Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


సైన్స్ & టెక్నాల‌జీ

వినువీధుల్లో వ్యర్థాలు

* అంతరిక్షంలో పెరిగిపోతున్న శకలాలు

మానవాళి అభివృద్ధి దిశగా ఎంతగా పరుగుతీస్తున్నా, ఆ కార్యకలాపాలవల్ల తలెత్తే సవాళ్లనూ అదే స్థాయిలో ఎదుర్కొనక తప్పడంలేదు. భూమిమీదే కాదు, రోదసిలోనూ అదే పరిస్థితి ఉంది. వాతావరణంలో పెరుగుతున్న కార్బన్‌ డయాక్సైడ్‌, మహాసముద్రాల ఆమ్లీకరణ, ఉష్ణమండల ప్రాంతాల్లో అడవుల ధ్వంసం వంటి పర్యావరణ విపరిణామాల మాదిరిగానే అంతరిక్షంలో వ్యర్థాలు పెరిగిపోతూ ఆందోళన కలిగిస్తున్నాయి. అంతరిక్ష పరిశోధనలో భాగంగా 1957లో మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం ‘స్పుత్నిక్‌-1’తో మొదలైన యాత్రను విజయవంతంగా కొనసాగిస్తూ ఇప్పటివరకు ఎన్నో వేల ఉపగ్రహాలను రోదసిలోకి పంపారు. ఈ ప్రయోగాల ఫలితంగా మానవాళికి ఎంతో మేలు ఒనగూరినా, ఇవి సృష్టించే శిథిలాలవల్ల సమీప భవిష్యత్తులో తీవ్ర నష్టమూ వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతరిక్షంలో లక్షల సంఖ్యలో పేరుకుపోయిన శిథిలాల వల్ల కొత్తగా ప్రయోగించే ఉపగ్రహాలకు, ఏర్పాటు చేయనున్న స్పేస్‌ స్టేషన్లకు, అంతరిక్షయానానికి ముప్పు వాటిల్లనుందని ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొన్న శాస్త్రవేత్తలు స్పష్టీకరించారు. ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ) అంచనా ప్రకారం అంతరిక్షంలో 8,400 టన్నులకు పైగా శిథిలాలు భూ కక్ష్యలో పేరుకుపోయాయి. దీని పరిష్కారానికి బలమైన అంతర్జాతీయ సహకారం అవసరమని ఈఎస్‌ఏ చెబుతోంది.

సున్నితమైన అంతరిక్ష క్షేత్రంలో శిథిలాల సమస్య అన్ని దేశాలకూ పెద్ద సవాలుగా మారిందని ఐక్యరాజ్య సమితి అంతరిక్ష వ్యవహారాల విభాగం సైతం ఆందోళన వ్యక్తం చేసింది. రోదసిలో ఉపగ్రహాల జీవిత కాలం ముగిసిన తరవాత నిరుపయోగంగా కక్ష్యలో తిరుగుతుంటాయి. కొన్నిసార్లు అవి ఇతర వ్యర్థాలను ఢీకొని చిన్న శకలాలుగా మారుతున్నాయి. ప్రయోగదశల్లో విడిపోయే వివిధ భాగాలు కూడా అంతరిక్షంలోనే ఉన్నాయి. 1957 నుంచి ఇప్పటివరకు మొత్తం 8,950 ఉపగ్రహాలను ప్రయోగించారు. వీటి కారణంగా ఒక సెం.మీ. నుంచి 10 సెం.మీ. వరకు ఉన్న వ్యర్థ వస్తువులు దాదాపు తొమ్మిది లక్షల వరకు ఏర్పడ్డాయి. అంతకంటే పెద్ద పరిమాణంలో గల వ్యర్థాలు 34 వేలకు పైగా రోదసిలో పోగుపడ్డాయి. వాటిలో చాలావరకు అమెరికా అంతరిక్ష నిఘా కేంద్రం (స్పేస్‌ సర్వైలైన్స్‌ నెట్‌వర్క్‌) నియంత్రణలో ఉన్నాయి. నియంత్రణలో లేని ఉపగ్రహాలతోనే ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాలంచెల్లిన ఉపగ్రహాలు భూకక్ష్యలో గంటకు 30 వేల కిలోమీటర్ల (సెకనుకు 7.9 కి.మీ.) వేగంతో తిరుగుతూ, ఒక్కోసారి దారితప్పి ఇతర శిథిలాలను ఢీకొడుతున్నాయి. కొత్తగా ప్రయోగించే ఉపగ్రహాలకు ఆటంకం కలిగిస్తున్నాయి. 2014లో ‘ఇస్రో’ చేపట్టిన ‘పీఎస్‌ఎల్వీ-సీ23’ ప్రయోగానికి ఓ శకలం అడ్డువస్తున్నట్లు గ్రహించి ప్రయోగాన్ని మూడు నిమిషాలు వాయిదా వేశారు. 2016లో చేపట్టిన ‘పీఎస్‌ఎల్వీ-సీ32’ ను కూడా ఇలాంటి కారణంతో ఒక నిమిషం ఆలస్యంగా ప్రయోగించారు. సాధారణ గ్రహశకలాల్లాగే ఒక్కోసారి కృత్రిమ ఉపగ్రహ శిథిలాలూ భూమివైపు దూసుకురావడం ఆందోళన కలిగిస్తున్న అంశం. 1979 జులైలో భారీ ఉపగ్రహం ‘స్కైలాబ్‌’ భూ వాతావరణంలోకి అత్యంత వేగంతో దూసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. 2011 అక్టోబరులో జర్మనీకి చెందిన గాజుపలకలు, టెలిస్కోప్‌ గల కాలంచెల్లిన ఉపగ్రహం ‘రోశాట్‌’ అత్యధిక వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశించినా అదృష్టవశాత్తు సముద్రంలో పడింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) కూడా గతంలో ఇలాంటి ముప్పును ఎదుర్కొంది. భూమికి 400 కి.మీ. ఎత్తులో ఉన్న ఐఎస్‌ఎస్‌ వైపు ఓ అంతరిక్ష శిథిలం దూసుకొచ్చింది. చివరికి అది అత్యంత సమీపం నుంచి వెళ్ళడంతో పెను ప్రమాదం తప్పింది. తక్కువ భూకక్ష్యలో (రెండు వేల కి.మీ.లోపు) ప్రవేశపెట్టే ఉపగ్రహాల కాలపరిమితి స్వల్పంగా ఉండటంవల్ల కాలంచెల్లిన తరవాత అవి భూమ్యాకర్షణశక్తి వల్ల వాతావరణంలోకి వచ్చి మండిపోతాయి. కానీ, భూస్థిర కక్ష్య (36 వేల కి.మీ.ఎత్తు)లో ప్రవేశపెట్టే భారీ ఉపగ్రహాలు గడువుతీరిన తరవాత అదే కక్ష్యలో అత్యధిక వేగంతో తిరుగుతుండటంతో అంతరిక్ష కార్యకలాపాలకు ముప్పుగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పలు దేశాలు కొన్ని వందల చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో అంతరిక్షంలో శిథిలాల సంఖ్య మరింత పెచ్చరిల్లే అవకాశం ఉంది.

అంతరిక్ష ప్రయోగాల్లో అమెరికా, రష్యా, చైనా, భారత్‌ ముందువరసలో ఉన్నాయి. అంతరిక్ష వ్యర్థాల తీవ్రతను తగ్గించేందుకు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ‘బాహ్య అంతరిక్ష శాంతియుత ఉపయోగం’పై ఏర్పాటైన కమిటీ నిబంధనల ప్రకారమే ప్రపంచ దేశాలు అంతరిక్ష ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి చేరవేసే క్రమంలో ప్రయోగ వాహనం నుంచి తక్కువ భాగాలు విడిపోయే విధంగా రూపొందించాలని, ఉద్దేశ్యపూర్వక విధ్వంసం, ఇతర హానికర చర్యలను నివారించాలని, ఉపగ్రహాల్లో నిల్వ చేసిన శక్తి కారణంగా సంభవించే విచ్ఛిన్నాలను తగ్గించాలనే సూచనలు ఉన్నాయి. కానీ, చాలా దేశాలు ఆ దిశగా అడుగులు వేయడంలేదనే విమర్శ ఉంది. ప్రయోగాలపై చూపిస్తున్న శ్రద్ధ శిథిలాల తొలగింపుపై చూపించడంలేదనేది చేదు నిజం. ఈ శకలాలను ఉపగ్రహాలు తిరిగే కక్ష్యలకు దూరంగా (డెడ్‌ ఆర్బిట్‌లోకి) పంపించడం, లేదా భూ వాతావరణంలోకి తీసుకొచ్చి నాశనం చేయడం ద్వారా ఇలాంటి ప్రమాదాల్ని తగ్గించవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిళ్ళ నేపథ్యంలో ఐఎస్‌ఎస్‌, ఈఎస్‌ఏ తక్కువ ఎత్తులో ప్రయోగాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. భవిష్యత్‌ ప్రయోగాలను దృష్టిలో ఉంచుకొని ఐక్యరాజ్య సమితితో పాటు అన్ని దేశాలు కలిసికట్టుగా అంతరిక్ష వ్యర్థాల నష్ట తీవ్రత నివారణకు ముమ్మర ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- అనిల్‌ కుమార్‌ లోడి
Posted on 07-08-2019