Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


సైన్స్ & టెక్నాల‌జీ

స్వప్నం కాదు... సత్యమే!

* 'డిజిటల్‌ ఇండియా'
రానున్న మూడేళ్లలో 'సాంకేతిక పురోగమన భారతావని'ని కళ్లముందు ఉంచే ప్రయత్న ఫలితమే 'డిజిటల్‌ ఇండియా'. ప్రధాని నరేంద్ర మోదీ మానస పుత్రికగా రూపుదిద్దుకొన్న ఈ విశేష ప్రక్రియతో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన విప్లవానికి తొలి అడుగులు పడ్డాయి. సమాచార సాంకేతికతే దేశ స్వరూపాన్ని ఆసాంతం మార్చనుంది. దీంతో పాలకులు, పాలితుల మధ్య అంతరాన్ని బాగా తగ్గించే దిశగా బృహత్తర కృషి మొదలైంది. రాజధాని దిల్లీలోని ప్రభుత్వ పెద్దలు ఎక్కడో మారుమూల ఉన్న గ్రామ పంచాయతీల పరిస్థితులను తెలుసుకోవడానికి ఒక్క మీటే దూరం! ఈ పథకం లక్ష్యాలు సామాన్యుడి దరికిచేరే మార్గాలను అన్వేషించడమే ప్రస్తుతం జరగాల్సిన పని!.

సత్వర ఫలితాల సాధన

గ్రామీణ భారతీయ సమాజాన్ని డిజిటల్‌ సాధికారత వైపు నడిపించాలన్నది అత్యున్నత ఆశయం. దీనివల్ల గుణాత్మక, జ్ఞానాత్మక ఆర్థిక వ్యవస్థ ఆవిష్కారమవుతుంది. ప్రభుత్వ శాఖలన్నింటినీ అనుసంధానించడం ద్వారా సుపరిపాలన, అవినీతి రహిత భారత్‌ను సాకారం చేసుకోవడమే ఇందులోని లక్ష్యాలు. ప్రతి ఒక్క పౌరుడికీ డిజిటల్‌ మౌలిక వసతులు కల్పించడం; ప్రభుత్వ సేవలతో పాటు పాలన, పథకాలను చేరువ చేయడం వంటి ప్రధాన అంశాలపైనే 'డిజిటల్‌ ఇండియా' దృష్టి సారించింది. ఈ పథకం ద్వారా బ్రాడ్‌ బ్యాండ్‌ రహదారులు నిర్మిస్తారు. చరవాణి అనుసంధానంతో అంతర్జాతీయ సమాచారం వినియోగిస్తారు. అందరికీ అంతర్జాల సేవలు అందిస్తారు. వీటి ప్రకారం- పౌరుడు తన దగ్గర ఉన్న విలువైన పత్రాల్ని (దస్తావేజులు, ఒప్పందం కాగితాలు, విద్యా ఉద్యోగ సంబంధ ధ్రువపత్రాలు) ఎలక్ట్రానిక్‌ పత్రాలుగా మార్చి వాటిని డిజిటల్‌ లాకర్లలో దాచవచ్చు. దీనివల్ల దొంగల భయం, అగ్ని ప్రమాదాలు, కాగితాలు చిరిగిపోవడం వంటివి ఉండవు. ఈ- సంతకం ద్వారా ఎవరైనా తన ఆధార్‌ కార్డుతో 'ఆన్‌లైన్‌'లో చేసే ప్రతి లావాదేవినీ అనుసంధానం చేసుకోవచ్చు. విద్యార్థులు జాతీయ ఉపకారవేతన 'పోర్టల్‌' సాయంతో తమకు చెందాల్సిన ప్రతి రూపాయిని, సౌకర్యాన్ని మరింత సులువుగా పొందవచ్చు. 'మై గవర్నమెంట్‌ ఇన్‌' ద్వారా నేరుగా పాలకులతో వివిధ సమస్యల గురించి మాట్లాడవచ్చు. పరిష్కారాలను సూచించడంతో పాటు, ప్రభుత్వ పాలన క్రమంలోని వివిధ అంశాల్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంటుంది. 'ఆన్‌లైన్‌' నమోదు కారణంగా వైద్యసేవలు మరింత చేరువవుతాయి. వైద్యసేవల కోసం సంప్రతించడం మొదలు ఫీజులు కట్టడం, వ్యాధి వివరాల నమోదు వంటివన్నీ ఆన్‌లైన్‌లోనే కొనసాగడం వల్ల ఎటువంటి లోపాలకూ తావులేని వైద్యం పేదవాడికి అందుబాటులోకి వచ్చే వీలు ఉంటుంది. ఈ- పరిపాలనను ఎమ్‌- పరిపాలన (ఎలక్ట్రానిక్‌ నుంచి మొబైల్‌)గా మార్చడంతో ప్రతి ఒక్కరూ సులభంగా ప్రభుత్వ పథకాలను వినియోగించుకుంటారు. ఐటీ రంగంలో పెద్ద యెత్తున ఉద్యోగావకాశాలు కల్పిస్తుండటం వల్ల, వచ్చే అయిదేళ్లలో అనేకమందికి ఉపయోగం కలుగుతుంది. ఈ-క్రాంతితో దేశంలోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను అంతర్జాల సదుపాయంతో అనుసంధానిస్తారు. రైతులకు గిట్టుబాటు ధరలు, ప్రభుత్వ సబ్సిడీలు, రుణాల వంటి వివరాలను మొబైల్‌ ద్వారా తెలియజేస్తారు. పోలీసు, న్యాయవ్యవస్థలను ప్రజల వద్దకు చేర్చేలా- వారి సేవలను అంతర్జాలం ద్వారా అందుబాటులోకి తెస్తారు. ఇవన్నీ సామాన్యుడికి ఒక కలలా అనిపించవచ్చు. ఆచరణలో సాధ్యమేనా అనే సందేహమూ కలగవచ్చు. ఆ స్వప్నాన్ని నిజం చెయ్యాలంటే ప్రభుత్వం గట్టి మేలే తలపెట్టాలి. ఈ దిశగా కొన్ని చర్యలు ఇప్పటికే చేపట్టారు. రూ. 1.13లక్షల కోట్ల పెట్టుబడితో, 2.5లక్షల గ్రామాలకు 'ఆప్టికల్‌ ఫైబర్‌' అందించే లక్ష్యంతో సాగుతున్నారు. 2019 నాటికి దేశంలోని దాదాపు సగం జనాభాకు డిజిటల్‌ ఇండియా సేవలు అందించాలని ముందుకు కదులుతున్నారు. అప్పటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రస్తుత వేగం సరిపోదు. నెలకు 30,000 కిలోమీటర్ల వంతున మొత్తం 75లక్షల కి.మీ. ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్‌ను 2017నాటికి అందించాలని భావించారు. ఇప్పటివరకు నెలకు కేవలం 500కి.మీ. కేబుల్‌ పనినే చేయగలుగుతున్నారు. ఇప్పటివరకు 5000 గ్రామాలు మాత్రమే అనుసంధానమయ్యాయి. 'ట్రాయ్‌' నివేదిక ప్రకారం ల్యాండ్‌లైన్లను వేయడంలో 125వ స్థానంలో, వైర్‌లెస్‌ కనెక్షన్లు అందించడంలో 113వ స్థానంలో భారత్‌ వెనకబడి ఉంది. డిజిటల్‌ ఇండియా పనులు వివిధ రాష్ట్రాల్లో ఇదివరకే మొదలయ్యాయి. 2001లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ-సేవ కేంద్రాల రూపంలో వివిధ సేవలు అందించడం ప్రారంభించారు. 2002లో 'అక్షయ' పేరుతో కేరళ ప్రభుత్వం ఇటువంటి సేవలు ప్రారంభించింది. ఈపాటికే అక్కడి అన్ని జిల్లాలను ఈ-జిల్లాలుగా మార్చడం ద్వారా లక్ష్యాలను చేరుకున్నారు. తాజాగా ప్రపంచబ్యాంకు సూచనల ప్రకారం 'బ్రాడ్‌బ్యాండ్‌' అనుసంధానతను పదిశాతం పెంచితే, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 13శాతం పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తిరిగి డిజిటల్‌ ఇండియా తెరపైకి వచ్చింది. దీని లక్ష్యం నెరవేరితే, ఒక్క గ్రామీణ భారత్‌కే రూ.64,800కోట్ల స్థూల లాభం చేకూరుతుంది. స్వప్నం సాకారం కావాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కోక తప్పదు. ఇప్పటికీ 30శాతం గ్రామాలకు సరైన రవాణా, మారుమూల ప్రాంత పల్లెలకు రోడ్లు లేవు. ఇటువంటి గ్రామాలకు ఫైబర్‌ కేబుల్‌ వెయ్యాలంటే ముందుగా రోడ్లను అభివృద్ధి చేయాలి. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో 40శాతంపైగా నిరక్షరాస్యులు. వీరికి డిజిటల్‌ పరిజ్ఞానం కల్పించడం సవాలుతో కూడుకున్న పని. ముందుగా వీరికి అక్షరజ్ఞానం కల్పించాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో 60శాతానికి పక్కా భవనాలు లేవు. కంప్యూటర్లు, వాటికి కావాల్సిన బల్లలు కుర్చీల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. అందుకే ప్రభుత్వం ముందుగా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమివ్వాలి. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి రూ.300కే చరవాణిలను అందించి, రెండు సంవత్సరాలపాటు ఉచిత కనెక్షను ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆలోచన. రోజుకు కేవలం రూ.74 సంపాదించే దారిద్య్రరేఖ దిగువన ఉన్న కుటుంబాలు డిజిటల్‌ సమాచార వినియోగానికి ఎంతమేరకు ఖర్చు పెడతాయన్నదే ప్రశ్న. ఇంకా 55,669 గ్రామాలకు మొబైల్‌ అనుసంధానం అవకాశం లేదు. ఈ గ్రామాల పరిధుల్లో సెల్‌టవర్ల నిర్మాణం పనిని చేపట్టాలి.

బాధ్యత ప్రతి ఒక్కరిదీ

తపాలా కార్యాలయాల ద్వారా డిజిటల్‌ సేవలు అందించాలన్నదీ ప్రభుత్వం ముందున్న ప్రతిపాదన. ఆయా కార్యాలయాల్లో పనిచేస్తున్న చాలామందికి తగినంత కంప్యూటర్‌ పరిజ్ఞానం అత్యవసరం. వారందరికీ ప్రభుత్వమే కంప్యూటర్‌, అంతర్జాల పరిజ్ఞానం అందించాల్సి ఉంది. ఈ సవాళ్లు అన్నింటినీ అధిగమించడానికి ప్రభుత్వం కేవలం దాని అనుబంధ సంస్థలపైనే ఆధారపడితే సరిపోదు. ప్రైవేటు సంస్థలను భాగస్వామ్యం చేయాలి. కొన్ని సంస్థలు మహిళలకు అంతర్జాల సేవలను ఉచితంగా అందించడానికి ఈపాటికే చర్యలు చేపట్టాయి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల విస్తృత కల్పన సాధించాలి. కళాశాల, విశ్వవిద్యాలయ విద్యార్థులను ఉత్తేజపరిచి వారి సేవలు వినియోగించుకోవాలి. గ్రామీణ నిరక్షరాస్యులను డిజిటల్‌ అక్షరాస్యులుగా మార్చడానికి ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ యూనిట్లను ఉపయోగించాలి. గ్రామీణ యువతకు జాతీయ నైపుణ్య సంస్థ ద్వారా డిజిటల్‌ పరిజ్ఞానంలో శిక్షణ ఇవ్వాలి. వారితో కమిటీలను రూపొందించి గ్రామం మొత్తం అక్షరాస్యులయ్యేలా ప్రణాళికలు రూపొందించాలి. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి స్థితిగతులను, ఉపాధి హామీ పథకాలతో మరింత మెరుగ్గా మార్చగలిగితే చాలు. వారికి డిజిటల్‌ ఇండియా లాభాలను వివరించగలిగితే, ఆ సమాచార వినియోగంపై వారు చూపు కేంద్రీకరిస్తారు. దేశంలో సాంకేతిక విప్లవం చోటుచేసుకోవాలన్నా, ప్రపంచదేశాల్లోని ఆర్థిక వ్యవస్థలను మించే రీతిలో భారత్‌ నిలవాలన్నా, అది డిజిటల్‌ ఇండియా అమలుతీరు పైనే ఆధారపడి ఉంది!

(రచయిత - ఈదర అలేఖ్య)
Posted on 22-08-2015