Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


సైన్స్ & టెక్నాల‌జీ

ప్రాణాలు తోడేస్తున్న వాయు కాలుష్యం

* ప్రమాదంలో ప్రజాజీవనం

తీవ్రమైన వాయు కాలుష్యం బారినపడి భారతావని ఉక్కిరిబిక్కిరి అవుతోంది. నగరాల్లోని 80శాతం ప్రజలు వాయు కాలుష్యం కారణంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) నివేదిక ప్రకారం మరే దేశంతో పోల్చినా భారత నగరాల్లోనే పీల్చేగాలి ప్రాణాంతకంగా మారిన దురవస్థ అధికంగా కనిపిస్తోంది. ప్రపంచంలో వాయు కాలుష్యం స్థాయి అత్యధికంగా ఉన్న పన్నెండు నగరాల జాబితాలో భారత్‌లోనే పదకొండు ఉండటమన్నది బాధ కలిగించే వాస్తవం. ఆ జాబితాలో భారత్‌లోని కాన్పూర్‌, ఫరీదాబాద్‌, వారణాసి నగరాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. వాహనాల పొగ, బొగ్గును మండించడం, విచ్చలవిడిగా వంటచెరకు వాడకం, ప్రమాదవశాత్తు అడవులు తగలబడటం వంటివన్నీ భారత్‌ను వాయు కాలుష్య కేంద్రంగా మారుస్తున్నాయి. మనదేశం భౌగోళికంగా కొండలు, పర్వతాలతో నిండిన ప్రాంతం కావడంతో, ఆవరించిన విష వాయు మేఘాలు కొన్ని సందర్భాల్లో ఎక్కడివక్కడే నిలిచిపోవడమూ సమస్యలకు అంటుకడుతోంది. జనం ఆరోగ్యాన్ని, ప్రాణాలను తోడేస్తున్న వాయు కాలుష్యాన్ని అడ్డుకోకపోతే భారతావని భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందనడంలో మరో మాట లేదు.

కాలుష్యభరిత వాయువులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నా, జనాభా పెరుగుతున్న అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సమస్య జోరు అధికం! ‘వాయు కాలుష్యం అందరినీ భయపెడుతోంది. బడుగులు, పేద వర్గాలపై ఈ సమస్య తీవ్రత చాలా ఎక్కువగా ఉంది’- డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ చేసిన ఈ వ్యాఖ్య కఠిన వాస్తవాలను ఆవిష్కరిస్తోంది. కట్టెల పొయ్యిల ఉపయోగం, పిడకలను వంటచెరకుగా వాడటం, దీపాలను వెలిగించేందుకు కిరోసిన్‌ వినియోగం వంటివన్నీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఎక్కువగా దర్శనమిస్తాయి. కాలుష్య నియంత్రణకు రూపొందించిన చట్టాలు, నిబంధనలు ఎంత పకడ్బందీగా ఉన్నప్పటికీ- క్షేత్రస్థాయిలో వాటిని సమర్థంగా అమలు చేయగలిగిన పాలనా పరిణతి వర్థమాన దేశాల్లో కనిపించడం లేదు. కనీస ప్రమాణాలు లేని వాహనాలనుంచి వెలువడే కాలుష్య ధూమాన్ని అడ్డుకోవడంలో దారుణ వైఫల్యం కనిపిస్తోంది. పంట వ్యర్థాలను కుప్పగా పోసి పెద్దయెత్తున తగలబెట్టడంవల్ల ప్రాణవాయువులో విషపూరిత రసాయనాలు చేరిపోతున్నాయి. మరోవంక నిర్మాణ రంగ పనుల కారణంగా గాలిలోకి కాలుష్యధూళి భారీయెత్తున చేరిపోతోంది. విష గాలులు ప్రజారోగ్యానికి తూట్లు పొడుస్తున్న నేపథ్యంలో చైనా వంటి దేశాలు నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మనదేశంలో చట్టాలకు మన్నన దక్కుతున్న జాడలే లేవు. కోటీ 90 లక్షలమందికి నెలవైన దేశ రాజధాని దిల్లీ నగరం కాలుష్యం కోరల్లో చిక్కి ఉక్కిరిబిక్కిరవుతోంది. విషవాయు ధూమాల పాలబడి పాలరాతి కట్టడమైన తాజ్‌మహల్‌ సైతం ఛాయామాత్రంగా ఆకుపచ్చ రంగులోకి మారుతున్న దుస్థితి నేడు మనముందుంది. కిందటేడు వాయు కాలుష్యం దిల్లీ నగరాన్ని పట్టికుదిపింది. దట్టంగా కమ్ముకున్న కాలుష్య మేఘాల కారణంగా ఒక దశలో దిల్లీకి విమాన సర్వీసులనూ నిలిపివేయాల్సి వచ్చింది. రహదారి ప్రమాదాలు పెచ్చుమీరాయి. పాఠశాలలను మూసివేశారు. నగర జీవనం స్తంభించిన పరిస్థితుల్లో నిరసన ప్రదర్శనలూ హోరెత్తాయి. స్వయంగా ఓ మంత్రి దిల్లీని ‘గ్యాస్‌ చాంబర్‌’గా అభివర్ణించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

దేశంలో పదుల సంఖ్యలో ఉన్న నగరాలు ఇంచుమించుగా దిల్లీ తరహా పరిస్థితులనే ఎదుర్కొంటున్నాయి. క్రమంగా గ్రామీణ ప్రాంతాలకూ తీవ్రత విస్తరిస్తోంది. 2015లో దేశంలో సంభవించిన మరణాల్లో 75శాతానికి వాయు కాలుష్యమూ ఓ కారణంగా ఉంది. దేశంలో మూడింట రెండొంతుల జనాభా ఇప్పటికీ గ్రామాల్లోనే నివసిస్తోంది. పంట వ్యర్థాలను ఎక్కడికక్కడ పొలాల్లో కాల్చిపారేయడమూ క్రమం తప్పకుండా జరుగుతోంది. ఈ పొగ క్రమంగా విస్తరించి నగరాలకు పాకి అక్కడి వాహనాలు, కర్మాగారాలు, నిర్మాణ పనులవల్ల వెలువడే కాలుష్య ధూళితో కలిసిపోయి అత్యంత ప్రమాదకరంగా రూపాంతరం చెందుతోంది. మరోవంక దేశంలోని అనేక నగరాల్లో చెత్త నిర్వహణకు సంబంధించి సరైన విధానాలు లేవు. తద్వారా చెత్తను ఎక్కడబడితే అక్కడే కాల్చివేస్తున్నారు. కట్టెలపొయ్యి, పిడకలు ఉపయోగించి వంటచేసే ఇళ్లలో జన్మించే పిల్లలు ఉండాల్సిన దానికన్నా తక్కువ బరువుతో జన్మిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వాయు కాలుష్యాన్ని కట్టడి చెయ్యడం ఖరీదైన వ్యవహారమన్న దుర్భ్రమ సర్వత్రా వ్యాపించి ఉంది. విష గాలుల కట్టడిపై పెట్టే ప్రతి రూపాయి ఖర్చువల్ల; ప్రజారోగ్యం మెరుగుదల, కొత్త ఉద్యోగాల కల్పన, పనినాణ్యత ఇనుమడించడం తదితరాలవల్ల పరోక్షంగా 30 రూపాయల లాభం చేకూరుతుంది. కిరోసిన్‌ స్టవ్‌ల తొలగింపు, డీజిల్‌ వాహనాలకు చెక్‌పెట్టడం, శిలాజ ఇంధనాలను బహిరంగంగా కాల్చివేయడానికి స్వస్తి చెప్పడంవంటి మూడు పనులు చేస్తే వాయు కాలుష్యాన్ని పెద్దయెత్తున అరికట్టవచ్చునని నిపుణులు వెల్లడిస్తున్నారు. కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలను తొలగించి- నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణమైన వాహనాలనే రహదారులపై అనుమతించాలి. దిల్లీలో కొంతమేరకు ఆ దిశగా కదలిక ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఇదే తరహా చైతన్యం ఇప్పుడు విస్తరించాల్సి ఉంది.

 

- పీవీ రావు
Posted on 25-06-2019