Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాష్ట్రీయం

రాళ్లు కావు... రేపటి రతనాలు!

నవ్యాంధ్రలో కొత్తరాజధాని సహా అభివృద్ధి కార్యక్రమాలు రూపుదిద్దుకోబోతున్న తరుణ మిది. పరిశ్రమలు, నౌకాశ్రయాల ఏర్పాటు దిశగా ప్రభుత్వంపెద్దయెత్తున ప్రణాళికలు రచిస్తోంది. ఈ తరుణంలో అనేక అంశాలపై పాలకులు దృష్టి సారించాలి. భవన నిర్మాణాల్లో కీలకంగా ఉపయోగపడే ఇసుక వంటి పదార్థాల అందుబాటు తీరును లోతుగా పరిశీలించాల్సి ఉంది. ఇసుకతోపాటు గ్రావెల్‌, కంకర, ఇసుకరాయి, బంకమట్టి రాయి, సున్నపురాయి, లేటరైట్‌, గ్రానైట్‌, డోలరైట్‌, అనార్ధొసైట్‌, మార్బుల్‌, స్లేట్‌, క్వార్ట్జ్‌, ఖొండలైట్‌, చార్నొఖైట్‌, లెప్టినైట్‌ రాళ్లు రాష్ట్రంలో విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. వాటిలో గట్టిదనంతో ఆకర్షణీయంగా ఉండే శిలలన్నింటినీ వాణిజ్య పరిభాషలో 'గ్రానైట్‌' అని పిలుస్తున్నారు.

దృఢత్వమే కీలకం

నవ్యాంధ్రలో ఈ శిలలన్నీ ఒకేరకంగా లభ్యం కావడంలేదు. గ్రానైట్‌లు అత్యధికంగా తొమ్మిది జిల్లాల్లో దొరుకుతుంటే- చలువరాయి కడప, కర్నూలు; స్లేట్‌- ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. నిర్మాణాలకు అన్ని శిలా పదార్థాలు పనికిరావు. వాటికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి. బయటికి కనిపించే శిలాభాగం ఆకర్షణీయంగా ఉండాలి. గుంటలు, పగుళ్లు, గీతలు విడి రేణువులు ఉండరాదు. బలంగా, దృఢంగా, నాణ్యత కలిగి వాతావరణంలో మార్పులను తట్టుకోగలిగి ఉండాలి. కఠినత ఎక్కువ ఉండాలి. అప్పుడే నిర్మాణాలు కంపనాలను తట్టుకొంటాయి. దాంతోపాటు కావలసిన పద్ధతిలో ముక్కలు చేసి, రూపం దిద్దడానికి అనువుగా శిలలు ఉండాలి. అగ్ని ప్రమాదాలను తట్టుకోగల స్వభావమూ తప్పనిసరి. సాధారణంగా పాతాళ, ఉపపాతాళ, రూపాంతర ప్రాప్తశిలలు బాగా దృఢంగా ఉండి నిర్మాణాలకు అనువుగా ఉంటాయి. అవక్షేప శిలలు తక్కువ దృఢంగా ఉంటాయి. భవన నిర్మాణాలకు శిలలను ఎంపిక చేసుకోవడంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. నివాస ప్రాంతంలోని శీతోష్ణస్థితి, రాత్రి-పగలు ఉష్ణోగ్రతల మధ్య బేధాలు, భూగర్భ జలమట్టం లోతులను బట్టి శిలల ఎంపిక జరగాలి. అసలైన గ్రానైట్‌, ఇసుకరాయి, క్వార్ట్జ్‌, ఫెల్స్‌పార్‌ ఖనిజాలతో ఏర్పడతాయి. క్వార్ట్జ్‌ స్థిరమైన ఖనిజం. ఇది శైథిల్యాన్ని తట్టుకుంటుంది.

కాని, ఫెల్స్‌పార్‌ తడి తగిలితే తేలిగ్గా పాడవుతుంది. అందువల్ల శిలలు గుంటలుపడి అందం కోల్పోతాయి. ఇనుము, మెగ్నీషియం, అల్యుమినా అధికంగా ఉండే బసాల్ట్‌, ఖోండరైట్‌, చార్నొఖైట్‌ శిలలు త్వరగా శైథిల్యం బారినపడతాయి. సున్నపురాయి, చలువరాయి కాల్షియం కార్బొనేట్‌ రసాయన సంఘటన కలిగి ఉంటాయి. వర్షం కురిసేటప్పుడు వర్షపునీరు వాతావరణంలో ఉండే కార్బన్‌డయాక్సైడ్‌తో చర్యపొంది కొద్దిపాటి ఆమ్లత్వాన్ని సంతరించుకుంటుంది. దానివల్ల శిలల్లో గుంటలు ఏర్పడతాయి. డోలమైట్‌ పరిస్థితీ అంతే. ఉష్ణోగ్రతల్లో ఎక్కువ తేడాలుంటే ఈ శిలల్లో పగుళ్లు ఏర్పడతాయి. బంకమట్టి రాయి, స్లేట్‌ల్లో ఎక్కువ భాగం బంకమట్టి ఖనిజాలను కలిగి ఉంటాయి. వీటిలో రేణువులు బాగా తక్కువ పరిమాణంలో ఉండి విదళన (క్లివేజ్‌) లక్షణం కలిగి ఉంటాయి. అందువల్ల ఈ శిలలు పొరలుగా విడిపోతాయి. గ్రావెల్‌, కంకర వంటివాటినీ నాణ్యత ప్రాతిపదికన విభజించుకోవాలి. రహదారులు, ఇండ్ల నిర్మాణంలో మెరక కోసం, వాటినుంచి ఏర్పడిన మెత్తటి పొడిని వాడుతున్నారు. ఫలితంగా నిర్మాణాలు కుంగిపోవడం, పగుళ్లు ఏర్పడి పాడవడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్రంలో లభ్యమవుతున్న భవన నిర్మాణ పదార్థాలను వాటి వాటి నాణ్యతలను బట్టి- గ్రామస్థాయిలో వివిధ విభాగాలుగా విభజించి ఆ మేరకు సుంకం నిర్ణయించాల్సి ఉంది.

రాష్ట్రంలో శిలల తవ్వకాలు ఎక్కువ భాగం ప్రైవేటు కంపెనీల ద్వారానే జరుగుతున్నాయి. కంపెనీలు తవ్వి తీసిన శిలలపై ప్రభుత్వం 'రాయల్టీ' వసూలు చేస్తోంది. గ్రానైట్‌ విషయంలో 'రాయల్టీ'ని బ్లాకు రకం, పరిమాణాలను బట్టి నిర్ణయిస్తారు. రాష్ట్రంలో దొరికే గ్రానైట్‌లను గెలాక్సి నల్లగ్రానైట్‌, నల్లగ్రానైట్‌, శ్రీకాకుళం, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో దొరికే రంగుల గ్రానైట్‌; మిగిలిన జిల్లాల్లో లభ్యమయ్యే రంగుల గ్రానైట్‌ అని నాలుగు రకాలుగా విభజించారు. పరిమాణాన్ని బట్టి కూడా గ్రానైట్‌ను నాలుగు రకాలుగా చూస్తారు. కొలతలను బట్టి సూపర్‌ గాంగ్‌సా, మినీ గాంగ్‌సా తదితర రకాలుగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ప్రభుత్వం గెలాక్సీ మొదటి రకం బ్లాకులపై టన్నుకు రూ.1100 మేర, నల్లగ్రానైట్‌పై రూ.800 మేర 'రాయల్టీ' వసూలు చేస్తోంది. గుజరాత్‌ రాష్ట్రంలో టన్ను నల్లగ్రానైట్‌పై రూ.160, రాజస్థాన్‌లో రూ.175 వసూలు చేస్తున్నారు. ధరల్లో ఈ తీవ్ర వ్యత్యాసాల కారణంగా రాష్ట్రంలో గనుల యజమానులు 'రాయల్టీ' చెల్లించేందుకు ఇష్టపడటం లేదు. వారు అనధికారిక వ్యాపారంవైపు మొగ్గుచూపుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీనివల్ల ప్రభుత్వానికి అపార నష్టం వాటిల్లుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం సహేతుక ప్రాతిపదికలను రూపొందించుకోవాలి. గనుల నుంచి బయటకు వచ్చే ప్రతి బ్లాకుకు తప్పనిసరిగా బిల్లు ఉండాలి. వాటి అమ్మకాల వివరాలు ప్రభుత్వానికి అందించాలి. కానీ, పెద్దమొత్తంలో బ్లాకులను రాత్రికి రాత్రే దగ్గరలోని ఫ్యాక్టరీలకు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల గనులు క్రమంగా తరిగిపోతున్నాయి. ప్రభుత్వానికి 'రాయల్టీ' సొమ్ము మాత్రం రావడం లేదు. అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవడానికి విజిలెన్స్‌ శాఖ ఉన్నప్పటికీ- కొందరు గనుల యజమానులకు దాడులకు సంబంధించిన సమాచారం చేరిపోతుండటంతో ప్రయత్నాలు సఫలం కావడంలేదు.

యజమానులకూ నష్టం

నిర్మాణాల్లో ఉపయోగిస్తున్న శిలల్లో ప్రత్యేకించి గ్రానైట్‌కు మంచి డిమాండ్‌ ఉంది. కానీ, దాని వెలికితీతలో, 'రాయల్టీ' లెక్కింపులో తేడాలవల్ల తాము నష్టపోతున్నట్లు గనులు యజమానులు వాపోతున్నారు. రాష్ట్రంలో గ్రానైట్‌ ఉత్పత్తిపై వసూలు చేస్తున్న 'రాయల్టీ' చాలా ఎక్కువ. ఫలితంగా గనుల వ్యాపారులు ఎంత పెట్టుబడి పెట్టినా, వారికి చివరికి మిగులుతోంది అత్తెసరే. 'రాయల్టీ' లెక్కింపులో బ్లాకు కొలతల సగటును ప్రమాణంగా ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తోంది. రవాణా సమయంలో బ్లాకు అంచులు అరిగినా, పగిలినా కొనుగోలుదారుతో తేడా రాకుండా ఉండటానికి అన్నివైపులా 'స్టాండర్డ్‌' సైజుకన్నా ఓ 10 సెం.మీ. ఎక్కువ ఉండేలా బ్లాకు తయారు చేస్తారు. కొనేవాళ్లు 10సెం.మీ. తగ్గించి లెక్కకడతారు. దాంతో మొత్తంగా యజమానులకు 20సెం.మీ. మేర నష్టం కలుగుతోంది. గనుల యజమానులు గ్రానైట్‌ బ్లాకులను వెలికి తీయడానికి ముందు ఆ ప్రదేశాన్ని వెలికితీతకు అనుకూలంగా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంత ఖర్చు చేసిన అనంతరం వెలికితీసే బ్లాకు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. నాణ్యత సరిగా లేకపోతే పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లుతుంది. గ్రానైట్‌ మైనింగ్‌లో పేలుడు పదార్థాలు వాడవచ్చు. అందువల్ల గ్రానైట్‌ బ్లాకులో పగుళ్లు ఏర్పడవచ్చు. దాంతో బ్లాకు విలువ సగానికి సగం కోసుకుపోతుందన్నది యజమానుల ఆవేదన.

కొత్త ఆదాయానికి మార్గాలు

నవ్యాంధ్రలో నిర్మాణ పదార్థాలకు గిరాకీ విపరీతంగా పెరుగుతోంది. ఈ తరుణంలో భవిష్యత్‌ డిమాండుకు తగిన ట్లుగా పదార్థాలపై సక్రమంగా అజమాయిషీ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌లో లభ్యమవుతున్న నిర్మాణ పదార్ధాల్లో ఇసుక తప్ప, మరే ఒక్కటీ తిరిగి ఉత్పత్తి అయ్యే పదార్థం లేదు. గ్రావెల్‌, శిలలు వంటివి ఒకసారి వాడుకుంటే వాటి కథ అంతటితో ముగిసినట్లే. ఇప్పటికే ఎన్నో కొండలు, గుట్టలు కరిగిపోయాయి. మిగిలిన వనరులను కచ్చితంగా అంచనావేసి, వృథా కాకుండా ఉపయోగించుకోవాల్సి ఉంది. అదే సమయంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని సక్రమంగా రాబట్టుకోవాలి. గ్రావెల్‌, మట్టి, కంకర, రోడ్‌ మెటల్‌ వీటన్నింటికి ఇసుక నిక్షేపాలకు ఇస్తున్న ప్రాధాన్యం ఇవ్వాలి. వీటిపై ప్రస్తుతం ఉన్న 'రాయల్టీ'కన్నా ఎక్కువ వసూలు చెయ్యాలి. ఖనిజాభివృద్ధి సంస్థ అధీనంలోని 25హెక్టార్ల- గ్రానైట్‌ గనులకు ప్రభుత్వం అంతర్జాతీయ టెండర్లు ఆహ్వానించాలని భావిస్తోంది. అలాగే వాణిజ్యపరంగా గ్రానైట్‌ పేరిట ప్రచారంలో ఉన్న అన్నిరకాలపైనా ఆదాయం పెంచుకోవడానికి తగిన కసరత్తు చెయ్యాలి. గుజరాత్‌లో గ్రానైట్‌ లభ్యమయ్యే ప్రాంతాలను కొన్ని మండలాలుగా విభజించారు. ఒక్కో మండలంలో 'రాయల్టీ' రూపంలో ఎంత ఆదాయం వస్తుందో అంచనావేసి ఆ మొత్తానికి టెండర్లు పిలుస్తారు. టెండరు పాడుకున్నవారు సొమ్ము మొత్తాన్ని ఒకేసారి ప్రభుత్వ ఖాతాకు జమ చేస్తారు. టెండరు పాడుకున్నవారే అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు. కాబట్టి, రాష్ట్రప్రభుత్వం గనుల యజమానులతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన మొత్తాన్ని 'రాయల్టీ'గా నిర్ణయించి ఆదాయాన్ని పెంచుకోవాలి. అలాగే, గ్రానైట్‌తోపాటు మిగిలిన శిలలు, ఇతర పదార్థాలపైనా దృష్టిసారించాలి. గ్రానైట్‌పై 'రాయల్టీ' మరో 20శాతం పెంచే అవకాశం ఉందని వూహాగానాలు వెలువడ్డాయి. తద్వారా అక్రమ వ్యాపారం మరింత పెరిగి ప్రభుత్వానికి ఆదాయానికి గండిపడే ప్రమాదం పొంచి ఉంది. ప్రభుత్వం ఆచరణాత్మక పంథాలో ముందుకు కదలాల్సిన సందర్భమిది!

(రచయిత - ఆచార్య పొదిల శంకర పిచ్చయ్య)
(భూగర్భశాస్త్ర, మనోవైజ్ఞానిక నిపుణులు)
Posted on 28-01-2015