Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాష్ట్రీయం

పొగచూరిన బతుకులకు... కావాలొక భరోసా!

'బీడీల తయారీ...తెలంగాణలో అతి పెద్ద వ్యవసాయ, అటవీ ఆధారిత పరిశ్రమ. లక్షలాది పేద, మధ్యతరగతి కుటుంబాలవారికి ఇది ఆధారంగా ఉంది'- కేంద్ర కార్మిక శాఖ ఇటీవల వెలువరించిన నివేదికలోని ప్రధాన అంశమిది. ఉమ్మడి రాష్ట్రంలో బీడీ పరిశ్రమ- పాలకుల నిర్లక్ష్యం కారణంగానే తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఉపాధి కొడిగట్టడంతో పాటు, ఈ పరిశ్రమను నమ్ముకొన్న కుటుంబాల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. దశాబ్దాలుగా పొగచూరిన బతుకులను ఆదుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ముందుకు రావడంతో కార్మికుల్లో కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి. తాత్కాలిక వూరట కాకుండా, శాశ్వతంగా వారి అభ్యున్నతికి తోడ్పడే చర్యలు ఇప్పుడు అత్యవసరం. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాల్సి ఉంటుంది.

ఉపాధికి మూలాధారం

తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లాలో 1901లోనే బీడీ పరిశ్రమ ప్రారంభమైంది. అది క్రమేపీ అన్ని జిల్లాలకూ విస్తరించింది. బీడీల తయారీకి ఉపయోగించే తునికాకు అందుబాటులో ఉండటంతో, పలు జిల్లాల్లో ఇదే పరిశ్రమ వేళ్లూనుకుంది. ఇంటి వద్దనే కూర్చొని తయారుచేసే సౌలభ్యం ఉన్నందున అనేకమంది మహిళలు ఇందులో నిమగ్నులవుతున్నారు. మొదట కొందరికి వ్యాపకంగా మొదలై, కాలక్రమంలో ఇదే ఉపాధిగా మారింది. రాష్ట్రంలోని అధికశాతం గ్రామాల్లో, పట్టణాల్లో బీడీల తయారీ సాగుతోంది. దాదాపు ఆరున్నర లక్షలమందికి ఉపాధి దొరుకుతోంది. రాజధానినగరం హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లోనూ లక్షమందికి పైగా దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు. దాదాపు 200కి పైగా చిన్నా, పెద్దా పరిశ్రమలు, కార్ఖానాల నుంచి యాజమాన్యాలు తునికాకు, పొగాకు సరఫరా చేస్తుండగా వాటితో బీడీలను మహిళలు చుడుతున్నారు. కార్ఖానాలు చిన్నవిగా ఉండడంతో వారు ఇళ్లవద్దనే వాటిని తయారుచేసి యజమానులకు అప్పగిస్తున్నారు. బీడీ కట్టల తయారీ, చుట్టలు చుట్టడం (ప్యాకింగ్‌), ఇతర విభాగాల్లో పురుషులు పనిచేస్తున్నారు. ఇది వ్యవసాయ అనుబంధ వృత్తిగా మారింది. కులవృత్తులు అవసానదశలో ఉన్న సమయంలో, ఆయా వర్గాల మహిళలకు బీడీల తయారీ ప్రత్యామ్నాయంగా తయారైంది. కరవు కాటకాల సమయంలో బీడీలు చుట్టే మహిళలే కుటుంబాలకు ఆధారమవుతున్నారు. బీడీల పరిశ్రమ ఒకప్పుడు వెలుగు వెలగడంతో, కార్మికులకు భారీయెత్తున ఉపాధి లభించింది. ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం సాగే వలసలు కొంత మేరకు తగ్గాయి. ఒక దశలో గల్ఫ్‌ నుంచి తిరిగొచ్చిన అనేకులు బీడీ పరిశ్రమలో చేరారు. అప్పులు, సూక్ష్మరుణాలకు చెందిన ముఠాల బారిన పడకుండా- మహిళలకు బీడీల తయారీ ద్వారా వచ్చే ఆదాయం చేయూతనిస్తోంది. స్వయం సహాయక సంఘాలు బీడీ పని వల్లనే బలోపేతమయ్యాయి.

వాగ్దానాలతో సరి!

పొగాకు ఉత్పత్తులు తగ్గించాలన్న భావంతో కేంద్రం బీడీ పరిశ్రమపై ఆంక్షలు మోపింది. వాటినే సాకుగా చూపి, యాజమాన్యాలు సంస్థలను మూసివేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోలేదు. ఇటు యాజమాన్యాల ధోరణీ పేద కార్మికుల ఉపాధిని దెబ్బతీసింది, తీస్తోంది. బీడీ కార్మికుల జనసంఖ్య ఓటు నిర్ణాయక శక్తిగా ఉండటంతో, రాజకీయపక్షాలు అనేక హామీలు ఇచ్చి, ఆ తరవాత మొండిచేయి చూపడం 'ఆనవాయితీ'గా మారింది. పరిశ్రమ మూతపడితే యాజమాన్యాలకు ఇతర ఆదాయ మార్గాలు ఉండవచ్చు కానీ కార్మికులకు వేరే జీవనాధారం ఉండదు. ప్రత్యామ్నాయ ఉపాధి చూపితే తప్ప జీవించలేని పరిస్థితి నెలకొంది.

బీడి కార్మికుల శ్రేయస్సు ఎండమావిగా మారింది. ఎవరిపైనా ఆధారపడకుండా సొంతంగా ఉపాధి పొందుతున్నప్పటికీ, వారి బాగోగులపై ప్రభుత్వాలకు పెద్దగా దృష్టి ఉండటం లేదు. రోజంతా శ్రమించే మహిళలకు కనీస ప్రతిఫలాలు లేవు. ఉపాధి హామీ వంటి పథకాల్లో కనీస వేతనాలను పరిగణనలోకి తీసుకుంటున్న ప్రభుత్వం, బీడీ పరిశ్రమలో మాత్రం దీన్ని ప్రవేశపెట్టడం లేదు. ప్రతీ రెండేళ్లకోసారి వేతనాల పెంపుదల అనివార్యమని చట్టం నిర్దేశిస్తున్నా, దాన్ని ఇక్కడ అమలు చేయడం లేదు. ఆ కార్మికుల్లో ఎక్కువమంది అసంఘటిత రంగంలో ఉన్నారు. భవిష్యనిధి (పీఎఫ్‌), కార్మిక రాజ్యబీమా (ఈఎస్‌ఐ)సౌకర్యాలు చాలామందికి అందుబాటులో లేవు. పీఎఫ్‌ కార్డులున్నా, వాటితో లబ్ధి కొంతవరకే. లభించే పింఛను అతి తక్కువ. అధునాతన వైద్యసేవల కోసం కార్మికులు రాజధానికి రావాల్సిందే. వైద్యశాలల్లో సిబ్బందికి కొరత! మందులు, రోగనిర్ధారణ పరీక్షలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పొగాకు ఉత్పత్తులతో పనుల వల్ల కార్మికులు క్యాన్సర్‌, క్షయ, శ్వాసకోశ, కీళ్ల వ్యాధుల బారిన పడుతున్నారు. బీడీ కార్మికుల ఆరోగ్య సంరక్షణ కోసం వారికి 'మాస్క్‌'లు పంపిణీ చేస్తామని ఏడేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా అది అమలు కాలేదు. కార్మికులకు ఇళ్ల నిర్మాణం కోసం పదేళ్ల క్రితంఒక పథకాన్ని కేంద్రం చేపట్టింది. సకాలంలో నిధులివ్వక, ఇచ్చినవి సరిపోక దాదాపు ఇరవై వేల ఇళ్ల నిర్మాణాలు అర్థాంతరంగా నిలిచిపోయాయి.

మార్పు చేర్పులతో పురోగతి

ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే బీడీ పరిశ్రమ నుంచి ఏటా రూ.100కోట్లు సెస్సు రూపేణా వసూలు చేస్తున్నా, కార్మికుల పిల్లలకు మూడు కోట్ల రూపాయలు మాత్రమే ఉపకార వేతనాల రూపేణా ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకొంటోంది. కార్మికులు కష్టాల్లో ఉంటే ఆదుకునేందుకు ఎలాంటి పథకాలు లేవు. రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఇచ్చే సామాజిక పింఛను తలా వెయ్యి రూపాయలు! బీడీ కార్మికులకు మాత్రం భవిష్యనిధి నుంచి వచ్చే పింఛను అతి స్వల్పం. అన్ని రంగాల్లో సర్వీసు ఆధారంగా వేతనం, పింఛను పెరుగుతుండగా ఈ పరిశ్రమలో ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. అనారోగ్యకర వాతావరణంలో పనిచేస్తున్న కార్మికులకు సెలవుల్లేవు. బీడీ తయారీలో మహిళలతో పాటు బాలికలు పనిచేస్తున్నారు. పేదరికం కారణంగా విధిలేక చదువులు మానేసి, బీడీల తయారీకి సిద్ధమైన పిల్లలను ఆదుకునే దిశగా ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కార్మికులను చైతన్యపరచడం లేదా వారికి భరోసా కల్పించడం ద్వారా పిల్లలను బీడీల తయారీ నుంచి తప్పించే అవకాశం ఉన్నా, ఆ దిశగా చర్యల్లేవు. ప్రపంచంలో ఏ ఉత్పత్తికైనా సరిపడే ముడిసరుకును యజమాని సరఫరా చేస్తారు. బీడీ పరిశ్రమలో మాత్రం తునికాకు తరుగు పేరిట కార్మికులపై యాజమాన్యాలు భారం వేస్తున్నాయి. ఇటువంటి అన్ని పరిస్థితుల్లోనూ పూర్తి మార్పు రావాలి. ప్రభుత్వం చేయాల్సింది ఎంతో ఉంది. సమగ్ర పథకం, సమర్థ కార్యాచరణలే ప్రధానంగా ఏలికలు ముందుకు సాగాలి.

కలసికట్టుగా కార్యాచరణ
* బీడీపనివారి దుర్భర స్థితిగతులపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా మహిళలకు వెయ్యిరూపాయల వంతున నెలవారీ భృతి ఇస్తామని ఇటీవల ప్రకటించింది. వారి వాస్తవ జీవనప్రమాణాల స్థాయితో పోలిస్తే అది అంతంతమాత్రమే!
* తెలంగాణ జిల్లాలలోని బీడీ కార్మికులు ఏళ్లతరబడి బాధలు పడుతున్నారని, అనారోగ్య సమస్యలతో నానా అవస్థలపాలవుతున్నారని ప్రభుత్వమే వెల్లడించింది. ఇక తనదైన సంక్షేమ విధానంతో ముందుకు నడవాలి.
* మహిళా శ్రామికుల సమస్యలను అధ్యయనం చేసి పరిష్కార మార్గాలు చూపేందుకు ఐఏఎస్‌ అధికారిణి పూనం మాలకొండయ్య ఆధ్వర్యంలోని సంఘం ఇప్పటికే కృషి సాగిస్తోంది. కనీస వసతుల కల్పన, పనికి తగిన ప్రతిఫలం, ఆరోగ్య భద్రత, గృహనిర్మాణం వంటి ప్రతిపాదనలపై వారు విస్తృత కసరత్తు సాగిస్తున్నారు. అది బీడీ పరిశ్రమకు అన్నివిధాలా విస్తరించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.
* మహిళల సంరక్షణకు ఉద్దేశించిన సంఘం రాష్ట్రప్రభుత్వానికి పలు కీలకమైన సూచనలు చేసింది. వాటిలో కొన్ని అమలవుతున్నాయి. కమిటీ వివిధ జిల్లాల్లో పర్యటించి బీడీ కార్మికుల పరిస్థితులు పరిశీలించనుంది. తెలంగాణలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా, సంఘం పరిశీలనా పరిధి విస్తృతం కావాలి.
* బీడీ కార్మికులకు సంబంధించి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. మహిళల సమస్యలన్నిం టినీ వివిధ కోణాల్లో పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల కల్పనను అన్వేషించాలి. రాష్ట్రానికి భారమైన పక్షంలో కేంద్ర సాయం తీసుకోవాలి.
* కార్మికులకు గృహనిర్మాణ పనులను పూర్తిచేయడంపై ఏలికలు దృష్టి నిలపాలి. కొత్త ఇళ్ల నిర్మాణాలను చేపట్టడం ముఖ్యం.
* బీడీ పరిశ్రమలోని బాలికలను ఆ పని నుంచి విద్యాలయాల వైపు మళ్లించాలి. ఇందుకు వినూత్న పథకం రూపుదిద్దుకోవాలి.
* మహిళా కార్మికుల సంక్షేమం విషయంలో, ఇతర రాష్ట్రాలకు ఆదర్శమయ్యేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించాల్సి ఉంది.

(రచయిత - ఆకారపు మల్లేశం)
Posted on 28-01-2015