Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


సైన్స్ & టెక్నాల‌జీ

పర్యావరణ ఆత్యయిక స్థితి!

* పెను సంక్షోభం ముంగిట ప్రపంచ దేశాలు

రుతుపవనాల రాకతో వానలు కురుస్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు సగం ప్రాంతంలో కరవు నెలకొంది. రుతుపవనాల రాకలో జాప్యం, అవసరం మేరకు వానలు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. మండే ఎండలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు దుర్భిక్షానికి దారి తీస్తున్నాయి. అభివృద్ధి పేరుతో అడవుల నరికివేత అనేక అనర్థాలకు కారణమవుతోంది. మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి. అకాల వర్షాలు, కరవు కాటకాలు వ్యవసాయ రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వాతావరణంలో సంభవిస్తున్న అనూహ్య మార్పులు పర్యావరణానికి ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ పరిణామాలను విశ్లేషించినప్పుడు ‘పర్యావరణ అత్యవసర పరిస్థితి’ తలెత్తినట్లనిపిస్తోంది. దీని ప్రభావం ఒక్క వ్యవసాయంపైనే కాకుండా ఇతర రంగాలపైనా పడనుంది. వ్యవసాయ రంగం దెబ్బతింటే గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కరవవుతుంది. దీనివల్ల వారు పొట్టచేత పట్టుకుని బతుకుతెరువు కోసం పట్టణాలకు వలస వెళ్లాల్సి వస్తుంది. పంట దిగుబడులు తగ్గితే రైతన్న ఆర్థికంగా చితికిపోతాడు. ఇది యావత్‌ రైతాంగ కుటుంబాలపైనా ప్రభావం చూపుతుంది. దిగుబడుల తగ్గుదల ప్రభావం ఆర్థిక వ్యవస్థపైనా ఉంటుంది. దీనివల్ల ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తుంది. వాతావరణ మార్పులవల్ల పట్టణాలు, నగరాల్లో కాలుష్యం తీవ్రమవుతుంది. ఇది ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల ప్రజావళి ఆర్థిక పరిస్థితి దెబ్బతిని మొత్తంగా భారతావని ప్రగతి సూచీలు పడకేసే ప్రమాదం ఉంది. పర్యావరణ పరిరక్షణను కీలక ప్రాథమ్యంగా నెత్తికెత్తుకోవడంతోపాటు- దేశ ఆర్థిక వ్యవస్థ కుంగిపోకుండా విపత్తులను కాచుకొనే కీలక వ్యవస్థల నిర్మాణం దిశగా ప్రభుత్వాలు సన్నద్ధం కావాల్సిన తరుణమిది. మరో అయిదు రోజుల్లో కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో- ప్రభుత్వం తన ప్రాథమ్యాలను పక్కాగా నిర్దేశించుకోవడం అత్యావశ్యకం.

ఆగని ప్రమాద ఘంటికలు
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ‘పర్యావరణ అత్యవసర పరిస్థితి’ నెలకొంది. పర్యావరణ సంక్షోభం తాలూకు దుష్పరిణామాలు ఆయాదేశాల ఆర్థిక వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన జాతీయ సైన్స్‌ అకాడమీ తాజాగా ప్రచురించిన అధ్యయన పత్రం ఈ విషయాన్ని వెల్లడించింది. భూతాపం కారణంగా 1961-2010 మధ్య కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సహజ వృద్ధి 31శాతం మేర కోసుకుపోయింది. జీవవైవిధ్యం పర్యావరణ సేవలకు సంబంధించిన అంతర ప్రభుత్వాల విజ్ఞాన శాస్త్ర విధానాల వేదిక ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం- భూమ్మీద ఉన్న జీవజాతుల్లో అయిదోవంతు (దాదాపు 10 లక్షలు) అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. 85 శాతం చిత్తడి నేలలు ఇప్పటికే కనుమరుగయ్యాయి. వాతావరణంలోకి విడుదలవుతున్న బొగ్గుపులుసు వాయువు (కార్బన్‌ డయాక్సైడ్‌) మోతాదు 415 పార్ట్స్‌ పర్‌ మిలియన్‌ (పీపీఎమ్‌)కు చేరుకుందంటే ప్రస్తుతం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. పారిశ్రామిక విప్లవానికి ముందున్న రోజుల్లో వాతావరణంలో కార్బన్‌ డయాక్సైడ్‌ పరిమాణం 280 పీపీఎమ్‌గా ఉండటం గమనార్హం.

పరిస్థితులు ఇంత తీవ్రంగా ఉన్నా పాలకులకు పట్టడం లేదు. ముంచుకొస్తున్న ముప్పును వారు గుర్తించడం లేదు. ఉదాసీనంగా వ్యవహరిస్తూ పరిస్థితి మరింత క్షీణించడానికి కారకులవుతున్నారు. దురదృష్టవశాత్తు వివిధ దేశాల ప్రభుత్వాలు వాతావరణ మార్పులు, పర్యావరణ సంక్షోభాన్ని సరిగ్గా అర్థం చేసుకోపోలేకపోతున్నాయి. వీటిపై పెద్దగా ఆసక్తిని చూపడం లేదు. వర్తక, వాణిజ్య సంస్థలు, రాజకీయ పార్టీలు వృద్ధిరేటుపై కనబరుస్తున్న శ్రద్ధలో ఇసుమంతైనా పర్యావరణంపై చూపడం లేదు. పర్యావరణపరమైన అలక్ష్యం సకల రంగాలనూ కుంగదీసి అంతిమంగా అభివృద్ధిని, జీడీపీ వృద్ధిరేటునూ ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయన్న స్పృహ కొరవడటమే ఇందుకు కారణం. ఇప్పటికైనా పర్యావరణ పరిరక్షణ, సంరక్షణ దిశగా ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, పౌరులు కర్తవ్యోన్ముఖం కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడిప్పుడే కొన్ని దేశాలు ఈ సమస్యపై దృష్టి సారిస్తున్నాయి. మిగిలిన దేశాలూ ఆ వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. వాతావరణంలో సంభవిస్తున్న అనూహ్య మార్పులు, భూతాపం పెరుగుదల వంటి పర్యావరణ దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమానికి ఆస్ట్రేలియాలోని డేర్బిన్‌ నగరంలో శ్రీకారం చుట్టారు. డేర్బిన్‌ నగర స్థానిక ప్రభుత్వం 2016 డిసెంబరులోనే అధికారికంగా ‘పర్యావరణ అత్యవసర పరిస్థితి’ని ప్రకటించింది. ‘పర్యావరణ అత్యవసర పరిస్థితి’ని ప్రకటించిన తొలి దేశంగా మాత్రం బ్రిటన్‌ చరిత్ర పుటలకెక్కింది. కిందటి నెల కెనడా పర్యావరణ ఆత్యయిక స్థితిని ప్రకటించింది. ఇప్పటివరకు 13 దేశాల్లోని 623 ప్రాంతాల పరిధిలో పర్యావరణ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. బ్రిటన్‌లో దాదాపు 53 శాతం, న్యూజిలాండ్‌లో 49 శాతం, కెనడాలో 32 శాతం జనావాస ప్రాంతాలు పర్యావరణ ‘ఎమర్జెన్సీ’ ప్రకటించి ఉద్గారాల నియంత్రణకు కార్యాచరణను ఉద్ధృతం చేసి స్ఫూర్తిదాయకంగా నిలిచాయి.

ప్రపంచానికే ఆదర్శంగా...
ఐరోపాలోని అనేక ప్రాంతాల్లో 16 ఏళ్ల గ్రెటాథెన్‌బర్గ్‌ అనే స్వీడన్‌ బాలిక సారథ్యంలో పాఠశాల విద్యార్థులు భారీయెత్తున పర్యావరణ పరిరక్షణోద్యమంలో భాగస్వాములవుతున్నారు. వారి ఉద్యమం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. ఆ ఉద్యమం మరెందరికో ఆదర్శప్రాయమై విద్యార్థుల కుటుంబ సభ్యులూ ఉద్యమంలో మమేకమవుతున్నారు. ఆసియాలోనూ బాలల పర్యావరణ ఉద్యమం క్రమంగా విస్తరిస్తోంది. భారత వాణిజ్య రాజధాని ముంబయిలో గత నెల విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని నినదిస్తూ భారీ ప్రదర్శన నిర్వహించారు. స్వీడన్‌ బాలిక పోరాటస్ఫూర్తితో వీరంతా ముందుకు కదిలారు. పర్యావరణ సంక్షోభ నియంత్రణలో ప్రభుత్వాల నిష్క్రియాపరత్వాన్ని ఎండగడుతూ స్వీడన్‌లో ప్రతి శుక్రవారం పాఠశాల విద్యార్థులు 2018 ఆగస్టునుంచి ప్రచారోద్యమం నిర్వహిస్తున్నారు. ఈ పోరాటాల స్ఫూర్తి సర్వత్రా విస్తరించాల్సిన అవసరం ఉంది.
తాజాగా జపాన్‌లోని ఒకాసాలో జరిగిన జి-20 దేశాల సదస్సు ప్యారిస్‌ వాతావరణ మార్పుల ఒప్పందాన్ని సంపూర్ణంగా అమలు చేయడానికి ముందుకొచ్చింది. కర్బన ఉద్గారాలు తగ్గించేందుకు ప్రతినబూనింది. 2015 డిసెంబరులో ప్యారిస్‌లో ఈ ఒప్పందం రూపుదిద్దుకుంది. ఈ ఒప్పందానికి సంబంధించి అమెరికా వైఖరి ప్రతికూలంగా ఉండటం గమనార్హం. తమ ప్రయోజనాలకు ప్యారిస్‌ ఒప్పందం విఘాతం కలిగిస్తోందంటూ అమెరికా గతంలోనే ఈ ఒప్పందం నుంచి వైదొలగింది. ఇప్పుడూ అవే కారణాలతో ఒప్పందానికి దూరంగా ఉంటోంది. పారిశ్రామికీకరణకు ముందున్న ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఈ శతాబ్దంలో ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల సెల్సియస్‌కు మించి పెరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్యారిస్‌ ఒప్పందం పేర్కొంటోంది.

సంస్కరణలు ఆవశ్యకం
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తాజా అధ్యయనాల ప్రకారం శిలాజ ఇంధనాలపై ఇస్తున్న రాయితీలు 2015లో నాలుగు లక్షల 70వేల కోట్ల డాలర్లు కాగా- 2017లో అవి అయిదు లక్షల 20వేల కోట్ల డాలర్లకు చేరుకున్నాయని అంచనా. ఇంధన ధరలకు సంబంధించి నిర్మాణాత్మక చర్యలు చేపడితే తప్ప కర్బన ఉద్గారాలకు కళ్ళెం వేయడం అసాధ్యం. భారత్‌లో ఏటా సగం దేశంలో కరవు కోరలు చాస్తోంది. ఇప్పటికీ ఏ ఒక్క రాష్ట్రంలోనూ కరవును సమర్థంగా ఎదుర్కొనే మెరుగైన కార్యాచరణ రూపుదాల్చలేదన్నది చేదు నిజం. పర్యావరణ సంక్షుభిత స్థితిలో దేశం కొట్టుమిట్టాడుతున్న సమయంలో సమూల సంస్కరణలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది. పర్యావరణ సంక్షోభాన్ని, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఏయే పంటలు వేస్తే గిట్టుబాటు అవుతుందో క్షేత్రస్థాయిలో శాస్త్రవేత్తలు అధ్యయనం చేయాలి. స్థానిక పర్యావరణ పరిస్థితులను తట్టుకునే విత్తనాలకు రూపకల్పన చేయడం అవసరం. విపత్తులు, కరవుకాటకాల సమయంలో హడావుడిగా తాత్కాలిక ఉపశమన చర్యలకు దిగడం కన్నా- దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి పెట్టడం మంచిది. నానాటికీ తీవ్రమవుతున్న నీటి కొరత దృష్ట్యా దేశవ్యాప్తంగా జలసంరక్షణ ఉద్యమాన్ని చేపట్టడం అవసరం. దేశ ప్రజలందరినీ ఈ క్రతువులో భాగస్వాములు చేయాలి. అప్పుడే సత్ఫలితాలు సాధ్యపడతాయి. విచక్షణారహితంగా సాగుతున్న అడవుల నరికివేతపై ‘మారటోరియం’ విధించాలి. దీనితోపాటు మొక్కల పెంపకాన్ని పెద్దయెత్తున చేపట్టాలి. వాటి సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలి. నీటి సరఫరాను హేతుబద్ధీకరించడం అవసరం. ఎక్కువ మొత్తంలో నీటిని వినియోగించే పంటలకు బదులుగా కరవుకాటకాలను తట్టుకునే వంగడాల అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలి. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి గ్రామీణ హామీ కార్యక్రమాన్ని కరవు ప్రాంతాల్లో ఏడాది పొడవునా కొనసాగించాలి. దేశంలో వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయనడానికి భీకర తుపానులు, వరదలు, పోటెత్తుతున్న కరవు, భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు, భూతాపమే నిదర్శనం. ప్రాణికోటికి ముప్పు వాటిల్లజేస్తున్న కర్బన ఉద్గారాలను పూర్తిగా నియంత్రించడమే లక్ష్యంగా పాలకులు పనిచేసినప్పుడే దేశ ఆర్థికం గాడినపడుతుంది!

 


Posted on 01-07-2019