Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


సైన్స్ & టెక్నాల‌జీ

అభివృద్ధికి వెన్నెల గొడుగు

* బహుళ ప్రయోజనాల చంద్రయాన్‌-2

దేశాన్ని పీడిస్తున్న ఆకలి, నిరుద్యోగం, రోగ బాధలను పరిష్కరించాల్సిందిపోయి, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని చంద్రయాన్‌, మంగళ్‌యాన్‌ వంటి అంతరిక్ష ప్రయోగాలకు ధారపోయడమెందుకు, దాని వల్ల ప్రయోజనమేమిటని కొంతమంది ప్రశ్నించవచ్చు. శాస్త్రసాంకేతిక పరిశోధనల వల్ల తక్షణ ప్రయోజనం ఉండకపోవచ్చు. కానీ, ఆ పరిశోధనలపై భౌతిక, మేధాపరమైన వనరులను ఇప్పటినుంచే పెట్టుబడిగా పెట్టకపోతే మనకు భవిష్యత్తూ ఉండదు. అంతెందుకు, అంతరిక్ష పరిశ్రమ ఫలాలను మనం వర్తమానంలోనే వినియోగించుకొంటున్నాం. ఇప్పుడు జీపీఎస్‌ ద్వారా ఏదైనా చిరునామా వెతుక్కోవాలన్నా, ఏటీఎం నుంచి నగదు తీయాలన్నా, తాజా వాతావరణ అంచనాలను తెలుసుకోవాలన్నా, మిత్రులకు చరవాణిలో సంక్షిప్త సందేశాలు పంపాలన్నా అంతరిక్షంలో తిరిగే ఉపగ్రహం లేకుండా పని జరగదు. రోదసిలో ఏర్పరచుకున్న మౌలిక వసతుల వల్ల డిజిటల్‌ విప్లవం ఊపందుకొంది. ఖనిజ వనరుల అన్వేషణ, సముద్ర పరిశోధన సులభమయ్యాయి. దేశం ఆర్థికంగా ముందంజ వేస్తూ కొత్త ఉపాధి అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. అమెరికా ఇంతవరకు 2,500 కోట్ల డాలర్లు (ఇప్పటి విలువలో 10,000 కోట్ల డాలర్లు) వెచ్చించి, 15 అపోలో యాత్రలు నిర్వహించింది. నీల్‌ ఆర్మ్‌ స్ట్రాంగ్‌ తదితర వ్యోమగాములను చంద్రుడిపై దింపిన ఆరు యాత్రలు వీటిలో ఉన్నాయి. 2017లో చైనా 840 కోట్ల డాలర్లు వెచ్చించి చాంగీ నౌకను చంద్రుడి మీద దింపింది. 1960లు, 70లలో రష్యా 2,000 కోట్ల డాలర్ల వ్యయంతో అనేకసార్లు మానవ రహిత వ్యోమనౌకలను చంద్రుడిపైకి పంపింది. కానీ, భారతదేశం కేవలం 14 కోట్ల డాలర్ల వ్యయంతో చంద్రయాన్‌-2ను ప్రయోగించడం నిజంగా అద్భుతం. గడచిన 50 ఏళ్లలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిర్వహించిన ప్రయోగాలు, దేశ ఆర్థికాభివృద్ధికి కీలకమైన విద్య, టెలీమెడిసిన్‌, కమ్యూనికేషన్లు, వ్యవసాయం, వాతావరణ పరిశోధన రంగాల్లో పురోగతికి తోడ్పడ్డాయి. దీంతోపాటు ఇతర దేశాలకూ అంతరిక్ష సేవలు అందించి రూ.421 కోట్ల విదేశ మారక ద్రవ్యాన్ని ఆర్జించింది.

దేశాల పరుగు పందెం
ప్రస్తుతం వివిధ దేశాలు రెండు కారణాల వల్ల అంతరిక్షంపై దృష్టి కేంద్రీకరించాయి. అవి- పరిశోధన, అభివృద్ధి. వీటిలో ఒకటి లేనిదే రెండోది లేదు. అదే సమయంలో అభివృద్ధి అన్ని దేశాల మధ్య పోటీ పెంచుతుంది. అభివృద్ధి సాధనకు వనరులు కావాలి. చంద్ర, కుజ గ్రహాల మీద ఉన్న అమూల్య ఖనిజ, ఇంధన వనరులను వాణిజ్య ప్రాతిపదికన ఉపయోగించుకునే దేశాలు ప్రగతి పరుగు పందెంలో అగ్రగాములవుతాయి. ఈ రేసులో ముందువరసలో నిలవడానికి భారత్‌ చంద్రుడిపై ఉన్న హీలియం 3 నిక్షేపాల కోసం పోటీ పడుతోంది. చంద్రుడిపై దాగిన అమూల్యమైన హీలియం 3 నిక్షేపాలను వెలికితీయడం ద్వారా ఆర్థికంగా కొత్త శిఖరాలకు ఎదగడానికి సమాయత్తమవుతోంది. హీలియం 3 అన్వేషణ చంద్రయాన్‌ 2 ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. హీలియం 3 సౌర వాయువుల్లో ఉంటుంది. ఆ వాయువులు భూమ్యోపరితలాన్ని తాకకుండా అయస్కాంత క్షేత్రం అడ్డుకొంటుంది. చంద్రుడిపై వాతావరణం ఉండదు కనుక హీలియం 3 నేరుగా చంద్రోపరితలాన్ని చేరుకుని అక్కడి మట్టిలో కలిసిపోతుంది. చంద్రుడిపై నేలకు కొద్ది కిలోమీటర్ల లోతులోనే 11 లక్షల టన్నుల హీలియం 3 నిక్షేపాలున్నట్లు అంచనా. చంద్రుడిపై మట్టిని 600 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలో వేడి చేస్తే హీలియం 3 విడుదల అవుతుంది. దాన్ని భూమికి తీసుకొచ్చి అణు సంయోగ (ఫ్యూజన్‌) రియాక్టర్లలో ఇంధనంగా ఉపయోగించి కారు చౌకగా విద్యుచ్ఛక్తి ఉత్పత్తి చేయవచ్చు. భావి చంద్రయాన్‌ ప్రయోగాలు ఇందుకు బాట వేయబోతున్నాయి.

హీలియం 3 ఐసోటోప్‌ యావత్‌ ప్రపంచ ఇంధన అవసరాలను దాదాపు 10 వేల సంవత్సరాల పాటు తీర్చగలదని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. కేవలం 40 టన్నుల హీలియం 3 అగ్రరాజ్యం అమెరికా విద్యుత్‌ గిరాకీని ఏడాదిపాటు తీర్చగలదు. ఈ లెక్కన ఒక్క టన్ను హీలియం 3 విలువ 700 కోట్ల డాలర్లు (రూ.49,000కోట్లు) అన్నమాట. చంద్రుడి మీదున్న మొత్తం 11 లక్షల టన్నుల హీలియం 3 విలువ కొన్ని లక్షల కోట్ల డాలర్లు ఉంటుంది. అక్కడి నుంచి హీలియం 3ని భూమికి తెచ్చి విక్రయించే దేశం ఆర్థికంగా అన్ని దేశాలనూ శాసించగలుగుతుంది. దీన్ని గ్రహించిన భారతదేశం హీలియం 3 విషయంలో స్వావలంబన సాధించాలని ఆశిస్తోంది.

చైనా చంద్రుడి మీద దింపిన చాంగి వ్యోమ నౌక హీలియం 3పై ఇప్పటికే ప్రయోగాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. చంద్రుడిపై భవిష్యత్తులో ఏర్పరచే మానవ ఆవాసాల ఇంధన అవసరాలను తీర్చడానికి హీలియం 3 నిక్షేపాలను ఉపయోగించుకునే విషయమై పరిశోధనలు జరపాలని ఐరోపా అంతరిక్ష పరిశోధన సంస్థ (ఈఎస్‌ఏ) పలు ప్రైవేటు కంపెనీలను పురమాయించింది. అమెరికా, రష్యాలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. 2025కల్లా చంద్రుడి మీద తవ్వకాలు చేపట్టాలని ఐరోపా శాస్త్రవేత్తలు తలపెట్టారు. అదే జరిగితే ప్రపంచంలో అందరికన్నా ముందు ఈ ఘనత సాధించినది ఐరోపా ఖండమే అవుతుంది. చంద్రుడిలోని హీలియం 3 నిక్షేపాల్లో 25 శాతాన్ని మాత్రమే భూమికి తీసుకురాగలుగుతామని కొందరు శాస్త్రవేత్తల అంచనా. ఆ మాత్రం నిక్షేపాలతోనే వందల సంవత్సరాల పాటు ఇంధన అవసరాలు తీర్చుకోవచ్చు. ఫ్యూజన్‌ రియాక్టర్లలో కాలుష్య రహితంగా విద్యుదుత్పాదన చేయవచ్చు. అది భూతాపాన్ని తగ్గించి పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది.

హీలియం 3 వైద్యరంగంలోనూ ఎంతో అక్కరకొస్తోంది. ఉబ్బసం, సిస్టిక్‌ ఫైబ్రోసిస్‌ వంటి శ్వాసకోశ వ్యాధుల నిర్ధారణకు ఊపిరితిత్తుల స్కానింగ్‌ చిత్రాలు తీయడానికి హీలియం 3 ఉపకరిస్తుంది. మొత్తం శరీరాన్ని చిత్రించే ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌లలోనూ హీలియం 3ని ఉపయోగించవచ్చు. కానీ, భూమి మీద ఈ ఐసోటోప్‌ చాలా అరుదు. హైడ్రొజన్‌ బాంబుల్లో ఉపయోగించే ట్రిటియం క్షయీకరణ నుంచి పుట్టే హీలియం 3 ఒక్కటే శరణ్యంగా ఉండేది. 2000వ దశకంలో అమెరికా, రష్యాలు వేలాది హైడ్రొజన్‌ బాంబులను నిర్వీర్యం చేశాయి. ఆ ప్రక్రియలో లభ్యమైన హీలియం 3ని ఇంతవరకు వైద్య ప్రయోజనాలకు వినియోగిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ నిల్వలూ ఖాళీ అయిపోతున్నాయి. కాబట్టి చంద్రుడి మీద నుంచి హీలియం 3ని తీసుకురాక తప్పదు. ఇంకా చంద్రుడి మీద ఉన్న జలవనరులూ మానవ నివాసాలకు కీలకం కానున్నాయి. ఏతావతా కుజుడు ఇతర గ్రహాలకు వెళ్లే నౌకలకు చంద్రుడు ఇంధన, జలసరఫరా కేంద్రంగా అవతరిస్తుంది. సౌర కుటుంబంలో మానవుడి విస్తరణకు తొలి మెట్టు అవుతుంది. ఆ ఉజ్వల భవితవ్యంలోకి భారతదేశం చంద్రయాన్‌, మంగళ్‌ యాన్‌లతో సాహసికంగా ముందడుగు వేస్తోంది.

దాహార్తి తీర్చే జాబిలి
చెన్నై జల సంక్షోభం వంటివి తీర్చడానికీ అంతరిక్ష ప్రయోగాలు తోడ్పడి ప్రజా శ్రేయస్సుకు భరోసా ఇస్తాయి. ప్రస్తుతం చెన్నై తాగునీటి అవసరాలను తీర్చడానికి కొన్ని నిర్లవణీకరణ కర్మాగారాలను నెలకొల్పినా, సముద్ర జల శుద్ధికి ఇంధనంపై భారీ వ్యయం చేయాల్సి వస్తోంది. విరివిగా నిర్లవణీకరణ చేపట్టాలంటే అడ్డుపడుతున్న అంశమిదే. చంద్రుడి మీద నుంచి హీలియం 3 నిక్షేపాలను భూమికి తీసుకొచ్చి అణు సంయోగ ప్రక్రియ ద్వారా చౌకగా సముద్ర జలాన్ని తాగునీరుగా మార్చి నీటికరవును అధిగమించవచ్చు. ఈ ప్రక్రియ వల్ల రేడియో ధార్మికత వెలువడదు కాబట్టి పర్యావరణానికీ ఎంతో హితమైనది.

ఇస్రో విజయ పరంపర
భూమికి దిగివస్తే దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘ (సార్క్‌) సభ్యదేశాలకు సాంకేతిక సేవలు అందించి రాజకీయ నాయకత్వం వహించడానికీ భారత్‌కు అంతరిక్షం తోడ్పడుతోంది. దక్షిణాసియా సామాజిక-ఆర్థిక అభివృద్ధి కోసమే ప్రత్యేకంగా ఓ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తానని భారత్‌ ఇటీవల ప్రతిపాదించింది. దీనివల్ల దక్షిణాసియా దేశాల సుహృద్భావాన్ని చూరగొని ఈ ప్రాంతంలో భావి భద్రత అవసరాలకు పూచీకత్తు వహించగలుగుతుంది. ఇస్రో 1969లో ప్రారంభమైనప్పటి నుంచి భారతదేశాన్ని అంతరిక్ష ప్రయోగాల్లో మున్ముందుకు తీసుకెళ్తోంది. 2015-2018 మధ్య విదేశాల కోసం ఉపగ్రహాల ప్రయోగంతోపాటు స్వదేశంలో అంతరిక్షం ద్వారా కమ్యూనికేషన్‌ సేవలు అందించడం, భూ పరిశీలన వంటి కార్యకలాపాల ద్వారా రూ.5,600 కోట్లు ఆర్జించింది. కేవలం ఒక హాలీవుడ్‌ సినిమా బడ్జెట్‌ కన్నా తక్కువ వ్యయంతో కుజగ్రహం వద్దకు మంగళ్‌యాన్‌ చేపట్టి అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంది. ఇంకా 2018 ఫిబ్రవరిలో ఒకే వాహక నౌక ద్వారా 104 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టి అనితరసాధ్య రికార్డును సాధించింది. ఒకే నౌకతో 37 ఉపగ్రహాలను ప్రయోగించడం పాత రికార్డు. 2019 ఏప్రిల్‌లో ఇస్రో పీఎస్‌ఎల్వీ రాకెట్‌ ద్వారా ఎమ్శాట్‌, మరి 28 అంతర్జాతీయ ఉపగ్రహాలను ప్రయోగించింది. 2022లో భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడానికి ఇస్రో నడుంకట్టింది. ముగ్గురు వ్యోమగాములను రోదసిలోకి తీసుకెళ్లి, తిరిగి భూమి మీదకు తీసుకురావడానికి 3.7 టన్నుల గగన్‌యాన్‌ నౌకను సిద్ధం చేస్తోంది. ఈ ఏడు రోజుల యాత్ర విజయవంతం కాగానే భూకక్ష్యలోకి సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని పంపి దీర్ఘకాలం నిర్వహించాలని భారత్‌ లక్షిస్తోంది. అంతరిక్ష రంగంలో భారత్‌ సాధిస్తున్న విజయాలు మన బాలలకు, యువతరానికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. సైన్స్‌, ఇంజినీరింగ్‌ చదువుల్లో రాణించి తామూ రోదసిలో విజయ పతాక ఎగురవేయాలనే సంకల్పాన్ని బాలలకు కలిగిస్తున్నాయి.

 

- డాక్టర్‌ కె.బాలాజీరెడ్డి
Posted on 24-07-2019