Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


సైన్స్ & టెక్నాల‌జీ

అణువణువునా అపాయం!

ప్రపంచం నుంచి అణ్వస్త్రాలను నిర్మూలించడానికి ఐక్యరాజ్య సమితి ఏళ్ల తరబడి కృషి జరుపుతోంది. అయినా ఆశించిన ఫలితాలు ఒనగూడటమే లేదు. అణ్వస్త్రదేశాలపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు బహుముఖీనం కావాల్సిన సందర్భమిది. సంపూర్ణ అణ్వస్త్ర రహిత ప్రపంచం కోసం దేశాలన్నీ కట్టు సడలని పట్టుదలతో ముందుకురకాలి. కూర్చున్న కొమ్మను నరుక్కునే ఆత్మహత్యా సదృశ ప్రయత్నాలకు వ్యతిరేకంగా పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు గళం విప్పాలి. అప్పుడే అణ్వస్త్రరహిత స్వప్నం సాకారం అవుతుందంటున్న వ్యాసమిది...

ప్రపంచాన్ని అణ్వస్త్ర రహితంగా తీర్చిదిద్దాలన్నదే ఐక్యరాజ్య సమితి పెట్టుకున్న ప్రప్రథమ లక్ష్యం. ఐరాస సర్వ ప్రతినిధి సభ 1946లో మొదటి తీర్మానం ద్వారానే ఈ లక్ష్యాన్ని చాటుకొంది. అణ్వస్త్రాలకు సంపూర్ణంగా స్వస్తిచెప్పడమన్నది 1959 నుంచే ఐక్యరాజ్య సమితి అజెండాగా ఉంది. సెప్టెంబరు 26న 'సంపూర్ణ అణ్వస్త్ర నిరాయుధీకరణ దినం'గా పాటించాలని 2013లో ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. 1970లో అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం అమలులోకి వచ్చిన తరవాత 1975 మొదలు ప్రతి అయిదేళ్లకోసారి ఐక్యరాజ్య సమితి ఈ ప్రతిపాదనను పరిశీలిస్తూనే ఉంది. నిరాయుధీకరణపై 1978లో సర్వ ప్రతినిధి సభ ప్రత్యేక సమావేశం నిర్వహించినప్పటి నుంచి అణ్వస్త్రాలను నిర్మూలించడానికి సమితి ప్రాధాన్యం ఇస్తూనే ఉంది. ఈ కార్యక్రమాన్ని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన వారంతా సమర్ధిస్తూ వచ్చారు.

అనుక్షణం భయం భయం

ఒకవైపు అణ్వస్త్ర నిర్మూలనకోసం ప్రయత్నాలు జరుగుతున్నా, మరోవైపు ప్రపంచంలో అణ్వస్త్ర రాశులు పేరుకుపోయాయి. అణ్వస్త్రాలున్న దేశాలు తమ అణ్వాయుధాగారాలకు పదునుపెట్టడానికి దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేస్తూనే ఉన్నాయి. అపారంగా నిధులు గుమ్మరిస్తూనే ఉన్నాయి. ప్రపంచ జనాభాలో సగంకన్నా ఎక్కువమంది అణ్వస్త్రాల నీడలోనే కాలం గడపాల్సి వస్తోంది. మొదటి నుంచీ అణ్వస్త్రాలున్న దేశాలు అయిదే అయినా, ప్రస్తుతం వీటి సంఖ్య తొమ్మిదికి పెరిగింది. మరికొన్ని అణ్వస్త్ర దేశాల ఛత్రఛాయల్లో ఉన్నాయి. నిరాయుధీకరణ కోసం దేశాల మధ్య ద్వైపాక్షిక, బహుళపక్ష ఒప్పందాలు కుదురుతున్నాయి. అణ్వస్త్ర నిరాయుధీకరణ కోసం సంప్రతింపులూ కొనసాగుతున్నాయి. అయినప్పటికీ 2014 వరకు ఒక్క అణ్వస్త్రమైనా నిరాయుధీకరణ పరిధిలోకి రాలేదు. అణ్వస్త్ర ప్రయోగాన్ని నియంత్రించడానికి తమ వద్ద ఉన్న ఆయుధాలు ఉపకరిస్తాయని అణ్వస్త్ర దేశాలు వాదిస్తున్నాయి. ఒక్క అణ్వస్త్రాన్ని ప్రయోగించినా జరగబోయే బీభత్సమేమిటో స్పష్టంగా తెలిసినా ఆ దేశాల వైఖరిలో మార్పు రావడం లేదు. అణ్వస్త్రాలను ఉపయోగిస్తే ముంచుకొచ్చే ప్రమాదం ఏమిటో చెప్పనక్కర్లేదు. ఆత్మరక్షణ కోసం ఏ దేశం అణ్వస్త్రాలు ప్రయోగించినా అది అక్కడితో ఆగే వ్యవహారం కాబోదు. ఎదురుదాడి అనివార్యమవుతుంది. అణ్వస్త్రాలను ప్రయోగిస్తే ఈ భూ మండలం మీద మనుషులే కాదు... జరిగిన నష్టాన్ని మదింపు చేయడానికైనా ఏ ఒక్కరూ మిగిలిఉండే అవకాశమే ఉండదు. ఏ జీవరాశీ మిగలదు. అసలు జీవావరణమే ఉండదు. ఈ ప్రపంచాన్నంతటినీ అనేక వేలసార్లు సర్వనాశనం చేయడానికి సరిపోయినన్ని అణ్వాయుధ రాశులు పోగుబడి ఉన్నాయి.

శత్రుపక్షాన్ని నిరోధించడానికి అణ్వస్త్రాల పాటవం ఉపయోగపడుతుందన్న భరోసా వాటిని నిల్వ పెట్టుకున్న దేశాలకు ఉండవచ్చు. కానీ, అణుయుద్ధమే వస్తే తమ గతి ఏమిటన్న ఆందోళన ఇతర దేశాలను సహజంగానే పీడిస్తోంది. అందుకే, నిరాయుధీకరణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతుండటం ఆయా దేశాలను కలవరపెడుతున్న పరిణామం. ఏటా సెప్టెంబరు 26న సంపూర్ణ అణ్వస్త్ర నిరాయుధీకరణ దినాన్ని పాటించాలన్నది ఐక్యరాజ్య సమితి నిరుడు డిసెంబరులో తీసుకొన్న నిర్ణయం. సంబంధిత తీర్మానానికి 129 దేశాలు మద్దతు పలికాయి. 28 దేశాలు వ్యతిరేకించాయి. 19 దేశాలు గైర్హాజరయ్యాయి. ప్రారంభంలో అణ్వస్త్రాలున్న అయిదు దేశాల్లో నాలుగు- అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌, యునైటెడ్‌ కింగ్డమ్‌లు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ వచ్చాయి. మిగిలిన దేశం చైనా ఒక్కటే తీర్మానాన్ని సమర్థించింది. ఎక్కువ అణ్వస్త్రాలున్న దేశాలు ముందుగా నిరాయుధీకరణకు ఉపక్రమించాలని అది కోరింది. అణ్వస్త్రాలు కలిగిన భారత్‌, పాకిస్థాన్‌ సైతం తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. ఈ రెండు దేశాలు అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందంపై మాత్రం సంతకాలు చేయలేదు. 'నాటో' కూటమిలోని జర్మనీ లాంటి దేశాలు, అమెరికా అణ్వస్త్ర ఛత్రఛాయల్లో ఉన్న జపాన్‌ లాంటి దేశాలు తీర్మానాన్ని వ్యతిరేకించడం లేదా గైర్హాజరు కావడం చేశాయి.

అడ్డగోలు వాదనలు

అణువిచ్ఛేదక సామగ్రి వినియోగం నిలిపివేయాలన్న ఒప్పందం, అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒప్పందం, జెనీవాలో జరిగిన నిరాయుధీకరణ సమావేశం లాంటి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. 2015లో అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందంపై మళ్ళీ సమీక్ష జరగాల్సి ఉంది. ఐక్యరాజ్య సమితి నిరాయుధీకరణపై సమావేశం నిర్వహించాలని ప్రయత్నించడం అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పంద అజెండాకు వ్యతిరేకమని కొన్ని అణ్వస్త్ర దేశాలు వాదిస్తున్నాయి. నిరాయుధీకరణ లక్ష్యాన్ని సాధించడానికి 1975 నుంచి ఐక్యరాజ్య సమితి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ అందరికీ ఆమోదయోగ్యమైన పత్రాన్ని మాత్రం రూపొందించలేకపోయారు. వచ్చే ఏడాది జరిగే సమీక్షా సమావేశంలోనూ ఏకాభిప్రాయం కుదరకపోవచ్చునన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఐక్యరాజ్య సమితి సహస్రాబ్ది లక్ష్యాల ప్రకటన పత్రంలోనూ అణ్వస్త్ర నిరాయుధీకరణ ఆవశ్యకతను నొక్కిచెప్పారు.

అణ్వస్త్రాలు ప్రయోగించడం అమానుషం, అక్రమం, చట్టవ్యతిరేకమని అణ్వస్త్రవ్యాప్తి నిరోధక పార్లమెంటేరియన్ల బృందం(పీఎన్‌డీపీ) గొంతెత్తి చాటుతూనే ఉంది. నార్వే లాంటి దేశాలైతే తమ భూభాగంలో అణ్వస్త్రాల తయారీ, దిగుమతి, వినియోగాలను నిషేధించడానికి ఏకంగా రాజ్యాంగ సవరణే చేశాయి. ఆ దేశాల్లో ప్రతి ఒక్కరూ ధైర్యంగా, దీక్షగా అణ్వస్త్రాలకు వ్యతిరేకంగా గొంతెత్తవచ్చు. తమ దేశాధినేతలకు లేఖల ద్వారా ఇతర మార్గాల్లో సందేశాల ద్వారా విజ్ఞప్తి చేయవచ్చు. అణ్వస్త్రాలు దగ్గర ఉంటే తమపై దాడికి శత్రుదేశాలు భయపడతాయన్న వాదన పస లేనిది. నిజం చెప్పాలంటే ఈ భూమిపై ఏ ఒక్క దేశం చేతిలోనైనా అణ్వస్త్రాలు ఉంటే, అది ప్రపంచ మానవాళికి పొంచిఉన్న పెనుముప్పునకు ప్రబల సంకేతం. రెండో ప్రపంచ యుద్ధం తరవాత మళ్ళీ అణ్వస్త్ర ప్రయోగం జరగకపోవడం మానవాళి చేసుకున్న అదృష్టమే. ఒక్కమాటలో చెప్పాలంటే, మానవ నాగరికత, అణ్వస్త్రాల మధ్య సహజీవనం- దుర్లభం!

అంతా నిగూఢం

ప్రస్తుతం సార్వభౌమాధికారంగల తొమ్మిది దేశాల దగ్గర అణ్వస్త్ర రాశులు పోగుపడి ఉన్నాయి. అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం ఏకపక్షంగా ఉందంటూ దానిపై సంతకం చేయడానికి భారత్‌, పాకిస్థాన్‌లు నిరాకరిస్తున్నాయి. ఉత్తర కొరియా ఒప్పందంపై తొలుత సంతకం చేసింది. తరవాత 2003 జనవరి 10న ఒప్పందం నుంచి విరమించుకుంది. యురేనియం శుద్ధిచేయడానికి ఉత్తర కొరియా రహస్యంగా ప్రయత్నిస్తోందని అమెరికా ఆరోపించిన నేపథ్యంలో ఉత్తర కొరియా ఈ నిర్ణయం తీసుకుంది. 1994లోనే అమెరికా ఇంధన రంగంలో ఆ దేశానికి సహాయం అందించడం నిలిపేసింది. తమ దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయని ఉత్తర కొరియా ప్రకటించినా అణుపాటవ పరీక్ష జరిపిన దాఖలాలు లేనందువల్ల ఆ మాటను ఎవరూ నమ్మలేదు. తరవాత 2006 అక్టోబర్‌ తొమ్మిదిన తొలిసారి అణుపాటవ పరీక్ష నిర్వహించింది. 2009 మేలో రెండో పరీక్ష జరిపింది. ఒక సమయంలో దక్షిణాఫ్రికా దగ్గర కూడా అణ్వస్త్రాలు ఉండేవి. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయడానికి ముందు ఆ దేశం వాటినన్నింటిని నిర్మూలించింది. ఇజ్రాయెల్‌ దగ్గరా అణ్వస్త్రాలున్నాయి. 1967నాటికే ఇజ్రాయెల్‌ అణుపరీక్ష నిర్వహించిందని అంటారు. ఇజ్రాయెల్‌ కూడా అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయలేదు. తమ ప్రాంతంలో అణ్వస్త్రాలను ఉపయోగించే మొదటిదేశంగా ఉండబోమని మాత్రం ఇజ్రాయెల్‌ చెబుతుంటుంది. దక్షిణాఫ్రికాతోపాటే ఇజ్రాయెల్‌ కూడా 1979లో అణుపాటవ పరీక్ష జరిపిందంటారు. అయినా ఇజ్రాయెల్‌ దాన్ని అంగీకరించడం లేదు.

మేలుకోకుంటే విపత్తే!

ప్రపంచంలో వివిధ దేశాల వద్ద ఉన్న అణ్వస్త్రాలు 17,000పై మాటే. అమెరికా, రష్యా దేశాల వద్ద ఎన్ని అణ్వస్త్రాలు ఉన్నాయన్న సంగతి అటుంచితే, 1800 అణ్వస్త్రాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రయోగించడానికి సర్వసన్నద్ధంగా ఉన్నాయన్న మాట వాస్తవం. వీటిలో అనేక అస్త్రాలు 1945లో హిరోషిమా, నాగసాకి నగరాల మీద ప్రయోగించిన అణ్వస్త్రాలకన్నా 20రెట్లు అధిక శక్తిమంతమైనవి. ప్రపంచ మానవాళినే సమూలంగా తుడిచిపెట్టగల భీకర ఆయుధాలవి. అందుకే అణుయుద్ధాన్ని నివారించడానికి ప్రయత్నించకపోతే మానవాళి గురించే కాదు ఈ భూమండలం మీద సకల చరాచర జీవరాశుల గురించి మాట్లాడటానికీ ఏమీ మిగలదు!

(రచయిత - ఆర్వీ రామారావ్‌ )
Posted on 26-09-2014