Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


రాష్ట్రీయం

ఆంధ్ర వైభవ దీప్తి- అమరావతి

రాజధాని అంటే రాజ నివాసం. రాజులు, రాజ్యాలు లేని ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజధాని అంటే ప్రజాతంత్రానికి శిరస్థానమని అర్థం. తెలుగు ప్రజల ఆశలు, ఆకాంక్షల కేంద్ర బిందువుగా ఆవిర్భవిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి ఏ పేరు పెట్టాలన్నది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.

ఆంధ్రులది వేల సంవత్సరాల చరిత్ర. రుగ్వేదానికి అనుబంధమైన ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రుల ప్రస్తావన ఉంది. ఆంధ్రుల రాజధాని అభినవ సింగపూర్‌లా అధునాతనంగా ఉండటమే కాదు, వారి ఘనచరిత్రనూ ప్రతిబింబించాలి. వారి శౌర్య పరాక్రమాలకు నిలువెత్తు సాక్షిగా నిలవాలి. రాజధాని ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న అమరావతికి ఆ లక్షణాలన్నీ ఉన్నాయి. అమరావతికి శతాబ్దాల చరిత్ర ఉంది. మౌర్య సామ్రాజ్య శకలాలపై భారతదేశమంతటా విస్తరించిన సువిశాల స్వతంత్ర రాజ్యాన్ని నిర్మించిన శాతవాహనులు; క్రీస్తు శకం అయిదు, ఆరు శతాబ్దాల్లో దక్షిణ భారతదేశంలో అధిక భాగాన్ని, ఒడిశాను పరిపాలించిన విష్ణుకుండినులు ఆంధ్రులన్నది చారిత్రక సత్యం. ఈ రెండు ఆంధ్ర రాజవంశాలకూ అమరావతితో అవినాభావ సంబంధం ఉంది. ఇక్ష్వాకులు, పల్లవుల కాలంలోనూ అమరావతి ప్రధాన నగరంగా వెలుగులు విరజిమ్మిందనడానికి చారిత్రక ఆధారాలున్నాయి. గౌతమ బుద్ధుడు తన మొదటి కాలచక్ర తంత్రాన్ని నిర్వహించింది అమరావతిలోనే. విలక్షణ చారిత్రక నగరంగా, విశిష్ట పర్యాటక క్షేత్రంగా, అన్నింటికీ మించి అధునాతన రాజధానిగానూ గుర్తింపు పొందగల పూర్తి అర్హత, స్థాయి- అమరావతికి ఉన్నాయి.

మహోన్నత చరిత

అమరావతి అంటే, మృత్యువులేని ప్రదేశం అని అర్థం. క్రీ.పూ.500లో అక్కడ సాక్షాత్తు గౌతమ బుద్ధుడు సంచరించాడు. తొలి కాలచక్ర తంత్రాన్ని నిర్వహించాడు. బౌద్ధ ప్రవచనంతో పునీతమై అమరత్వం పొందింది కాబట్టే, ఆ ప్రాంతం అమరావతి అయిందంటారు. తథాగతుడి పవిత్ర అవశేషాలు అమరావతిలో బయటపడ్డాయి.
తెరవాడ బౌద్ధానికి ఆద్యుడైన బుద్ధఘోషుడు క్రీస్తుశకం నాలుగు, అయిదు శతాబ్దాల మధ్య కాలంలో అమరావతి ప్రాంతంలో నివసించాడు. అపర బుద్ధుడిగా విశ్వవిఖ్యాతి గడించిన ఆచార్య నాగార్జునుడూ, ఇదే ప్రాంతానికి చెందినవాడు.

క్రీస్తు పూర్వం రెండు, మూడు శతాబ్దాల మధ్యకాలంలో ఇక్కడ అశోక చక్రవర్తి ఆదేశానుసారం 160 అడుగుల వైశాల్యం, 100 అడుగుల ఎత్తు కలిగిన మహా స్తూపం నిర్మించారు. ఆచార్య నాగార్జునుడు పునరుద్ధరించిన అమరావతీ స్తూపాన్ని చైనీయులు శ్రీ ధాన్యకటక చైత్యంగా అభివర్ణించారు. అమరావతీ స్తూపం చరిత్ర ప్రసిద్ధమైన సాంచీ స్తూపం కన్నా పెద్దదని ప్రతీతి. మహాయాన బౌద్ధానికీ అదే కేంద్ర బిందువుగా నిలిచింది.

బుద్ధుడి జన్మస్థలమైన బిహార్‌లో, ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌గా ప్రసిద్ధమైన గాంధార దేశంలో ఒకనాడు బౌద్ధం పరిఢవిల్లింది. తెలుగునేలపైనా అందుకు సమాన స్థాయిలో బౌద్ధ ధర్మం విరాజిల్లిందనడానికి అమరావతిలోని శిథిలాలే సాక్ష్యం.

శౌర్య పరాక్రమాలకు ప్రతీక అయిన ఆంధ్రజాతికి అమరావతితో విడదీయరాని చారిత్రక అనుబంధం ఉంది. బౌద్ధం ఇక్కడి అనేక తెగల సమూహమైన ఆంధ్రజాతిని ఏకీకృతం చేసి వారిలో సామ్రాజ్యకాంక్షను రగిలించింది. వారికి జగద్విఖ్యాతి దక్కడానికి దోహదపడింది. ఆ రకంగా ఆంధ్రులు చరిత్రలో ప్రబల సమీకృతశక్తిగా మొదట ఆవిర్భవించింది అమరావతిలోనే. ధాన్యకటకంగా ప్రసిద్ధమైన ఈ ప్రదేశాన్ని రాజధానిగా చేసుకొని పాలన సాగించిన శాతవాహనులు మౌర్య సామ్రాజ్య పతనానంతరం అశాంతిని, అరాచకాన్ని పారదోలి యావద్దేశానికి తమ పాలన విస్తరించారు. వారి ఏలుబడిలో వర్తక వాణిజ్యాలు స్వేచ్ఛగా సాగాయి. తమ నావికా శక్తితో ఆగ్నేయాసియాతోనూ వాణిజ్యానుబంధం నెలకొల్పుకోగలిగారు.

అశోకుడి మరణానంతరం దాదాపు నాలుగు శతాబ్దాలకు పైగా అప్రతిహతంగా సాగిన శాతవాహనుల పాలనకాలంలో అమరావతీ నగరం ఆంధ్రుల వైభవానికి ప్రతీకగా నిలిచింది. క్రీ.పూ.228నుంచి క్రీ.శ.225వరకు సువిశాల ఆంధ్ర సామ్రాజ్యానికి ఇదే రాజధాని. అంతకుముందు కూడా ఆంధ్రులు- మౌర్యుల సామంతులుగా అక్కడి నుంచే పాలన సాగించారు. క్రీ.పూ. రెండు, మూడు శతాబ్దాల నాటికి అమరావతి నగరం ప్రపంచ ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లుతోంది. అక్కడ బౌద్ధారామాలే కాక, ఒక విశ్వవిద్యాలయమూ ఉండేదట. దేశం నలుమూలల నుంచే కాక ఆగ్నేయాసియా దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు సైతం అక్కడ విద్యనభ్యసించేవారు. చైనాకు చెందిన ప్రసిద్ధ యాత్రికుడు యువాన్‌చాంగ్‌ అమరావతిలో బౌద్ధ అభిధర్మాన్ని అధ్యయనం చేశాడని ప్రతీతి.

చింతపల్లి జమీందారు 1796లో తన రాజధానిని అమరావతికి మార్చి అక్కడ ఒక పట్టణాన్ని నిర్మించారు. అక్కడి బౌద్ధ నిర్మాణాల ప్రాధాన్యం తెలియని స్థానికులు పురాతన కట్టడాల నుంచి రాతి పలకలను, ఇటుకలను, శిల్పాలను తొలగించి పట్టణ నిర్మాణంలో వాడుకున్నారు. ఆ క్రమంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బౌద్ధ స్తూపం ధ్వంసమైంది. అంతకు పూర్వం స్థానికులు ఇక్కడి శిథిలాల దిబ్బలని, స్తూపాన్ని 'దీపాలదిన్నె' అని పిలిచేవారు.

క్రీస్తుశకం 1859లోనే అమరావతికి చెందిన 70 శిల్పఖండాలను లండన్‌లోని బ్రిటిష్‌ మ్యూజియానికి తరలించారు. లండన్‌ మ్యూజియంలో అమరావతి పేరుతో ఒక ప్రత్యేక గ్యాలరీ ఉంది. అమూల్యమైన ఆ కళాఖండాలను తిరిగి ఇవ్వాల్సిందిగా భారత్‌ తమను ఏనాడూ కోరలేదని లండన్‌ మ్యూజియం అధికారులు చెప్పిన మాటలు పత్రికల్లోనూ ప్రచురితమయ్యాయి.

అమరావతి పేరు ఖండాంతర ఖ్యాతి పొందింది. ఇంగ్లాండులో తెరవాడ బౌద్ధాన్ని పాటిస్తున్నవారు అమరావతి పేరుతో ఒక బౌద్ధారామాన్ని నడుపుతున్నారు.

ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం

బౌద్ధ మత ప్రాభవం కాలక్రమంలో సన్నగిల్లాక మధ్య యుగాల్లో అమరావతి- శైవ మతానికి కేంద్ర స్థానమైంది. ఒకనాటి బౌద్ధాలయమే అనంతరం శివాలయంగా మారిందన్న వాదనా ఉంది. ఆలయం ఎప్పుడు ప్రారంభమైందన్న నిర్దిష్ట చారిత్రక ఆధారాలేవీ లేవు. కానీ అమరావతిలోని అమరేశ్వరాలయానిది- అతిపురాతనమైన చరిత్ర, అత్యంత ఆసక్తికరమైన స్థల పురాణం. శివలింగాన్ని తన కంఠంలో బంధించిన తారకాసురుడనే రాక్షసుణ్ని శివుడి కుమారుడైన సుబ్రహ్మణ్యుడు వధించాడట. తారకాసుర వధ జరిగాక ఆ రాక్షసుడి గొంతులోని శివలింగం ఖండాలుగా విడిపోయి అయిదు శైవ క్షేత్రాల్లో పడిపోయిందట. ఆ అయిదింటిలో అమరావతిగా ప్రసిద్ధమైన అమరేశ్వరం ఒకటి అంటారు.

దిగంతాలకు ఖ్యాతి...

అమరేశ్వరాలయాన్ని శ్రీకృష్ణదేవరాయల వంటి రాజులెందరో దర్శించి దానధర్మాలు చేశారు. తమ శివప్రీతిని చాటుకున్నారు. శ్రీకృష్ణ దేవరాయలు క్రీ.శ.1515లో ధాన్యకటకాన్ని జయించి అమరేశ్వరాలయంలో తులాభారం తూగి ఆ ధనాన్ని దానం చేసినట్లు ఆలయ శాసనం చెబుతోంది. అక్కడి అనేక దాన శాసనాలు ఆలయ విశిష్టతను వెల్లడిస్తున్నాయి. 1361లో కొండవీటి రాజైన అనపోతారెడ్డి ఈ ఆలయాన్ని బాగుచేయించి ఆచంద్రతారార్కంగా పునఃప్రతిష్ఠ చేయించారని శాసనాలు చెబుతున్నాయి. దివాన్‌ చందూలాల్‌ ప్రేరణతో నైజాం నవాబు ఈ దేవస్థానానికి 500 ఎకరాల పొలం, ప్రతి సంవత్సరం వెయ్యి రూపాయల నగదు ఇచ్చే ఏర్పాటు చేశారు. అమరేశ్వరాలయం చుట్టూ వెలసింది కాబట్టే, ఈ ప్రదేశం అమరావతి అయిందన్నది మరో వాదన.

ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి అమరావతి కంటే సముచితమైన పేరు మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు. అమరావతి రాజధానిగా ఆంధ్రుల ఖ్యాతి చిరస్థాయి పొందుతుందనడంలో సందేహం లేదు. వర్తక, వాణిజ్యాలే కాక ఇక్కడ పర్యాటకమూ పరిఢవిల్లేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ప్రాచీన కళాఖండాలను, అవశేషాలను పునరుద్ధరించడమే కాక బ్రిటిష్‌ మ్యూజియంలో ఉన్న అమరావతీ శిల్పాలను రప్పించి అద్భుత ప్రదర్శనాలయాన్ని నిర్మించడం ద్వారా దేశవిదేశాల పర్యాటకులను విశేషంగా ఆకర్షించవచ్చు. పర్యాటక, ఆధ్యాత్మిక దృష్టి కోణంలో ఏటా 'కాలచక్ర' వంటి అంతర్జాతీయ క్రతువులు నిర్వహించవచ్చు. అధునాతనంగా పునర్నిర్మితమైన ఆంధ్రుల అతి పురాతన రాజధాని నగరంగా అమరావతి ప్రపంచ ప్రసిద్ధి పొందగల వీలుంది.

(రచయిత - రామోజీరావు)
Posted on 27-01-2015