Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


సైన్స్ & టెక్నాల‌జీ

జాబిలి యాత్రలో తొలి మజిలీ

భారత రోదసి శోధన చరిత్రలో కళ్లు మిరుమిట్లు గొలిపే మహాద్భుత ప్రకరణమిది. పదకొండేళ్ల విరామానంతరం రెండోదఫా చంద్రమండల యాత్ర స్వప్నాన్ని సాకారంచేసే కృషిలో ‘ఇస్రో’ ధీమాగా ముందడుగు వేసింది. వారం క్రితమే జరగాల్సిఉన్న కీలక అంతరిక్ష ప్రయోగం సాంకేతిక సమస్యతో చివరి దశలో వాయిదా పడగా, శాస్త్రవేత్తల రెట్టించిన పట్టుదలతో ‘బాహుబలి’ జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3 ఎమ్‌1 వాహక నౌక చంద్రయాన్‌-2 ఉపగ్రహాన్ని నిన్న విజయవంతంగా నింగిలోకి మోసుకుపోయింది. అయిదు రోజుల తరవాత భూ నియంత్రిత కక్ష్యలోకి ఉపగ్రహం ప్రవేశించాక మూడు లక్షల 84వేల కిలోమీటర్లకుపైగా దూరాన ఉన్న చంద్రుడి దక్షిణధ్రువ ప్రాంతాన జెండా పాతడమన్నది ఈ భూరి కసరత్తులో అత్యంత సంక్లిష్ట ఘట్టం. జాబిలివైపు వెళ్లేందుకు చంద్రయాన్‌-2 తొలుత తన కక్ష్యను పెంచుకోవడం, చందమామకు దగ్గరయ్యాక వ్యోమనౌకలోని రాకెట్లు క్రమపద్ధతిలో మండుతూ వేగనియంత్రణ పాటించడం- తు.చ. తప్పకుండా సాధ్యపడితే సెప్టెంబరు ఏడో తేదీన ఇండియాకు విశేష ఘనత దఖలుపడుతుంది. నిర్దుష్ట అంచనాలతో ఈ తరహా ప్రయోగం చేసిన నాలుగో దేశంగా అమెరికా, రష్యా, చైనాల సరసన నిలువనున్న భారత్‌- చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో వ్యోమనౌక దింపిన మొట్టమొదటి దేశంగా అద్వితీయ రికార్డునూ సొంతం చేసుకోనుంది. సాంకేతికంగా ఇది చంద్రయాన్‌-1కి కొనసాగింపే అయినా, అప్పట్లో పరిశోధన జాబిలి కక్ష్యకే పరిమితమైంది. ఇప్పుడు చంద్రయాన్‌-2 తనతోపాటు తోడ్కొని వెళ్లిన విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌ చంద్రుడిపై మృదువుగా దిగుతాయంటున్నారు. గతంలో అక్కడ నీటిఉనికి ఒక్కటే వెలుగుచూసింది; తాజా ప్రయోగం ద్వారా చంద్రుడు, భూమి, సౌర కుటుంబం పుట్టుక, పరిణామ క్రమానికి సంబంధించిన గుట్టుమట్లు ఎన్నింటినో రాబట్టగల వీలుంది. భవిష్యత్తులో చంద్రుడిపై ఆవాసం గురించీ కొంత స్పష్టత రావచ్చు. ఇంతటి విశేష ప్రభావాన్విత ప్రయోగం కనుకనే, ప్రధాని మోదీ సంబరంగా స్పందించినట్లు- ‘ఇవి ప్రతి భారతీయుడి గుండే గర్వంతో ఉప్పొంగే చిరస్మరణీయ క్షణాలు’!

వేల సంవత్సరాలుగా మనిషిని అబ్బురపరుస్తూ దేశదేశాల జానపద గాథల్లో, బాలల గేయాల్లో ఒద్దిగ్గా ఒదిగిపోయిన అందమైన చందమామపై ఇప్పటికే ఎన్నో పరిశోధనలు చోటుచేసుకున్నాయి. 1959-72 సంవత్సరాల మధ్య అమెరికా, సోవియెట్‌ రష్యాల స్పర్ధ చంద్రమండలానికీ విస్తరించింది. తెలిసిందే. యాభై ఏళ్ల క్రితం 1969లో నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ బృందం చంద్రుడిపై అడుగిడినప్పుడు, అంతరిక్షంలో భూగోళానికి సమీప బంధువుతో ఆత్మీయ వారధి నిర్మితమైనట్లుగా మానవాళిలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. 1983నాటికి గాని రోదసి ప్రయోగ కార్యక్రమం వ్యవస్థీకృతం కాని భారత్‌ ఒకటిన్నర దశాబ్దాల క్రితం చంద్రయానం పట్ల ఆసక్తి వ్యక్తపరచినా- 2008 సంవత్సరం దాకా అది వట్టి కలగానే మిగిలిపోయింది. రెండేళ్లు పనిచేసేలా రూ.386 కోట్ల వ్యయంతో రూపొందించిన చంద్రయాన్‌-1 ఉపగ్రహం కథ పది నెలలకే అర్ధాంతరంగా ముగిసిపోయింది. టైటానియం, యురేనియం, థోరియం వంటి విలువైన ఖనిజ నిక్షేపాల ఆనుపానులు పట్టిచ్చేదిగా అప్పట్లో అమితాసక్తి రేపిన చంద్రయాన్‌-1 వ్యోమనౌకలోని ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థలో అనూహ్యంగా ఇబ్బందులు తలెత్తాయి. ఆ చేదు అనుభవం నుంచి గుణపాఠాలు నేర్చి రాటుతేలిన ‘ఇస్రో’ శాస్త్రవేత్తల బృందం- ఈసారి చంద్రుడి చుట్టూ పరిభ్రమించే ఆర్బిటర్‌, దాని నుంచి విడివడి జాబిలి ఉపరితలంపై దిగాల్సిన ల్యాండర్‌, రోవర్‌ల రూపకల్పనలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. అన్నీ అనుకున్నట్లే జరిగి చందమామపై నీరు, ఖనిజాలు, రాతి నిర్మాణాలకు సంబంధించి లోతైన పరిశోధనల ఫలితాలు వెల్లడైతే- భారత మేధకు పదునుపెట్టిన సాహసోపేత రోదసి విన్యాసం సంపూర్ణంగా సార్థకమవుతుంది!

అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న 110 గ్రాముల పరికరం నిర్ధారిత గడువుకు ముందే చంద్రయాన్‌-1 గాడి తప్పడానికి కారణమైందని నిగ్గుతేలడం, చంద్రయాన్‌-2కి అవసరమైనవన్నీ దేశీయంగానే తయారుచేయాలన్న విధాన నిర్ణయానికి దారి తీసింది. అందువల్ల ఖర్చు బాగా తగ్గింది. 15 అపోలో ప్రయోగాలకు అమెరికా వ్యయపద్దు రెండున్నర వేలకోట్ల డాలర్లకు (ప్రస్తుత మారకం రేటు ప్రకారం, లక్షా 75 వేలకోట్ల రూపాయలకు)పైబడింది. ఇటీవల ప్రయోగించిన చాంగే 4 కోసం చైనా వెచ్చించింది 840 కోట్ల డాలర్లు (సుమారు రూ.58,800 కోట్లు). చంద్రయాన్‌-2 నిమిత్తం అయిన ఖర్చు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలంటే- చౌకలో, శాస్త్రీయంగా మరెవరికీ తీసిపోని కచ్చితత్వంతో భారతీయ శాస్త్రజ్ఞుల అమేయ ప్రజ్ఞాపాటవాలు ఎవరినైనా అబ్బురపరచేవే. ఉపగ్రహాల నిర్మాణం, ట్రాన్స్‌పాండర్లూ వాహక నౌకల రూపకల్పన పరిజ్ఞానంలో మేటిగా ఎదిగిన ఇండియా చంద్రుడి అన్వేషణలోనూ తనదైన ముద్ర వేయడం ఆసేతుహిమాచలం అమందానందదాయకం! వరసగా రెండు వారాలు చీకటి, రెండు వారాలు వెలుతురు ఉండే జాబిలి ఆనుపానులు ఆకళించుకున్నాక- రష్యా, అమెరికా, చైనాల తరవాత మానవ సహిత అంతరిక్ష ప్రయోగాల్లో నాలుగో దేశంగా ఇండియాను నిలబెట్టడానికి ‘ఇస్రో’ ప్రణాళికలు రచిస్తోంది. అంగారక యాత్రలో ‘మంగళ్‌యాన్‌’ ద్వారా ప్రథమయత్నంలో గెలుపొందినట్లే, ‘గగన్‌యాన్‌’ పేరిట 2022 నాటికి ముగ్గురు వ్యోమగాముల్ని రోదసిలోకి పంపాలనీ లక్షిస్తోంది. ‘మన శాస్త్రవేత్తల సృజనాత్మకత విశ్వవ్యాప్తంగా భారత కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింపజేస్తోంది’ అని మోదీ ప్రభుత్వం సగర్వంగా ప్రకటించింది. అది సమధిక కేటాయింపులతో ‘ఇస్రో’కు ఉత్సాహపు ఊపిరులూదితే- సంపూర్ణ దేశవాళీ పరిజ్ఞానంతో మరిన్ని ఘనవిజయాలకు అంతరిక్షమే బృహత్‌ వేదిక కానుంది!

 


Posted on 23-07-2019