Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


సైన్స్ & టెక్నాల‌జీ

విచ్చుకోవాలిక విజ్ఞాననేత్రం!

అప్పుడెప్పుడో ఎనిమిది దశాబ్దాల క్రితంనాటి మాట. సర్‌ సీవీ రామన్‌కు భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి లభించడంతో యావజ్జాతి పులకించిపోయింది. ఒక భారతీయుడు స్వదేశంలో విశిష్ట పరిశోధనలు జరిపి, సాధించిన ఆవిష్కరణలకు గాను ఆ అత్యున్నత పురస్కారం పొందడం అదే తొలిసారి. స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు దొర్లిపోతున్నా- విజ్ఞానశాస్త్ర రంగంలో మరో 'నోబెల్‌' కోసం మన ఎదురుచూపు ఎండమావినే తలపిస్తోంది. మరోవైపు, విదేశీ గడ్డ మీద విజ్ఞాన పతాకాలు ఎగురవేసి అత్యున్నత స్థాయిలో గౌరవాభినందనలు అందుకొంటున్న భారతీయులు ఎందరో ఉన్నారు. వారంతా భారతీయ విజ్ఞాన నిధికి వారసులు. శాస్త్ర-సాంకేతిక విజ్ఞానం ద్వారా స్వదేశంలోనూ అద్భుతాలు సాధ్యపడుతున్నప్పటికీ, అవి ప్రధానంగా అంతరిక్ష పరిశోధనలకే పరిమితమవుతున్నాయి. ఇతర రంగాలకు విస్తరించడంలేదు. అందుకు కారణాలు ఏమైనప్పటికీ, దేశంలో వైజ్ఞానిక పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణలు ఒక పరిధి దాటడంలేదన్నది వాస్తవం. కాళ్ల కింద నేల కుంగుతున్న నిజాన్ని విస్మరించి, ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నామన్నది సత్యం. ప్రవాస భారతీయుల వైజ్ఞానిక విజయాలు, స్వదేశంలో స్థితిగతులు మారాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. ముఖ్యంగా సామాజిక, ఆర్థిక, విద్యా ఆరోగ్య సంబంధ సమస్యలకు సరైన పరిష్కారాలు చూపి, స్వచ్ఛ భారత్‌ వంటి ప్రజోపయోగ కార్యక్రమాల సాఫల్యానికి బాటలు పరచేలా రూపుదిద్దుకొన్ననాడే శాస్త్ర-సాంకేతిక విజ్ఞానానికి సార్థకత. ఈ నేపథ్యంలోనే నేడు ముంబయిలో ప్రధానమంత్రి మోదీ ప్రారంభిస్తున్న 102వ భారతీయ విజ్ఞానశాస్త్ర మహాసభలు (ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌) ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

పరిశోధనే ప్రాణాధారం

శాస్త్ర విజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతున్న కాలమిది. ఆధునిక మానవుడికి ఒనగూరుతున్న యావత్‌ సదుపాయాలు, సౌకర్యాలు, విలాసాలు విజ్ఞానశాస్త్ర ఫలాలే. వ్యవసాయ, పారిశ్రామిక, విద్యా ఆరోగ్య రంగాల్లో గణనీయ పురోగతి సైన్సు పుణ్యమే. స్కాటిష్‌ శాస్త్రవేత్తల బృందమొకటి మూలకణాల్ని ఉపయోగించి ప్రయోగశాలలో మనిషి నెత్తురు తయారీ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే, ప్రపంచ ప్రజారోగ్య రంగంలో సరికొత్త విప్లవం వికసించినట్లే. మూలకణాలను ఉపయోగించి కృత్రిమ మానవ అవయవాల రూపకల్పనకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని శాస్త్రజ్ఞులు, ముఖ్యంగా జీవ శాస్త్రవేత్తలు జరుపుతున్న ప్రయోగాలు సాకారమైతే- వివిధ రుగ్మతల పాలబడి మృత్యుముఖంలోకి జారుకొంటున్న కోట్ల మందికి ప్రాణభిక్ష లభించినట్లే. విజ్ఞానశాస్త్రానికి అంతకు మించిన ప్రయోజనం ఇంకేముంటుంది? మరోవైపు- స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలకు అవసరమైన దీర్ఘకాలం మన్నే రీఛార్జిబుల్‌ బ్యాటరీలను అమెరికా శాస్త్రజ్ఞులు ఇప్పటికే రూపొందించారు. 20నుంచి 30సెకన్ల కాలంలోనే సెల్‌ఫోన్‌ను పూర్తిగా ఛార్జి చేసే ఉపకరణాన్ని తయారుచేసిన కాలిఫోర్నియా (అమెరికా)కు చెందిన భారత సంతతి యువతి ఇశా ఖరే, ఇంటెల్‌ ఫౌండేషన్‌ వారి 50వేల డాలర్ల యువశాస్త్రవేత్త అవార్డు కైవసం చేసుకుని, స్ఫూర్తిదాతగా నిలిచారు.

అమెరికాకే చెందిన మరో భారతీయ యువతి దీపిక, స్వచ్ఛమైన నీటిని అందించేందుకు వినూత్న పద్ధతిని కనిపెట్టింది. టైటానియం ఆక్సైడ్‌, జింక్‌ ఆక్సైడ్‌లను కలిపి హైడ్రాక్సిల్‌ అనే ద్రావణాన్ని తయారు చేసిన ఆమె- సూర్యరశ్మి పడే నీళ్లలో దాన్ని కలిపితే ఆ నీటిలోని హానికారక బ్యాక్టీరియా నశిస్తుందని శ్వేత సౌధంలో జరిగిన సైన్సు ప్రదర్శనలో నిరూపించి- శభాషనిపించుకొంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఉన్నత శ్రేణి పెట్రోలు, డీజిలుగా మార్చే విశిష్ట సాంకేతిక ప్రక్రియను డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం (ఐఐపీ) శాస్త్రజ్ఞులు రూపొందించారు. ఈ హరిత సాంకేతిక పరిజ్ఞానం జర్మనీ, జపాన్‌, అమెరికాల్లో ఇప్పటికే అందుబాటులో ఉంది. సెల్‌ఫోన్లలో ఎస్‌ఎంఎస్‌ (సంక్షిప్త సందేశాలు) ద్వారా వాతావరణ వివరాలు అందచేసి, హెచ్చరికలు జారీచేసే వ్యవస్థనూ ఇటీవల ఆవిష్కరించిన భారత్‌, 1.4 బిలియన్‌ డాలర్ల (రూ.8,820కోట్ల) వ్యయంతో 30మీటర్ల టెలిస్కోపును తయారుచేసింది. దాంతో, సునామీలవంటి ప్రకృతి విపత్తుల్ని ముందుగానే పసిగట్టి, జాగ్రత్తలు చేపట్టే దిశలో పెద్ద ముందడుగు వేసింది. సముద్ర తీరప్రాంతంలో నివసిస్తున్న 26శాతం దేశ జనాభాకు ఇది వరంలాంటిదే. కానీ, అనేక దేశాలతో పోలిస్తే శాస్త్ర-సాంకేతిక పరిశోధనలు, ఆవిష్కరణల్లో భారత్‌ ఎంతగానో వెనకబడి ఉండటం- ఆందోళన కలిగిస్తోంది.

భారతదేశం గతేడాది శాస్త్ర సాంకేతికపరంగా రెండు కీలకమైన మైలురాళ్లు దాటింది. వాటిలో మొదటిది- మంగళ్‌యాన్‌. తొట్టతొలి ప్రయత్నంలోనే కుజ గ్రహానికి మానవరహిత అంతరిక్ష నౌకను పంపడం ద్వారా భారతీయ రోదసి పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్ర సృష్టించింది. రెండోది- వాతావరణ హెచ్చరికలకు సంబంధించి సాధించిన విజయం. ముందస్తుగా, కచ్చితంగా హుద్‌హుద్‌ తుపాను తీవ్రత, అది సృష్టించనున్న ఉత్పాతం గురించి హెచ్చరించి- వేల ప్రాణాలను కాపాడటం చిన్న విషయం కాదు. 1999లో ఒడిశాను పెనుతుపాను ముట్టడించినప్పుడు అధికారికంగానే 3,958 మంది మృతి చెందారు. వాస్తవంలో ఆ సంఖ్య 10వేలకు పైమాటేనన్న అంచనాలు వెలువడ్డాయి. అప్పట్లో తుపానును 24గంటల ముందు మాత్రమే పసిగట్టి, హెచ్చరించేవారు. దాంతో సురక్షిత ప్రాంతాలకు తరలి, ప్రాణాలు కాపాడుకొనేందుకు ప్రజలకు పెద్దగా సమయం లభించేది కాదు. ఇప్పుడు అయిదు రోజుల ముందుగానే తుపాను తీవ్రత గురించి హెచ్చరిస్తున్నారు. దాంతో ముందుజాగ్రత్త చర్యలకు వీలవుతోంది. లక్షల ప్రాణాలు కాపాడగలుగుతున్నారు.

సామాజిక, ఆర్థిక వ్యవస్థల్ని కాపాడి, మానవాభివృద్ధికి దోహదపడే నిజమైన వైజ్ఞానిక వికాసం ఇదే. కానీ, పరిశోధనలపరంగా మన గురి లక్ష్యానికి బారెడు దూరంలో ఉండటమే విచారకరం. చైనా, దక్షిణ కొరియా, అమెరికాలతో పోలిస్తే శాస్త్ర సాంకేతిక రంగంపై భారత్‌ చేస్తున్న వ్యయం చాలా తక్కువ. 2011-12లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో అమెరికా 2.76శాతం, దక్షిణ కొరియా 4.04శాతం ఖర్చు చేస్తే, పరిశోధన కోసం భారత్‌ చేసిన వ్యయం 0.88శాతం మాత్రమే. ఈ విషయంలో మనకన్నా చైనా అయిదురెట్లు అధికంగా వ్యయం చేస్తోంది. రష్యాను మినహాయిస్తే ఇతర 'బ్రిక్‌' దేశాలకన్నా పరిశోధనలో ఇండియా చాలా వెనకబడిపోయింది. మోదీ ప్రభుత్వం గడచిన జులైలో సమర్పించిన 2014-15 బడ్జెట్‌లో శాస్త్ర పరిశోధనలకు కేటాయింపులను పెంచినప్పటికీ- వాటి వినియోగ ప్రాధాన్యాలు గురి తప్పుతున్నాయి. పరిశోధన, అభివృద్ధి వ్యయంలో మూడింట రెండొంతులు కేవలం మూడు రక్షణ సంస్థల (అణుశక్తి విభాగం, రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ- డీఆర్‌డీఓ, అంతరిక్ష విభాగం)కే కేటాయిస్తున్నారు. వ్యవసాయ పరిశోధన, వైజ్ఞానిక-పారిశ్రామిక పరిశోధన, వైద్య పరిశోధన, జీవ సాంకేతిక విభాగం వంటి కీలక వ్యవస్థలు తక్కిన నిధులతోనే నెట్టుకు రావాల్సి వస్తోంది. ఈ విభాగాలకూ సమప్రాధాన్యం దక్కేలా మోదీ ప్రభుత్వం సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందీనాడు!

ఉద్యమస్థాయిలో కార్యాచరణ

ప్రపంచ నవీకరణ సూచి (జీఐఐ-2014) ప్రకారం వైజ్ఞానిక పరిశోధనల్లో భారత్‌ స్థాయి అంతకుముందు ఏడాది కన్నా 10 స్థానాలు దిగజారింది. 143 దేశాల సూచిలో భారత్‌ 76వ స్థానానికే పరిమితమైంది. ప్రపంచ పోటీతత్వ నివేదిక (జీసీఆర్‌) సైతం నవీకరణల్లో భారత్‌ వెనకబాటును కళ్లకు కట్టింది. మరోవైపు చైనా శాస్త్ర-ఇంజినీరింగ్‌ రంగాల్లో దశాబ్ద కాలంలో అద్భుత ప్రగతి సాధించి, ఐరోపా సంఘం (ఈయూ), అమెరికాల తరవాత మూడో స్థానానికి ఎగబాకింది. విజ్ఞాన శాస్త్ర-ఇంజినీరింగ్‌ సూచీలను బట్టి- 2011లో ప్రపంచవ్యాప్తంగా 8.27లక్షల పరిశోధన పత్రాలు ప్రచురితమైతే, అందులో 'ఈయూ'లోని 28 దేశాల వాటా 2.54లక్షలు (31శాతం), అమెరికా వాటా 2.12లక్షలు (26 శాతం), చైనా వాటా దాదాపు 90వేలు (11శాతం), జపాన్‌ వాటా 47వేలు (ఆరు శాతం) ప్రముఖ విజ్ఞానశాస్త్ర పత్రికల్లో పరిశోధన పత్రాల ప్రచురణ విషయంలో భారత్‌ 20వేలైనా దాటకుండా ఎక్కడో అడుగున ఉంది. అమెరికాలో ప్రతి పది లక్షల జనాభాకు 4,651 మంది పరిశోధకులు ఉంటే భారత్‌లో ఆ సంఖ్య 140 మాత్రమే. విశ్వవిద్యాలయాలను విజ్ఞానశాస్త్ర పరిశోధన కేంద్రాలుగా మారిస్తేనే ఈ పరిస్థితిలో కొంతైనా మార్పు వస్తుంది. స్టెమ్‌ (విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక, ఇంజినీరింగ్‌, గణితశాస్త్రం) విధానానికి అగ్ర ప్రాధాన్యం ఇచ్చి, భారీ పెట్టుబడులతో ప్రోత్సహించడం ఇప్పుడు తప్పనిసరి. ఈ దిశలో కార్యాచరణ ఉద్యమస్థాయిలో సాగాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా జరిగిన 101 సభల్లో చేసిన సూచనలు, సిఫార్సులకు పట్టిన గతే ఈసారి పట్టరాదు. శాస్త్ర- సాంకేతిక రంగాల్ని ప్రక్షాళించేందుకు ప్రస్తుత సైన్సు కాంగ్రెస్‌ను మోదీ సర్కారు ఒక సువర్ణావకాశంగా వినియోగించుకోవాలి.

(రచయిత - పి.దత్తారాం ఖత్రీ)
Posted on 03-01-2015