Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


సైన్స్ & టెక్నాల‌జీ

సాంకేతిక నగరాలే ఆలంబన!

* ప్రగతికి పట్టం... ఉపాధికి వూతం
‘యంత్రాలు ఆలోచించగలవా అనేది కాదు, మనుషులు నిజంగా ఆలోచించగలరా అన్నదే అసలు ప్రశ్న’
- అమెరికన్‌ మనస్తత్వవేత్త బీఎఫ్‌ స్కిన్నర్‌
కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌), స్వయంచాలిత యంత్రాలు (ఆటోమేషన్‌), రోబోలు, కంప్యూటర్లు సరిగ్గా ఇదే ప్రశ్నను మన ముందుంచుతున్నాయి. మన జీవితాలను పని పరిస్థితులను వేగంగా మార్చేస్తూ, తాము విసరుతున్న సవాళ్లకు లోతుగా ఆలోచించి పరిష్కారాలు కనుగొనగలరా అని నిలదీస్తున్నాయి. ఆటోమేషన్‌ వల్ల భారత్‌లో 69 శాతం, చైనాలో 77 శాతం ఉద్యోగాలకు ఎసరు వస్తుందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించడం ఇక్కడ గమనార్హం. ‘ఇంతకాలం అభివృద్ధి రథం వ్యవసాయ రంగంలో మొదలై, అక్కడి నుంచి పారిశ్రామికీకరణకు, ఆ పైన హైటెక్‌ సేవారంగానికీ పయనిస్తూ వచ్చింది. టెక్నాలజీ వల్ల ఈ పరిణామ క్రమం విచ్ఛిన్నమవుతుంది’ అని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్‌ కిమ్‌ ఇటీవల స్పష్టం చేశారు. పాత వ్యవస్థ ధ్వంసమవుతున్నప్పుడు కొత్త ఆలోచనలతో సరికొత్త వ్యవస్థలను సృష్టించక తప్పదు. నగరాల్లో మేలైన మానవ వనరులు, ఉత్పత్తి, పరిశోధన, పాలనా వసతులు కేంద్రీకృతమై ఉంటాయి కాబట్టి కొత్త వ్యవస్థ నిర్మాణానికి అవి సారథ్యం వహిస్తాయి. పారిశ్రామిక విప్లవం నుంచి ఈ సంగతి పదేపదే నిరూపితమవుతోంది. పారిశ్రామిక యుగంలో ఉత్పత్తి కేంద్రాలు పల్లెల నుంచి పట్టణాలకు మారడంతో వృత్తి ఉపాధుల కోసం పట్టణాలకు వలసలు వెల్లువెత్తాయి. సమాచార యుగంలో వలసలు మరింత విజృంభించి పట్టణాలు అలవి కానంతగా విస్తరిస్తున్నాయి. భారత్‌లో నిమిషానికి 25-30మంది గ్రామీణులు బతుకుతెరువు కోసం పట్టణాలకు తరలిపోతున్నారు. ప్రస్తుతం మన జనాభాలో 31 శాతం మంది పట్టణాల్లో నివసిస్తుంటే, 2030 నాటికి అది 50 శాతానికి పెరగనుంది.

పర్యావరణ హితంగా పాలన
నేడు ప్రపంచ ఆదాయంలో సగభాగం 600 మహానగరాల్లో ఉత్పన్నమవుతోంది. భారతదేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 63 శాతానికి, ప్రపంచ జీడీపీలో 80 శాతానికీ నగరాలే మూల స్థానాలు. దిల్లీ చుట్టూ విస్తరించిన జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌) 2011-12లో దేశ జీడీపీకి 12,890 కోట్ల డాలర్లను (7.5 శాతం) అందించగా, హైదరాబాద్‌ 7,400 కోట్ల డాలర్లను అందజేసింది. రెండున్నర కోట్ల జనాభా కలిగిన న్యూయార్క్‌ మెట్రోపాలిటన్‌ ప్రాంతం లక్షా నలభై వేల కోట్ల డాలర్ల సంపదను సృష్టించింది. ఇంతా చేసి ప్రపంచ నగరాలు భూగోళంపై మూడు శాతం నేలనే ఆక్రమిస్తున్నాయి. ఇంత తక్కువ విస్తీర్ణంలో అత్యధిక ఉత్పత్తి, వృత్తి ఉపాధులు కేంద్రీకృతం కావడం శాపం కాదు. దాన్ని ఒక వరంగా మలచుకోవడం మన చేతుల్లోనే ఉంది. నగరాల్లో పరిపాలన, పరిశోధన, ఉత్పత్తి, వినియోగాలను సమర్థంగా, పర్యావరణ హితంగా నిర్వహించవచ్చు. ఈ వాస్తవమే స్మార్ట్‌ నగరాలకు ఆలంబన! పారిశ్రామిక విప్లవం నుంచి వూపందుకున్న పట్టణీకరణ 21వ శతాబ్దిలో మరింత విజృంభించి స్మార్ట్‌ నగరాల అవతరణకు దారి తీస్తోంది. హైటెక్‌ ఉత్పత్తికి, సమ్మిళిత అభివృద్ధి సాధనకు స్మార్ట్‌ నగరాలు అమోఘ సాధనాలవుతాయి. ఈ సందర్భంగా ఉత్పత్తి ప్రక్రియ మానవ జీవితాన్ని మలిచే తీరును అవలోకించాలి. వ్యవసాయ, పారిశ్రామిక, సమాచార యుగాల్లో ఉత్పత్తి అవసరాలను తీర్చడానికి వేర్వేరు విద్యా విధానాలు అవసరమవుతాయి. పారిశ్రామిక యుగంలో ఫ్యాక్టరీలకు, ప్రభుత్వ కార్యాలయాలకు ‘క్రమశిక్షణ’గా పనిచేసే కార్మికులను, సిబ్బందిని అందించడమే విద్యావిధాన లక్ష్యం. అందుకే విద్యాసంస్థల్లోనూ ఫ్యాక్టరీల మాదిరిగా నిర్ణీత వేళలతో పాటు- పర్యవేక్షకులు (ఉపాధ్యాయులు) ఉంటారు. పరిశ్రమలకు అవసరమైన పాఠ్య ప్రణాళికలు ఉంటాయి. కార్మికుల్లా తరగతి గదులకు బారులు తీసే విద్యార్థులు కనిపిస్తారు. వ్యవసాయం, చేతి వృత్తుల నుంచి యువతను కర్మాగారాలకు, కార్యాలయాలకు మళ్లించడమే విద్యాసంస్థల ధ్యేయం. ఈ సంస్థల అంతర్గత వాతావరణానికి, ఫ్యాక్టరీల్లోని పరిస్థితులకూ అంతగా తేడా ఉండేది కాదు. కానీ, నేటి సమాచార యుగానికి ఈ నమూనా నప్పదు. బోధన, అభ్యసనాలు కేవలం తరగతి గదికి, నిర్ణీత వేళలకే పరిమితం కావు. ఎప్పటికప్పుడు మారిపోయే ప్రపంచంతో పరుగు తీసే నిత్య విద్యార్థులు మాత్రమే ఇక్కడ రాణిస్తారు. తరగతి గదికే పరిమితం కాకుండా ‘ఆన్‌లైన్‌’లో 24 గంటలూ అందుబాటులో ఉండే పఠనీయ అంశాలు 21వ శతాబ్ది విలక్షణాంశాలు. కొత్త సాంకేతికతకు, కొత్త ఉత్పత్తి ప్రక్రియలకే కాదు- కొత్త పాలనా విధానాలకూ నగరాలే ప్రయోగశాలలు. పార్టీ రాజకీయాల్లో చిక్కుకునే జాతీయ ప్రభుత్వాలు కీలక విధానాలను వేగంగా చేపట్టలేక సతమతమవుతుంటే, ఆధునిక నగర పాలికలు జోరుగా నవ్య పాలనా విధానాలను అమలు చేయగలుగుతున్నాయి.
సాంకేతికత ఆసరాతో స్మార్ట్‌ నగరాలు తమ పౌరులకు ఇంధనం, తాగు నీరు, విద్య, వైద్యం, ఆర్థిక సేవలు, సమాచార, రవాణా సౌకర్యాలు, పారిశుద్ధ్యం, చెత్త పునర్వినియోగం, పరిశోధన సౌకర్యాలను అందజేస్తాయి. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), పారిశ్రామిక ఆటేమేషన్ల మేళవింపుతో ఇది సాధ్యపడనుంది. ఈ మేళవింపు వల్ల సరికొత్త వృత్తి ఉపాధులు అందుబాటులోకి వచ్చి పట్టణాలకు వలసలు మరింత విజృంభిస్తాయి. వలసదారులను కొత్త ఆర్థిక వ్యవస్థలో ఇముడ్చుకోవడమెలా, వారి రద్దీని తట్టుకుంటూ నగర జీవితాన్ని సౌఖ్యవంతం చేయడమెలా అన్నది నేడు ప్రపంచం ముందున్న సవాలు. దీనికి పరిష్కారం కనుగొనడానికి సెప్టెంబరులో చైనాలోని యించువాన్‌ నగరంలో జరిగిన స్మార్ట్‌ సిటీల సదస్సు తర్జన భర్జనలు జరిపింది. 66 దేశాలకు చెందిన 1000 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. చారిత్రక నగరమైన యించువాన్‌ 20 లక్షల జనాభాతో స్మార్ట్‌ నగరంగా రూపుదిద్దుకొంది. యించువాన్‌లోని హైటెక్‌ పౌర హాలులో అమర్చిన భారీ కంప్యూటర్‌ తెరలు నగరంలోని రవాణా దృశ్యాలను ఎప్పటికప్పుడు చూపుతాయి. అధికారులు ఆన్‌లైన్‌ సందేశాలతో వాహనాలను దారి మళ్లించి రద్దీ తగ్గిస్తుంటారు. ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే, వెంటనే ఆ దృశ్యం కంప్యూటర్‌ తెరలపై ప్రత్యక్షమవుతుంది. అధికారులు తక్షణం అంబులెన్స్‌ పంపి అత్యవసర వైద్య సహాయం అందేలా చూస్తారు. జెంజియాంగ్‌ నగరంలో స్మార్ట్‌ ఫోన్‌లోని యాప్‌ స్టోర్‌తో సిటీ బస్సు రాకపోకలను తెలుసుకోవచ్చు. నగరంలోని ఏదైనా ఆస్పత్రిలో వైద్యునితో అపాయింట్‌మెంట్‌ తీసుకోవచ్చు. వాహన పార్కింగ్‌ స్థలాలను బుక్‌ చేసుకోవచ్చు. నగరంలో తిరిగే బస్సులు తమ కదలికలను ఎప్పటికప్పుడు ఆన్‌ లైన్‌లో కంట్రోల్‌ కేంద్రాలకు తెలియజేస్తుంటాయి. దీని వల్ల వాటిని తక్కువ రద్దీ మార్గాల్లోకి మళ్లించి ఇంధనం ఆదా చేసి కాలుష్యాన్ని తగ్గించవచ్చు. ఈ యాప్‌ను రోజుకు అయిదు లక్షల మంది వినియోగించుకుంటున్నారు. అధికారులు ఏటా 6700 టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ ఉద్గారాలను తగ్గించి, 27 లక్షల డాలర్ల విలువైన ఇంధనాన్ని ఆదా చేయగలుగుతున్నారు. భారతదేశంలోనూ కొచ్చి స్మార్ట్‌ సిటీ, గుజరాత్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ టెక్‌-సిటీ (గిఫ్ట్‌), లావాసా, నయా రాయ్‌పూర్‌లు స్మార్ట్‌ సిటీలుగా రూపుదిద్దుకొంటున్నాయి. దిల్లీ సమీపంలోని 4,500 ఎకరాల్లో వేవ్‌ ఇన్‌ఫ్రాటెక్‌ సంస్థ సరికొత్త స్మార్ట్‌ నగరాన్ని నిర్మిస్తోంది.

సమాచార నిధితో పురోభివృద్ధి
ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవీవ్‌లో స్థానికులకు డిజిటల్‌ రెసిడెంట్‌ కార్డు ద్వారా వ్యక్తిగత వెబ్‌ పేజీని కేటాయిస్తున్నారు. దీని సాయంతో వారు విద్యుత్‌, నీరు, తదితర బిల్లులను ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. నగర సమాచారాన్ని తెలుసుకోవచ్చు. వేసవిలో ఈత కొలనును బుక్‌ చేసుకోవచ్చు. అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌ నగరంలో 40 లక్షల మంది జనాభా ఉంటే, వారిలో 15 లక్షల మంది సజీవ సెన్సర్లుగా పనిచేస్తూ ఎక్కడ ప్రమాదాలు జరిగినా వెంటనే నగర పాలికకు తెలియజేస్తున్నారు. రవాణా నియంత్రణ, పార్కింగ్‌ స్థలాల కేటాయింపు సైతం స్మార్ట్‌గా జరుగుతున్నాయి. ఇదంతా సమాచార సాంకేతిక పరిజ్ఞానం చలవే! స్మార్ట్‌ సిటీలోని ట్రాఫిక్‌ లైట్లు, సీసీటీవీ కెమెరాలు, నీరు, విద్యుత్‌ సరఫరా వ్యవస్థలు సెన్సర్లుగా పనిచేస్తాయి. రేపు గృహంలోని ఎలక్ట్రానిక్‌ పరికరాలూ సెన్సర్లుగా మారతాయి. అంతర్జాలంలో వీటన్నింటి అనుసంధానం నుంచి ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) ఉద్భవిస్తుంది. సెన్సర్లు సేకరించే బిగ్‌ డేటాను క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ద్వారా నిల్వ చేస్తారు. ఈ సమాచార నిధిని ఉపయోగించుకోవడం స్మార్ట్‌ సిటీ విలక్షణత. భారత్‌లో 2016 చివరికి క్లౌడ్‌ కంప్యూటింగ్‌ 450 కోట్ల డాలర్ల విపణిగా అవతరిస్తుందని ప్రభుత్వం లెక్కగట్టింది. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ రంగం ఐరోపా దేశాల్లో 2020 నాటికి 25 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుందని సిస్కో కంపెనీ అంచనా వేసింది.
పరిపాలన, ఇంధన నిల్వ, విద్యుత్‌ ఉత్పత్తి, వినియోగం, రవాణా, భద్రత, వైద్యం, భవన నిర్మాణం, తదితర రంగాల్లో స్మార్ట్‌ ప్రక్రియలు విస్తరిస్తున్నాయి. స్మార్ట్‌ సిటీ, డిజిటల్‌ ఇండియా ప్రాజెక్టుల విజయానికి శక్తిమంతమైన బ్రాడ్‌ బ్యాండ్‌ ఆవశ్యకం. 2017 నాటికి దేశంలో 17.5 కోట్ల మందికి బ్రాడ్‌ బ్యాండ్‌ కనెక్షన్లు ఏర్పడతాయని అంచనా. ఇదంతా కొత్త తరహా ఉత్పత్తి ప్రక్రియలకు, వృత్తి ఉద్యోగాలకు దారితీస్తుంది. రానున్న దశాబ్దాల్లో నూతన తరహా ఉద్యోగాలన్నీ నగరాల్లోనే పుట్టుకొస్తాయి. యువత వాటిని అందిపుచ్చుకోవాలంటే, మన విద్యావిధానం రూపురేఖలను మార్చేయక తప్పదు. మారుతున్న పరిస్థితులకు తగిన విధానాలను ప్రభుత్వం రూపొందించుకోవాలి.

యించువాన్‌ తీరే వేరు
చైనాలో ఇప్పటికే 75 కోట్ల మంది పట్టణాల్లో నివసిస్తుండగా, 2025 నాటికి మరి 30 కోట్లమంది పల్లెల నుంచి నూతనంగా వలస రానున్నారు. ఈ తాకిడిని తట్టుకోవడానికి చైనా భారీయెత్తున స్మార్ట్‌ నగరాల ప్రాజెక్టును చేపట్టింది. యించువాన్‌ నగరంలో బస్సు ప్రయాణికులు జేబులోనుంచి డబ్బు తీసి టికెట్‌ కొనక్కర్లేదు. డ్రైవర్‌ వంక చూసి చిరునవ్వు చిందిస్తే చాలు, ముఖ గుర్తింపు సాఫ్ట్‌వేర్‌తో వారి ఖాతా నుంచి రవాణా సంస్థ ఖాతాలోకి డబ్బు జమ అయిపోతుంది. నగరంలోని స్మార్ట్‌ లేక్‌ గృహ సముదాయానికి కేటాయించిన ఎలక్ట్రానిక్‌ చెత్త కుండీలు వ్యర్థాలను దంచి, కుదించి, దుర్వాసన రాకుండా ఎయిర్‌ కండిషన్‌ చేస్తాయి. కుండీలు నిండిపోగానే వాటిలోని సెన్సర్లు నగర పాలికకు ఆన్‌లైన్‌లో సందేశం పంపుతాయి. పారిశుద్ధ్య సిబ్బంది వెంటనే వచ్చి చెత్త ముద్దను శుద్ధి-పునర్వినియోగ కేంద్రాలకు తరలిస్తారు. ఈ ప్రాంతంలో 15 వై ఫై పాయింట్లను ఏర్పరచారు. ఒక స్మార్ట్‌ వైద్య కేంద్రాన్ని, తాగు నీటి శుద్ధి కేంద్రాన్ని నెలకొల్పారు. పౌరులు కిరాణా సరకులను, ఇతర ప్యాకెట్లను అందుకోవడానికి స్మార్ట్‌ పెట్టెలను ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియకు చైనీస్‌ బహుళజాతి కమ్యూనికేషన్ల సంస్థ జడ్‌టీఈ సాంకేతిక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. చైనా ప్రభుత్వం ఈ కంపెనీకి నిధులు, ఇతర వనరులు, తగు అధికారాలు ఇచ్చి స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టును ముందుకు తీసుకెళుతోంది.

 

- ఏఏవీ ప్రసాద్‌
Posted on 12-10-2016