Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


సైన్స్ & టెక్నాల‌జీ

ఆకట్టుకుంటున్న అంతరిక్షం!

* జాతిని కదిలించిన చంద్రయాన్‌
* రోదసిపట్ల యువతలో అమితాసక్తి
* ఇస్రో సాధించిన సిసలైన విజయం
* అంతరిక్ష విపణిలో అపార అవకాశాలు

వైఫల్యమంటే రెట్టించిన ఉత్సాహంతో విజయం వైపు దూసుకెళ్ళడానికి దట్టించిన రాకెట్‌ ఇంధనం. ల్యాండర్‌ విక్రమ్‌తో ఆర్బిటర్‌కు సంబంధాలు తెగిపోయినా చంద్రయాన్‌ 2 ప్రయోగం విఫలమైనట్లు కాదని, అది 90 నుంచి 95 శాతం విజయవంతమైందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రకటించింది. కీలక తరుణంలో తనకు అండగా నిలచిన భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపింది. అంతరిక్షంలో అగ్రగాములైన రష్యా, అమెరికాలకూ అంతా నల్లేరుపై నడకగా సాగలేదు. వాటికీ ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. అన్నింటిని అధిగమిస్తూ ముందుకుసాగాయి. వాటితో పోలిస్తే ఇస్రోకు అపజయాలు తక్కువే. 1961-65 మధ్యకాలంలో అమెరికా వైమానిక, వ్యోమ పరిశోధన సంస్థ (నాసా) చందమామ మీదకు పంపిన రాకెట్లలో ఆరు వరసగా విఫలమయ్యాయి. అదే భారతదేశం ఎకాయెకి మొదటి చంద్రయాన్‌ ప్రయోగాన్నే దిగ్విజయంగా నిర్వహించింది. చంద్రయాన్‌-1లో మొత్తం 11 శాస్త్ర పరిశోధన పరికరాలు ఉంటే, వాటిలో ఆరు పరికరాలు విదేశాలకు చెందినవే. ఇస్రో మీద వాటికున్న అపార నమ్మకానికి అవి నిదర్శనాలు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం కలగన్న ‘మూన్‌ ఇంపాక్టర్‌ ప్రోబ్‌’ను చంద్రుడితో ఢీకొట్టించి నీటి జాడను రూఢి చేయడంలో ఇస్రో సఫలమైంది. దానితోపాటు భవిష్యత్తులో చంద్రుడి మీద కోరుకున్నచోట మన వ్యోమనౌకలను మృదువుగా దింపడాని(సాఫ్ట్‌ ల్యాండింగ్‌)కి తోడ్పడే పరికరాలను రూపొందించారు. చంద్రయాన్‌-2లో సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ప్రయోగం దెబ్బతిన్నట్లు కనిపించినా, మొత్తం మీద దక్షిణ ధ్రువం వద్దకు విక్రమ్‌ ల్యాండర్‌ను గురి తప్పకుండా చేర్చగలగడం మామూలు విషయం కాదు. పైగా ఇతర దేశాలకన్నా చాలా తక్కువ ఖర్చుతో (రూ.1,000 కోట్లతో) చంద్రయాన్‌ 2ను ప్రయోగించడం విశేషం.

దక్షిణ ధ్రువం ప్రత్యేకతలు
చంద్ర దక్షిణ ధ్రువం ఎంతో విభిన్నమైంది. అక్కడున్న బిలాల్లో శాశ్వతంగా నీడ పరచుకునే చోట్ల సౌర కుటుంబంలో మరెక్కడా లేనంత అత్యల్ప ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ అతిశీతల బిలాల్లో యుగాలుగా గడ్డకట్టిన నీరు భావి మానవ ఆవాసాల అవసరాలను తీర్చగలదు. ఈ నీటిపై రకరకాల శాస్త్రీయ ప్రయోగాలు చేయడం చంద్రయాన్‌ 2 ప్రధాన లక్ష్యం. చంద్ర జలాన్ని ఆమ్లజని, ఉదజనులుగా విడదీసి ద్రవరూపంలోకి మార్చి రాకెట్‌ ఇంధనంలా ఉపయోగించవచ్చు. ఆ ఇంధనంతో చంద్రుడి నుంచి భూమికి, కుజ గ్రహానికి రాకపోకలు సాగించవచ్చు. ఇంకా చంద్రోపరితలం పైనున్న హీలియం 3 నిల్వలతో చౌకగా విద్యుదుత్పాదన చేయవచ్చు.

వైఫల్యాలపై శోధన
ప్రయోగ వైఫల్యానికి కారణాలేమిటో తెలుసుకుని భవిష్యత్తులో వాటిని అధిగమించడానికి ఇస్రో ఉపక్రమించింది. చంద్రుడి మీద పరచుకునిఉన్న దుమ్మూధూళి ఒక ప్రధాన కారణం కావచ్చు యుగాల నుంచి ఉల్కలు, చిన్న చిన్న గ్రహ శకలాలు చంద్రోపరితలాన్ని ఢీకొని ధూళిగా మారిపోయాయి. ఆ ధూళి కణాలు చాలా పదునైన గాజు కణాల్లా ఉండటమే కాదు, సూర్య కిరణాల వల్ల విద్యుదావేశం (చార్జ్‌) సంతరించుకుంటాయి. అక్కడ ల్యాండర్‌ వంటి బరువైన వస్తువును దింపినప్పుడు రేగే దుమ్ము సౌర ఫలకాల్లోకి, సెన్సర్లలోకి, ఇతర కీలక పరికరాల్లోకి చొరబడి వాటిని పనిచేయకుండా చేసి ఉండవచ్చు. ఎదురుగా ఉండే గోతులు లేదా రాళ్ళను గుర్తించి, ల్యాండర్‌ను భద్రమైనచోట దింపడానికి సెన్సర్లు అవసరం. అవి పనిచేయకపోతే ల్యాండర్‌ రాళ్ళ కుప్పమీదో, గోతిలోనో పడిపోయి ఉండవచ్చు. చంద్రుడి మీద గురుత్వాకర్షణ శక్తి అంతటా ఒకే విధంగా ఉండదు. కొన్నిచోట్ల అధిక సాంద్రత కలిగిన పదార్థం కుప్పగా పడిఉంటుంది. ఈ పదార్థాన్ని ‘మాస్కాన్‌’ అంటారు. మాస్కాన్‌ పోగుపడినచోట గురుత్వాకర్షణ బలంగా ఉండి, పక్క ప్రాంతాల్లో బలహీనంగా ఉంటుంది. విక్రమ్‌ ల్యాండర్‌ దిగినచోట ‘మాస్కాన్‌’ దండిగా ఉంటే దాని ఆకర్షణకు విక్రమ్‌ ఊగిసలాడి పక్కకు పడిపోయి ఉండవచ్చు. లేదా విక్రమ్‌ను ముందుకునడిపే చోదక (ప్రొపల్షన్‌) వ్యవస్థలో, నేల మీదకు దింపడానికి అనువైన స్థలాలను గుర్తించే దిశానిర్దేశక (నావిగేషన్‌) వ్యవస్థలో లోపాలు తలెత్తి ఉండవచ్చు. ఈ అత్యాధునిక సాంకేతికతలను ఇస్రో ఈమధ్యనే సొంతంగా రూపొందించుకొంది. వాటిని భూమి మీద పరీక్షించి, మంచి ఫలితాలు సాధించినా ఇతర గ్రహం మీద అవి సవ్యంగా పనిచేయకుండా అడ్డుపడే అంశాలు ఉండవచ్చు. వాటి వల్ల విక్రమ్‌ను ముందుకు తీసుకెళ్ళే థ్రస్టర్‌లో అపశ్రుతులు ఏర్పడి ల్యాండర్‌ గతి తప్పి ఉండవచ్చు. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల వల్లనే వ్యోమనౌకలు తరచూ కూలిపోతుంటాయి. నాసా ఇరవైఏళ్ల క్రితం మార్స్‌ పోలార్‌ ల్యాండర్‌ను కుజ గ్రహం దక్షిణ ధ్రువం మీద దింపడానికి ప్రయత్నించి విఫలమైంది. ఇజ్రాయెల్‌ కూడా ఇటీవల చంద్రుడిపై వైఫల్యం చవిచూసింది. శాస్త్రసాంకేతిక నిపుణులు వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని వాటిని అధిగమిస్తారు. చంద్రయాన్‌ 2 విక్రమ్‌ ల్యాండర్‌ను దింపలేకపోయినా దాని ఆర్బిటర్‌ ఏడేళ్లపాటు చంద్ర కక్ష్యలో పరిభ్రమిస్తూ చందమామ సమాచారాన్ని సేకరిస్తుంది. ఆర్బిటర్‌ కేవలం ఏడాదిపాటు పరిభ్రమిస్తుందని మొదట్లో అంచనా వేసినా, భూమి నుంచి చంద్రుడి వద్దకు వెళ్ళేటప్పుడు ఇంధనాన్ని బాగా ఆదా చేసుకున్నందువల్ల అది ఏకంగా ఏడేళ్లపాటు తిరుగుతూ అమూల్య సమాచారాన్ని అందిస్తుంది. ఆ సమాచారం ఇస్రోతో కలిసి జపాన్‌ అంతరిక్ష సంస్థ జాక్సా 2024లో చంద్రుడి వద్దకు పంపే వ్యోమ నౌకకు ఉపకరిస్తుంది. ఆర్టెమిస్‌ ప్రాజెక్టు కింద చంద్రుడి దక్షిణ ధ్రువం వద్దకు వ్యోమగాములను పంపడానికి అమెరికా సైతం చంద్రయాన్‌ 2 సమాచారాన్ని ఉపయోగించనుంది. ఇస్రోతో కలిసి సౌర కుటుంబాన్ని అన్వేషించడానికి నాసా సై అంటోంది. భారత ప్రభుత్వ నిధులతో అద్భుతంగా నడుస్తున్న ప్రాజెక్టులు, సంస్థల్లో ఇస్రోను మించినది లేదు. సమీప భూకక్ష్యలోకి పీఎస్‌ఎల్వీ రాకెట్లను, స్థిర భూకక్ష్యలోకి జీఎస్‌ఎల్వీ రాకెట్లను అనుకున్న ప్రకారం అయిదేళ్లలోనే ప్రయోగించగలిగింది. చంద్రుడి ఉపరితల అన్వేషణకు 2008లో చంద్రయాన్‌ ప్రాజెక్టును చేపట్టి తొలి ప్రయత్నంలోనే చందమామ కక్ష్యను చేరుకుంది. అది అనితర సాధ్య విజయమనడంలో మరో మాట లేదు. తదుపరి చంద్రోపరితలంపై నౌకను దించదలచినా, భారత ప్రభుత్వ సూచనపై ఇస్రో కుజగ్రహంవైపు దృష్టి సారించింది. 2013లో అమెరికా వ్యోమనౌక మావెన్‌కు దీటుగా ఇస్రో మంగళ్‌యాన్‌ను ప్రయోగించింది. కుజగ్రహం వద్దకు తొలి యత్నంలోనే చేరుకున్న దేశంగా భారత్‌ పేరు మార్మోగిపోయింది. మంగళ్‌యాన్‌ నిర్ణీత కాలంకన్నా ఎక్కువ సమయం కుజ కక్ష్యలో పరిశీలనలు జరిపింది. చంద్ర, కుజ పరిశోధనలకు ఇస్రో సొంత సాంకేతికతలు, రాకెట్లు, ఇతర పరికరాలను అభివృద్ధి చేసుకోవడం అపూర్వ విజయం. వేరే గ్రహం మీద మన నౌకను దింపి అక్కడ శాస్త్రీయ పరిశోధనలు జరిపే సత్తా తనకుందని నిరూపించుకోవడానికి చంద్రయాన్‌ 2 ఉపకరిస్తుందని ఆశించారు. దానికి అనుకోని విఘ్నం ఎదురైనా, ఇస్రో తన పట్టుదలను ఏమాత్రం సడలించబోవడం లేదు. చంద్రుడి మీద, ఆమాటకొస్తే మరే గ్రహంపైనైనా వ్యోమనౌకను మృదువుగా దింపే కళలో ఇస్రో నిష్ణాతురాలు కావలసి ఉంది. ఈ నైపుణ్యానికి బాగా పదును పెట్టుకోవడం మీద ఇస్రో దృష్టి కేంద్రీకృతం చేస్తుందనడంలో సందేహం లేదు.

దేశదేశాల ఆసక్తి
2018 సంవత్సరంలో 36,000 కోట్ల డాలర్లుగా ఉన్న అంతరిక్ష వాణిజ్యం ఏటా 5.6 శాతం వృద్ధిరేటు సాధించి 2040కల్లా లక్ష కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. అందుకే రష్యా, అమెరికా, చైనా, భారతదేశాలతోపాటు మరి ఎనిమిది దేశాలు- ఆస్ట్రేలియా, మెక్సికో, న్యూజిలాండ్‌, పోలండ్‌, పోర్చుగల్‌, దక్షిణాఫ్రికా, టర్కీ, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ అంతరిక్ష పరిశోధన సంస్థలను ప్రారంభించాయి. మున్ముందు నానో ఉపగ్రహాలు, పునర్వినియోగ రాకెట్లకు గిరాకీ పెరగనుంది. వాటిని తయారుచేసి సమీప భూకక్ష్యలోకి ప్రయోగించడమనేది భారీ అంతరిక్ష విపణిగా మారుతుంది. అందుకే నేడు ప్రైవేటు సంస్థలూ అంతరిక్షంలోకి రాకెట్లను ప్రయోగిస్తున్నాయి. 2018లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మొత్తం 382 ఉపగ్రహాలను రోదసిలోకి ప్రయోగించగా, 2040కల్లా ఈ ప్రయోగాలు రెట్టింపవుతాయి.

ప్రోత్సాహకాలతో ఆదరణ
ఇస్రో, నాసా వంటి ప్రభుత్వ సంస్థలతో పాటు అమెజాన్‌, టెస్లా వంటి ప్రైవేటు కంపెనీలూ అంతరిక్ష విపణిని కొత్త ఎత్తులకు తీసుకెళ్ళబోతున్నాయి. భారతదేశమూ అంతరిక్ష విపణిలో దూసుకుపోవడానికి ‘న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థ’ను ప్రారంభిస్తోంది. ఉపగ్రహాలను, వ్యోమనౌకలను ప్రయోగించడానికి ఇస్రో రూపొందించుకున్న పీఎస్‌ఎల్వీ, జీఎస్‌ఎల్వీ రాకెట్లు ఇప్పటికే పలుమార్లు తమ సత్తా నిరూపించుకున్నాయి. పీఎస్‌ఎల్వీ ద్వారా సొంత ఉపగ్రహాలతోపాటు విదేశీ ఉపగ్రహాలనూ ప్రయోగిస్తూ ఇస్రో ఆదాయం ఆర్జిస్తోంది. అంతరిక్ష విపణి విస్తరిస్తున్న కొద్దీ భారతీయులకు వ్యాపార, ఉపాధి అవకాశాలు విజృంభిస్తాయి. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలపైన, ఇతర ఇంజినీరింగ్‌ ఉద్యోగాలపైన మక్కువ పెంచుకున్న యువతరం అంతరిక్షంలో వేచి ఉన్న ఉజ్జ్వల భవిష్యత్తును అందుకోవడం మీద దృష్టి సారించాలి. పాఠ్య ప్రణాళికలు, విద్యాలయాలు వారిని అందుకు సన్నద్ధుల్ని చేయాలి. విధానకర్తలు, విద్యావేత్తలు, శాస్త్రజ్ఞులు కలిసి యువత కనుల ముందు కొత్త బంగారు లోకాన్ని ఆవిష్కరించి, అక్కడ అనితరసాధ్య విజయాలను సాధించాలనే తపన రగిలించాలి. తదనుగుణమైన విధానాలు రూపొందించి పకడ్బందీగా అమలు చేయాలి.


- సయ్యద్‌ మక్బూల్‌ అహ్మద్‌
(రచయిత- హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌)
Posted on 21-09-2019