Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


సైన్స్ & టెక్నాల‌జీ

మనిషికి చేదోడువాదోడు

* రాటుదేలుతున్న మానవరూప రోబోలు

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రూపొందించిన ‘వ్యోమమిత్ర’ రోబో ఇటీవల అందరి దృష్టినీ ఆకర్షించింది. ‘నేను సగం హ్యూమనాయిడ్‌ రోబోను. వ్యోమమిత్రను’ అంటూ బెంగళూరులో ఏర్పాటయిన సదస్సులో ఈ రోబో తనను తాను ప్రపంచానికి పరిచయం చేసుకుంది. మానవ రూపాన్ని పోలిన రోబోల (హ్యూమనాయిడ్‌ రోబో) రంగంలో ఇదో ముందడుగు. గగన్‌యాన్‌ పరిశోధనలో భాగంగా ‘ఇస్రో’ చేపట్టే మానవ రహిత యాత్రలో భాగంగా ఇది రోదసిలోకి అడుగుపెట్టనుంది. అంతరిక్షంలో దాదాపుగా మనుషుల తరహాలోనే ఇది కార్యకలాపాలు నిర్వహిస్తుంది. వ్యోమగాములకు అవసరమైన జీవనాధార ఆపరేషన్లు, ఆక్సిజన్‌ సమాచారాన్ని ఇది అందిస్తుంది. అంగారక గ్రహంపై ప్రయోగం కోసం అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ 300 పౌండ్ల బరువున్న హ్యూమనాయిడ్‌ రోబోను ప్రత్యేకంగా రూపొందించింది. నిరంతరాయంగా చుట్టుపక్కల వాతావరణాన్ని పరిశీలించగల బహుళ పార్శ్వ కెమెరాలు, 3-డీ స్టీరియోలు, వీడియోలతో దీన్ని తయారు చేశారు. హ్యూమనాయిడ్‌ రోబోల తయారీపై అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కొంతకాలంగా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాటి వినియోగం ఇనుమడించడమే ఇందుకు కారణం.

కొత్త ప్రపంచం వైపు
ఈ రోబోలు అచ్చు మానవ రూపాన్ని పోలి ఉండటంతో పాటు సాధారణ మనుషుల మాదిరిగా సంభాషించడం, నడవడం, అభిప్రాయాలు పంచుకోవడం వంటి పనులు చేస్తాయి. ఇందులో కొన్ని రకాల రోబోలు అంతకుముందు నెరపిన సంభాషణలనూ గుర్తుచేయగలవు. మానవరూప రోబోలు భావోద్వేగాలనూ వ్యక్తం చేయగలవని నిరూపించేందుకు శాస్త్రవేత్తలు పట్టుదలగా పనిచేశారు. హాంకాంగ్‌ కంపెనీ రూపొందించిన హ్యూమనాయిడ్‌ రోబో సోఫియా 50 రకాల భావాలు వ్యక్తీకరించగలదు. ముఖాలను, దృశ్యాలను గుర్తించగలదు. మనుషుల హావభావాలు అనుకరించగలదు. దానితోపాటు మనుషులతో కొద్దిపాటి సంభాషణనూ కొనసాగించగలదు. అందమైన మహిళను పోలినట్టుండే మొట్టమొదటి హ్యూమనాయిడ్‌ రోబోను చైనా నాలుగేళ్ల క్రితం రూపొందించింది. దానిపేరు జియా! ఈ రోబో వాతావరణం ఎలా ఉందో చెప్పగలదు. కళ్ల కదలికలు, సంభాషణలు పలికేటప్పుడు పెదాలు సరిపోవడం (లిప్‌ సింక్రనైజేషన్‌) వంటి అంశాల విషయంలో నిపుణులు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ రోబోను తయారు చేశారు. కృత్రిమమేధ రంగంలో పరిశోధనలు ఊపందుకుంటున్నాయి. ఫలితంగా రోబోల రూపకల్పనలో గుణాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చైనాలో రెస్టారెంట్లు, నర్సింగ్‌ హోంలు, ఆస్పత్రులు, గృహాల్లో విస్తృతంగా రోబోల వినియోగంవైపు కదులుతున్నారు. అమెరికా, కెనడా, జపాన్‌, దక్షిణ కొరియా, బ్రిటన్‌, సింగపూర్‌లు రోబోల తయారీలో చురుగ్గా ఉన్నాయి. ఇందులో కొన్ని దేశాలు కృత్రిమ మేధ పరిశోధనలకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయిస్తున్నాయి.

జపాన్‌ శాస్త్రవేత్తలు 2014లో వార్తలు చదివే మొట్టమొదటి ఆండ్రాయిడ్‌ రోబోకు రూపకల్పన చేశారు. బీనా-48 పేరుతో తయారైన రోబో- రచయిత, వ్యాపారవేత్తయిన మార్టిన్‌ రోత్‌ బ్లాట్‌ మార్గదర్శకంలో అచ్చు ఆయన భార్య పోలికలతో రూపుదిద్దుకుంది. నేషనల్‌ జియోగ్రాఫిక్‌ ఛానల్‌తోపాటు అనేక టీవీ షోల్లో ఇది ప్రత్యక్షమైంది. 2025నాటికి కార్మికులు చేపట్టే పనుల్లో పాతిక శాతం రోబోలే చేస్తాయని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. వీటి సామర్థ్యం పెరగడం, తయారీ ఖర్చులు క్రమంగా తగ్గుతుండటం ఇందుకు కారణం. కంప్యూటర్‌, ఎలెక్ట్రానిక్‌ ఉత్పత్తులు, విద్యుత్‌ ఉపకరణాలు, గృహోపకరణాల పరిశ్రమలు, రవాణా ఉపకరణాల్లోనూ రోబోల వినియోగం పెరుగుతోంది. వీటివల్ల సేవల రంగం అన్నింటి కంటే ఎక్కువగా ప్రభావితమవుతుందని భావిస్తున్నారు. 2016లో 2.96 కోట్ల యూనిట్లుగా ఉన్న హ్యూమనాయిడ్‌ రోబోల వినియోగం, 2026 నాటికి 26.43 కోట్ల యూనిట్లకు పెరుగుతుందన్న అంచనాలున్నాయి (బెర్గ్‌ ఇన్‌సైట్‌ నివేదిక). 2018లో ప్రపంచ విపణిలో రోబో పరిశ్రమ పరిమాణం 3,801 కోట్ల డాలర్లుంటే, 2023 నాటికి అది 6,400 కోట్ల డాలర్లకు చేరుతుందని బీసీసీ పరిశోధన సంస్థ అంచనాలు వెల్లడిస్తున్నాయి. జర్మనీ పరిశ్రమల రంగంలో రోబోల వినియోగం అధికంగా ఉంది. అక్కడ సగటున 10వేల మంది ఉద్యోగులకు 309 రోబోలను వినియోగిస్తున్నారు. మిగిలిన దేశాలతో పోలిస్తే అది చాలా ఎక్కువ.

మానవుల ప్రవేశానికి దుర్లభమైన ప్రదేశాల్లో రోబోల సేవలు ఉపయోగపడుతున్నాయి. ఇటాలియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ సంస్థ రూపొందించిన ‘వాక్‌ మ్యాన్‌’ ప్రత్యేకమైంది. 2015లో మొదటిసారిగా రూపొందించిన రోబోను ఆ తరవాత అదనపు సాంకేతిక హంగులు జోడించి ఆధునికీకరించారు. ఆరడుగుల ఎత్తు, 102 కిలోల బరువుతో దీనిని రూపొందించారు. ఒక కిలోవాట్‌ బ్యాటరీతో రెండుగంటల పాటు ఇది సేవలందించగలదు. గ్యాస్‌లీకేజి లాంటి ప్రమాదాలు సంభవించినప్పుడు ఇది తనంతట తానుగా గది తలుపులు తెరిచి లోపలకు ప్రవేశించగలదు. లీకేజిని గుర్తించి సంబంధిత వాల్వును మూసివేయగలదు. శిథిÅలాలనూ తొలగించగలదు. ఇంజినీరింగ్‌ కార్యకలాపాల్లోనూ రోబోల సేవలు వినియోగించుకుంటున్నారు. జాయింట్‌ రోబొటిక్స్‌ లేబొరేటరీ, ఎయిర్‌బస్‌ గ్రూపులు సంయుక్తంగా నాలుగేళ్లపాటు చేపట్టిన పరిశోధనలు సత్ఫలితాలనిచ్చాయి. ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ పనుల్లో కార్మికులకు ప్రత్యామ్నాయంగా, మనుషులకు ప్రమాదకరమైన పనులకూ రోబోలను వినియోగిస్తున్నారు.

అన్నింటా తామై...
జాయింట్‌ రోబొటిక్స్‌ లేబొరేటరీ రూపొందించిన హెచ్‌ఆర్‌పీ2, హెచ్‌ఆర్‌పీ4 రకాల రోబోలు అత్యంత ఎత్తయిన ప్రదేశాలకు నిచ్చెన సాయంతో ఎగబాకగలవు. కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రోబోలు స్వేచ్ఛగా చేతులు అటూ ఇటూ కదిలించటానికి అనువుగా, మనుషుల కండరాలను పోలిన విధంగా అమరికల కోసం కృషి చేశారు. తనకు వెయ్యిరెట్లు అధికమైన బరువును మోయగలగడం, శరీరాన్ని కదిలించడం, వంచడం తదితర చర్యలకు వీలుగా వాటికి ‘సింథటిక్‌ కండరాల’ను అమర్చారు. వృద్ధులు, పసిపిల్లలు, రోజువారీ అవసరాలు కోరుకునే వారికి రోబోలు తమ వంతు సహకారం అందిస్తున్నాయి. మాటలు సరిగ్గా రాని చిన్నారులకు తోడ్పాటును అందిస్తున్నాయి. వైద్యరంగంలో సహాయక పాత్రను ఇవి సమర్థంగా పోషిస్తున్నాయి. భద్రత విభాగంలో రోబోల పాత్ర చెప్పుకోదగింది. నేరాలను నియంత్రించడం, పసిగట్టడం వంటివి కృత్రిమ మేధ ద్వారా సాధ్యమవుతుంది. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను పసిగట్టేందుకు వీలవుతుంది. వ్యవసాయం, ఆహార తయారీలోనూ వీటిని వాడుతున్నారు.

కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువుల మాదిరిగా హ్యూమనాయిడ్‌ రోబోలు మున్ముందు కుటుంబంలో ఓ భాగంలా మారతాయని భావిస్తున్నారు. నిజజీవితంలో రోబోలు మానవులకు సవాలు విసరడం ఇప్పట్లో సాధ్యమయ్యే విషయం కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా రోబోలకు ముందుగా ‘ప్రోగ్రామింగ్‌’ చేస్తారు. దాంతో అవి కేవలం తమకు నిర్దేశించిన బాధ్యతలు మాత్రమే చేపట్టగలవు. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగల శక్తి వాటికి లేకపోవడం లోటే. స్వీయ ఆలోచన సామర్థ్యం కొరవడటం, సొంతంగా విద్యుత్‌ సరఫరా ఏర్పాటు లేకపోవడం, బ్యాటరీ నియంత్రణ మేరకే పనిచేయగలగడం వంటి అంశాలు వాటికి పరిమితులు విధిస్తున్నాయి. మనిషిని పోలిన ఈ రోబోలను అభివృద్ధి వాహికలుగా ఉపయోగించుకునే ప్రయత్నాలు జోరందుకుంటున్న నేపథ్యంలో- ఇవి దేశాల ఆర్థిక వృద్ధికి చురుకు పుట్టించే సమర్థ సాధనాలుగా మారతాయనడంలో మరోమాట లేదు.

- పార్థసారథి చిరువోలు
Posted on 04-02-2020