Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


సైన్స్ & టెక్నాల‌జీ

శాస్త్రీయ స్పృహే ప్రగతి సూత్రం

భారతీయ భౌతిక శాస్త్రవేత్త సర్‌ సీవీ రామన్‌ 1928 ఫిబ్రవరి 28న ‘రామన్‌ ఎఫెక్ట్‌’ను కనిపెట్టారు. ఉత్కృష్ట భారతీయ ప్రజ్ఞ వెలుగులు ప్రపంచంలో నలుదిశలకూ వ్యాపించిన ఆ తేదీనే ‘జాతీయ సైన్స్‌ దినోత్సవం’గా జరుపుకొంటున్నాం. 1930లో ఈ ఆవిష్కరణకు గానూ రామన్‌కు నోబెల్‌ బహుమతి లభించింది. ఏటా మన పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు సైన్స్‌ దినోత్సవ సంబరాలను ఘనంగా జరుపుకొంటారు. సమాచార మాధ్యమాల్లో ప్రసంగాలు, లఘుచిత్రాలు ప్రసారమవుతాయి. శాస్త్రజ్ఞులు గోష్ఠులు జరుపుకొంటారు. ప్రదర్శనలు, ప్రసంగాలు పరిపాటి అవుతాయి. ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట ఇతివృత్తం ఆధారంగా సైన్స్‌ దినోత్సవాలు నిర్వహిస్తోంది. 2016లో దేశాభివృద్ధికి శాస్త్రీయ ప్రాతిపదికలు, 2017లో దివ్యాంగులకు శాస్త్ర సాంకేతిక తోడ్పాటు అనే ఇతివృత్తాల ఆధారంగా సైన్స్‌ దినోత్సవం జరపగా 2018లో ‘సుస్థిర భవిష్యత్తుకు శాస్త్ర సాంకేతిక విజ్ఞానం’ అనే అంశం ప్రాతిపదికగా నిలుస్తోంది. ప్రాచీన కాలంలోనే అపూర్వ శాస్త్రీయ ఆవిష్కరణలను ప్రపంచానికి అందించిన భారతీయులు నవీన యుగంలో మళ్ళీ తమ సత్తా చాటుతున్నారు. నేడు ప్రపంచంలో శాస్త్రజ్ఞులు, సాంకేతిక నిపుణుల సంఖ్యలో భారత్‌ ద్వితీయ స్థానం ఆక్రమిస్తోంది. అణు, అంతరిక్ష పరిజ్ఞానాల్లో భారత్‌ అగ్రదేశాల సరసన చేరింది. సాఫ్ట్‌వేర్‌ రంగంలో భారత్‌ విజయాలు జగానికి ఎరుకే! ఇస్రో, బెంగళూరు ఐఐఎస్‌సీ, డీఆర్‌డీఓ వంటి సంస్థలు శాస్త్రసాంకేతిక రంగంలో వినూత్న పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. నేడు శాస్త్ర సాంకేతిక విజ్ఞానం లేనిదే కార్పొరేట్‌ రంగం వ్యాపారంలో నిలదొక్కుకోలేదు. పురోగమించలేదు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ సరికొత్త నైపుణ్యాలు అలవరచుకొంటూ, సమస్య పరిష్కార పటిమను ప్రదర్శిస్తూ, సృజనాత్మకంగా పనులు చేయగల నిర్ణయాలు తీసుకోగల ఉద్యోగులకు గిరాకీ అంతా ఇంతా కాదు. విద్యార్థుల్లో సైన్స్‌ పట్ల గాఢాసక్తి, కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన, ప్రయోగాలు చేసే చొరవ ఉండి, వాటిని ప్రోత్సహించే అధ్యాపక వర్గం, కళాశాల వాతావరణం ఉన్నప్పుడు దేశ ప్రగతి రథం దూసుకెళ్తుంది. విద్యార్థులను సృజనాత్మక పంథాలోకి ఆకర్షించడానికి సైన్స్‌ దినోత్సవ సంబరాలు ఎంతగానో తోడ్పడతాయి. నిత్య జీవితంలో సైన్స్‌ ప్రాముఖ్యం గురించి వారిలో అవగాహన, చైతన్యాలను పెంచుతాయి.

ప్రయోగాలతో పాఠాలు
మానవ సంక్షేమం కోసం సైన్స్‌ పరిశోధనలు చేపట్టేలా విద్యార్థులను ప్రేరేపించడం సైన్స్‌ దినోత్సవ లక్ష్యం. ఈ సందర్భంగా వారు శాస్త్ర విజ్ఞాన ప్రసంగాలు వింటారు, సైన్స్‌ విషయాలు చదువుతారు. గమనించడం, ప్రయోగాలు చేయడం ద్వారా కొత్త నైపుణ్యాలు అలవరచుకొంటారు. అసలు శాస్త్ర సాంకేతిక రంగానికి ప్రయోగాలే ఊపిరి. ప్రయోగాలు చేసేటప్పుడు విద్యార్థులు వివిధ భావనలు, వస్తువులను పరిశీలించి వర్ణిస్తారు. ప్రశ్నలు అడుగుతారు. తాము ఏర్పరచుకున్న అభిప్రాయాలను ప్రస్తుత శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతో సరిచూసుకుని, వాటిని ఇతరులతో పంచుకుంటారు. తమ అభిప్రాయాలకు ప్రత్యామ్నాయాలు ఏవైనా ఉన్నాయా అని శోధిస్తారు. తార్కిక శక్తిని, ఆలోచనా పటిమను పెంపొందించుకుని సైన్స్‌ పట్ల లోతైన అవగాహన ఏర్పరచుకుంటారు. జాతీయ సైన్స్‌ దినోత్సవం నాడు విద్యార్థులతో వివిధ సైన్స్‌ ప్రాజెక్టులు చేయించడంలో ఉద్దేశమిదే. ఆ రోజున సైన్స్‌ ప్రదర్శనలు, ఎక్స్‌పోలు నిర్వహించాలి. క్విజ్‌ పోటీలు పెట్టాలి. ప్రసంగాలు, చర్చా కార్యక్రమాలు నిర్వహించాలి. వ్యాస రచన పోటీలు పెట్టాలి. వినూత్న పోస్టర్ల తయారీని ప్రోత్సహించాలి. శాస్త్ర విజ్ఞాన చిత్రాలు, డాక్యుమెంటరీలను ప్రదర్శించాలి. ప్రస్తుత ప్రపంచంలో సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, గణితం (స్టెమ్‌) కోర్సులే ఇప్పుడు రాజ్యమేలుతున్నాయి. గడచిన పదేళ్లలో దేశదేశాల్లో రొడ్డ కొట్టుడు పనులకు కాలంచెల్లి, ఆ తరహా ఉద్యోగాలు రానురానూ తగ్గిపోతున్నాయి. సాంకేతిక నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాలు క్రమంగా పెరుగుతున్నాయి. నవయుగంలో రాణించడానికి అవసరమైన నైపుణ్యాలను శ్రద్ధగా, ఉత్సాహంగా నేర్చుకుని రాణించే వాతావరణం విద్యాసంస్థల్లో వెల్లివిరియాలి. ఆ దిశగా ఉపాధ్యాయులు తమ విద్యార్థులను ప్రోత్సహించాలి. మౌలికాంశాలను క్షుణ్నంగా నేర్పాలి. పిల్లల్లో విజ్ఞాన అనురక్తిని రగిలించి విరివిగా ప్రయోగాలు చేయిస్తే మౌలిక శాస్త్రాలవైపు ఆకర్షితులవుతారు.
ఇక్కడ ప్రపంచ ఆర్థిక వేదిక ఏటా ప్రచురించే అంతర్జాతీయ పోటీతత్వ నివేదికలో భారత్‌ స్థానాన్ని పరిశీలించారు. 2004 నుంచి ఈ నివేదిక అంతర్జాతీయ పోటీతత్వ సూచీలో ఆయా దేశాల స్థానాన్ని నిర్ణయిస్తోంది. ఈ దేశాలు తమ పౌరుల అభ్యున్నతికి ఎలాంటి అవకాశాలు అందించగలుగుతున్నాయో అంచనా వేస్తోంది. శాస్త్ర సాంకేతిక పరిశోధనలతో ఉత్పాదక శక్తిని పెంపొందించుకుని తన వనరులను అత్యంత సమర్థంగా వినియోగించుకొనే దేశం ఆర్థిక పోటీలో ఇతర దేశాలను దాటుకొని వేగంగా పురోగమించగలదు. ఆ పురోగతిని అంచనా వేయడానికి పోటీతత్వ సూచీని రూపొందించారు. 2017లో స్విట్జర్లాండ్‌, అమెరికా, సింగపూర్‌లు పోటీతత్వ సూచీలో మొదటి మూడు స్థానాలను ఆక్రమించగా, భారత్‌ 40వ స్థానంతో సరిపెట్టుకొంది. మన యువతరం ఉన్నతస్థాయి పరిశోధనలు చేపట్టే వాతావరణాన్ని కల్పించి తగు వనరులు కేటాయించినప్పుడు ప్రపంచ ర్యాంకింగుల్లో భారత్‌ అగ్రశ్రేణికి చేరుకుంటుంది. ఈ దిశగా విద్యార్థులను ఉత్తేజితులను చేయడానికి ఏటా జాతీయ సైన్స్‌ దినోత్సవం జరుపుకొంటున్నాం. ‘నేచర్‌’ పత్రిక సూచీ ప్రకారం 2016 డిసెంబర్‌-2017 నవంబర్‌ మధ్య శాస్త్ర సాంకేతిక పత్రికల్లో 24,143 పరిశోధన పత్రాలను ప్రచురించడం ద్వారా అమెరికా తానే మేటినని చాటుకుంది. 10,718 పత్రాల ప్రచురణతో చైనా రెండో స్థానం ఆక్రమించగా భారత్‌ కేవలం 1,639 ప్రచురణలతో సరిపెట్టుకుంది. మన పరిశోధన స్థాయిని ఎన్నెన్నో రెట్లు పెంచుకోవడానికి యుద్ధప్రాతిపదికపై కృషి జరగాలి. ఉపాధ్యాయులు, పరిశోధకులు, పరిశ్రమలవారు, విద్యార్థులు దీన్ని ఒక యజ్ఞంగా చేపట్టాలి.

యువతరానికి సవాలు
ప్రపంచ మేధోహక్కుల సంస్థ, ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం స్వదేశీయులు దాఖలు చేసిన పేటెంట్లలో రాశి రీత్యా చైనాదే అగ్రస్థానం. 2016లో చైనాలో ఈ తరగతిలో మొత్తం 12,04,981 పేటెంట్‌ దరఖాస్తులు దాఖలయ్యాయి. 2,95,327 దరఖాస్తులతో అమెరికా రెండోస్థానం ఆక్రమిస్తుంటే 13,199 దరఖాస్తులతో భారత్‌ యథాప్రకారం జాబితాలో ఎక్కడో దిగువన ఉంది. ప్రవాసుల పేటెంట్‌ తరగతిలో 3,10,244, దరఖాస్తులతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, 1,33,522 దరఖాస్తులతో చైనా ద్వితీయ స్థానం సాధించింది. భారత్‌ ఖాతాలో 31,858 దరఖాస్తులు మాత్రమే ఉన్నాయి. రాబోయే నాలుగో పారిశ్రామిక విప్లవ యుగంలో ఉన్నత పరిశోధన నైపుణ్యాలున్న దేశాలు మాత్రమే ఆర్థికంగా విజృంభించి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)ని పెంచుకుని తమ ప్రజలకు మంచి జీవితాలను ప్రసాదించగలవు. భారత్‌ ఇకనైనా మేల్కొని యువతరాన్ని భావి సవాళ్లకు సమాయత్తం చేయాలి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలపై చైనా, అమెరికాలు వందల కోట్ల డాలర్లు ఖర్చుపెడుతున్నాయి కనుకనే అవి అగ్రగాములుగా వెలిగిపోతున్నాయి. అమెరికా తన జీడీపీలో 2.74 శాతాన్ని (47,300 కోట్ల డాలర్లను) పరిశోధన-అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ)పై ఖర్చు చేస్తుంటే, చైనా 2.1 శాతాన్ని (40,900 కోట్ల డాలర్లను) వెచ్చిస్తోంది. పరిశోధన-అభివృద్ధిపై ఎక్కువగా వెచ్చిస్తున్న 10 దేశాల్లో భారత్‌ది ఆరో స్థానం ఈ పద్దుపై మన వ్యయం 6,600 కోట్ల డాలర్లు మాత్రమే. ఇది మన జీడీపీలో కేవలం 0.85 శాతానికి సమానం. ఇకనైనా అత్యవసరగా ఆర్‌ అండ్‌ డీ కేంద్రాలను, ప్రయోగశాలలనూ విస్తృతంగా నిర్మించడానికి కేటాయింపులు పెంచాలి.
భారతీయ విద్యా రంగంలో 1990ల నుంచి సైన్స్‌ విద్యకు ప్రాధాన్యం తగ్గిపోతూ ఇంజినీరింగ్‌, ఐటీ, సాఫ్ట్‌వేర్‌ రంగాలకు గిరాకీ పెరగసాగింది. పరిశోధక సత్తా ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులు ప్రధానమైన సైన్స్‌ కోర్సులను వదలి టెక్నాలజీ కోర్సులవైపు పరుగులు తీయసాగారు. దీనితో గత 20 ఏళ్ల నుంచి మౌలిక శాస్త్రాల్లో మేధోపరంగా తీవ్ర లోటు ఏర్పడింది. దీన్ని వెంటనే పూడ్చటం సాధ్యం కాదు. విద్యార్థుల్లో సైన్స్‌ పట్ల గాఢమైన ఆసక్తి అనురక్తులను పాదుగొల్పి పరిశోధనలు చేపట్టే వాతావరణం కల్పించాలి. తద్వారా దీర్ఘకాలంలో దేశ ఆర్థిక రథానికి చోదక శక్తులుగా వారు ఎదగగలుగుతారు. ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలల్లో ప్రయోగశాలలు నెలకొల్పి ప్రయోగాలకు ఊతమివ్వాలి. ఇందుకు బడ్జెట్‌లో నిధులు పెంచాలి. విద్యార్థులకు ప్రాథమిక తరగతుల నుంచే విశ్లేషణాత్మక ఆలోచనా విధానం అలవరచాలి. కార్యకారణ సంబంధాల అన్వేషణను నేర్పాలి. మౌలిక శాస్త్రీయ భావనలపై పట్టుసాధించడానికి తర్కం బోధించాలి. జిజ్ఞాసువులుగా తీర్చిదిద్ది పరిశోధకులుగా మలచాలి. మౌలిక శాస్త్రాలపై ప్రయోగాలు చేయడానికి తగు సమయం కేటాయించాలి. ఈ విధంగా విద్యార్థులుపై తరగతులకు, విశ్వవిద్యాలయాలకు వెళ్లాక పరిశోధన చేపట్టేలా సమాయత్తం చేయాలి. రోబోటిక్స్‌, డేటా సైన్స్‌, కృత్రిమ మేధ, జన్యువైద్యం, ఇతర గ్రహాలకు యాత్రలు ఊపుందుకొంటున్న ఈ ప్రపంచీకరణ యుగంలో శాస్త్ర సాంకేతిక పరిశోధనలకున్న ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు. వాటిలో రాణించేలా మన విద్యార్థులను తీర్చిదిద్దడం జాతి కర్తవ్యం!

 

- డాక్టర్‌ కె.బాలాజీరెడ్డి
Posted on 28-02-2018