Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


సైన్స్ & టెక్నాల‌జీ

అవధిలేని అభివృద్ధికి అంతర్జాలం!

* అదిగదిగో... నాలుగో పారిశ్రామిక విప్లవం
మానవాళి జీవనం గడచిన కొన్నేళ్లలో విప్లవాత్మకంగా మారిపోయింది. మున్ముందు మరెన్నో గుణాత్మక మార్పులు చోటుచేసుకోనున్నాయనడంలో సందేహం లేదు. ఇప్పటివరకూ సంభవించిన మూడు పారిశ్రామిక విప్లవాలు ప్రపంచ ముఖచిత్రాన్ని గణనీయంగా మార్చివేశాయి. ఇకమీదట సంభవించబోయే పారిశ్రామిక విప్లవం మునుపటితో పోలిస్తే ఎంతో శక్తిమంతమైనది. యువత ప్రతిభాపాటవాల ఆవిష్కరణకు, వారికి నూతన అవకాశాల కల్పనకు ఈ విప్లవం కొత్త బాటలు వేయనుంది. మొత్తంగా మానవాళికి సరికొత్త అనుభవాలు మిగిల్చే మార్పులు మున్ముందు చోటుచేసుకున్నాయి.

గుణాత్మక మార్పులు
‘ఆవిరి యంత్రం’ ప్రాతిపదికగా తొలి పారిశ్రామిక విప్లవం మొగ్గతొడగడంతో రవాణా, పరిశ్రమలు వంటి రంగాల్లో కీలక మార్పులు సంభవించాయి. ద్వితీయ పారిశ్రామిక విప్లవం విద్యుచ్ఛక్తిని ఆధారంగా చేసుకుని వెల్లివిరియడంతో పరిశ్రమల్లో భారీ ఉత్పత్తులకు మార్గం సుగమమైంది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్‌, ఐటీ రంగాల వృద్ధి కారణంగా మూడో పారిశ్రామిక విప్లవానికి అంకురారోపణ జరిగింది. గడచిన యాభయ్యేళ్ల కాలంలో సాంకేతిక రంగంలో పొడగడుతున్న మార్పులవల్ల జీవ, భౌతిక, డిజిటల్‌ రంగాల మధ్య హద్దులు చెరిగిపోయాయి. ఈ రంగాల్లో మౌలిక మార్పుల ద్వారా నూతన నాలుగో పారిశ్రామిక విప్లవానికి నాందీ ప్రస్తావన జరిగింది. అంతర్జాల విజ్ఞానం ఆధారంగా పని చేసే పరికరాల (ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌- ఐఓటీ)వల్ల పొడచూపుతున్న విప్లవం మూడో పారిశ్రామిక విప్లవానికి పొడిగింపే అనుకుంటే పొరపాటు పడినట్లే. ఇది విస్తరిస్తున్న వేగాన్ని, ప్రభావాన్ని, సృష్టించబోయే అవకాశాలను- మిగిలిన విప్లవాలతో సరిపోల్చలేం!‘ఐఓటీ’ వల్ల పారిశ్రామిక ఉత్పత్తి, నిర్వహణ వంటివాటితోపాటు ప్రభుత్వ పాలన సైతం గుణాత్మకంగా ప్రభావితం కానుంది. ‘ఐఓటీ’ ఆధారిత మార్పులకు ఆహ్వానం పలికిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. గోదావరి పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని- నూతన సాంకేతిక విప్లవం సాయంతో కృష్ణా పుష్కరాలను విజయవంతంగా నిర్వహించారు. ఐఓటీ ద్వారా అంతర్జాల ఆధారిత పరికరాల అనుసంధానం పెరగడంవల్ల సమాచార మార్పిడికి, సమాచార నిల్వకు అవధులు ఉండవు. రొబొటిక్స్‌, కృత్రిమ మేధ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, నానో టెక్నాలజీ వంటివాటి వల్ల ఈ అవకాశాలు హద్దులు లేకుండా విస్తరించనున్నాయి. సెన్సర్ల వినియోగంలో, కృత్రిమ మేధస్సు విషయంలో విప్లవాత్మక మార్పులు రంగప్రవేశం చేస్తున్నాయి. ఫలితంగా భారీయెత్తున వచ్చిపడుతున్న సమాచారాన్ని క్షణాల వ్యవధిలో విశ్లేషించి, ఎప్పటికప్పుడు పరిష్కారాలు అన్వేషించేందుకు వీలవుతుంది. ‘క్రౌడ్‌ అనాలిసిస్‌’ సాయంతో పుష్కరాలకు ఎంతమంది వస్తున్నారు, ఏయే ఘాట్లలో రద్దీ ఎక్కువగా ఉంది వంటి సూక్ష్మ వివరాలు తెలుసుకుని; యాత్రికులను అన్ని ఘాట్లకూ సమానంగా తరలించేందుకు సాధ్యమైంది. ‘డాటా అనాలిసిస్‌’ ద్వారా యాత్రికుల సమస్యలను ఎప్పటికప్పుడు వర్గీకరించి- పారిశుద్ధ్యం, రవాణా వంటి విషయాల్లో సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి, వాటి పరిష్కారానికి కృషి చేశారు. ‘ఛాయాచిత్ర విశ్లేషణ’ (ఇమేజ్‌ ప్రాసెసింగ్‌) ద్వారా ప్రతి ఘాట్‌లోనూ శుభ్రత, ప్రమాణాలు పరిరక్షించడంతోపాటు జేబుదొంగలను పసిగట్టేందుకూ వీలు చిక్కింది. సాంకేతిక విజ్ఞాన సాయంతో క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు పసిగట్టి, పరిష్కరించడంలో ‘ఐఓటీ’ ప్రభుత్వాలకు అద్భుతంగా ఉపయోగపడుతుంది.
గ్రామీణ భారతం అనేక సమస్యల బారినపడి కుంగుతోంది. అంతర్జాల ఆధారిత పరికరాలను, సేవలను గ్రామాలకు; ముఖ్యంగా రైతు సమస్యల పరిష్కారానికి మళ్ళిస్తే పల్లెలకు ఎంతో మేలు కలుగుతుంది. క్రమంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. వర్షాభావం కారణంగా నదీ జలాలు ఇంకిపోతున్నాయి. ఫలితంగా సేద్యం రోజురోజుకూ భారమవుతోంది. ‘ఐఓటీ’ తోడ్పాటుతో నేలలోని తేమ, ఉష్ణోగ్రత వంటివాటిని కచ్చితంగా లెక్క కట్టి; నీటి వినియోగాన్ని నియంత్రించవచ్చు. తద్వారా రైతులకు అపారమైన మేలు జరుగుతుంది. చేపల చెరువులను కమ్ముకొంటున్న కొత్త రకం వ్యాధులవల్ల ‘అక్వా’ రైతులు నష్టాల బారినపడుతున్నారు. వీటిని ముందే గుర్తించి రైతుకు సకాలంలో సమాచారం అందించగలిగితే నష్టాన్ని కొంతమేరకైనా నివారించడం సాధ్యమవుతుంది. మార్కెట్‌ యార్డుల్లో గిట్టుబాటు ధరలు అందించకుండా దళారులు రైతులను నిలువునా ముంచుతున్నారు. రైతు పండించిన పంట నాణ్యతను విశ్లేషించి, ఎక్కడికక్కడ నిర్దిష్ట ధరను నిర్ణయించగలిగితే అన్నదాతకు సాంత్వన దక్కుతుంది. దాంతోపాటు కాలుష్య, పారిశుద్ధ్య నియంత్రణ; ఆరోగ్యం తదితర రంగాల్లో ‘ఐఓటీ’ ద్వారా గుణాత్మక మార్పులు సాకారమవుతాయి. విభిన్న రంగాల్లో అంతర్జాల అనుసంధానం పెరగడంతో దళారీ వ్యవస్థకు, అవినీతికి చరమగీతం పాడవచ్చు. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ కొత్త వేగంతో ప్రగతి దిశగా దౌడు తీస్తుంది.

ప్రగతి దిశగా...
నాలుగో పారిశ్రామిక విప్లవం విస్తరిస్తే ఆర్థిక అసమానతలు పెచ్చుమీరతాయని కొందరు ఆర్థిక శాస్త్రవేత్తలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. యాంత్రీకరణవల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి సాధించవచ్చునని; ఫలితంగా యాజమాన్యాలు అధిక లాభాలు గడిస్తాయేగాని కార్మికులకు న్యాయం జరగదని; పైగా ఉన్న ఉద్యోగాలు వూడే ప్రమాదముందన్న వాదన వినిపిస్తోంది. ఇది కొంతవరకు నిజమే కావచ్చు. కానీ, స్థూలంగా చూస్తే యాంత్రీకరణవల్ల ఉద్యోగుల భద్రత ప్రమాణాలు, సౌకర్యాలు, వారి జీతభత్యాలు పెరుగుతాయన్నది నిర్వివాదాంశం. ఇంతకాలం సాంకేతిక పరిజ్ఞానం జోలికి వెళ్ళకుండా అరకొర జీతాలిస్తూ చిన్నపిల్లలు, మహిళలతో పని చేయించుకున్న యాజమాన్యాలకు ఇకమీదట అడ్డుకట్ట పడనుంది. ‘ఐఓటీ’ విస్తరించే కొద్దీ నైపుణ్యంగల ఉద్యోగులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో అవసరపడతారు. ఆ రకంగా నైపుణ్యాలతో పరిపుష్టమైన సిబ్బందికి గిరాకీ పెరుగుతుంది. మరోవంక- సమాచార, సాంకేతిక, భౌతిక అవరోధాలులేని వాతావరణం కల్పించగలిగిననాడు సామాన్యులూ సర్కారుతో మమేకం కాగలరు. సాధారణ ప్రజలు తమ అభిప్రాయాలను ప్రభుత్వాలకు వినిపించడం, వాటి తప్పిదాలను ఎత్తిచూపడం సాధ్యపడుతుంది. తద్వారా ప్రభుత్వాలకూ పారదర్శకంగా, అవినీతిరహితంగా పాలన అందించేందుకు వీలు కుదురుతుంది. నూతన సాంకేతిక పరిజ్ఞానంవల్ల అధికార కేంద్రీకరణకు ద్వారాలు మూసుకుపోతాయి. పాలన వికేంద్రీకరణతో పోటీతత్వం పెరిగి అవినీతి, అధికార దుర్వినియోగం సమసిపోతాయి. అయితే ప్రభుత్వాలు ఏ స్థాయిలో ‘ఐఓటీ’ని అమలు పరుస్తాయన్న దానిమీదే ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. చౌక ధరల దుకాణాల్లో సరకులను ‘బయోమెట్రిక్‌’ పద్ధతి ద్వారా అందించడంవల్ల, దొంగ కార్డుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఆ రకంగా ప్రభుత్వానికి రూ.1,700 కోట్లు ఆదా అయ్యాయి. పింఛను పథకంలోనూ ఇలాంటి విధానాన్నే అమలు చేయడం వల్ల నిజమైన లబ్ధిదారులకు ఎంతో మేలు జరుగుతోంది. సాంకేతిక విజ్ఞానాన్ని సమర్థంగా ఉపయోగించుకుంటే అది అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఏ మాత్రం దారితప్పినా అది వినాశనానికీ హేతువవుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, భవిష్యత్తును సుసంపన్నంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ‘ఐఓటీ’ని దేశవ్యాప్తంగా ఉపయోగించుకోవాల్సి ఉంది.

 

Posted on 27-08-2016