Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


సైన్స్ & టెక్నాల‌జీ

ముదిరే వ్యాధి... నిరోధకత ఏదీ?

* ఆరోగ్య రంగంలో సంక్షోభం
అమెరికాలో పదేళ్ల క్రితం పుట్టిన ఆర్థిక సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ప్రభావితం చేసింది. అప్పట్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కలిగిన నష్టం దాదాపు 15 లక్షల కోట్ల డాలర్లని (దాదాపు రూ.950 లక్షల కోట్లు) అంచనా! ప్రపంచ జీడీపీ వృద్ధిరేటు 2007-08, 2008-09 కాలంలో -3.6 శాతానికి పడిపోయింది. అభివృద్ధి చెందిన దేశాల్లో 3.0 శాతం, వర్ధమాన దేశాల్లో 0.25 శాతం మేర నిరుద్యోగం పెరిగింది. మొత్తం 21 కోట్లమంది నిరుద్యోగులుగా మిగిలారు. దాదాపు మూడు కోట్లమంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డుమీద పడ్డారు. ద్రవ్యోల్బణం పెచ్చరిల్లింది. దీనివల్ల చాలా దేశాల్లో ప్రభుత్వ ఆదాయాలు కోసుకుపోయాయి. ద్రవ్యలోటు అమాంతం అధికమైంది. ప్రపంచ విపణులు, ఆర్థిక వ్యవస్థలు ఆ ధాటికి తల్లడిల్లిపోయాయి. ఉన్న ఇల్లు, ఉద్యోగం పోయి ఎన్నో కుటుంబాలు మానసిక క్షోభకు గురయ్యాయి. ఈ ఆర్థిక సంక్షోభ ప్రభావం ప్రధానంగా 2008, 2009లోనే అధికంగా కనిపించింది. సంక్షోభ ప్రభావం రెండు మూడేళ్లకు పరిమితమైతేనే ప్రపంచం ఇన్ని విపత్కర పరిస్థితులు ఎదుర్కొంది. అలాంటిది మరింత తీవ్ర సంక్షోభం ఎదురైతే ప్రపంచ దేశాల స్థితిగతులు ఎలా మారిపోతాయో, దాని దుష్ప్రభావం ఎన్ని దశాబ్దాలపాటు ఉంటుందో తేలిగ్గానే వూహించుకోవచ్చు! ఆ పెను సంక్షోభం పేరే- యాంటీమైక్రోబయాల్‌ రెసిస్టెన్స్‌! వైద్యరంగంలో ఇన్నేళ్లుగా మనుషులను అంటురోగాల బారి నుంచి కాపాడుతున్న యాంటిబయాటిక్‌ మందులు పనిచేయకపోవడమే ముంచుకొస్తున్న ఈ ఉపద్రవం.

ప్రమాదఘంటికలు
ఒకప్పుడు అంటురోగాలు ప్రబలితే వూళ్లకు వూళ్లే ఖాళీ అయ్యేవని అనేవారు. 70 ఏళ్ల క్రితం యాంటీబయాటిక్‌ మందులు కనిపెట్టాక మరణాల సంఖ్య 80 శాతం మేర తగ్గింది. ఇప్పుడు ఆ మందులు తమ ప్రభావం కోల్పోతున్నాయి. దీంతో ఆరోగ్య రంగాన మళ్ళీ రోగానికి మందు లేని రోజులనాటి పరిస్థితులు పునరావృతమవుతాయన్న భయాందోళనలు ప్రబలుతున్నాయి. రోగిపై మందులు సరిగ్గా పనిచేయకపోతే మరణాలు పెరుగుతాయి. కార్మిక సరఫరా తగ్గుతుంది. స్థూల ఉత్పత్తి పతనమవుతుంది. దరిమిలా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వాటిల్లే నష్టం 2008నాటి మాంద్యం కన్నా అధికంగా ఉంటుందన్న అంచనాలు వినవస్తున్నాయి. అదే నిజమైతే కొన్ని దశాబ్దాలపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోతాయి. ప్రపంచంలో పేదరికం తాండవిస్తుంది. ఆర్థిక అసమానతలు పెచ్చరిల్లుతాయి.
జీవరాశులకు సోకే వివిధ వ్యాధులకు పలు రకాల కారణాలుంటాయి. రకరకాల వైరస్‌లు, బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు, పరాన్నజీవులు, శిలీంధ్రాలు వాటిలో ముఖ్యమైనవి. రోగాలకు కారణమయ్యే ఈ కారకాలను శరీరంలో నిర్మూలించడానికి మందులు వాడతాం. అందులో ప్రధానమైనవి యాంటీబయాటిక్స్‌. వాటిని తీసుకోవడంవల్ల జబ్బు నయమవుతుంది. వ్యాధులకు కారణమైన సూక్ష్మజీవులు పరిణామ క్రమంలో మార్పులకు లోనైనప్పుడు అవి పునరుత్తేజితమవుతాయి. మందును ఎదుర్కోగల శక్తిని సముపార్జించుకుంటాయి. చికిత్సకు లొంగని స్థాయికి చేరుకుంటాయి. అనేకమంది మాంసాహారాన్ని భుజిస్తారు. మాంసాహారం కోసం కోళ్ళు, మేకలు, చేపలను పెంచుతారు. అవి త్వరగా పెద్దవై సత్వరం అధిక లాభాలు రావడం కోసం పెంపక కేంద్రాల యజమానులు వాటికి అవసరానికి మించి యాంటీబయాటిక్స్‌ ఇస్తున్నారు. దానివల్ల ఆయా జీవాల్లోని వైరస్‌, బాక్టీరియాలకు యాంటీబయాటిక్స్‌ నిరోధక సామర్థ్యం పెరుగుతుంది. ఆ మాంసాలను తిన్నప్పుడు నిరోధకత పెరిగిన సూక్ష్మజీవులు మానవ శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఆపై మనిషి వ్యాధి బారినపడినప్పుడు మందులు వాడినా లాభం ఉండదు. మందులకు లొంగక సూక్ష్మజీవులు శరీరంలో జీవించి ఉండటం వల్ల రోగి మరణానికి చేరువ అవుతాడు. అప్పుడే పుట్టిన పిల్లల్లో సైతం యాంటీమైక్రోబయాల్‌ రెసిస్టెన్స్‌ లక్షణాలు ఉంటాయి!
యాంటీమైక్రోబయాల్‌ రెసిస్టెన్స్‌ ఒక సామాజిక విషాదం. మనుషులకైనా, జంతువులకైనా రోగం త్వరగా తగ్గడానికి వైద్యులు విరివిగా డ్రగ్స్‌ వాడకాన్ని సూచిస్తారు. సరైన మోతాదు విషయాన్ని విస్మరిస్తున్నారు. దానివల్ల దీర్ఘకాలంలో ఇరుగుపొరుగుకు, పరిసరాలకు వాటిల్లే చేటు గురించి పెద్దగా ఆలోచించడం లేదు. ఈ ధోరణే ఇప్పుడు మానవాళి పాలిట పెనుశాపమవుతోంది. యాంటీబయాటిక్స్‌ దుర్వినియోగం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెడపోకడే. 50 శాతం మందులను మాత్రమే వైద్యులు సరిగ్గా ఉపయోగిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు స్పష్టీకరిస్తున్నాయి. ఒక్క అమెరికాలోనే ఏటా వైద్యులు పదిహేను కోట్ల యాంటీబయాటిక్స్‌ మందుచీటీలు రాస్తున్నారు. వాస్తవానికి వాటిలో అయిదు కోట్ల సిఫార్సులు అనవసరమైనవని ‘సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌’ అధ్యయనం కుండ బద్దలు కొట్టింది. యాంటీబయాటిక్స్‌ మందులను ఎక్కువగా వాడే దేశాల్లో ఇండియాది ప్రపంచంలో నాలుగో స్థానం. వీటి వాడకం 2,633 టన్నుల నుంచి 2030నాటికి 88 శాతం మేర పెరుగుతుందన్నది ‘సైన్స్‌’ పత్రిక అంచనా. చాలా దేశాల్లో డాక్టర్ల సిఫార్సులతో నిమిత్తం లేకుండా ఈ డ్రగ్స్‌ దొరుకుతున్నాయి. కొన్నిచోట్ల కిరాణా దుకాణాల్లో సైతం వీటిని అమ్ముతున్నారు. మందుల కల్తీ సమస్యను మరింత జటిలం చేస్తోంది.
రోగానికి మందులు పనిచేయని దుస్థితివల్ల వాటిల్లే నష్టాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై 2017-2050 మధ్యకాలంలో ఎలా ఉండబోతున్నాయన్న దానిపై ప్రపంచ బ్యాంక్‌ అధ్యయనం జరిపింది. ఈ అధ్యయన నివేదికలోని అంశాలు అన్ని ప్రపంచ దేశాల్నీ కలవరపరుస్తున్నాయి. దీని ప్రకారం యాంటీమైక్రోబయాల్‌ రెసిస్టెన్స్‌ ప్రభావం వల్ల 2050 నాటికి ప్రపంచం కనిష్ఠంగా 1.1 శాతం, గరిష్ఠంగా 3.8 శాతం మేర జీడీపీని నష్టపోతుంది. ఆ తగ్గుదల 2030 నుంచి కనబడుతుంది. వార్షిక జీడీపీలో తగ్గుదల కనిష్ఠంగా లక్ష డాలర్ల (రూ.63.38 లక్షల కోట్లు) నుంచి, గరిష్ఠంగా 34 లక్షల డాలర్లు (రూ.215.5 లక్షల కోట్లు) దాటుతుంది! దీని దుష్ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థలపై దశాబ్దాల తరబడి కొనసాగుతుంది. యాంటీమైక్రోబయాల్‌ రెసిస్టెన్స్‌ వ్యాప్తిని అదుపులో ఉంచకపోతే అంతర్జాతీయ వాణిజ్యం భారీగా దెబ్బతింటుంది. చికిత్సకు లొంగని వ్యాధుల వల్ల పశుగణ ఉత్పాదకత క్షీణిస్తుంది. వ్యాధుల వ్యాప్తికి సమాంతరంగా ఆరోగ్య సంరక్షణ వ్యయాలు పెరుగుతాయి. కార్మికులు వ్యాధుల బారిన పడటంతో వారి పని దినాల సంఖ్య తగ్గుతుంది. ఉత్పాదకత పడిపోతుంది. దానివల్ల మొత్తం స్థూల ఉత్పత్తి కుంటువడుతుంది. పేద కార్మికులపై ఆధారపడిన దేశాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అది దేశాలమధ్య ఆర్థిక అసమానతల్ని పెచ్చరిల్లజేస్తుంది. 2050 నాటికి ప్రపంచ వార్షిక ఆరోగ్య సంరక్షణ వ్యయం ఎనిమిది శాతం అధికమవుతుంది. దీనివల్ల 2.80 కోట్ల ప్రజలు పేదరికంలోకి జారిపోనున్నారని అంచనా.

తక్షణ కర్తవ్యం
ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు 2000-2007 మధ్యకాలంలో ఏడాదికి సగటున 3.7 శాతంగా నమోదైంది. ఆర్థిక సంక్షోభ కాలంలో అది 0.1 శాతానికి పడిపోయింది. యాంటీమైక్రోబయాల్‌ రెసిస్టెన్స్‌ వల్ల నాటి ఆర్థిక దుస్థితిగతులు ప్రపంచంలో పునరావృతమయ్యే రోజులు పొంచిఉన్నాయి. ఈ ప్రమాదాన్ని గుర్తించిన కొన్ని దేశాలు పోరాటానికి ప్రణాళికలు రూపొందించాయి. వ్యూహరచనలో అన్ని దేశాలను ఒక్క తాటిమీదకు తీసుకురావడానికి ప్రపంచ బ్యాంకు ప్రయత్నిస్తోంది. ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఉమ్మడి వ్యూహం అవసరం. ప్రతి దేశం అంతర్జాతీయ సమాజంతో కలిసి నడవాలి. ప్రజల్లో అవగాహన పెంచాలి. అందుకోసం విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. ఆ వైపు భారత్‌ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోంది. నిరుడు ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం ‘యాంటీబయాటిక్స్‌ను జాగ్రత్తగా వాడండి’ అంటూ ‘దిల్లీ డిక్లరేషన్‌ ఆన్‌ యాంటీమైక్రోబయాల్‌ రెసిస్టెన్స్‌’ను ప్రకటించింది. ప్రకటన చేయడానికే పరిమితం కాకుండా అవసరమైన నిధులనూ ప్రభుత్వాలు ప్రత్యేకించాలి. ఈ యుద్ధంలో సానుకూల ఫలితాలు రాబట్టడానికి ‘స్వచ్ఛ భారత్‌’ కార్యక్రమం ఎంతో ఉపకరిస్తుంది. భవిష్యత్‌ తరాల బాగుకోసం మందుల వాడకంలో దుర్వినియోగానికి కళ్లెం వేయాలి. అందుకు కావలసిన యంత్రాంగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఈ కార్యక్రమంపై చేసే వ్యయం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో రెట్లు అధికంగా ఉంటాయి. యాంటీమైక్రోబయాల్‌ రెసిస్టెన్స్‌ మూలాలను పసిగట్టడంలో ప్రభుత్వాల చొరవతోపాటు పౌర సంఘాల చైతన్యమూ ఎంతో అవసరం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడిని నిజం చేసే దిశగా ప్రతిఒక్కరూ తమవంతు పాత్ర పోషించాలి. అప్పుడే రాబోయే ఉపద్రవాన్ని సమర్థంగా ఎదుర్కోగలం!

 

Posted on 27-01-2018