Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాష్ట్రీయం

పరిశోధనతోనే ఫల సాధన!

ఉద్యాన పంటల సాగుకు అన్ని విధాలా అనుకూలమైన వాతావరణం కలిగి ఉన్న రాష్ట్రం- తెలంగాణ. ఈ పరిస్థితిని ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలి. ప్రత్యేక పంటల పరిశోధన కేంద్రాలు ఏర్పాటుచేయడంతో పాటు ఇజ్రాయెల్‌ తరహాలో హరిత గృహాలు, పాలీ హౌస్‌లు, గ్లాస్‌ హౌస్‌ల వంటి వాటి ద్వారా దిగుబడులను భారీగా పెంచుకొనే దిశలో సాగిపోవాల్సిన సమయమిది...

తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఉద్యాన పంటల సాగు వెన్నుదన్నుగా నిలవనున్నది. రాష్ట్రంలో విస్తారంగా ఉన్న ఎర్రనేలలు ఉద్యాన పంటల సాగుకు అత్యంత అనుకూలమైనవి. ఉష్ణ వాతావరణం, విస్తార రవాణా సదుపాయాలు ఈ పంటల విస్తృత సాగుకు అసరా కానున్నాయి. రాష్ట్రంలోని మూడు వ్యవసాయ వాతావరణ మండలాల్లో వైవిధ్యమైన ఉద్యాన పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంది. శాస్త్రీయ సిఫార్సులకు అనుగుణంగా సాగుచేస్తే తెలంగాణ రాష్ట్రం ఉద్యాన పంటల సాగులో దేశానికే ఆదర్శంగా నిలవవచ్చు.

ఉద్యాన పంటల సాగులో తెలంగాణ ప్రాంతానికి గొప్ప చరిత్ర ఉంది. నిజాం నవాబుల కాలంలో హైదరాబాద్‌ ద్రాక్ష తోటల సాగులో ప్రపంచ ప్రసిద్ధి పొందింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ద్రాక్ష తోటల సాగు ముమ్మరంగా సాగేది. హైదరాబాద్‌ ద్రాక్ష విదేశాలకు ఎగుమతి అయ్యేది. తెలంగాణలో అభివృద్ధిపరచిన 'అనాబ్‌షాహీ' ద్రాక్ష రకం హెక్టారుకు 100టన్నుల దిగుబడితో ప్రపంచ రికార్డు సాధించింది. అనంతపురం జిల్లాలో విరివిగా సాగవుతున్న 'దిల్‌ఖుష్‌' దాక్ష రకం తెలంగాణలో అభివృద్ధిపరచిందే. ద్రాక్ష సాగుకు తెలంగాణ ప్రాంతం ఇప్పటికీ అత్యంత అనుకూలం. అందువల్ల ద్రాక్ష సాగుకు ప్రభుత్వం చేయూత నివ్వాలి. మహారాష్ట్ర మాదిరిగా ద్రాక్ష వైన్‌ను ఎక్సైజ్‌ పరిధినుంచి తప్పించి 'ఆహార' జాబితాలో చేరిస్తే సుంకం తగ్గుతుంది. ద్రాక్ష దిగుబడులు ఎక్కువగా ఉన్నప్పుడు 'వైన్‌' తయారీతో రైతులు ఆదాయం పొందవచ్చు. ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా, ఇటలీ, జర్మనీ వంటి దేశాల్లో ద్రాక్ష తోటల్లోనే వైన్‌ తయారీ పరిశ్రమలుంటాయి. మన రాష్ట్రంలో తోటలు వేరు, వైన్‌ తయారీ పరిశ్రమలు వేరు. ప్రభుత్వం హైదరాబాద్‌ బ్రాండ్‌ ద్రాక్ష సాగును ప్రోత్సహిస్తే సంవత్సరమంతా ఉపాధి సాధ్యమవుతుంది.

శాస్త్రీయత అత్యవసరం

బత్తాయి, నిమ్మ నల్గొండ జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. రెండు లక్షల ఎకరాల్లో నిమ్మ, బత్తాయి సాగవుతున్న ఏకైక జిల్లా నల్గొండ. దేశంలో మరే జిల్లాలో ఇంత విస్తీర్ణంలో ఈ పంట సాగు కావటం లేదు. కానీ, వేరుకుళ్లు, నీటి ఎద్దడి వల్ల రైతులు నష్టాల నుంచి కోలుకోలేక తోటలు తీసేస్తున్నారు. జీవనియంత్రణ పద్ధతుల ద్వారా వేరుకుళ్లును సమర్థంగా నివారించవచ్చు. అందుకు రాష్ట్రంలో అవసరమైన జీవనియంత్రణ ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలి. బత్తాయి నాణ్యత పెంచడానికి, తెగుళ్ల నివారణకు సేంద్రీయ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలి. సాగు శాస్త్రీయంగా ఉండేందుకు భూసార పరీక్షలు తప్పనిసరి చేయాలి. రాష్ట్రంలోని వాతావరణం మామిడిలో 'మంగు' అభివృద్ధి చెందకుండా నిరోధిస్తుంది. అందుకే ఇక్కడి మామిడి కాయలపై మచ్చలు ఉండవు. నిల్వకాలం ఎక్కువ. రైతుకు మార్కెట్‌ ధర కన్నా ఎక్కువే గిట్టుతుంది. ఎగుమతుల ద్వారా మంచి ఆదాయం లభిస్తుంది. మామిడి ఆధారిత శుద్ధి పరిశ్రమలకు అవకాశం ఉంది.

వరంగల్‌, మెదక్‌, రంగారెడ్డి, ఆదిలాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో మామిడి విస్తీర్ణం ఇంకా పెరిగే అవకాశం ఉంది. జామ తోటల సాగూ తెలంగాణ రైతుకు మంచి అదాయాన్ని సమకూర్చనుంది. ఒక మాదిరిగా నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో పెద్దగా పెట్టుబడి ఖర్చులు లేకుండా వీటిని సాగు చేసుకోవచ్చు. పట్టణాల్లో మంచి మార్కెట్‌ ఉన్న నల్లనేరేడు, రేగు, ఉసిరి, సీతాఫలం నీటి ఎద్దడిని తట్టుకుని మేలైన దిగుబడినిస్తాయి. ఇప్పటివరకు స్వతహాగా నాటుకున్న మొక్కల నుంచే వీటి పండ్లను సేకరించి గిరిజనులు, గ్రామీణులు మార్కెట్‌కు తరలిస్తున్నారు. వాటిమీద విస్తృత పరిశోధనలు జరగడంలేదు. నాణ్యమైన అధిక దిగుబడినిచ్చే ప్రత్యేక రకాలు లేవు. నల్గొండ, మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల్లో ఈ పంటల సాగుతో రైతులు, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే అవకాశం ఉంది.

కొత్తరకం పంటలను తెలంగాణ రాష్ట్రంలో విజయవంతంగా పరిశీలించవచ్చు. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే 'ఆయిల్‌పాం' సాగు చేస్తున్నారు. 'ఆయిల్‌ పాం' సాగుకు నల్గొండలోని 10 మండలాలూ అనుకూలమని తేలింది. రాష్ట్రంలోని ఇంకా పలు జిల్లాల్లో ఈ అవకాశం ఉంది. 20నుంచి 30 డిగ్రీల సెల్సియస్‌ కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాల్లో స్టా బెర్రీ సాగు సాధ్యమని అధ్యయనాల్లో వెల్లడైంది. చలికాలంలో కరీంనగర్‌లోని జగిత్యాల, పరిసర ప్రాంతాల్లో ఇందుకు సరిపోయే వాతావరణం ఉంటుంది. ముందస్తు కొనుగోలు ఒప్పందాలతో తెలంగాణలో ఔషధ, సుగంధ ద్రవ్య మొక్కలను భారీయెత్తున సాగుచేసుకోవచ్చు. భూసార హీన భూముల్లో సైతం వీటిని పండించవచ్చు.

ఇతర రాష్ట్రాల మాదిరిగా ప్రత్యేక పంటల పరిశోధన స్థానాలు తెలంగాణలో లేవు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అరటి (కొవ్వూరు), కొబ్బరి (అంబాజీపేట), జీడిమామిడి (బాపట్ల), బత్తాయి, నిమ్మ (తిరుపతి, పెట్లూరు), మామిడి (నూజివీడు) పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. ఇలాంటి ప్రత్యేక పరిశోధన స్థానాలు తెలంగాణ రాష్ట్రంలోనూ ఏర్పాటు చేయాలి. ఈ పంటలకు సంబంధించి సమగ్ర పరిశోధనలు అప్పుడు సాధ్యమవుతాయి. తెలంగాణ రాష్ట్రంలో నీటి ఎద్దడి నేపథ్యంలో ఆధునిక, శాస్త్రీయ నీటి సాగు పద్ధతులకు భారీ ప్రోత్సాహకాలివ్వాలి. 'బిందు బిందుకు పంటల అధిక దిగుబడి' లక్ష్యంగా చేసుకోవాలి. కశ్మీర్‌లో సూక్ష్మనీటి సాగుతో హెక్టారుకు 40టన్నుల ఆపిల్‌ దిగుబడి సాధ్యమయ్యింది. కుంకుమపువ్వు దిగుబడి 50శాతం పెరిగింది. పాలీహౌస్‌లలో 'స్టా బెర్రీ' సాగు చేసినప్పుడు, బిందు సేద్యంతో 45రోజుల ముందుగానే పంటకోత సాధ్యమయ్యింది. తమిళనాడులో బిందుసేద్యం, సాగునీటిలో ఎరువులవేతతో చెరుకు దిగుబడి 20శాతం పెరిగింది. తెలంగాణలో సాగునీటి కొరతను ఎదుర్కొనటంతోపాటు, తక్కువ ఖర్చుతో తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడులకు ఈ పద్ధతి అత్యంత అనుసరణీయం. ఈ విషయంలో ఇజ్రాయెల్‌ ఆదర్శంగా నిలుస్తోంది. ఆ దేశంలో కేవలం 20శాతం భూమి సాగుకు అనువైనది. అందులో సగానికే నీటి సదుపాయం ఉంది.

సగానికి పైగా దేశం ఉష్ణప్రాంతం. ఉన్న కొద్దిపాటి నీటిని బిందు, తుంపర సాగు పద్ధతులతో సద్వినియోగం చేసుకుంటోంది. సమర్థమైన నీటి వినియోగ పద్ధతులు అవలంభిస్తోంది. శుద్ధి చేసిన వ్యర్థ జలాలను, లవణ శాతం తగ్గించిన సముద్రజలాల్ని వ్యవసాయానికి ఉపయోగించుకుంటోంది. 50ఏళ్లలో 12రెట్లు దిగుబడి పెంచుకుంది. సాగుకు అనువుగాని భూముల్లో హరిత గృహాలు, పాలీహౌస్‌లు, గ్లాస్‌ హౌస్‌లు నిర్మించి ప్రపంచాన్నే అబ్బురపరిచే దిగుబడులు సొంతం చేసుకుంటోంది. ఎగుమతికి అనువైన అధిక విలువ గల పంటలు అక్కడి హరిత గృహాల్లో సంవత్సరమంతా సాగవుతున్నాయి. మూడువేల హెక్టార్లలో హరిత గృహాలున్నాయి. ప్రపంచంలో అత్యధిక ఉద్యాన పంటల ఉత్పాదకత ఇజ్రాయెల్‌ ప్రత్యేకత. హెక్టారుకు 300టన్నుల టమాటలు, హెక్టారుకు సరాసరి 30లక్షల గులాబీల సాగు ఒక్క ఇజ్రాయెల్‌కే సాధ్యపడింది. అంతర్జాతీయంగా మంచి మార్కెట్‌ ధర ఉన్న చెర్రి, టమాట, రంగుల మిరపలను ముమ్మరంగా సాగు చేస్తోంది. ఇజ్రాయెల్‌ తరహా వాతావరణ పరిస్థితులు కలిగిన తెలంగాణలో అటువంటి ఆధునిక విప్లవాత్మక వ్యవసాయ పద్ధతులు అక్షరాలా అనుసరణీయం.

విశ్వవిద్యాలయాలదే కీలక పాత్ర

రాష్ట్రానికి అవసరమైన కూరగాయల్లో 20శాతం మాత్రమే స్థానికంగా ఉత్పత్తి అవుతున్నాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ నుంచి భారీగా కొనుగోలు చేయవలసివస్తోంది. కూరగాయలు అధికంగా హైదరాబాద్‌లోనే వినియోగిస్తున్నారు. వీటి ఉత్పత్తి పెంచేందుకు 'మూసీ' నది పరివాహక ప్రాంతాల్లోని వ్యర్థ జలాలను సురక్షిత స్థాయికి శుద్ధిచేసి వాడుకోవచ్చు. 200 చదరపు కిలో మీటర్ల పరిధిలో ఈ వ్యర్థ జలాలు వాడుతున్నారు. 2100 హెక్టార్లలో వరిని ఈ వ్యర్థ జలాలతోనే పండిస్తున్నారు. పారా గట్టి, అరటి, కొబ్బరి, 13 రకాల కూరగాయలు పండుతున్నాయి. కానీ, ఆరోగ్యాన్ని హరించే లెడ్‌, కాడ్మియం లాంటి లోహాలు ఆ జలాల్లో సిఫార్సుకు మించి ఉన్నాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అందువల్ల తగు జాగ్రత్తలు పాటించాలి. పండ్ల తోటల పెంపకానికి మాత్రం ఈ వ్యర్థ జలాలు భేషుగ్గా ఉపయోగించవచ్చు. స్థానికంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చటంలో, ఆధునిక శాస్త్రీయ పరిశోధనల ఫలితాలను రైతులకు చేరవేయటంలో విశ్వవిద్యాలయాల పాత్ర కీలకమైనది. దేశంలోనే నాలుగో ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది.

అది పూర్తిస్థాయిలో రైతులకు ఉపయోగపడాలంటే, నాణ్యమైన శిక్షణ పొందిన ఉద్యాన పట్టభద్రులను ఎక్కువ మొత్తంలో అందించాలి. ఇప్పుడున్న నిపుణుల కొరతను తీర్చగలగాలి. తెలంగాణలో వ్యవసాయ కళాశాలలు, పరిశోధన కేంద్రాల సంఖ్యను పెంచాలి. ప్రస్తుత ప్రభుత్వ నర్సరీలను ఆధునీకరించాలి. ప్రతి మండలంలో ప్రభుత్వ పండ్ల మొక్కల నర్సరీలు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల అవసరాలు తీర్చాలి. అంటు మొక్కలతో అధిక దిగుబడులు సాధ్యం. నాసిరకం మొక్కలు సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నిపుణులతో కూడిన పర్యవేక్షణ సంఘాలు నియమించాలి. తెలంగాణలో ఉన్న ఉద్యాన వనరులు పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటే సమగ్ర ఉన్నతి సుసాధ్యం.

(రచయిత - డాక్టర్ పిడిగెం సైదయ్య)
(శాస్త్రవేత్త, ఉద్యాన విశ్వవిద్యాలయం)
Posted on 27-01-2015