Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


సైన్స్ & టెక్నాల‌జీ

ఇది సైబర్‌ ఉగ్రవాదం!

ప్రచ్ఛన్న శత్రువులనుంచి నిరంతర దాడుల ముప్పును నేడు తరతమ భేదాలతో ప్రపంచ దేశాలెన్నో ఎదుర్కొంటున్నాయి. కంప్యూటర్లు, అంతర్జాలం, స్మార్ట్‌ఫోన్లే కార్యస్థలిగా సైబర్‌ నేరగాళ్ల విజృంభణ దేశీయంగానూ దిగ్భ్రాంతపరుస్తోంది. రకరకాల పద్ధతుల్లో టోకరా వేస్తున్న వంచక ముఠాల హస్తలాఘవం మూలాన క్షణాల వ్యవధిలో వేలు లక్షలు పోగొట్టుకుంటున్న బాధితుల సంఖ్య పోనుపోను విస్తరిస్తోంది. భాగ్యనగరంలో గంటకో సైబర్‌ నేరం వెలుగుచూస్తున్న దశలో తెలంగాణ రక్షకభట విభాగం జాతీయ పోలీస్‌ అకాడమీతో తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం సైబర్‌ నేరస్థుల కదలికలు, వారి కట్టడిపై ఎస్సై నుంచి డీఎస్పీ స్థాయి అధికారి వరకు జాతీయ పోలీస్‌ అకాడమీ శిక్షణ సమకూరుస్తుందంటున్నారు. గత సంవత్సరం సుమారు 14వేల సైబర్‌ నేరాలు నమోదైన తెలంగాణలో పరిష్కారమైన కేసులు కేవలం రెండు డజన్లే. మరిన్ని కేసుల చిక్కుముడులు విప్పి బాధితులకు ఉపశమనం కలిగించడంలో నూతన శిక్షణ కీలక మైలురాయి కాగలదేమో చూడాలి! సైబర్‌ క్రైమ్‌, ఆర్థిక నేరాలు, మాదకద్రవ్యాల సంబంధిత కేసుల నమోదుకు ప్రత్యేక పోలీస్‌ స్టేషన్లు నెలకొల్పిన కర్ణాటక- శిక్షణ పొందిన అధికారుల కొరత వేధిస్తున్నట్లు ఇటీవలే వాపోయింది. సైబర్‌ దాడుల బారినుంచి సమాచారాన్ని భద్రపరచేటందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలూ బ్లాక్‌చైన్‌ సాంకేతికత వైపు మొగ్గుచూపడం తెలిసిందే. సాంకేతికతను దుర్వినియోగపరచడం ద్వారా చెలరేగిపోతున్న సైబరాసురులను ఏవో కొన్ని రాష్ట్రాల చొరవతో సమర్థంగా నియంత్రించగల వీల్లేదు. దిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ్‌ బంగ, బిహార్‌, ఝార్ఖండ్‌ ప్రాంతాల్లో మూలాలు కలిగిన నేరగాళ్లను పోలీసులు గాలించి అదుపులోకి తీసుకుంటున్నా- ఆన్‌లైన్‌ మోసాలు, ఖాతాల హ్యాకింగ్‌ వంటివి ఇంతలంతలవుతూనే ఉన్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ డిప్యూటీ గవర్నరుగా ఎస్‌.పి.తల్వార్‌ ఏనాడో ఉద్బోధించినట్లు- ‘యాక్సెస్‌ కంట్రోల్‌ వ్యవస్థల పరిరక్షణ విధివిధానాల’ ప్రక్షాళనే అజెండాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సమన్వయంతో ముందడుగేయాలి!

జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం- సైబర్‌ అకృత్యాలు జోరెత్తుతున్న తొలి ఆరు రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ ఉన్నాయి. ఉత్తర్‌ ప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, అసోం వాటికన్నా ముందున్నాయి! 2016-2018 సంవత్సరాల మధ్య యూపీ, కర్ణాటక, మహారాష్ట్రల్లో అధికారికంగా నమోదైన సైబర్‌ నేరాల సంఖ్య 33 వేలకు పైబడింది. అదే కాలావధిలో తెలుగు రాష్ట్రాల్లో కేసులు రెండింతలైనా, వాటి పరిష్కరణ వేగంలో ఆయా పోలీసు విభాగాల పనితీరు నత్తనడకే ఎంతో మెరుగనిపిస్తోంది! పాత వాహనాల విక్రయాల ముసుగులో దగాలకు భరత్‌పూర్‌ (రాజస్థాన్‌), బ్యాంకు అధికారులమంటూ డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల మోసాలకు జాంతాఢా (ఝార్ఖండ్‌) బృందాలు మారు పేరు. అవి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై గురిపెట్టినట్లు ఇటీవలి ఉదంతాలు నిరూపిస్తున్నాయి. భాగ్యనగర వాసి పేరును, దిల్లీ చిరునామాను జోడించి పాన్‌ కార్డు ఆధారంగా లక్షల రూపాయల రుణం కొట్టేసిన మోసగాళ్ల బాగోతం- సైబర్‌ నేర సామ్రాజ్య విస్తృతికి కళ్లకు కట్టింది. ఖరీదైన ఉత్పాదనలపై 80, 90 శాతం దాకా రాయితీలు అందిస్తామనే తరహా మాయ వలల్లో చిక్కి జేబులు గుల్ల చేసుకుంటున్న అభాగ్యుల ఉదంతాలు తరచూ వినిపిస్తున్నాయి. సినిమా మొదలు బస్సు, రైలు, విమాన టికెట్ల బుకింగ్‌ వరకు ఏదైనా ఆన్‌లైన్‌ లావాదేవీల రూపేణా జరపగల ఆధునిక సౌలభ్యం మాటున- కుయుక్తులతో ఖాతాదారుల్ని బురిడీ కొట్టించి కాసుల పంట పండించుకునే సైబర్‌ ముష్కరుల ఉరవడి వ్యవస్థాగతమై వర్ధిల్లుతున్న కంతల్ని పట్టిస్తోంది. పక్షం రోజుల క్రితమే సైబర్‌ క్రైమ్‌ సమన్వయ కేంద్రాన్ని, ప్రత్యేక పోర్టల్‌ను ఆవిష్కరించిన మోదీ ప్రభుత్వం- ఆర్థిక నేరగాళ్లకు కట్టుదిట్టంగా ఉచ్చు బిగించే ఉమ్మడి కార్యాచరణను రాష్ట్రాలతో కలిసి సజావుగా పట్టాలకు ఎక్కించాల్సి ఉంది.

వ్యక్తుల ఆర్థిక స్థితిగతుల్ని తలకిందులు చేసేయడమే కాదు, వ్యవస్థల పునాదులనే కుళ్లగించే స్థాయిలో సైబర్‌ అక్రమాలు విక్రమిస్తున్నాయి. కూడంకుళం అణు విద్యుత్‌ కేంద్ర పాలన విభాగ సమాచార వ్యవస్థ హ్యాకర్ల దాడికి గురైందన్న సమాచారం మూడు నెలల కిందట సామాజిక మాధ్యమాల్లో గగ్గోలు పుట్టించింది. నిరుడు తెలుగు రాష్ట్రాల విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కమ్‌)ల వెబ్‌ సైట్లలోని సమాచారం తస్కరించిన హ్యాకర్లు రూ.35 కోట్లు డిమాండ్‌ చేసిన వైనం- దేశాన్ని సైబర్‌ అభద్రత ఆవరించిందని స్పష్టీకరించింది. సైబర్‌ దాడుల కారణంగా అయిదేళ్లలో కార్పొరేట్‌ సంస్థలు రూ.370 లక్షల కోట్ల మేర నష్టపోతాయన్న అంచనాలు నిశ్చేష్టపరుస్తున్నాయి. ఇది దేశ దేశాల్ని వణికిస్తున్న అంతర్జాతీయ ఆర్థిక ఉగ్రవాదం. లోగడ బంగ్లాదేశ్‌, వియత్నాం, ఈక్వడార్‌, పోలండ్‌లలో కోట్లాది ఆన్‌లైన్‌ ఖాతాల అపహరణను నిర్ధారించిన సిమాంటెక్‌ సంస్థ, ఇండియాలోనూ పరిస్థితి చేజారుతున్నట్లు అప్పట్లోనే హెచ్చరించింది. పొరుగున జన చైనా భూతల రక్షణ శ్రేణుల్ని ఎలక్ట్రానిక్‌ భద్రత వ్యవస్థను అనుసంధానించడంలో- సవాళ్లకు దీటుగా స్పందించే వైఖరి ప్రస్ఫుటమవుతోంది.ఇక్కడ ‘డిజిటల్‌ ఇండియా’కు శ్రీకారం చుట్టిన మోదీ ప్రభుత్వం జాతీయ సైబర్‌ భద్రత విధానాన్ని ప్రత్యేకంగా కొలువు తీర్చినా- వివిధ విభాగాల మధ్య సమన్వయం కొరవడిందని పార్లమెంటరీ స్థాయీసంఘమే సూటిగా తప్పుపట్టింది. దేశీయంగా వాణిజ్య, సైనిక సమాచారాన్ని భద్రంగా సంరక్షించుకునే నిమిత్తం పదిలక్షలమంది నిపుణులతో కూడిన సైబర్‌ దళం అత్యవసరమని సాఫ్ట్‌వేర్‌ సేవా సంస్థల జాతీయ సంఘం ‘నాస్కామ్‌’ గతంలోనే మదింపువేసినా ఒరిగిందేముంది? ఆన్‌లైన్‌ నేరాలు, డెబిట్‌ క్రెడిట్‌ కార్డుల మోసాల్లో రాటుతేలి కీలక వ్యవస్థల్నీ చెరపట్టేలా రెచ్చిపోతున్న సైబరాసురుల పీచమణచడమే ఇప్పుడు ప్రభుత్వాల ముందున్న అత్యంత గడ్డు సవాలు!

Posted on 28-01-2020