Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


సైన్స్ & టెక్నాల‌జీ

రోద‌సిలో కాసుల వేట‌

* వినువీధుల్లో వాణిజ్యావకాశాలు
* సమీప భవిష్యత్తులో పర్యాటక యాత్రలు

అంతరిక్షం ఇంకెంత మాత్రం ప్రభుత్వాలు, సైన్యాలు, టెలికమ్యూనికేషన్‌ సంస్థల గుత్త సొత్తు కాదు. నేడు ప్రైవేటు కంపెనీలు కూడా రోదసిలో ప్రవేశించి కొత్త కొత్త వ్యాపారాలకు ద్వారాలు తెరిచే పనిలో పడ్డాయి. ఒకప్పుడు భూ పరిశీలనకు, ప్రయాణ మార్గ నిర్దేశానికి, ఉపగ్రహ ప్రయోగాలకు పరిమితమైన అంతరిక్ష కార్యకలాపాలు ఇకపై రోదసి పర్యాటకానికి, గ్రహ శకలాల్లో ఖనిజాల తవ్వకానికి విస్తరించనున్నాయి. 2016-2025 మధ్యకాలంలో ప్రపంచ దేశాలు మొత్తం 1,450 కొత్త ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించనున్నాయని, ఈ మార్కెట్‌ విలువ 25,000 కోట్ల డాలర్లని యూరోకన్సల్ట్‌ సంస్థ అంచనా. అంతరిక్ష సాంకేతికత విలువ రాగల 30 ఏళ్లలో 33,900 కోట్ల డాలర్ల నుంచి 2.7 లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతుందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా లెక్కగట్టింది. ఈ సాంకేతికత సృష్టి, వినియోగంలో 80 దేశాలు నిమగ్నమయ్యాయి. అంతరిక్షంలో అగ్రశ్రేణి దేశాల్లో భారత్‌ కూడా ఉంది. ప్రస్తుతం భూకక్ష్యలో పరిభ్రమిస్తున్న 1,950 ఉపగ్రహాల్లో 830 అమెరికాకు చెందినవైతే, 280 ఉపగ్రహాలతో చైనా, 147 ఉపగ్రహాలతో రష్యా తదుపరి స్థానాలను ఆక్రమిస్తున్నాయి. 54 ఉపగ్రహాలతో భారత్‌ ఏడో స్థానంలో నిలిచింది. పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ)తో ఉపగ్రహాల ప్రయోగంలో ఆరితేరిన భారత్‌- చంద్ర, కుజ గ్రహాల మీదకు రోదసి నౌకలను దిగ్విజయంగా పంపింది. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్దకు చంద్రయాన్‌-2 నౌకను పంపడానికి సమాయత్తమవుతోంది. ఈ ఘనతను సాధించే మొట్టమొదటి దేశం భారత్‌ అవుతుంది. 2022కల్లా తొలిసారిగా మానవ సహిత వ్యోమనౌకను అంతరిక్షంలోకి పంపుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు. 2019-20 బడ్జెట్‌లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు రికార్డు స్థాయిలో రూ.10,252 కోట్లు కేటాయించి రోదసిలో భావి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మోదీ సర్కారు సన్నద్ధమవుతోంది. ఇస్రో 2018 ఫిబ్రవరిలో ఒకేసారి 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టి అనితర సాధ్య విజయం సొంతం చేసుకుంది. ఈ ఏడాది చంద్రుడి మీదకు వ్యోమనౌకలను పంపనున్న ఇస్రో, ముగ్గురు భారతీయ వ్యోమగాములను రోదసిలోకి పంపి ఏడు రోజుల తరవాత భద్రంగా భూమికి తీసుకొచ్చే ‘గగన్‌ యాన్‌’ నౌక ప్రయోగానికి సిద్ధమవుతోంది. భారతదేశం ఇలా అమెరికా, రష్యా, చైనాలకు దీటుగా అంతరిక్ష కార్యకలాపాలు చేపడుతూ నవ యుగంలోకి సాహసోపేతంగా అడుగిడుతోంది. అంతరిక్ష అన్వేషణ కొత్త భావాలు, కొత్త వ్యాపార అవకాశాలు, కొత్త తరహా ఉద్యోగాలను సృష్టించి యువతరానికి ఉజ్వల భవిష్యత్తు అందిస్తుంది. ఆ కొత్త వ్యాపారాలేమిటో పరిశీలించడం ఆసక్తికరం.

అంతరిక్షానికి నిచ్చెన: బహుళ అంతస్తుల భవనాలకు వేసే లిఫ్ట్‌ల మాదిరిగా నింగిలోకీ లిఫ్ట్‌లు వేయవచ్చు. ఇప్పుడు మనుషులను, సామగ్రిని కక్ష్యలోకి తీసుకెళ్లాలంటే రాకెట్లే శరణ్యం. వీటిబదులు నేల నుంచి నింగిలో 62,000 మైళ్ల ఎత్తు వరకు లిఫ్ట్‌ వేస్తే పని సులువైపోతుంది. ఈ దిశగా లిఫ్ట్‌ పోర్ట్‌, సెడ్కో కంపెనీలు ప్రయోగాలు చేస్తున్నాయి. బిగెలో ఏరోస్పేస్‌, స్పేస్‌ ఐలండ్‌ గ్రూపులు అంతరిక్షంలో హోటళ్ల నిర్మాణానికీ ప్రయోగాలు చేపట్టాయి.
గ్రహశకలాల్లో ఖనిజ తవ్వకాలు: భూమికి సమీపంలో 3,000 గ్రహశకలాలపై బంగారం, వెండి, ప్లాటినం, నికెల్‌, కోబాల్ట్‌, ఇనుము, మెగ్నీషియం వంటి విలువైన ఖనిజాలు ఉన్నాయి. కొన్ని శకలాలపై ఐసుగడ్డలూ ఉన్నాయి. ఈ నీటిని ఆక్సిజన్‌, హైడ్రోజన్‌గా విభజించి కుజుడి మీదకు వెళ్లి వచ్చే రాకెట్లకు ఇంధనాన్ని, గ్రహశకల తవ్వకాల్లో నిమగ్నమైన కార్మికులు పీల్చడానికి గాలి, తాగడానికి నీరూ సరఫరా చేయవచ్చు. సౌర కుటుంబమంతటా ఇంధన సరఫరా కేంద్రాలను నెలకొల్పవచ్చు.
అంతరిక్షంలో కృత్రిమ చందమామలు: నగరాలకు రాత్రిపూట వెలుగు అందించేందుకు చైనాకు చెందిన టియాన్‌ ఫు న్యూ ఏరియా సైన్స్‌ సొసైటీ సిద్ధమవుతోంది. చెంగ్డూ నగరంపై రాత్రిపూట కాంతి పంచడానికి 2020లోనే ప్రత్యేక ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. 2022లో మరి మూడు కాంతిజనక ఉపగ్రహాలను పంపి నగరాల్లో రాత్రిళ్ళు వీధి దీపాల అవసరాన్ని తొలగించదలచింది. అవి 2000 నుంచి 4000 చదరపు మైళ్ల విస్తీర్ణంలో 24 గంటలపాటు కాంతిని ప్రసరించగలవు. చెంగ్డూ నగరంలో కేవలం 31 చదరపు మైళ్ల ప్రాంతంలో రాత్రి పూట కాంతిని ప్రసరిస్తే ఏటా 17.4 కోట్ల డాలర్లను ఆదా చేయవచ్చు.
ఇస్రో వాణిజ్య పథకాలు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కూడా అంతరిక్ష ఉత్పత్తులు, సేవల వాణిజ్యీకరణకు న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐఎల్‌) అనే సరికొత్త ప్రభుత్వరంగ సంస్థను నెలకొల్పింది. అంతరిక్ష కార్యకలాపాలను వ్యాపార ప్రాతిపదికపై చేపట్టి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)ని పెంచడానికి ఇస్రో వేసిన తొలి అడుగు ఇది. దీనికి ప్రభుత్వం కూడా చేయవలసింది చాలా ఉంది. గడచిన మూడు దశాబ్దాలుగా మన విద్యారంగం సాఫ్ట్‌వేర్‌పైనే దృష్టి కేంద్రీకరించింది. ఇకపై అంతరిక్ష పరిశోధనలకూ ప్రాధాన్యమివ్వడం ద్వారా లక్షలాది కొత్త ఉద్యోగాలు సృష్టించవచ్చు. అందుకోసం పాఠశాల స్థాయి మొదలు విశ్వవిద్యాలయ స్థాయి వరకు పాఠ్య ప్రణాళికల్లో అంతరిక్ష శాస్త్రాన్ని ముఖ్యాంశం చేయాలి. అంతరిక్ష పర్యాటకంపై అమెరికా, జపాన్‌లలో రెండు విశ్వవిద్యాలయాలు ఇప్పటికే ప్రత్యేక కోర్సులు బోధిస్తున్నాయి. భారతదేశమూ తక్షణ కార్యాచరణకు నడుంకట్టాలి.

అంతరిక్షానికి టికెట్‌ టికెట్‌...
భూకక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష వేదిక (ఐఎస్‌ఎస్‌)కు వెళ్లి రావడానికి ఎన్ని కోట్లయినా వెచ్చించడానికి అనేకమంది సంపన్నులు సిద్ధంగా ఉన్నారు. స్పేస్‌ ఎక్స్‌ రాకెట్‌లో ఒక టికెట్‌ ధర 5.2 కోట్ల డాటర్లు (రూ.364 కోట్లు) అట. 2020 సంవత్సరం నుంచే ప్రైవేటు వ్యోమగాములు 30 రోజులపాటు ఐఎస్‌ఎస్‌లో గడపడానికి యాత్రలు నిర్వహిస్తానని నాసా ప్రకటించింది. ప్రతి పర్యాటకుడు ఐఎస్‌ఎస్‌లో ఒక రాత్రి గడపడానికి 35,000 డాలర్లు (రూ. 2.45 కోట్లు) చెల్లించాల్సి ఉంటుంది. నాసా రాకెట్లపై పర్యాటకులు అంతరిక్షంలోకి వెళ్లడానికి ఉపకరించే పెట్టెల తయారీలో స్పేస్‌ ఎక్స్‌, బోయింగ్‌ కంపెనీలు నిమగ్నమై ఉన్నాయి. అమెజాన్‌కు చెందిన బ్లూ ఆరిజిన్‌, బ్రిటిష్‌ పారిశ్రామికవేత్త రిచర్డ్‌ బ్రాన్సన్‌ స్థాపించిన వర్జిన్‌ గెలాక్టిక్‌లు అంతరిక్ష పర్యాటకాన్ని పెద్దయెత్తున చేపట్టనున్నాయి. 2023కల్లా ఇద్దరు అంతరిక్ష పర్యాటకులను చంద్రుడి చుట్టూ తిప్పి భూమికి తిరిగి తీసుకురావడానికి స్పేస్‌ ఎక్స్‌ ప్రయత్నాలు ప్రారంభించింది.

ఆకాశంలో ప్రకటనలు
రష్యాలో స్టార్ట్‌ రాకెట్‌ అనే అంకుర పరిశ్రమ మదిలో మెరిసిన ఆలోచన ఇది. కేవలం రూ.50 లక్షలతో క్యూబ్‌ శాట్స్‌ అనే మినీ ఉపగ్రహాలు నిర్మించి అంతరిక్షంలోకి ప్రయోగించాలని ఈ సంస్థ ప్రతిపాదిస్తోంది. లక్షా నలభై వేల రూపాయల రుసుముపై ఈ ఉపగ్రహాలు నింగిలో వాణిజ్య ప్రకటనలు, ప్రచార చిత్రాలను ప్రసరించగలవు. పెప్సికో పానీయం ఎడ్రెనలిన్‌ రష్‌ ప్రకటనల కోసం స్టార్ట్‌ రాకెట్‌ కంపెనీతో ఒప్పందం కుదిరింది కూడా. 2021లోనే ఈ పానీయ ప్రకటన వినీలాకాశంలో మెరవబోతోంది.

కుజ గ్రహ అన్వేషణ
ఇప్పటివరకు కుజ గ్రహం వద్దకు రాకెట్లను పంపాం. కుజ కక్ష్యలో నౌకలు తిప్పాం. కుజుడి మీద సంచార-అన్వేషక వాహనాలు దింపాం. ఇక 2030కల్లా కుజుడి మీద మనుషులను దింపడానికి అమెరికా నడుం బిగించింది. భవిష్యత్తులో ఆ గ్రహం మీద మానవ నివాసాలనూ ఏర్పాటు చేయాలనుకొంటున్నారు. బోయింగ్‌, లాకీడ్‌ మార్టిన్‌, నాసా సంస్థలు ఈ దిశగా ప్రయోగాలు మొదలుపెట్టాయి. ఇదంతా 40,000 కోట్ల డాలర్ల వ్యాపార ఒప్పందాలకు దారితీయవచ్చు.

చంద్ర మండల యాత్రలు, గనుల కాలనీలు
చంద్రుడి మీద 2025కల్లా మానవ ఆవాసాలు (కాలనీలు) నెలకొంటాయని కొందరి అంచనా. ఇంధనంగా ఉపయోగపడే హీలియం-3 నిల్వలు 11 లక్షల టన్నుల వరకు చంద్రుడి మీద ఉన్నాయి. వీటిని ఉపయోగించి అణు సంలీన (ఫ్యూజన్‌) రియాక్టర్లలో రేడియో ధార్మికత ప్రమాదం లేకుండా విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయవచ్చు. భూమి మీద ఒక టన్ను హీలియం-3 విలువ రూ.49,000 కోట్లు. 2025 నుంచే ఈ ఇంధన నిక్షేపాల కోసం చంద్రుడి మీద తవ్వకాలు ప్రారంభించడానికి అమెరికా, రష్యాలు పోటీపడుతున్నాయి. ఇదే ఇంధనం సాయంతో చంద్రుడి నుంచి కుజ గ్రహానికి సులువుగా యాత్రలు జరపవచ్చని నాసా భావిస్తోంది. కాబట్టి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు త్వరలోనే చందమామ మీద హీలియం-3 తవ్వకానికి కాలనీలు నెలకొల్పనున్నాయి.
సౌరశక్తి ఉత్పాదక ఉపగ్రహాలు: కక్ష్యలో బృహత్తర సౌర ఫలకాలను ఏర్పాటు చేసి అవి సంగ్రహించే సౌరశక్తిని భూమి మీద నెలకొల్పే మైక్రోవేవ్‌ రిసీవర్లకు ప్రసారం చేయవచ్చు. ఆ రిసీవర్లు గృహాలకు, పరిశ్రమలకు సౌర విద్యుత్తును సరఫరా చేస్తాయి. ఈ విధంగా యావత్‌ భూగోళ విద్యుత్‌ అవసరాలను తీర్చవచ్చు. ఉపగ్రహాలకు సౌర శక్తి ఇంజిన్లను అమర్చడానికి అమెరికా ప్రయోగాలు చేస్తోంది. ఐరోపా, జపాన్‌ అంతరిక్ష సంస్థలతోపాటు స్పేస్‌ ఐలండ్‌ గ్రూప్‌ అనే సంస్థ కూడా అంతరిక్షంలో సౌర శక్తిని ఒడిసిపట్టే ప్రయత్నాల్లో ఉన్నాయి.

కర్మాగారాలు, ప్రయోగశాలలు
కంప్యూటర్‌ చిప్‌లు, బయోటెక్నాలజీ ఉత్పత్తుల తయారీకి అంతరిక్షంలోని భార రహిత స్థితి ఎంతో అనువైనది. అందుకే అక్కడ మున్ముందు ప్రయోగశాలలు, కర్మాగారాలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వీటి నిర్వహణకు సమాచార సాంకేతిక వ్యవస్థలు, కృత్రిమ మేధ, స్వయంచాలిత యంత్రాలు, రోబోలు అవసరమవుతాయి. కైజర్‌ త్రెడ్‌, స్పేస్‌ ఐలండ్‌ కంపెనీలు ఇప్పటికే ఈ పనిలో నిమగ్నమయ్యాయి. అంతరిక్ష నౌకలను నడిపే సౌర తెరచాపలు సూర్యుడి నుంచి వెలువడే ఫోటాన్‌ కణాలను సౌర ఫలకాల తెరచాపపైకి కేంద్రీకృతంగా ప్రసరింపజేస్తే ఒత్తిడి పుట్టి అంతరిక్ష నౌకను ముందుకు నెడుతుంది. ఆ నౌక రాకెట్‌ ఇంజిన్ల మాదిరి ఉన్నపళాన వేగంగా దూసుకెళ్లకపోయినా, క్రమక్రమంగా ఊపందుకొంటుంది. ఉదాహరణకు సౌర తెరచాపను అమర్చిన అంతరిక్ష నౌక మొదటి రోజు గంటకు 100 మీటర్ల వేగంతో ప్రారంభించినా 12 రోజుల తరవాత 2,300 మీటర్ల వేగాన్ని అందుకోవచ్చు. ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ), కైజర్‌ త్రెడ్‌, ఎల్‌ గార్డ్‌, ప్లానెటరీ సొసైటీ, స్పేస్‌ సర్వీసెస్‌ సంస్థలు సౌర తెరచాప నౌకల తయారీపై ప్రయోగాలు చేస్తున్నాయి.

 

- డాక్టర్‌ కె.బాలాజీ రెడ్డి
Posted on 14-07-2019