Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాష్ట్రీయం

శాపమవుతున్న మానవ తప్పిదాలు

అభివృద్ధి చర్యల పేరిట మానవుడు ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నాడు. దాంతో అది ప్రకోపించి ప్రమాద సంకేతాలను పంపుతోంది. ఇటీవల విశాఖ తీరాన్ని హుద్‌హుద్‌ తుపాను తాకడం, ఆపై సముద్రం భారీ అలలతో ముందుకొచ్చి తీరాన్ని కోతకు గురిచేయడం అలాంటివే. ఈ విపరిణామాలకు గల కారణాలను సమగ్రంగా పరిశోధించాలి. ముఖ్యంగా తీరప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందిస్తున్న రాష్ట్రప్రభుత్వం, దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించాలంటున్న వ్యాసమిది...

మూడువైపులా సముద్రంతో భారతదేశం ప్రకృతి సంపదకు పుట్టినిల్లుగా భాసిల్లుతోంది. సముద్రంవల్ల దేశానికి ఎనలేని మేలు కలుగుతోందనడంలో సందేహం లేదు. మరోవంక సముద్రం కారణంగా ఏర్పడుతున్న ప్రకృతి వైపరీత్యాలు మాత్రం పెను సమస్యలు సృష్టిస్తున్నాయి. సముద్ర నీటిమట్టంలో పెరుగుదలవల్ల ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి. సముద్ర మట్టం పెరగడంవల్ల కొన్నిసార్లు అలలు ముందుకు(ట్రాన్స్‌గ్రెసన్‌) వస్తుంటాయి. మట్టాలు తగ్గితే అలలు వెనక్కు(రిగ్రెసన్‌) జారుతుంటాయి. సముద్రమట్టాల్లో ఈ మార్పులు కొన్నిసార్లు ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటుంటాయి. ఇంకొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతుంటాయి. గడచిన పదేళ్లుగా ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోనూ సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. మూడు పక్కలా సముద్రం ఉన్న భారతావనికి ఈ పరిణామాలు భారీనష్టం కలగజేసే ప్రమాదం ఉంది.

విశాఖలో... ప్రమాద ఘంటిక!

ఇటీవల విశాఖ తీరంలో అలలు 100మీటర్ల నుంచి 200మీటర్ల మేర ముందుకు చొచ్చుకువచ్చి రక్షణ కుడ్యాన్ని ధ్వంసం చేశాయి. గడచిన కొంతకాలంగా తరచూ ఇలా జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. కాకినాడ తీరంలో ఉప్పాడ వద్ద సైతం అలలు అప్పుడప్పుడు ముందుకు చొచ్చుకువస్తున్నాయి. విశాఖ తీరంలో బీచ్‌ నుంచి సముద్రంలోకి 30మీటర్ల వరకు ఇసుక విస్తరించి ఉంది. 31మీ. నుంచి 60మీ. వరకు బంక మట్టి; 61మీ. నుంచి 100మీ. వరకు గవ్వల మండలం; 100మీ. నుంచి 200మీ. వరకు 'కాంక్రి షన్స్‌' ఉన్నాయి. ఇక్కడ 200మీ. లోతు వరకు జరిగిన పరిశోధనలను బట్టి గడచిన 18వేల సంవత్సరాల కాలంలో సముద్ర మట్టం నాలుగు దశల్లో పెరిగినట్లు తెలుస్తోంది. 30మీ. లోతు వద్ద, అలాగే 60మీ, 80మీ, 130మీ. లోతుల వద్ద గతంలో బీచ్‌లు ఏర్పడినట్లు ఆనవాళ్లు దొరికాయి.

సముద్రతీరాల్లో మానవ జోక్యం బాగా పెరుగుతోంది. మనిషి జోక్యం ఎంత తక్కువ ఉంటే తీరం అంత భద్రంగా ఉంటుంది. ప్రకృతి ప్రక్రియలన్నీ నియమబద్ధంగా సాగిపోతాయి. తూర్పు తీరంలో గంగా, బ్రహ్మపుత్ర, మహానది, నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణా, గుండ్లకమ్మ, పెన్నా, కావేరి వంటి నదులు సముద్రంలో కలుస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఆనకట్టలు నిర్మించినప్పటికీ- టన్నుల కొద్దీ ఇసుక, బంక మట్టి అవక్షేపాలు ఏటా బంగాళాఖాతంలోకి చేరుతూనే ఉన్నాయి. తీరం వెంబడి తరంగాలు, అలలు, వివిధ రకాల ప్రవాహాలు శిల్పకారుల తరహాలో పనిచేసి వీటిని రకరకాల రూపాల్లోకి మార్చేస్తుంటాయి. నదుల ద్వారా సముద్రాన్ని చేరిన అవక్షేపాలు పెద్ద మొత్తంలో ఉంటే సముద్రపు అలలకు ఆ అవక్షేపాల్లోని ఇసుక, బంకమట్టి వంటివాటిని వేరుచేసే శక్తి ఉండదు. అందువల్లే గంగ, కృష్ణా, గోదావరి వంటి పెద్ద నదుల ముఖద్వారాల్లో డెల్టాలు ఏర్పడ్డాయి. ఉదాహరణకు గోదావరి డెల్టా తీరం వెంబడి 500కి.మీ. పొడవునా విస్తరించి; సముద్రంలోపల 200కి.మీ. మేర నిక్షిప్తమైంది. ఒకవేళ అవక్షేపాలు కొద్దిమొత్తాల్లో సముద్రంలో చేరితే అలలు వాటిలోని ఇసుకను వేరుచేసి దాన్ని కొంత బీచ్‌లో, మరికొంత సాగరంలో నిక్షేపిస్తాయి. ఇసుక తరవాత బంకమట్టి నిక్షిప్తమవుతుంది. తీరంలో ఇలా నిక్షిప్తమైన ఇసుక- తీరస్థ ప్రవాహాల(లిట్టొరల్‌ కరెంట్స్‌) కారణంగా తీరం వెంబడి దూర ప్రాంతాలకు రవాణా అవుతుంది. ఈ మొత్తం ప్రక్రియలో కొన్నిచోట్ల నిక్షిపణ (డిపొజిషన్‌), మరికొన్ని చోట్ల క్రమక్షయం(ఎరోజన్‌) జరుగుతుంది.

విశాఖ తీరంలో ఔటర్‌ హార్బర్‌ నిర్మాణం, తీర రక్షణ కోసం రూపొందించిన నిర్మాణాలు, ఇటీవల ముంచెత్తిన హుద్‌హుద్‌ తుపాను వల్ల సమతుల్యత దెబ్బతింది. ఓ అంచనా ప్రకారం 4.5లక్షల టన్నుల ఇసుక కొట్టుకుపోయింది. ఇసుక బార్‌లు ఇంకా కొన్నిచోట్ల ఏర్పడుతున్నాయి. పెద్ద మొత్తంలో ఇసుక కొట్టుకుపోవడం వల్ల బీచ్‌ పక్కనే సముద్రపు లోతూ పెరిగింది. సాధారణంగా సముద్రం మధ్యలో అలలు ఏర్పడవు. తీరాన్ని నీరు సమీపించినప్పుడు అలలు ఏర్పడతాయి. కింద భూమి తగిలిన పక్షంలో అలలు అక్కడ విరిగి పడతాయి. విశాఖ తీరంలో క్రమక్షయం వల్ల లోతు పెరిగింది. ఫలితంగా అలలు గతంలోలా కాకుండా తీరానికి మరింత దగ్గరలో విరిగిపడుతున్నాయి. అంతేకాకుండా ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల మాదిరిగానే సముద్ర మట్టం విశాఖ తీరంలోనూ పెరగడంవల్ల అలలు రోడ్డు మీదకు చొచ్చుకువచ్చాయి. విశాఖ తీరంలో ఏడాదికి 0.75మి.మీ. వంతున సముద్ర మట్టం పెరుగుతున్నట్లు లెక్కలు నమోదయ్యాయి.

ప్రపంచంలో వివిధ తీరాల వెంట అలల స్థాయుల ఆధారంగా- ఉపగ్రహ చిత్రాల సాయంతో సముద్ర మట్టాల పెరుగుదల అంచనా వేస్తారు. 2016నాటికి వాతావరణంలోకి కర్బన సంబంధ పదార్థాల ఉద్గారాన్ని పూర్తిగా సున్నా స్థాయికి నియంత్రించాల్సి ఉంది. ఇప్పటికే వాతావరణంలో ఏర్పడ్డ కాలుష్యం వల్ల 2100నాటికి సముద్ర మట్టం 1.2 అడుగులనుంచి 2.6 అడుగులకు పెరుగుతుంది. దీని ప్రభావంవల్ల కేవలం అమెరికాలోనే తీర ప్రాంతంలో నివసిస్తున్న పదికోట్ల మంది ప్రమాదంలో చిక్కుకుంటారు. మట్టం రెండు అడుగులు పెరిగితే సుమారు లక్ష కోట్ల డాలర్ల విలువైన ఆస్తులు, నిర్మాణాలు సముద్రంలో మునిగిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికీకరణ పురులు విచ్చుకోవడానికి ముందు వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు 280 పీపీఎంలు (పార్ట్స్‌ పర్‌ మిలియన్‌), 2009నాటికి 387 పీపీఎంలుగా ఉండేది. తరవాత ఏడాదికి రెండు పీపీఎంల చొప్పున పెరుగుతూ ఉంది. దీనివల్లే ప్రస్తుతం సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. లక్షా ఇరవై అయిదు వేల సంవత్సరాల కిందట వాతావరణ పరిస్థితులు ఇంచుమించు ఇప్పట్లాగే ఉన్నాయన్నది శాస్త్రవేత్తల అంచనా. అప్పుడు శతాబ్దానికి 1.6మీ. చొప్పున సముద్ర మట్టం పెరిగింది. మొత్తంమీద ప్రస్తుత స్థాయికన్నా అప్పట్లో సముద్ర మట్టం నాలుగు నుంచి ఆరు మీటర్లు ఎక్కువ ఉంది. ఉష్ణోగ్రత ఆనాడు ప్రస్తుతంకన్నా మూడు సెంటీగ్రేడ్‌లనుంచి అయిదు సెంటీగ్రేడ్‌లు గరిష్ఠంగా ఉండేది. నాటి పరిస్థితులతో వాతావరణం పోలి ఉన్నందువల్ల కొన్నేళ్లలోనే సముద్ర మట్టం నాలుగు మీటర్లనుంచి ఆరు మీటర్లకు; ఉష్ణోగ్రత మూడు సెంటీగ్రేడ్లనుంచి అయిదు సెంటీగ్రేడ్‌లకు పెరగవచ్చునని అంచనా.

కారణాలు... పరిష్కారాలు

సముద్ర మట్టం పెరగడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ- మానవ తప్పిదాలే అందులో కీలకం. ప్రపంచవ్యాప్తంగా హిమగిరులు, పలకలు కరిగిపోవడం; తాప వ్యాకోచం వంటివి మట్టాల పెరుగుదలకు ముఖ్య కారణాలు. సముద్ర మట్టం మొత్తం పెరుగుదల ఏడాదికి 1.8 మి.మీ. ఉంటే; తాప వ్యాకోచం కారణంగా 0.7మి.మీ. హిమం కరిగి 0.8 మి.మీ. మేర మట్టం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. పారిశ్రామికీకరణ పేరిట అదుపులేకుండా కర్బన కాలుష్యాన్ని వాతావరణంలోకి విడుదల చేయడంవల్ల భౌగోళిక తాపం ఇనుమడిస్తోంది. పాండిచ్చేరిలో 1901-1980 మధ్య సంవత్సర సగటు ఉష్ణోగ్రతలు 28.25సెంటీగ్రేడ్లు; 1996-2000 అనగా కేవలం నాలుగేళ్ల కాలంలో ఉష్ణోగ్రత 28.48 సెంటీగ్రేడ్లకు పెరిగింది. యాభయ్యేళ్లలో ఉష్ణోగ్రతల్లో ఈ స్థాయి తేడా ఎందుకు వచ్చిందో వూహించడం అసాధ్యం కాదు. భూ తాపంవల్ల గ్రీన్‌లాండ్‌, అంటార్కిటికా హిమపలకలు కరిగి సముద్ర మట్టాలు పైకొస్తున్నాయి. మరోవంక సముద్ర జలాలు వ్యాకోచం చెంది హిమపలకలు విడివడి సముద్రాల్లో విస్తరించి, కరిగిపోతున్నాయి. మట్టాల వృద్ధికి ఇదీ ఓ కారణమే.

మానవ తప్పిదాల కారణంగా సముద్ర తీరప్రాంతాలకు ఏర్పడుతున్న ముప్పును పర్యావరణ మార్పులపై 2007లో ఏర్పాటైన అంతర్‌ ప్రభుత్వ కమిటీ(ఐపీసీసీ) ఎత్తి చూపింది. వారి అంచనాల ప్రకారం, 21వ శతాబ్దంలో సముద్రమట్టం 18సెం.మీ.నుంచి 59సెం.మీ. మేర పెరుగుతుంది. ఐక్యరాజ్య సమితి పరిశోధన మండలి ఈ పెరుగుదల 56సెం.మీ.నుంచి 200సెం.మీ. వరకు ఉండవచ్చని 2010లోనే అంచనా వేసింది. మూడో జాతీయ వాతావరణ అంచనా(ఎన్‌సీఏ)లో 2100నాటికి సముద్ర మట్టాలు ఒక అడుగునుంచి నాలుగు అడుగుల మేర పెరగవచ్చని తాజాగా నిపుణులు అభిప్రాయపడ్డారు. వీటితోపాటు కృత్రిమ నిర్మాణాలు, సముద్రాల్లోకి పెద్దయెత్తున చేరుతున్న అవక్షేపాల పరిమాణం, సహజసిద్ధ రూపాన్ని మార్పు చేసే చర్యలు, తీర ప్రాంతంలో జరిగే నిక్షేపణ, క్రమక్షయాలు, భూగర్భంలో కొత్తగా ఏర్పడే జలం వంటివీ సముద్ర మట్టాల పెరుగుదలకు కొంత మేర కారణమవుతాయి.

భౌగోళిక తాపానికి కారణమవుతున్న బొగ్గుపులుసు వాయువు, క్లోరో ఫ్లోరోకార్బన్‌ల వంటి హరిత గృహ(గ్రీన్‌హౌస్‌) వాయువులు వాతావరణంలోకి చేరకుండా చూడటం ప్రథమ కర్తవ్యం. వీటి ఉద్గారాన్ని నిలువరించకపోతే 2100నాటికి సముద్ర మట్టం ప్రస్తుత మట్టం కన్నా 6.6అడుగులు పెరుగుతుందన్న అమెరికన్‌ శాస్త్రవేత్తల అంచనాలు పెను ప్రమాదఘంటికలే. ఒకవేళ అదే జరిగితే, దాని దుష్ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో వూహించ శక్యం కూడా కాదు. నవ్యాంధ్ర పునర్నిర్మాణంలో భాగంగా తీరప్రాంతంలో నౌకాశ్రయాల నిర్మాణం, పారిశ్రామికవాడలు నెలకొల్పాలని ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. అభివృద్ధికి చురుకు పుట్టించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందనడంలో సందేహం లేదు. కానీ, వీటివల్ల సముద్ర మట్టాలపై ప్రతికూల ప్రభావం పడకుండా జాగ్రత్తపడాలి. ప్రకృతి వైపరీత్యాలనూ దృష్టిలో ఉంచుకుని తీరం వెంబడి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. లేనిపక్షంలో పడిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీటి చందంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.

(రచయిత - పొదిల శంకర పిచ్చయ్య)
(రచయిత- భూగర్భశాస్త్ర, మనోవైజ్ఞానిక నిపుణులు)
Posted on 09-01-2015