Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


సైన్స్ & టెక్నాల‌జీ

విక్రమిస్తే విజయం మనదే!

భరత జాతి ఆశలను ఆకాంక్షలను భుజాన మోస్తూ జాబిలికి చేరువై అక్కడి ఉపరితలంపై అడుగిడే దశలో ఎదురైన సాంకేతిక అవాంతరం, చంద్రయాన్‌-2ను సంపూర్ణ విజయానికి అల్లంత దూరాన ఆపేసింది. మూడు లక్షల ఎనభై నాలుగు వేల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణంలో చంద్రమండలానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ‘విక్రమ్‌’ ల్యాండర్‌కు, బెంగళూరు అంతరిక్ష కేంద్రంతో సంబంధాలు తెగిపోవడం-‘ఇస్రో’ సిబ్బందితోపాటు యావద్దేశాన్నీ కుదిపేసింది. జులై 22నాడు మొదలైన సంక్లిష్ట ప్రయోగం చిట్టచివరి ఘట్టంలోనూ విజయవంతమై ఉంటే ఈ తరహా ఘనత సాధించిన నాలుగో దేశంగా రష్యా, అమెరికా, చైనాల సరసన భారత్‌ సగర్వంగా నిలిచేది. చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని శోధించిన తొలి దేశంగా మన కీర్తిపతాక ఎగసేది. అంతా అనుకున్నట్లే జరిగితే- విక్రమ్‌ అక్కడ మృదువుగా పాదం మోపిన దరిమిలా కొన్ని గంటల వ్యవధిలో చందమామపై కీలక పరీక్షల ఘట్టం చోటుచేసుకునేదే. నిర్ణీత పద్ధతిలో నెలరాజుపై దిగే క్రమంలో ఆఖరి పావుగంట అత్యంత ముఖ్యమైనది, అదే పరీక్షా ఘట్టమని ‘ఇస్రో’ సారథి శివన్‌ రెండు నెలలుగా చెబుతూనే ఉన్నారు. 13 నిమిషాల పాటు వేగాన్ని తగ్గించుకుంటూ అంతా సవ్యంగానే సాగుతున్నదన్న భావన కలిగించిన ‘విక్రమ్‌’ ల్యాండర్‌ నియంత్రణ కోల్పోయిందని, బహుశా నిర్ధారించిన దానికన్నా ఎక్కువ చలనగతితో చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టి ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సౌరవాయువుల కారణంగా అది గతి తప్పిందేమోనన్న బిర్లా విజ్ఞాన కేంద్రం సంచాలకులు డాక్టర్‌ బి.జి.సిద్ధార్థ్‌- ‘విక్రమ్‌’ క్షేమంగా దిగినా సమాచారలోపం వల్ల అక్కడేం జరిగిందో తెలియడం లేదని, మళ్ళీ సంబంధాల పునరుద్ధరణ అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేసే వీల్లేదంటున్నారు. 95శాతం మేర ప్రయోగ లక్ష్యం నెరవేరిందంటున్న ‘ఇస్రో’ మాజీ సారథి మాధవన్‌ నాయర్‌ ప్రభృతుల వ్యాఖ్యలు, ఏదో ఒక రోజు విజయం సాధించి తీరతామన్న ప్రధాని మోదీ ధీమా, ఇది అసలు వైఫల్యమే కాదన్న భిన్న రంగాల ప్రముఖుల స్పందనలు- శాస్త్రవేత్తలకు గొప్ప స్ఫూర్తి ప్రపూరితాలు!

ఇండియాకన్నా ముందు చంద్రమండల యాత్రలు చేపట్టినవారి అనుభవాలేమిటో తరచిచూస్తే జాబిలిపై దిగడమెంత కష్టతరమో ఇట్టే బోధపడుతుంది. భూమితో పోలిస్తే చంద్రుడిపై గురుత్వాకర్షణ శక్తి తక్కువ. తొలినాళ్లలో అక్కడ వ్యోమనౌకను నిదానంగా దింపబోతే, అది అంచనాలకు మించిన వేగంతో దూసుకెళ్ళి చంద్రమండలాన్ని ఢీకొని ముక్కలైపోయేది. శోధనకు ఉద్దేశించిన పరికరాలు, ల్యాండర్లు ఎన్నో విఫలం కావడానికి ప్రధాన కారణమదే. పదకొండు వైఫల్యాల తరవాతే శశిగోళం మీద మృదువుగా దిగడం (సాఫ్ట్‌ ల్యాండింగ్‌)లో సోవియట్‌ యూనియన్‌ సఫలీకృతమైంది. నాలుగు పర్యాయాలు చతికిలపడ్డాకనే అయిదోసారి సాఫీగా అమెరికా చంద్రమండల యాత్ర సాకారమైంది. చంద్రుడిపై పూర్తి నియంత్రణతో దిగడం ఎంత క్లిష్టతరమో తెలిసే- ‘ఆఖరి దశ’ కోసం ‘ఇస్రో’ శాయశక్తులా సన్నద్ధమైంది. 47 రోజులు పయనించి చంద్రయాన్‌-2 జాబిలి కక్ష్యలోకి చేరే ముప్ఫై నిమిషాల వ్యవధిలో గుండె ఆగినంత పనయిందని ‘ఇస్రో’ సారథి శివన్‌ పక్షం క్రితం భావోద్వేగంతో స్పందించారు. ఒక్కో దశా దాటుకుంటూ ముందుకు దూసుకుపోయాక చివరి అంకంలో ఎదురుదెబ్బ తగిలేసరికి ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. ఆ స్థితిలో శివన్‌ను హత్తుకుని వెన్నుతట్టి ఊరడించిన ప్రధాని మోదీ అసంకల్పిత చర్య, కోట్లాది భారతీయుల మనోభావాలకు అద్దం పట్టింది. సాంకేతికంగా ‘విక్రమ్‌’ను తద్వారా ‘ప్రజ్ఞాన్‌’ సేవలను ‘ఇస్రో’ కోల్పోయిందనుకున్నా- జాబిలి చుట్టూ చక్కర్లు కొడుతున్న ఆర్బిటర్‌ కనీసం ఏడాదిపాటు చంద్రుడి చిత్రాలను, ఇతరత్రా సమాచారాన్ని నిరంతరం అందించనుంది. అందుకు దోహదపడిన పదహారున్నర వేలమంది ‘ఇస్రో’ కుటుంబ సభ్యుల సేవలను ఈ జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది!

రోదసి ప్రయోగాల్లో విశేషానుభవం గడించిన అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ అంగారక యాత్ర కోసం ‘మావెన్‌’ రూపొందించడానికి అయిదేళ్లు శ్రమించింది. ఒబామా సర్కారు అప్పటి మారకం రేటు ప్రకారం అందుకు చేసిన ఖర్చు సుమారు రూ.4000 కోట్లు. తనవంతుగా ఏడాదిన్నరలోనే అంగారక యాత్రకు సన్నద్ధమైన ‘ఇస్రో’కైన వ్యయం అందులో తొమ్మిదోవంతే. ఆమధ్య చాంగే-4 నిమిత్తం చైనా రమారమి రూ.59 వేలకోట్లు వెచ్చించగా చంద్రయాన్‌-2 పద్దుకింద వ్యయీకరించింది వెయ్యి కోట్ల రూపాయల లోపు. చౌకలో, శాస్త్రీయంగా మరెవరికీ తీసిపోని కచ్చితత్వంతో వైజ్ఞానిక ప్రయోగాలు నిర్వహించడంలో మన శాస్త్రజ్ఞుల ప్రజ్ఞాపాటవాలు విశ్వాన్నే విస్మయపరుస్తున్నాయి. చంద్రయాన్‌-2 అనంతరం సూర్యుడి చుట్టూరా కరోనా వలయంలోని విధ్వంసకర మార్పుల గుట్టు విప్పే ఆదిత్య-ఎల్‌1, విశ్వంలో ప్రకాశవంతమైన ఎక్స్‌రే మూలాలను శోధించే ఎక్స్‌పోశాట్‌, మంగళ్‌యాన్‌లతోపాటు మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌, శుక్రయాన్‌లపై ‘ఇస్రో’ ఇప్పటికే గురిపెట్టింది. తాజా అనుభవంతో కొద్దిపాటి సర్దుబాట్లు అనివార్యమైనా, భారత రోదసి సంస్థ రెట్టించిన పట్టుదలతో పురోగమించాలి. సోయుజ్‌ వ్యోమగాముల దుర్మరణం (1971), ఛాలెంజర్‌ విషాదాంతం (1986), వందసార్లు రోదసియానం చేసివచ్చేలా తీర్చిదిద్దిన కొలంబియా నింగిలోనే బుగ్గిపాలైన మహోత్పాతం (2003) వంటివెన్నో శాస్త్రవేత్తల పరిమితుల్ని చాటిచెప్పాయి. తన పరిధిలో లేని అంశాల కారణంగా వాటిల్లే దుష్పరిణామాలకు కుంగిపోని మానవ నైజం, అపార జ్ఞానతృష్ణలే శాస్త్ర పరిశోధనల రంగాన అద్భుత ప్రకరణలెన్నింటినో ఆవిష్కరించాయి. అటువంటి పోరాటస్ఫూర్తే ‘ఇస్రో’ను ఘనతర కక్ష్యలో నిలపగలుగుతుంది!


Posted on 08-09-2019