Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


సైన్స్ & టెక్నాల‌జీ

సంక్షోభంలో ఐటీ... సంస్కరణలే దివిటీ!

* నైపుణ్యాలవృద్ధితో నూతన అవకాశాలు
దేశీయ సమాచార సాంకేతిక పరిజ్ఞాన రంగం (ఐటీ)లో సిబ్బంది ఉద్యోగ భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ రంగంలో సంక్షోభం కారణంగా కాగ్నిజెంట్‌, టెక్‌ మహీంద్ర, ఇన్ఫోసిస్‌, విప్రో వంటి పెద్ద సంస్థల్లో కొంతమేరకైనా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. 2008-10నాటి ఆర్థిక మాంద్యంలో సైతం కనిపించని పరిణామమిది. వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు కాగ్నిజెంట్‌ సమాయత్తమైంది. పనితీరు సరిగాలేనివారిని ఇంటికి పంపే అవకాశం ఉందని ఆ సంస్థ ప్రకటించింది. వెయ్యిమంది సీనియర్‌ ఉద్యోగుల రాజీనామాలను ఇన్ఫోసిస్‌ కోరనుందని సమాచారం! మరోవంక సంస్థ ఆదాయంలో వృద్ధిలేని పక్షంలో పది శాతం ఉద్యోగుల(18 వేలమంది)పై వేటువేయవచ్చని విప్రో ముఖ్య కార్యనిర్వహణాధికారి తెలిపారు. ఫ్రాన్స్‌కు చెందిన కాప్‌ జెమినిలో 1,95,800 మంది ఉద్యోగులున్నారు. వీరిలో అధిక సంఖ్యలో భారత్‌లోనే పనిచేస్తున్నారు. ఆ సంస్థ ముంబయి కార్యాలయంలో ఇప్పటికే 200 మందిని తొలగించారు. ఈ ఏడాది చివర్లో మరో 10వేలమందికి ఉద్వాసన పలకనున్నారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఉద్యోగ అభద్రత
ఐటీ రంగంలో తాజా సంక్షోభానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. అవి- ఆటోమేషన్‌, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధానాలు, లాభార్జనపై కంపెనీల ఆసక్తి! కృత్రిమ మేధ, రోబో తరహా ఆటోమేషన్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి వినూత్న సాంకేతిక పరిజ్ఞానాలవల్ల ప్రస్తుతం తక్కువ సిబ్బందితోనే పనులు పూర్తవుతున్నాయి. దీంతో సంస్థల వ్యూహాల్లో సహజంగానే మార్పులు వస్తున్నాయి. ఆ మేరకు ప్రస్తుత ఐటీ ఉద్యోగులు తమ నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకోలేకపోతున్నారు. వారి ఉద్యోగాలు అభద్రతలోకి జారుకోవడానికి ప్రధాన కారణమిదే! మాన్యువల్‌ టెస్టింగ్‌, టెక్నాలజీ సపోర్ట్‌, సిస్టం అడ్మినిస్ట్రేషన్‌ విభాగాల్లో పెద్దసంఖ్యలో ఉద్యోగాలకు ఉద్వాసన పలికే ప్రమాదం కనిపిస్తోంది. ఈ సమస్యకు ట్రంప్‌ ప్రతిపాదిత హెచ్‌-1బీ వీసాల విధానం మరింత ఆజ్యం పోసింది. అమెరికాలో భారత కంపెనీలు ఒకరికి ఉద్యోగం కల్పించాలంటే- దేశీయంగా నలుగురు భారతీయులకు ఉద్వాసన పలకాలి. అందుకు నిరాకరించిన సంస్థలపై అమెరికాలో పన్ను భారం విపరీతంగా పడుతుంది. పరిస్థితులు ఇలా కనిపిస్తుంటే- ఐటీలో ఉద్యోగాలకు వచ్చిన ముప్పేమీ లేదని కేంద్ర ప్రభుత్వంసహా ఆ రంగంలో నిపుణులు అభయమిస్తున్నారు. ఐటీ రంగం మున్ముందు 8-9 శాతం మేర వృద్ధి సాధిస్తుందని భరోసా ఇస్తున్నారు. వార్షిక పనితీరు మదింపు నివేదికల ఆధారంగా ఏటా కొందరిని ఉద్యోగాల నుంచి తొలగించడం నిరంతర ప్రక్రియలో భాగమేనని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు లక్షలకుపైగా ఐటీ ఉద్యోగులున్నారు. ఇప్పటివరకూ ఉద్యోగాల్లో కోత పది వేలకు మించలేదు. కానీ, వ్యయ నియంత్రణలో భాగంగా నాసిరకం పనితీరు కనబరుస్తున్నవారితోపాటు; అత్యధిక వేతనాలు పొందుతున్న కొందరు ఉన్నతోద్యోగులపైనా వేటు వేయవచ్చన్న అంచనాలున్నాయి. అంతర్జాతీయంగానూ భారతీయ సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులకు ప్రతికూల పవనాలు వీస్తున్న రోజులివి. అమెరికా, సింగపూర్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాలనుంచి ‘వర్క్‌ పర్మిట్‌’కు సంబంధించిన ఇబ్బందులూ మరోవంక తప్పడం లేదు. స్వేచ్ఛావాణిజ్య ప్రపంచంలో ఐటీ కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగాలకు చోటుపెడుతున్నాయి. తమ సేవలను విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. జాతి ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నందువల్ల ప్రభుత్వం ఆయా కంపెనీలకు ఇతోధిక ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపులు అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులను తొలగించే సంస్థలకు సర్కారు రాయితీలు ఇవ్వడంలో అర్థం ఏముందన్న ప్రశ్న వస్తోంది. కాలానుగుణ మార్పులకు సంబంధం లేకుండా, కళాశాలల్లో నాణ్యత లేని చదువుల ప్రహసనాన్ని ఇందుకు జవాబుగా ఐటీ నిపుణులు ముందుకు తెస్తున్నారు. ప్రమాణాలు లేని కళాశాలలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తెలియని అధ్యాపకుల బోధనను అవి ప్రస్తావిస్తున్నాయి! ఈ లోపాలను పరిహరించడం ప్రభుత్వాల బాధ్యతేనని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐటీ విద్యను ప్రక్షాళించాల్సిన అవసరం ఉరుముతోంది. ఐటీ సంస్థలూ ఉద్యోగుల తొలగింపు జోలికి పోకుండా, శిక్షణ కేంద్రాల్లో సిబ్బంది నైపుణ్యాల అభివృద్ధికి అవకాశం కల్పించాలి. కొన్ని అగ్రశ్రేణి ఐటీ కంపెనీలు ఆ దిశగా చురుగ్గానే అడుగులు వేస్తున్నాయి. సైబర్‌ దాడులు, మోసాలు, ‘హ్యాకింగ్‌’ నేపథ్యంలో అంతర్జాల భద్రత రంగంలో ఉద్యోగావకాశాలు భారీగా ఉన్నట్లు; 2025నాటికి 10లక్షల ఉద్యోగాలకు ఆ రంగం వేదిక కాబోతున్నట్లు ‘నాస్కామ్‌’ నిరుడు ప్రకటించింది. అర్హులు కొరవడి ఈ ఉద్యోగాలను భర్తీ చేయలేకపోతున్నట్లు కంపెనీలు వాపోతున్నాయి. పరిశ్రమకు కావలసిన సాంకేతికతపై ‘నాస్కామ్‌’ త్వరలో అంతర్జాలంలోనే విస్తృత సమాచారాన్ని అందుబాటులో ఉంచేందుకు శ్రమిస్తోంది. ఐటీ అంటేనే ఉద్యోగ భద్రత అని మొన్నటివరకూ అనేకులు భావించేవారు. ఆ భరోసాతోనే వారు సానుకూల ఆర్థిక నిర్ణయాలు తీసుకుం టున్నారు. ఇళ్లు, వాహనాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువుల కోసం విరివిగా రుణాలు తీసుకుంటుంటారు. జీవిత బీమా పాలసీలు కడతారు. పెద్ద మొత్తం ఫీజులు చెల్లించి పిల్లలను కార్పొరేట్‌ స్కూళ్లల్లో చేర్పిస్తారు. ఈ పరిస్థితుల్లో వారి ఉద్యోగానికి ఎసరు వస్తే జీవితాలు తలకిందులవుతాయి. దానివల్ల బ్యాంకింగ్‌, స్థిరాస్తి రంగాలపైనా ప్రభావం పడుతుంది. కాగ్నిజెంట్‌లో ఉద్యోగాల తొలగింపు చర్య- చెన్నైలో ఉద్యోగ సంఘం (ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇన్ఫోటెక్‌ ఎంప్లాయీస్‌) ఏర్పాటు ప్రతిపాదనకు దారి తీసింది. ఐటీ ఉద్యోగులు పారిశ్రామిక వివాదాల చట్టం పరిధిలోకి వస్తారని అక్కడి లేబర్‌ కమిషనర్‌ వివరణ సైతం ఇచ్చారు. సంస్థకోసం అహరహం నిజాయతీగా కష్టపడుతున్న ఉద్యోగులను ‘హైర్‌ అండ్‌ ఫైర్‌’ అంటూ తొలగించడం సముచితం కాదు. ఉద్యోగులను ఇష్టానుసారం తొలగించే విధానానికి మార్పులు తప్పనిసరి. తొలగింపునకు సంబంధించిన విధానాలను పారదర్శకంగా రూపొందించాలి.

స్వదేశీ విపణే ఆలంబనగా...
ఐటీ ఎగుమతుల ద్వారా దేశానికి ఏటా 15,500 కోట్ల డాలర్ల (సుమారు రూ.10లక్షల కోట్లు) మేర విదేశ మారకం లభిస్తోంది. తెలంగాణలోనే 4,31,891 మంది ఉద్యోగుల ద్వారా ఏటా సుమారు రూ.57 వేలకోట్ల విదేశ మారకం సమకూరుతోంది. ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తోంది. హెచ్‌సీఎల్‌ వంటి పెద్ద కంపెనీలు కాలుమోపనున్నాయి. ఇదే సమయంలో నకిలీ సంస్థలు ప్రవేశించకుండా గట్టిగా అడ్డుకోవాలి. ఐటీ విద్యకు పేరుపడ్డ శిక్షణ కేంద్రాల్లో ప్రస్తుతం ప్రవేశాలు భారీగా తగ్గడంతో అవి వెలాతెలాబోతున్నాయి. వాటిని నడపలేక కొందరు నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. అమెరికా, ఐరోపా వంటి ఇతర దేశాలపై భారతీయఐటీ కంపెనీలు ఆధారపడటం కన్నా దేశీయ విపణిపై దృష్టిసారించడం మేలు. దీనివల్ల లక్షల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు సృష్టించవచ్చు. అంతర్జాతీయ విపణినుంచి ఎదురవుతున్న సవాళ్లకు ఇదే సముచిత సమాధానం. అప్పుడే దేశీయ సమస్యలకు వినూత్న పరిష్కారాలు సాధ్యమవుతాయి. దేశీయ విపణిలో ఒడుదొడుకులు ఎక్కువ. తమ ఆదాయంలో ఒక శాతం మాత్రమే దేశీయ విపణినుంచి లభిస్తోందని, ఆ చెల్లింపులకు సంబంధించీ అనేక సమస్యలు ఎదురవుతున్నట్లు ఐటీ నిపుణులు వాపోతున్నారు. ఏది ఏమైనా దేశీయ విపణి వాటాను మరింత పెంచుకోవడం భారతీయ ఐటీ కంపెనీల తక్షణ కర్తవ్యం. గతంలో మాదిరిగా అమెరికన్‌ మార్కెట్లపై ఎక్కువగా ఆధారపడటం లేదు. జపాన్‌. ఐరోపా, ఆసియా పసిఫిక్‌ దేశాలకూ మన ఐటీ రంగం విస్తరిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులకు సంబంధించి నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంచుకోవడంపై వారు దృష్టి సారించాలి. వేగంగా నేర్చుకోవడం, బృందంతో కలుపుగోలుగా ఉండటం వంటి లక్షణాలను అలవరచుకోవాలి. భవిష్యత్తులో అటు కంపెనీలకు, ఇటు సమాజంలోని వివిధ రంగాలకు ఐటీ సేవలు విస్తారంగా అవసరమవుతాయి. భారతీయ రైల్వే సైతం నూతన సాంకేతిక పరిజ్ఞానంతో తనను తాను పునరావిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్న సందర్భమిది. కేంద్రంగా వచ్చే నెలనుంచి అమల్లోకి తీసుకురానున్న జీఎస్‌టీని నిర్దిష్టంగా పట్టాలకు ఎక్కించేందుకు ఐటీ రంగమే కీలకం.పాస్‌పోర్టునుంచి పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం పొందడం వరకు కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరగకుండా ఇంటి నుంచే పనులు చక్కబెట్టుకొనే రీతిలో ఐటీ రంగం విస్తరించనుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుమారు 400 రకాల పౌరసేవల్ని అంతర్జాలం ద్వారా ప్రభుత్వాలు అందిస్తున్నాయి. అటు కేంద్రం ఇటు ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్న సాంకేతికతను తమ పాలనలో చక్కగా అందిపుచ్చుకొంటున్నాయి. మరోవంక ప్రభుత్వాలు కేవలం ఐటీ రంగాన్నే పట్టుకుని వేలాడకుండా చైనా తరహాలో అన్ని రంగాలనూ సమానంగా అభివృద్ధిపరచేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. తద్వారా అన్ని రంగాలూ బలోపేతమై యువతకు ఉపాధి అవకాశాలు ఇనుమడిస్తాయి. ఆ రకంగా ఏదైనా ఒక రంగంలో ఉపాధి సంక్షోభం ఏర్పడితే- మిగిలిన రంగాల్లో ఉద్యోగ సృష్టి ద్వారా యువతను ఆదుకునేందుకు అవకాశం ఉంటుంది.

 

Posted on 14-06-2017