Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


సైన్స్ & టెక్నాల‌జీ

ఇంతింతై... 5జీ అంతై!

* ఆధునిక సాంకేతిక విప్లవం

చరవాణి రంగంలో 2జీ ఫోన్ల సాయంతో వినియోగదారులు అవతలివారితో మాట్లాడగలిగారు, సంక్షిప్త సందేశాలు పంపగలిగారు. 3జీ చలవతో మొబైల్‌లోనే ఇంటర్నెట్‌ సదుపాయం పొందారు, ఫొటోలను సునాయాసంగా పంపగలుగుతున్నారు. 4జీ సాంకేతికత వివిధ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుని సరకులు, సేవలు పొందే సౌకర్యాన్ని కల్పించింది. సామాజిక మాధ్యమాలను, వీడియో స్ట్రీమింగ్‌ను అందుబాటులోకి తెచ్చింది. 5జీ సాంకేతికత ఈ పనులన్నింటినీ స్మార్ట్‌ఫోన్‌తో మహా వేగంగా చేయడమే కాదు- లక్షలాది గృహ, పారిశ్రామిక ఉపకరణాలను ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ)తో అనుసంధానిస్తుంది.
విశాఖపట్నంలోని ఒక ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జరుగుతోంది. చిత్రమేమంటే శస్త్ర చికిత్సకుడు ఆపరేషన్‌ గదిలో లేడు. ఎక్కడో ముంబయి నుంచి ‘రియల్‌ టైమ్‌ మొబైల్‌ లింక్‌’ సాయంతో కత్తెర తిప్పుతున్నాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు రవాణా సంస్థలో కంప్యూటర్‌ తెర ముందు కూర్చున్న వాహన చోదకుడు అక్కడి నుంచే జాతీయ రహదారి మీదుగా విజయవాడకు ట్రక్కు నడిపిస్తున్నాడు. ఫిలింనగర్‌లో ఒక చలనచిత్ర సంగీత దర్శకుడు చెన్నై, ముంబయిల్లోని వాద్యకారులను ‘మొబైల్‌ లింకు’ ద్వారా కూడగట్టి పాటలకు బాణీలు కడుతున్నాడు. 5జీ సాంకేతికత చలవతో ఈ దృశ్యాలు నిత్య జీవన ఘటనలయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. ప్రస్తుతం ఒక యాప్‌ను కాని, వెబ్‌ పేజీని కానీ డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే, మొదట మన విజ్ఞప్తి డేటా కేంద్రానికి వెళ్లి, అక్కడి నుంచి మొబైల్‌ ఫోన్‌కు తిరిగి రావాలి. 5జీ వచ్చాక సదరు డేటా సెకను కూడా ఆలస్యం లేకుండా మొబైల్‌లోకి డౌన్‌లోడ్‌ అయిపోతుంది. 5జీలోని ఆలస్య రాహిత్యం, హఠాత్సంభవత్వాల వల్లనే వైద్యుడు, చోదకుడు, సంగీతకారులు దూరతీరాల నుంచి విజయవంతంగా పనులు చేయగలుగుతారు.

డేటాయే సర్వస్వం
ఆ రోజు వచ్చాక క్లౌడ్‌లో, సర్వర్లలో అపరిమిత సమాచార (డేటా) నిధులు కలిగిన గూగుల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి కంపెనీలు యావత్‌ మొబైల్‌ మార్కెట్‌లో చక్రం తిప్పుతాయి. ఈ కంపెనీల ట్రాకర్లు అనేకానేక వెబ్‌సైట్ల కోడ్‌లలో ఇమిడి ఉండి సందర్శకుల ఆసక్తులు, బ్రౌజింగ్‌ అలవాట్లను పసిగడుతున్నాయి. శోధకుల వెబ్‌ చరిత్ర ఆధారంగా వారి వ్యక్తిత్వ చిత్రణం చేపడుతున్నాయి. అంతర్జాలంలో అగ్రశ్రేణిలో ఉన్న పది లక్షల వెబ్‌సైట్లకు 75 శాతం సైట్లలో గూగుల్‌ ట్రాకర్లు అమర్చి ఉన్నాయి. ఫేస్‌బుక్‌, ట్విటర్‌లు వరసగా 25 శాతం, 10 శాతం సైట్లలో ట్రాకర్లు అమర్చి రెండు, మూడు స్థానాలను ఆక్రమిస్తున్నాయి. లాగిన్‌ కావాలన్నా, సామాజిక మాధ్యమాల్లో సమాచారం పంచుకోవాలన్నా ఆయా వెబ్‌సైట్లలో అమర్చిన మూడు కంపెనీల ట్రాకింగ్‌ కోడ్‌లే ఆధారం. కంప్యూటర్లు, స్మార్ట్‌ ఫోన్ల నుంచి ఈ సైట్‌లను సందర్శించేవారి సమాచారాన్ని ట్రాకర్ల ద్వారా సేకరిస్తారు. ఈ సమాచారం నెట్‌ శోధకులకు వాణిజ్య ప్రకటనలు పంపడానికే కాకుండా, వారి రాజకీయ భావాలను ప్రభావితం చేయడానికి, వివిధ జన సమూహాలతో గ్రూపులు కట్టడానికీ ఉపయోగపడతాయి. వ్యక్తుల వస్తుసేవల కొనుగోలు రికార్డులను, టెలిఫోన్‌ రికార్డులు, పత్రికలు, టీవీ చందా వివరాలను డేటా బ్రోకర్ల నుంచి కొనుగోలు చేసి, పైన చెప్పుకొన్న ట్రాకింగ్‌ సమాచారంతో మేళవిస్తే శోధకుల సమగ్ర వ్యక్తిత్వం ఆవిష్కృతమవుతుంది. అమెరికాలో పోలీసులు, వివిధ ప్రభుత్వ సంస్థలు పౌరుల వ్యక్తిత్వ రికార్డులను డిమాండ్‌ చేస్తే గూగుల్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌లు వాటిని సర్కారువారికి సమర్పించుకోకతప్పదు. ఈ నిఘా వ్యవహారమంతా 5జీ వల్ల అమిత వేగం సంతరించుకుంటుంది. అమెరికా 2007లో ఏర్పరచిన ప్రిజమ్‌ నిఘా వ్యవస్థ గూగుల్‌, యాహూ, ఆపిల్‌, యూ ట్యూబ్‌, ఫేస్‌బుక్‌ తదితర అంతర్జాల సంస్థల సర్వర్ల నుంచి వ్యక్తుల ఈ-మెయిళ్లు, పత్రాలు, ఫొటోలు, ఆడియో వీడియో చాట్‌ వివరాలను సంగ్రహిస్తోంది. వెరిజాన్‌ తదితర టెలికం కంపెనీల ఖాతాదారుల ఫోన్‌ సంభాషణలనూ ఆలకిస్తోంది. ఇదంతా ఉగ్రవాదులను, విదేశీ గూఢచారులను ఎదుర్కోవడానికేనని అమెరికా వివరిస్తోంది. వాస్తవమిలా ఉంటే 5జీ సేవల సాకుతో పాశ్చాత్య దేశాల్లోని వ్యక్తుల, సంస్థల గుట్టుమట్లను, జాతీయ శాస్త్ర, సాంకేతిక, సైనిక రహస్యాలను చైనా తస్కరించబోతోందని అమెరికా గగ్గోలు పెట్టడం చోద్యం. చైనీస్‌ టెలికం దిగ్గజం హువావై తయారుచేసే 5జీ పరికరాల్లో బ్యాక్‌ డోర్‌ అమర్చి ఉందని, దాని ద్వారా చైనా అందరిపై నిఘా వేయగలుగుతుందని అమెరికా హెచ్చరిస్తోంది. హువావై సామగ్రిని తమ మొబైల్‌ నెట్‌వర్క్‌లలో వాడవద్దని బ్రిటన్‌, జర్మనీ తదితర ఐరోపా దేశాలను కోరింది. కానీ, నేడు 5జీ సామగ్రి సరఫరాలో హువావైయే రారాజు. 4జీ కన్నా 100 రెట్లు, బ్రాడ్‌ బ్యాండ్‌ కన్నా పది రెట్లు ఎక్కువ వేగంతో సమాచారాన్ని ప్రసారం చేసే 5జీ ద్వారా ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, కృత్రిమ మేధ, స్వయంచాలనం (ఆటోమేషన్‌) ఊపందుకుని సరికొత్త పారిశ్రామిక విప్లవం సంభవించనుంది. ఉత్తరోత్రా లక్షలాది యంత్రాలు, స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు 5జీ నెట్‌వర్క్‌తో అనుసంధానమవుతాయి కాబట్టి, వాటిలోని సమాచారాన్ని సంగ్రహించడం, వాటి మధ్య సమాచార పంపిణీని అడ్డుకోవడం సులువవుతుందన్న భయాలున్నాయి. 5జీ రేపు కార్లు, ఇళ్లు, గృహోపకరణాలు, పరిశ్రమల అనుసంధానకర్తగా అవతరించనుంది. 2020కల్లా 5జీ నెట్‌వర్కుల స్థాపనకు దక్షిణ కొరియా, జపాన్‌, చైనా, అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌, జర్మనీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ విషయంలో భారత్‌ ఆలస్యంగానైనా మేల్కొనడం ఊరట కలిగించే విషయం.

అగ్రరాజ్యం అసలు భయం
ప్రస్తుతం దక్షిణ కొరియా, జపాన్‌లు 5జీ వినియోగంలో అగ్రగాములుగా ఉన్నా, ఈ నెట్‌వర్క్‌లకు కావలసిన పరికరాల తయారీ, సరఫరాపై చైనా కంపెనీ హువావైదే ఆధిపత్యం. 30 దేశాల్లో 46 వాణిజ్యపరమైన 5జీ కాంట్రాక్టులను సంపాదించి, లక్షకు పైగా 5జీ స్టేషన్లను ఎగుమతి చేశానని హువావై ఇటీవలే ప్రకటించింది. మున్ముందు 5జీ పరికరాల మార్కెట్‌ చైనా గుప్పిట్లోకి వెళ్లిపోతుందని అమెరికా ఆందోళన చెందడంలో ఆశ్చర్యమేముంది?

స్పెక్ట్రమ్‌ వేలానికి శ్రీకారం
5జీ టెలికం సేవలకు ప్రత్యేకించదలచిన స్పెక్ట్రమ్‌ బ్యాండ్‌ల జాబితాను భారత ప్రభుత్వం రూపొందిస్తోంది. రేపు జరిగే ఉన్నత స్థాయి మంత్రిత్వ సమావేశంలో జాబితాను ఖరారు చేసే విషయమై చర్చిస్తారు. అక్టోబరులో ఈజిప్ట్‌లోని షర్మ్‌ అల్‌ షేక్‌లో జరగనున్న ప్రపంచ రేడియో కమ్యూనికేషన్‌ మహాసభ ఏయే ఎయిర్‌ వేవ్‌ బ్యాండ్‌లను 5జీ సేవలకు కేటాయించేదీ నిర్ణయిస్తుంది. ఐరోపా సమాఖ్య తమ సభ్య దేశాల్లో 5జీ సేవలకు 26 గిగాహెర్జ్‌ బ్యాండ్‌ను కేటాయించాలని ప్రతిపాదిస్తోంది. భారత్‌ కూడా తన టెలికం, అంతరిక్ష, సమాచార-ప్రసార, రక్షణ, పౌర విమానయాన శాఖల అవసరాల కోసం ప్రత్యేక బ్యాండ్‌లను ప్రతిపాదించాల్సి ఉంది. 5జీ సేవలను 100 రోజుల్లో ప్రయోగాత్మకంగా చేపట్టాలని కేంద్ర టెలికం మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఆదేశించినందువల్ల ఈ సమావేశంలో స్పెక్ట్రమ్‌ బ్యాండ్‌ల జాబితాను ఖరారు చేయడం అనివార్యమవుతోంది. దీనికితోడు భారత్‌ ఈ సంవత్సరమే 5జీ ఎయిర్‌ వేవ్‌ల వేలం ప్రక్రియను చేపట్టనుంది. ప్రపంచ 5జీ సేవల విపణిలో వాటా సంపాదించడానికి స్వీడన్‌కు చెందిన ఎరిక్సన్‌, ఫిన్లాండ్‌కు చెందిన నోకియా, దక్షిణ కొరియాకు చెందిన శామ్‌సంగ్‌, చైనాకు చెందిన హువావై, జడ్‌టీఈ కంపెనీలు పోటీపడుతున్నాయి. 5జీ సామగ్రిని, సాంకేతికతను చవకగా సంపాదించడానికి భారత్‌ ఈ పోటీని ఉపయోగించుకోవాలి. భారత్‌లో 5జీ సేవలను ప్రారంభించడానికి ఎరిక్సన్‌ ఇప్పటికే నడుం బిగించింది. బీఎస్‌ఎన్‌ఎల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌, ఐడియా సెల్యులర్‌ కంపెనీలు 4జీ నుంచి 5జీకి పరిణామం చెందడానికి తోడ్పడుతోంది. 5జీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) మోహరింపునకు బీఎస్‌ఎన్‌ఎల్‌, భారతీ ఎయిర్‌టెల్‌లతో చేతులు కలిపి పనిచేస్తోంది. ఎయిర్‌టెల్‌, జియోలతో కలిపి 5జీ సాంకేతికత సాయంతో డ్రోన్లను నడపడం, ఐఐటీ దిల్లీ, జియోలతో కలిసి డ్రైవర్‌ రహిత కారును నడపడం వంటి ప్రయోగాలూ చేసింది. 2026కల్లా ప్రపంచమంతటా 5జీ సాయంతో పరిశ్రమల డిజిటలీకరణకు తోడ్పడటం ద్వారా టెలికం ఆపరేటర్లు 61,900 కోట్ల డాలర్ల ఆదాయం ఆర్జించగలుగుతారు. అప్పటికి భారత్‌లో 5జీ మొబైల్‌ సేవల విలువ 2,700 కోట్ల డాలర్లకు చేరుతుందని ఎరిక్సన్‌ సంస్థ అంచనా. వచ్చే దశాబ్దం 5జీదే కాబట్టి, ఆ సేవలకు అవసరమైన పరికరాలను, సిబ్బందిని ఇక్కడే తయారుచేయడంపై భారత్‌ దృష్టి కేంద్రీకరించాలి. ఈ రంగంలో హైటెక్‌ ఉద్యోగాలు చేయడానికి అవసరమైన నైపుణ్యాలను మన యువతకు అలవరచడానికి పాఠ్య ప్రణాళికలను సిద్ధం చేయాలి.

భారత్‌కు పెట్టుబడులు
నేడు చైనా, భారతదేశాల్లో మధ్యతరగతి నుంచి వస్తుసేవలకు గిరాకీ వెల్లువెత్తుతోంది. ఎక్కడ గిరాకీ ఉందో అక్కడే వస్తువులను తయారు చేస్తే ఉత్పత్తి, రవాణా, కార్మిక వ్యయాలు తగ్గి లాభాలు ఇనుమడిస్తాయి. అందువల్ల ఈ రెండు దేశాల్లో పరిశ్రమల స్థాపనకు పెట్టుబడిదారులు పోటీపడుతున్నారు. అధునాతన సాంకేతికతలతో నడిచే ఆ పరిశ్రమలకు 5జీ నెట్‌వర్కులు ఊపిరి కానున్నాయి.

తస్మాత్‌ జాగ్రత్త...
5జీ సాంకేతికత వల్ల జీవజాతులకు పెను ముప్పు ఉందన్న హెచ్చరికలను తేలిగ్గా తీసుకోరాదు. సెల్‌ఫోన్‌ రేడియేషన్‌ వల్ల మనుషులకు క్యాన్సర్‌, గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువవుతుందని, వారి డీఎన్‌ఏకు నష్టం వాటిల్లుతుందని అమెరికా పరిశోధకులు తెలిపారు. చెట్ల బెరళ్లు దెబ్బతింటాయని, ఆకులు రాలిపోతాయని ఐరోపా పరిశోధకులు కనుగొన్నారు. కాబట్టి వైఫై సాధనాలను ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ సాధనాలకు కనీసం మూడు అడుగుల దూరంలో ఉండటం, ఫోన్‌లో మాట్లాడేటప్పుడు హెడ్‌ఫోన్లు ధరించడం, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌, కార్లలో బ్లూటూత్‌, వైఫైలను తొలగించడం, ఫోన్‌లో తక్కువగా మాట్లాడి, ఎక్కువగా సందేశాలు పంపడం, రాత్రి పూట వైఫై సాధనాలను స్విచాఫ్‌ చేయడం వంటివి భద్రతకు పూచీ ఇస్తాయి.

 

- ఏఏవీ ప్రసాద్‌
Posted on 16-06-2019