Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


సైన్స్ & టెక్నాల‌జీ

బుద్ధిజీవులకు మహమ్మారుల గుణపాఠం

* మానవతే కీలకమంటున్న గతం

‘ఓ ఫుట్‌బాల్‌ ఆటగాడికి నెలకు 10లక్షల యూరోలిస్తారు. దేవుడిలా ఆరాధిస్తారు! అదే ఓ జీవ పరిశోధకుడికి మాత్రం 1,800 యూరోలిస్తారు! మరింకేం, వెళ్ళండి... వెళ్ళి ఆ క్రిస్టియానో రొనాల్డో(ఫుట్‌బాలర్‌)నే అడగండి కరోనాకు మందివ్వమని!’ - కరోనా కాలంలో చక్కర్లుకొడుతున్న బోలెడన్ని వాట్సాప్‌ పోస్టుల్లో- ఓ స్పానిష్‌ జీవశాస్త్ర పరిశోధకురాలి పేరిట వచ్చిన సందేశమిది! ఇందులో ఫుట్‌బాలర్లపై ఆక్రోశమో, వారిపై అసూయో లేదు. మన ప్రాథామ్యాలు; ప్రపంచ దేశాలు, ప్రభుత్వాలు, నాయకుల హ్రస్వదృష్టిపై ఆక్రోశం ఆవేదన దాగున్నాయి! కరోనా లాంటివి కరాళనృత్యం చేస్తుంటే ‘ఇంతా చదువుకొని ఏమీ చేయలేకపోతున్నామే’ అనే ఓ అశక్తత అందులో ఉందనడంలో సందేహం లేదు. నిజమేగదా!

కానీ, ఏం లాభం?- ఇక్కడ మన చిరునామా గల్లంతయ్యే అవకాశం ఉందనే సంగతి మాత్రం గుర్తించలేకపోతున్నాం!

మహమ్మారులు ఈ ప్రపంచానికి కొత్తేం కాదు. క్రీస్తు పూర్వం 430లో ఏథెన్స్‌లో వచ్చిన ప్లేగు నుంచి మొదలు పెడితే, తాజా సార్స్‌, ఎబోలా దాకా బోలెడన్ని! ప్రాణహాని జరుగుతున్నా ప్రతిసారీ మనిషి వాటిని తట్టుకొని నిలబడుతూనే ఉన్నాడు. చరిత్రలో ఏ మహమ్మారి అయినా మానవాళిని వణికించిందే తప్ప- తుడిచిపెట్టలేదు! ఇప్పుడు కరోనా కూడా అలాంటిదే. కానీ, మేం ఆధునికులం, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాం; 5జీతో, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌తో పయనిస్తున్నామనుకుంటున్న వేళ- అమెరికా, ఐరోపా, చైనాలతో సహా యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తుండటం ఈ కరోనా ప్రత్యేకత! ఈ వైరస్‌ తీవ్రత కూడా కొద్దిరోజుల్లో తగ్గిపోవచ్చేమో. లేదా దీనికో మందు కనుక్కొని తగ్గించుకోగలుగుతామేమో! అంతటితో విజయం సాధించామనుకుంటే మాత్రం అంతకంటే మూర్ఖత్వం ఉండదు.

మానవాళి ముందున్న ప్రశ్నలెన్నో...
కరోనా నుంచి మనం నేర్చుకునే పాఠాలేమిటి? కరోనా తరవాత మనుషులుగా మన తీరు ఎలా ఉంటుంది? ప్రకృతి పట్ల, తోటి జీవరాశి పట్ల మన దృక్కోణం ఎలా ఉంటుంది? జీవితాన్ని ఇన్‌స్టంట్‌ కాఫీగా చూస్తున్న నవతరం ఆలోచనల్లో ఎలాంటి మార్పులొస్తాయి, ప్రభుత్వాలెలా ఆలోచిస్తాయి, అధినేతలు ఏం మార్గదర్శనం చేస్తారు, పరిశోధకులు ఎలా స్పందిస్తారు? ఇవన్నీ మానవాళి భవిష్యత్‌ మనుగడను నిర్దేశించే ప్రశ్నలు!

అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందని దేశాలంటూ విభజించుకొని; అగ్రరాజ్యమని, ఆధునికులమని, తెల్లవారమని, నల్లవారమని, కులమని, మతమని, క్యాపిటలిజమని, కమ్యూనిజమని, ఆర్టిఫిషియల్‌, వర్చువల్‌ అని... ఇలా ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా విభజనలు చేసుకొని ఒకర్ని ఎక్కువగా, ఇంకొకర్ని తక్కువగా చిత్రీకరించుకొని- ఈ భూమ్మీద తామే బుద్ధిజీవులమని, తమకు ఎదురులేదనుకునేంతగా కాలరెగరేస్తున్న వేళ- కరోనా మన స్థానమేమిటో, స్థాయేమిటో, మనం సాధించామనుకుంటున్న అభివృద్ధి విలువేమిటో- మార్స్‌ మీద మన మరబొమ్మలు తీసిన హైరెజెల్యూషన్‌ బొమ్మలంత స్పష్టంగా చూపిస్తోంది!

ఆ మూల నుంచి ఈ మూల దాకా ఆర్థిక ప్రపంచాన్ని తన గుప్పిట పెట్టుకోవడానికి సరికొత్త కవాతు మొదలు పెట్టిన చైనాకు ఆ వేగం వెనకాలున్న చీకట్లను; పౌష్టికాహారం, ఆరోగ్యం, అభివృద్ధి మమ్మల్ని చూసి నేర్చుకోండంటూ ప్రపంచానికి పాఠాలు చెప్పే అమెరికా, ఐరోపా దేశాలకు అందులోని డొల్లతనాన్ని ఈ కరోనా ప్రపంచానికి పంచరంగుల్లో చూపించింది! వైరస్‌లు పేద దేశాలకో, బీద ప్రజలకో పరిమితం కాదని, వస్తే అందరినీ మట్టుపెడతాయని కరోనా కళ్ళకు కట్టినట్లు ప్రదర్శిస్తోంది! అభివృద్ధికీ పరిమితులున్నాయని తెలియజెపుతోంది.

ప్రతి మహమ్మారీ మన తప్పిదాలను ఎత్తిచూపేదే! వాటిని దిద్దుకోమని మనల్ని హెచ్చరించేదే! అలా చేసిన సమాజాలు బాగుపడ్డాయి. 1346-1353 మధ్య ఆసియా మీదుగా ఐరోపాకు ప్రయాణించిన ‘బ్లాక్‌డెత్‌’గా పిలిచే మహమ్మారిలో సగం ఐరోపా తుడిచిపెట్టుకుపోయిందని అంచనా. ఐరోపా చరిత్రనే ఆ మహమ్మారి మార్చివేసిందంటారు. ఆ సమయానికి ఐరోపాలో ప్రబలంగా ఉన్న భూస్వామ్య కూలీ వ్యవస్థ మహమ్మారి కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. చాలామంది చనిపోవడంతో కూలీలు దొరక్క, ఉన్నవారికి ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. తదనంతర కాలంలో సాంకేతిక ఆవిష్కరణలకూ ఇది కారణమైందని చెబుతారు. గుణపాఠాలు నేర్చుకోని ఉదంతాలూ ముందున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో వచ్చిన ప్లేగు లాంటివి దేశాల ఆధిపత్య పోరును, ఆశను ఏమీ తగ్గించలేకపోయాయనేది చరిత్ర చెబుతున్న సత్యం.

ప్రకృతితో మమేకమైతేనే ప్రగతి
ఇప్పుడు కరోనాతో అతలాకుతలం అవుతున్న ఇటలీ వేదికగా- 1960ల్లో ‘క్లబ్‌ ఆఫ్‌ రోమ్‌’ అని ఒక బృందం ఏర్పడింది. ప్రపంచంలోని చాలామంది శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు ఇందులో సభ్యులు! 1972లో ఈ బృందం ‘అభివృద్ధి పరిమితులు’ అంటూ ఓ నివేదిక సమర్పించింది. అభివృద్ధికీ పరిమితులున్నాయని... ఈ విశ్వం, భూగోళంతో సమతౌల్యం లేకుండా మానవుడు సాధించే అభివృద్ధి ముందుకు సాగదని స్పష్టీకరించింది. 2100 సంవత్సరం తరవాత మన ఈ ఆర్థికాభివృద్ధి వేగాన్ని, జనాభా విస్ఫోటనాన్ని తట్టుకునే శక్తి ఈ ప్రకృతి వ్యవస్థకు లేదని ఈ బృందం నిర్ధారించింది.

కోట్లాది రూపాయలు పరిశోధనలపై పోస్తున్నా, కంటికి కనిపించని చిన్నజీవులతో పోరాటం చేయలేకపోతున్నాం! ఇప్పటివరకూ మలేరియాకు సైతం వ్యాక్సిన్‌ కనుక్కోలేకపోయాం! మీజిల్స్‌ లాంటివి మళ్ళీ తలెత్తుతూనే ఉన్నాయి. అదీ అమెరికాలో! ఏమైంది... ఈ ప్రపంచ జీవవైద్య పరిశోధన? పేరుకు ‘సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ’ అంటున్నా, విద్యార్థులు వెళుతున్నది టెక్నాలజీ వైపే! సైన్స్‌ వైపు వచ్చేవారే తక్కువ! ‘ఇన్‌స్టంట్‌’ యుగంలో కళాశాల ప్రాంగణం నుంచి బయటపడగానే, లక్షల రూపాయల వేతనాలతో పని చేసేయాలన్న తపనే తప్ప- ఏళ్ళ తరబడి పరిశోధనలు చేసే ఓపికెవరికుంది?

అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి
ఇక ప్రభుత్వాలు, అధినేతలు, ప్రపంచ నాయకత్వాల దృష్టంతా ఎన్నికలు నెగ్గడాలు, వ్యాపార వాణిజ్య సంబంధాలు, యుద్ధాలు... ప్రపంచ పెత్తనాలపైనే ఉంటోంది. మానవాళి మనుగడ కోసం ముందుచూపుతో, విశాల హృదయంతో ఆలోచిస్తున్నవారెవరు? వేగంగా వెళ్ళి బాంబులు వేసేవో... కనిపించకుండా శత్రువును సంహరించేవో, మనుషుల్లేకుండా పనికానిచ్చేవో, క్షణంలో భస్మీపటలం చేసేవో... ఇలా ఆయుధాల ఆవిష్కరణలపై చూపుతున్న శ్రద్ధను- మన ఆరోగ్యంపై మాత్రం చూపలేకపోతున్నాం! పనికిరాని సిద్ధాంతాలు, భావజాలాలు వాటిపై వాదోపవాదాల్లోనే శాస్త్రవేత్తలూ మునిగితేలుతుండటం మానవాళి చేసుకున్న దౌర్భాగ్యం! మానవత్వం ముందు మరే తత్వమూ నిలవలేకపోయింది. మానవత్వం తప్ప మరే మతమూ గెలవలేకపోయింది. ఇదీ చరిత్ర చెబుతున్న సత్యం! అయినా ఇంకా కేపిటలిజం, కమ్యూనిజం... రైట్‌ లెఫ్ట్‌లంటూ, మతాల పేరు చెబుతూ ఎందుకీ ఆత్మవంచన! తోటి మనిషి కష్టంలో లాభాపేక్ష చూడటం అగ్రనీతి అవుతుందో ఉగ్రనీతి అవుతుందో అమెరికా, చైనా లాంటి దేశాలు తేల్చుకోవాల్సిన తరుణమిది! తోటి మానవుల జీవన స్థాయి పెంచని... తోటి జీవులతో కలిసి ఉండలేని అభివృద్ధి ఓ అభివృద్ధి కాదు. ఆ దేశం... ఈ దేశమని కాకుండా అన్ని దేశాల్లోనూ రాజకీయ సంస్కృతే సంకుచితంగా మారింది!

ఇప్పటికైనా వాణిజ్య కాంక్షలు కాకుండా, ప్రజారోగ్యం ప్రపంచ దేశాల ప్రథమ అజెండా కావాలి. ప్రజారోగ్యంలో దేశాలన్నీ పెట్టుబడి పెట్టాలి! ఎవరికి వారుగా చేసినా, కలిసి చేసినా ప్రపంచ ఆరోగ్యమే ప్రాథామ్యం కావాలి! ఇలాంటి మహమ్మారుల విషయంలో ఒకదేశం మరోదేశంపై ఆరోపణలు సంధించడం కాకుండా, ఒకరికొకరు సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, పరిశోధనల్లో పరస్పరం సహకరించుకోవడంతోనే గండం నుంచి గట్టెక్కగలుగుతాం. అనుమానాలు, ఆరోపణలు, పంతాలు... మానవాళి అంతానికే తప్ప- ఆనందానికి దారులు కాదు.

వ్యక్తిగతంగానూ మనుషులుగా మనందరి ఆలోచనా విధానం కూడా మారాల్సిన అవసరాన్ని కరోనా చాటిచెబుతోంది! మనం మానవమాత్రులమేనని తేల్చిచెప్పింది! ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌... వర్చువల్‌ రియాలిటీలొస్తే రోబోలతో కలిసి ఎలా బతకాలో ఊహించుకునే ముందు- ప్రకృతితో ఎలా కలసి ఉండాలో, ఇతర జీవులతో ఎలా సహజీవనం చేయాలో తెలుసుకోమని చెబుతోంది! లేదంటే కరోనా తాతలొస్తాయ్‌! చరిత్రను, సంఘటనలను వివరించడానికి క్రీస్తు పూర్వం - క్రీస్తుశకం అని ఎలా అంటామో- ఇకమీదట మన జీవనం ‘కరోనాకు ముందు - కరోనా తరవాత’లా మారాలి. కరోనాకు పూర్వం ఎలాగూ సరిగ్గా ఉండలేకపోయాం. కరోనా శకంలోనైనా మనసున్న మనుషులుగా ఉంటామా... ఉందామా?

వైరస్‌లతో నష్టం అపారం
పేర్లు వేరైనా కరోనా లాంటి వైరల్‌ మహమ్మారుల తాకిడి గతంలోకంటే ఈ రెండుమూడు దశాబ్దాల నుంచి ఎక్కువైంది. సార్స్‌ అనో, స్వైన్‌ఫ్లూ అనో, ఎబోలా, మెర్స్‌, జైకా, ఎల్లో ఫీవర్‌... ఇలా ఏదో ఒకరూపంలో ఇవి మానవాళికి సవాలు విసరుతూనే ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థకు ప్రతి నెలా 5,000 దాకా వివిధ కొత్త రోగాల గురించిన సంకేతాలు అందుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం, ఏటా ఈ మహమ్మారుల కారణంగా జరుగుతున్న నష్టం సుమారు 57 వేలకోట్ల డాలర్లు! కేవలం దేశాల మధ్య యుద్ధాల వల్ల అపారనష్టం సంభవిస్తుందనుకోవడం పొరపాటు. అంతకుమించిన భారీ మూల్యాన్ని కంటికి కనిపించని ఈ సూక్ష్మక్రిములతో సాగిస్తున్న సమరం వల్ల చెల్లించాల్సి వస్తుంది.

- రేగళ్ళ సంతోష్‌కుమార్‌
Posted on 25-03-2020