Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


సైన్స్ & టెక్నాల‌జీ

రెచ్చిపోతున్న సైబర్‌ చోరులు

కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించే లక్ష్యంతో తరతమ భేదాలతో ప్రపంచ దేశాలెన్నో లాక్‌డౌన్‌ నిబంధనలు అమలుపరుస్తున్నాయి. ఆంక్షల కారణంగా బయటకు అడుగుపెట్టలేని స్థితిలో ఉన్న జన బాహుళ్యానికి కొవిడ్‌కు సంబంధించిన లోతైన సమాచారం, తాజా పరిణామాలు సహజంగానే ఆసక్తి కలిగిస్తాయి. కొంతమందిలో మహమ్మారి పట్ల భీతిని, తోటివారి బాగోగుల గురించి ఆరాటపడే మరికొందరి ఉదార స్వభావాన్ని సొమ్ము చేసుకోవడంలో దేశదేశాలకు చెందిన సైబర్‌ ముఠాలు ఆరితేరిపోతున్నాయి. జనం నోళ్లలో నానుతున్న కరోనా వైరస్‌కు ముందో వెనకో స్టేటస్‌, మ్యాప్‌, రియల్‌ టైమ్‌ వంటి విశేషణాలు జోడించి ఎన్నెన్ని మాయదారి వెబ్‌సైట్లు ప్రచారంలోకి వచ్చాయో కేంద్ర హోం మంత్రిత్వశాఖ మూడు వారాల క్రితమే వివరణాత్మక జాబితా విడుదల చేసింది. భారత జాతీయ సైబర్‌ భద్రతాధికారి లఫె్టినెంట్‌ జనరల్‌ రాజేశ్‌ పంత్‌ అంచనా ప్రకారం, రెండు నెలల వ్యవధిలో కరోనా వైరస్‌ పేరిట అంతర్జాతీయంగా నాలుగువేల దాకా మోసకారి పోర్టల్స్‌ అవతరించాయి. కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మాయా చికిత్సలపై రోజూ లక్షలమందికి సైబర్‌ నేరగాళ్లనుంచి ఇ-మెయిళ్లు వెల్లువెత్తుతున్న దృష్ట్యా అమెరికా, యూకే వంటివి తమ పౌరుల్ని అప్రమత్తం చేస్తున్నాయి. కొవిడ్‌ కేసుల ప్రజ్వలనం దరిమిలా సైబర్‌ నేరాలు నాలుగింతల దాకా ఎగబాకినట్లు అమెరికా నిఘా సంస్థ ఎఫ్‌బీఐ చెబుతోంది. ఇళ్లకు పరిమితమైన పౌరుల భయాందోళనల్ని లాభార్జన అవకాశాలుగా మలచుకోవడమే ధ్యేయంగా సైబర్‌ నేరగాళ్లు ఎంతకైనా బరితెగిస్తున్నారన్న ఐరోపా సంఘం సారథి ఉర్సులా వాండర్‌ లయెన్‌ వ్యాఖ్యలు- పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. 35 దేశాలకు చెందిన మూడువందలకుపైగా భద్రతానిపుణులు సైబర్‌ నేరగాళ్లపై ఉమ్మడి పోరాటానికి తెరతీసిన నేపథ్యంలో, దేశీయంగానూ విస్తృత జన చేతన వ్యూహాలు చురుగ్గా పదును తేలాలి!

మూడేళ్లక్రితం ‘వాన్న క్రై’ పేరిట సైబర్‌ నేరగాళ్ల భీకర దాడులు 175 దేశాల్ని గడగడలాడించాయి. తరవాత రష్యా, ఉక్రెయిన్‌, అమెరికా, జర్మనీ, జపాన్‌, దక్షిణ కొరియా ప్రభృత దేశాల్లో సైబరాసురుల విజృంభణను వెన్నంటి దేశంలో లక్షలాది డెబిట్‌ కార్డుల సమాచారం నేరగాళ్ల పాలబడిందన్న కథనాలు వెలుగు చూశాయి. అప్పట్లో కేంద్రానికి చెందిన పలు వెబ్‌సైట్లూ సైబర్‌ దాడులకు గురయ్యాయి. ఇప్పుడు లాక్‌డౌన్‌ కారణంగా వివిధ సంస్థల ఉద్యోగులు ఇళ్లనుంచే విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లకు కార్యాలయాల్లో ఉన్నంత సమాచార భద్రత ఇళ్లలో ఉండదన్నది నిజం. ఉపయోగించే యాప్‌లు, నొక్కే లింకుల విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కీలక సమాచారం సైబర్‌ నేరగాళ్లకు చేరిపోతుంది. జూమ్‌ వీడియో యాప్‌ వాడుతున్న ఇద్దరు కోల్‌కతా వృత్తి నిపుణుల కంప్యూటర్లను అక్రమంగా చెరపట్టిన నేరగాళ్లు బిట్‌కాయిన్ల రూపేణా తాము అడిగినంతా చెల్లించాల్సిందేనని షరతు విధించిన ఉదంతం అందుకు తాజా దృష్టాంతం. కరోనా వైరస్‌ మాల్వేర్‌ సాయంతో కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లనుంచి ముఖ్య సమాచారం సంగ్రహిస్తున్న చోరులు క్షణాల్లో బాధితుల బ్యాంక్‌ ఖాతాల్ని ఖాళీ చేసేస్తున్నారు. కొద్దిపాటి తేడాలతో ‘ప్రధాని ప్రత్యేక నిధి’గా భ్రమింపజేసే లింకుల వెల్లువ, సైబర్‌ ముఠాల చోర కళా ప్రావీణ్యానికి నిదర్శనం. ప్రపంచంలోనే ఎత్తయిన సర్దార్‌ పటేల్‌ విగ్రహాన్ని 400 కోట్ల డాలర్లకు ఆన్‌లైన్‌లో అమ్మజూపిన ప్రబుద్ధుడు, అలా సేకరించిన మొత్తాన్ని గుజరాత్‌ ప్రభుత్వ కొవిడ్‌ వ్యతిరేక పోరుకు జమ చేస్తానన్న ప్రహసనంపై ఇటీవలే పోలీసు కేసు నమోదైంది. లాక్‌డౌన్‌ పూర్తయ్యేవరకు ఉచితంగా సినిమాలు చూడటానికి, చరవాణి రీఛార్జికోసం తాము పంపిన వాట్సాప్‌ లింకును పదిమందికి చేరవేస్తే చాలునన్న ఎరలకు చిక్కినవాళ్లు మరెందరినో బాధితుల జాబితాలోకి చేరుస్తున్నారు. ప్రభుత్వపరంగా సైబర్‌ ఆత్మరక్షణ యంత్రాంగం పటిష్ఠమైతేనే, ఈ అంతర్జాల ఉగ్రవాదానికి కోరలు తుంచగలిగేది. ఆలోగా వ్యక్తిగత స్థాయిలో పాటించే సంయమనం, తీసుకునే జాగ్రత్తలే నష్టతీవ్రతను తగ్గించగలుగుతాయి!

Posted on 24-04-2020