Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాష్ట్రీయం

హరిత తెలంగాణకు బహుముఖ వ్యూహం

కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రం తొట్టతొలి సంక్రాంతి సంబురాలను జరుపుకొంటోంది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఒక పంట కాలాన్ని పూర్తిచేసుకుంది. సరిగ్గా సంక్రాంతి వేడుకల నాటికి రైతు ఇంటికి చేరింది ధాన్యలక్ష్మి. కాకతీయుల కాలం నాటినుంచి వస్తున్న చిన్ననీటి వనరులు, చిరుధాన్యాల సాగు, ఉద్యాన పంటలు ఇదివరకటి పాలకుల అస్తవ్యస్త విధానాల కారణంగా కుంచించుకుపోయాయి. రాష్ట్రంలో అసలు భవిష్యత్తే లేని వాణిజ్య పంటలతో రైతులు నష్టపోయారు. విస్తరణ సేవలు పడకేసి, ఆర్థిక పరపతి అందుబాటులో లేక సేద్యం వదిలేయటానికి సిద్ధపడుతున్న తెలంగాణ రైతాంగానికి ప్రత్యేకరాష్ట్రంతోనే పండగొచ్చింది. అంతర్జాతీయ రవాణా సౌకర్యాలు, జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలు, ఉద్యానాన్ని పెంపొందించే మేలైన వాతావరణం కలిగిన తెలంగాణ రాష్ట్రంలో సరైన ప్రణాళికలతో ముందుకెళితే భవిష్యత్తంతా నిత్య సంక్రాంతే కానున్నది. ఛత్తీస్‌గఢ్‌ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరవాత వ్యవసాయ రంగంలో గణనీయ పురోగతి సాధించింది. తక్కువ రుణాలున్న రైతులను కలిగి, అధిక వ్యవసాయ వృద్ధిరేటుతో తెలంగాణ రాష్ట్రానికి అది మార్గదర్శనం చేస్తోంది. గుజరాత్‌ తరహా వ్యవసాయ ప్రగతి సాధించటానికి అవసరమైన అన్ని వనరులనూ తెలంగాణ కలిగి ఉంది. ఈ సంక్రాంతితోనే అలాంటి అభివృద్ధికి బీజావాపన జరగాలి.

ప్రపంచంలో వ్యవసాయపరంగా అత్యంత వైవిధ్యభరిత దేశం భారత్‌. పలు విశిష్టతలతో దేశంలోనే అరుదైన రాష్ట్రంగా వర్ధిల్లుతోంది తెలంగాణ. వరి పంట విస్తీర్ణం, ఉత్పత్తిలో పెద్ద జిల్లాగా కరీంనగర్‌ ఉంటే, కేవలం మెట్ట పంటలు పండే జిల్లాగా మహబూబ్‌నగర్‌ వాసికెక్కింది. కూరగాయల సాగు విస్తీర్ణంలో రంగారెడ్డి, పత్తి విస్తీర్ణంలో వరంగల్‌, బత్తాయి విస్తీర్ణం, ఉత్పత్తిలో నల్గొండ జిల్లా, సోయాబీన్‌ ఉత్పత్తిలో ఆదిలాబాద్‌ జిల్లాలు దేశంలోనే ప్రఖ్యాతిగాంచాయి. కరీంనగర్‌, వరంగల్‌, మెదక్‌ జిల్లాల్లోని ప్రత్యేక వాతావరణం రాష్ట్రాన్ని దేశ విత్తన రాజధానిగా నిలుపుతోంది. మెళకువలతో విత్తనోత్పత్తి చేపడుతూ నికర రాబడి సాధించటంలో ప్రపంచానికే పాఠాలు నేర్పుతున్న 'అంకాపూర్‌' గ్రామం; పరపతి అందుబాటు, ఉత్పత్తి కారకాల కొనుగోలులో రైతుల సంఘటిత శక్తిని చాటుతున్న 'ముల్కనూరు సహకార సంఘాలు' తెలంగాణ కీర్తి కిరీటంలో కలికితురాయిలు. వాటి స్ఫూర్తితోనే తెలంగాణ సమగ్రాభివృద్ధికి బంగారు బాటలు వేయాలిప్పుడు!

సాగునీరే కీలకం

వ్యవసాయ ప్రధానమైన తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి లభ్యత అంతంత మాత్రమే. ప్రభుత్వ ఆధ్వర్యంలోని కాలువల ద్వారా కేవలం 13శాతం సాగునీరు అందుతోంది. అత్యధిక ఖర్చుతో భూగర్భ జలాలను తోడి పంటలను సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 69శాతం భూములకు భూగర్భ జలాలే దిక్కు. ఒకప్పుడు ప్రధాన నీటి వనరులుగా ఉన్న చెరువులు, కుంటలు ఇప్పుడు 15శాతం సాగుకు మాత్రమే నీరందించగలుగుతున్నాయి. దేశమంతా వాణిజ్య పంటలవైపు మొగ్గుచూపుతుంటే- తెలంగాణాలో 42శాతం తృణధాన్యాలు సాగవుతున్నాయి. కూరగాయల సాగు కేవలం రెండు శాతమే. ఇలాంటి పరిస్థితులను అధిగమించి, అప్పుల వూబిలోనుంచి రైతుల్ని బయటపడేయగలగిన నాడే రైతులకు నిజమైన సంక్రాంతి. నేల, వాతావరణ పరిస్థితులను బేరీజు వేసుకుంటూ, పెట్టుబడి ఖర్చులు తగ్గిస్తూ మేలైన అధిక దిగుబడులనిచ్చే ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించినప్పుడే పండగ దినం. ప్రపంచ ఆధునిక వ్యవసాయ విజ్ఞానాన్ని తెలంగాణా రైతు లోగిళ్లలో ముగ్గులా పరచాల్సిన సమయమిది!

కేవలం భూగర్భ జలాల మీద ఆధారపడి వ్యవసాయం కొనసాగించలేని పరిస్థితి తెలంగాణలో ఉంది. ఈ నేపథ్యంలో సంప్రదాయ నీటివనరులైన చెరువులు, కుంటలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చేపడుతున్న చర్యలు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. చిన్నాచితకా కలుపుకొని మొత్తం 46వేల పైచిలుకు చెరువుల పునరుద్ధరణ, మరమ్మతుల కోసం ఆరంభమైన 'మిషన్‌ కాకతీయ'ను సత్వరం పూర్తి చేయాల్సిన అవసరం ఉరుముతోందిప్పుడు. ఈ యజ్ఞం పూర్తయితే 265 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఏర్పడుతుంది. 26లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు అందుతుంది. దేశంలోని ప్రతి వ్యవసాయ క్షేత్రానికి సాగునీటిని అందించేందుకు కేంద్రం ప్రారంభిస్తున్న 'ప్రధానమంత్రి కృషి సించాయి యోజన' మరింత మేలు చేకూర్చేదే. హరిత విప్లవం ఫలితాలు అనుభవించని రాష్ట్రాలను, తరచుగా వర్షాభావానికి గురయ్యే ప్రాంతాలను ఈ పథకంలో చేరుస్తున్నారు.

ఈ పథకం ఫలితాలు రాష్ట్రానికి అందేలా చూడాలి. రాష్ట్రంలోని అన్ని నీటి వనరులను కచ్చితంగా గుర్తించేందుకు, వాటి అన్యాక్రాంతాన్ని అడ్డుకునేందుకు ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి. త్రీడీ ఫొటోలు, శాటిలైట్‌ ఇమేజింగ్‌ల ద్వారా నీటి వనరులను కరాఖండిగా గుర్తించవచ్చు. అసలే కొరతగా ఉన్న నీటి వనరుల వాడుక సామర్థ్యమూ తక్కువే. తక్కువ నీటిని పొదుపుగా ఎక్కువ సామర్థ్యంతో వాడుకునేందుకు బిందు, తుంపర సేద్యాలను ప్రోత్సహించాలి. దిగుబడి, నాణ్యతతోపాటు ఖర్చులను తగ్గించే మార్గమిది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఇటీవల వేరుసెనగ విస్తీర్ణం పెరగటంలో సూక్ష్మనీటి పారుదల పద్ధతులదే ప్రధాన పాత్ర. రాష్ట్రంలో విస్తారంగా ఉన్న మామిడి, బత్తాయి, కూరగాయల సాగునూ బిందు, తుంపర పద్ధతుల్లో చేపట్టి విప్లవాత్మక దిగుబడులు సాధించవచ్చు. నేల, స్థానిక పరిస్థితులను బట్టి సాగు చేస్తే మేలైన దిగుబడులు సాధ్యం. కానీ రాష్ట్రంలోని సాగులో శాస్త్రీయత కొరవడింది. వర్షాధార ప్రాంతాల్లో సైతం అత్యధిక నీరు అవసరమయ్యే వరి వంటి పంటలు సాగు చేస్తే, సరైన దిగుబడులు రావు. నష్టాలూ ఎక్కువే. తక్కువ నీరు అవసరమయ్యే సజ్జ, జొన్న, రాగి, అపరాలు, నూనెగింజల పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలి.

ఉన్న కొద్దిపాటి నీటివనరులను సాగులో ఉపయోగించుకోవటంలో విద్యుత్‌ది ప్రధాన పాత్ర. అత్యధిక విద్యుత్‌ కొరత అనుభవిస్తున్న రాజస్థాన్‌, సోలార్‌ వాటర్‌ పంపుసెట్ల వాడకం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు చేరువైంది. ప్రభుత్వమిస్తున్న భారీ సబ్సిడీతో రైతులు వీటిని విస్తారంగా వాడుతున్నారు. సోలార్‌ పంపు సెట్లు వాడిన ఒకటి, రెండు సంవత్సరాల్లోనే అక్కడి రైతులు పెట్టుబడిని తిరిగి పొందగలిగినట్లు తెలుస్తోంది. దేశం మొత్తం సౌర విద్యుత్‌ను ప్రధాన ఇంధన వనరుగా వాడుకునే అవకాశం ఉందని 'ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఆడిటర్స్‌ ఆఫ్‌ ఇండియా' చెబుతోంది. పుష్కల సౌరశక్తి తెలంగాణ సొంతం. రాజస్థాన్‌ కంటే ఎక్కువ సౌరశక్తి తెలంగాణకు లభించే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్రప్రభుత్వం భారీ సబ్సిడీలతో పెద్ద సంఖ్యలో సోలార్‌ వాటర్‌ పంపుసెట్లు ఏర్పాటు చేయాలి. మహబూబ్‌నగర్‌లో అయిదు వేల ఎకరాల విస్తీర్ణంలో మెగా సోలార్‌ పార్క్‌ ఏర్పాటు ద్వారా గ్రామాల్లో విద్యుత్‌ కొరత తీర్చేందుకు ప్రభుత్వం ఉద్యమించటం మంచిదే. దశలవారిగా రాష్ట్రంలో సాంప్రదాయ మోటార్లను సోలార్‌ పంపుసెట్లతో భర్తీ చేయాలి. కేంద్ర ప్రభుత్వం జాతీయ సౌర ఇంధన మిషన్‌లో భాగంగా రాష్ట్రాలకు నిధులు సమకూరుస్తోంది. పర్యావరణ మార్పులను తగ్గించేందుకు దేశంలో పెద్దయెత్తున సౌర విద్యుత్‌ వినియోగాన్ని మోదీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. భవిష్యత్తులో నిధులు ఇంకా పెరుగుతాయి. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి.

రాష్ట్రంలో కూరగాయల సాగుకు అనుకూల వాతావరణం, నేలలు ఉన్నాయి. కానీ, అవసరమైన కూరగాయల్లో 20శాతమే రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నాయి. అత్యధికంగా కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. కర్ణాటక, మహారాష్ట్ర సైతం నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. అయినప్పటికీ, హరిత గృహాల్లో కూరగాయలు ఇబ్బడిముబ్బడిగా సాగుచేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయగలిగే స్థాయికి అవి ఎదిగాయి. మహారాష్ట్రలో 15వేల హెక్టార్లు, కర్ణాటకలో 10వేల హెక్టార్లు, తమిళనాడులో రెండు వేల హెక్టార్ల గ్రీన్‌హౌస్‌లలో పూర్తిగా కూరగాయలు సాగు చేస్తున్నారు. సాధారణంగా క్షేత్ర సాగులో టమాట, దోస వంటి కూరగాయల్లో 12నుంచి 18టన్నుల దిగుబడి సాధిస్తే- హరిత గృహాల్లో సాగుచేసి 250నుంచి 300 టన్నుల దిగుబడి సాధిస్తోంది కర్ణాటక. కేవలం 10శాతం సాగు యోగ్యత ఉన్న క్షేత్రాల్లో హరిత గృహాల ద్వారా మిర్చి, టమాట, దోస వంటి కూరగాయలు సాగుచేసి, ప్రపంచాన్ని అబ్బురపరచే దిగుబడులు సాధిస్తోంది ఇజ్రాయెల్‌. రంగారెడ్డి, నల్గొండ, మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో కేవలం వర్షాధార సాగే సాధ్యం కాబట్టి, ఈ నాలుగు జిల్లాల్లో 'గ్రీన్‌హౌస్‌' సాగుకు ప్రత్యేక అవకాశాలివ్వాలి. అవసరమైతే ప్రభుత్వమే ఆయా పంటల విత్తనాలు కొనుగోలు చేసి, రైతులకందించి ఈ తరహా సాగును ప్రోత్సహించవచ్చు. హైదరాబాద్‌ చుట్టూ వంద కిలోమీటర్ల పరిధిలో గ్రీన్‌హౌస్‌ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు కచ్చితంగా ఆహ్వానించదగినవే. ప్రధాన నగరాల్లోని రైతు బజార్లకు గ్రీన్‌హౌస్‌ కూరగాయలను తరలించగలిగితే రైతుకు గిట్టుబాటు ధర లభిస్తుంది. వినియోగదారులకు కూరగాయలు అందుబాటులో ఉంటాయి.

ప్రత్యామ్నాయాలపై దృష్టి

మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ సేద్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆదిలాబాద్‌ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో ఆపిల్‌సాగు; కరీంనగర్‌ జిల్లాలోని జగిత్యాల చుట్టూ బంగాళాదుంప; నల్గొండ, మహబూబ్‌నగర్‌లలో ఆయిల్‌ఫాం సాగును పరిశీలించవచ్చు. అధిక విస్తీర్ణంలో పసుపు పంట సాగవుతున్న దృష్ట్యా ప్రాసెసింగ్‌ కేంద్రం నెలకొల్పితే విలువల జోడింపు సాధ్యం. ఉద్యాన ఉత్పత్తులు చెడిపోకుండా శీతల గృహాలు, గిడ్డంగులను భారీగా ప్రోత్సహించాలి. నిజామాబాద్‌ జిల్లా నందిపేటలో 'మెగా ఫుడ్‌ పార్క్‌'ను సత్వరం సాకారం చేయాల్సిన అవసరం ఉంది. ఎగుమతిపరంగా మామిడి పండ్లు, ధాయ్‌, జామ, బొప్పాయి పంటలకు రాష్ట్రంలో మంచి అవకాశాలున్నాయి. మొత్తంగా రాష్ట్రంలో మరో పది లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు పండించే వీలుంది. తెలంగాణలో వ్యవసాయ-అనుబంధ రంగాల పురోగతికి బహుముఖ వ్యూహాలతో ముందుకు సాగాల్సి ఉంది. తొలుత సాగునీటి కొరతను తీర్చేందుకు 'మిషన్‌ కాకతీయ'ను పూర్తిచేయటంతోపాటు, ప్రాణహిత, చేవెళ్ల, జూరాల-పాకాల, పాలమూరు ఎత్తిపోతల పథకాలు పూర్తిచేయాలి. కల్వకుర్తి, కోయిలసాగర్‌, నెట్టెంపాడు, భీమ ఎత్తిపోతల పథకం, శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్‌ ప్రాజెక్టులు పూర్తిచేసి జలసిరులు కల్పించాలి.

వీటితో సగం తెలంగాణకు మహర్దశ వచ్చినట్లే. రైతులను ఎంతోకొంత ఆదుకునేందుకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో అమలుచేయనున్న 'తెలంగాణ గ్రామీణ సమ్మిళితవృద్ధి పథకం' ఎంతో కీలకమైనది. దీంతో వెనకబడిన 150 మండలాల్లోని రైతులకు ఆర్థిక పరపతి పెరుగుతుంది. విపణీ అందుబాటులోకి వస్తుంది. రైతుల ఆర్థిక అవసరాలు తీరతాయి. వ్యవసాయ అనుబంధ రంగాలను సమీకృతం చేయటంవల్ల ఉత్పత్తులు, వ్యర్థాల పరస్పర వినియోగం విస్తరించి, ఉత్పాదకతను పెంచుతుంది. పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి. వర్షాధార ప్రాంతం ఎక్కువగా ఉన్నందున- సజ్జ, జొన్న, మొక్కజొన్న పంటల సాగును ప్రోత్సహించాలి. భూసార పరీక్షలకు అనుగుణంగానే పంటల సాగును చేపట్టాలి. రాష్ట్రంలోని ప్రతి నేలసారాన్ని తెలిపే పటలాల అభివృద్ధిని పూర్తిచేయాలి. తరచుగా వర్షాభావ పరిస్థితులు ఎదురవుతున్నందువల్ల రైతులకు పంటల బీమాను తప్పనిసరి చేయాలి. అంకాపూర్‌ లాంటి గ్రామాలను రాష్ట్రవ్యాప్తంగా గుర్తించి రైతు ఆధారిత విత్తనోత్పత్తి చేపట్టాలి. జాతీయ, అంతర్జాతీయ సంస్థల పరిశోధనల ఫలితాలు రైతు పొలాలదాకా చేరేలా చూడాలి. పాడి, పంట, ఉద్యాన రంగాలకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా నిలిచినప్పుడే తెలంగాణ రైతు లోగిళ్లలో సంక్రాంతి శోభ రాజిల్లుతుంది.

(రచయిత - డాక్టర్ పిడిగెం సైదయ్య)
(రచయిత- శాస్త్రవేత్త, ఉద్యాన విశ్వవిద్యాలయం)
Posted on 16-01-2015