Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


సైన్స్ & టెక్నాల‌జీ

అవసరానికో అణుబ్యాంకు

* విద్యుత్తు సమస్యకు వినూత్న పరిష్కారం
ఆ బ్యాంకు స్థాపనకు ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితాలో మూడో స్థానం ఆక్రమించిన వారెన్‌ బఫెట్‌ 5 కోట్ల డాలర్లు అందించారు. అమెరికా, ఐరోపా సమాఖ్య (ఈయూ), నార్వే, కువైట్‌, యుఏఈ దేశాలు కలసి 10.5 కోట్ల డాలర్ల మూలధనం అందించాయి. కజఖ్‌స్థాన్‌లో నేడు శంకుస్థాపన జరుపుకొని, 2017లో కార్యకలాపాలు ప్రారంభించబోతున్న ఈ బ్యాంకులో ఉండేది డబ్బు కాదు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) నెలకొల్పే ఈ ఇంధన బ్యాంకులో 90 టన్నుల స్వల్పశక్తి సంవర్ధిత యురేనియం (ఎల్‌ఈయూ)ను నిల్వ చేస్తారు. 1000 మెగావాట్ల లైట్‌వాటర్‌ రియాక్టర్‌ను నడపడానికి అది సరిపోతుంది. ప్రపంచంలోని మొత్తం 438 అణు రియాక్టర్లలో 350 లైట్‌వాటర్‌ రియాక్టర్లే. వీటిలో ఒక్కో రియాక్టర్‌ ఉత్పత్తి చేసే విద్యుత్‌ మూడేళ్లపాటు ఒక నగర అవసరాలను తీర్చగలుగుతుంది.

ప్రకృతిలో సహజంగా లభించే యురేనియం ఖనిజంలో అణు విచ్ఛిత్తికి అనువైన యు 235 ఐసోటోప్‌ కేవలం 0.72 శాతం ఉంటుంది. దీన్ని స్వల్పంగా అంటే 4.95 శాతానికి పెంచినప్పుడు విద్యుదుత్పత్తికి ఇంధనంగా ఉపయోగపడుతుంది. అదే యు 235 ఐసోటోప్‌ను 90 శాతానికి పెంచితే అణ్వస్త్ర తయారీకి అనువైన యురేనియం చేతికి అందుతుంది. కజఖ్‌లో స్థాపితమయ్యే అంతర్జాతీయ అణు ఇంధన బ్యాంకు విద్యుదుత్పాదనకు పనికొచ్చే స్వల్ప శక్తి సంవర్ధిత యురేనియంను మైనపు ద్రావణం రూపంలో నిల్వచేస్తుంది. సహజ యురేనియంను ఇలా శుద్ధి చేయడానికి ఆసక్తి ఉన్న దేశాల నుంచి టెండర్లు ఆహ్వానిస్తారు. ఇంధనం కావలసిన దేశాలు తగు రుసుము చెల్లించగానే ఎల్‌ఈయూ సిలిండర్లను రష్యా లేదా చైనా మీదుగా రవాణా చేస్తారు. అణ్వస్త్ర తయారీకి ఉపయోగించవనే భరోసా ఉన్న దేశాలకే ఎల్‌ఈయూ ఇంధనాన్ని ఐఏఈఏ విక్రయిస్తుంది.

ఇరాన్‌ ఉదంతమే ప్రేరణ

విద్యుదుత్పాదన, అణు పరిశోధనలకు కావలసిన యురేనియం నిరంతరం లభిస్తుందనే భరోసా లేక ఇరాన్‌ సొంత యురేనియం శుద్ధి సౌకర్యాలను ఏర్పరచుకుంది. ఈ సమస్యను అధిగమించడానికి అణు ఇంధన బ్యాంకు స్థాపనే పరిష్కారమని 2000 సంవత్సర ఆరంభంలో భావించినా అది కార్యరూపం ధరించలేదు. ఈ ఏడాది జులైలో ఇరాన్‌, ఆరు ప్రముఖ రాజ్యాల మధ్య కుదిరిన ఒప్పందం పౌర ప్రయోజనాలకు అణు ఇంధనాన్ని వినియోగించే అవకాశాన్ని ఇరాన్‌కు అందిస్తోంది. అదే సమయంలో ఇరాన్‌ ఈ ఇంధనాన్ని అణ్వస్త్ర తయారీకి మళ్లించకుండా 15 నుంచి 25 ఏళ్లపాటు పకడ్బందీ అంతర్జాతీయ నిఘా ఉంటుంది. ఇరాన్‌లోని ఒక అణు రియాక్టర్‌కు శుద్ధి చేసిన యురేనియం సరఫరా చేయడానికి 2021 వరకు రష్యా కాంట్రాక్టు కుదుర్చుకొని ఉంది. దీనికితోడు అనేక రష్యన్‌ రియాక్టర్లనూ ఇరాన్‌ కొనుగోలు చేయనుంది. వీటికోసం కజఖ్‌లోని అంతర్జాతీయ ఇంధన బ్యాంకు నుంచి యురేనియంను కొనుగోలు చేసే వెసులుబాటు ఇరాన్‌కు ఏర్పడుతుంది.

యురేనియం శుద్ధి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న అమెరికా, తదితర దేశాలు కజఖ్‌ బ్యాంకుకు ఇంధనాన్ని అందిస్తే, ఆ పరిజ్ఞానం లేని దేశాలు శాంతియుత ప్రయోజనాల కోసం సదరు ఇంధనాన్ని కొనుగోలు చేయవచ్చు. ఇది డొంకతిరుగుడు మార్గంగా కనిపించవచ్చు కానీ యురేనియం శుద్ధి పరిజ్ఞానం రెండువైపులా పదునైన కత్తిలాంటిదని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ టెక్నాలజీని అణు విద్యుత్‌ ఉత్పత్తికే కాకుండా అణ్వస్త్ర తయారీకీ ఉపయోగించుకోవచ్చు. ఇరాన్‌ అణు బాంబులు తయారు చేస్తోందన్న అనుమానంతోనే ఐక్యరాజ్య సమితి, ఆరు ప్రముఖ రాజ్యాలు ఆ దేశంపై కఠిన ఆంక్షలు విధించాయి. చివరకు జులై ఒప్పందం సామరస్య పంథాకు ద్వారాలు తెరచినా- ఇరాన్‌ అనుభవం వంటిది పునరావృతం కాకుండా ఉండాలంటే అంతర్జాతీయ ఇంధన బ్యాంకు ఏర్పాటు ఉత్తమ మార్గమని భావించారు. పైగా, ఇటీవల ఉక్రెయిన్‌, పశ్చిమ ఐరోపా దేశాలకు రష్యా సహజ వాయు సరఫరాను నిలిపివేసిన నేపథ్యంలో అణు ఇంధనం విషయంలోనూ ఇలాంటి చేదు అనుభవాలు చవిచూడవలసి వస్తుందేమోనని ఆందోళన వ్యక్తమైంది. రష్యా తన భూభాగంలోని అంగార్క్స్‌లో ఐఏఈఏ తరఫున స్వల్ప శక్తిసంవర్ధిత యురేనియం నిల్వలను ఏర్పరచినా, దాని ఒక్కదాని మీదనే ఆధారపడటానికి అంతర్జాతీయ సమాజం వెనకాడుతోంది. ఇరాన్‌ కూడా అణు ఇంధనం కోసం పెద్ద దేశాల మీద కన్నా ఐఏఈఏ మీద ఆధారపడటం ఉత్తమమని భావిస్తోంది. అందువల్ల పూర్తిగా ఐఏఈఏ అజమాయిషీలో ప్రపంచంలోనే మొదటిసారిగా కజఖ్‌స్థాన్‌లో అంతర్జాతీయ అణు ఇంధన బ్యాంకును ఏర్పాటుచేస్తున్నారు. ఇది ఈశాన్య కజఖ్‌లోని యుల్బా మెటలర్జికల్‌ కర్మాగారంలో నిర్మితమవుతుంది. గతంలో సోవియట్‌ అణు విద్యుత్కేంద్రాలకూ, అణు జలాంతర్గాములకూ శుద్ధిచేసిన యురేనియంను సరఫరా చేసిన కర్మాగారమిది.

సోవియట్‌ రిపబ్లిక్‌గా ఉన్న కాలంలో కజఖ్‌స్థాన్‌ 1400 అణు క్షిపణులకు స్థావరంగా నిలిచింది. అక్కడ ఎన్నో అణ్వస్త్ర పరీక్షలు జరిగేవి. సోవియట్‌ విచ్ఛిన్నం తరవాత కజఖ్‌, ఉక్రెయిన్‌, బెలారుస్‌ రిపబ్లిక్‌లు తమ దగ్గరున్న అణ్వస్త్రాలను రష్యాకు అప్పగించాయి. 1996 కల్లా ఈ మూడు రిపబ్లిక్‌లు మొత్తం అణ్వస్త్ర నిల్వలను రష్యాకు తరలించేశాయి. చమురు, సహజవాయు నిల్వలు దండిగా ఉన్న కజఖ్‌స్థాన్‌ ప్రపంచ యురేనియం ఉత్పత్తిలో 41శాతానికి మూలకర్త. రష్యా, చైనా, జపాన్‌లకు యురేనియం ఎగుమతి చేస్తున్న కజఖ్‌స్థాన్‌ భారత్‌కూ సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తంమీద అణు ఇంధన ఉత్పత్తి, నిల్వ, రవాణాలో కజఖ్‌స్థాన్‌కు ఎంతో అనుభవం ఉంది కనుక ఐఏఈఏ ఇంధన బ్యాంకు ఏర్పాటుకు ఆ దేశాన్ని ఎంచుకున్నారు.

ఎవరి అనుమానాలు వారివి

పెద్ద రాజ్యాలకున్న యురేనియం శుద్ధి సత్తాను తాము సంతరించుకోకుండా చూడటానికి అంతర్జాతీయ అణు ఇంధన బ్యాంకును ఏర్పాటు చేస్తున్నారని చాలా దేశాలు అనుమానపు చూపులు చూస్తున్నాయి. అయితే, ప్రతి దేశమూ అణు ఇంధనం కోసం ఈ బ్యాంకు మీద ఆధారపడుతుందని కాదు. సంప్రదాయ సరఫరాలు విచ్ఛిన్నమైనప్పుడు మాత్రమే ఈ బ్యాంకు నుంచి ఇంధనాన్ని 'డ్రా' చేసుకోవచ్చు. నిజానికి ప్రస్తుతం ప్రపంచంలో అణు ఇంధనానికి కొరత లేదు. మొత్తం 13 దేశాలకు సంపూర్ణ యురేనియం శుద్ధి పరిజ్ఞానం ఉందని ప్రపంచ అణు సంఘం తెలిపింది. కానీ, ఈ పరిజ్ఞానాన్ని రూపొందించడం ఎంతో వ్యయప్రయాస భరితం. అన్ని దేశాలకు అంత ఆర్థిక శక్తి, సాంకేతిక సత్తా ఉండవు. ఫుకుషిమా ప్రమాదాన్ని పురస్కరించుకుని అణు కేంద్రాలపై భయాలు వ్యక్తమవుతున్నా, ప్రపంచంలో రానురానూ విద్యుచ్ఛక్తికి గిరాకీ పెరుగుతున్న దృష్ట్యా, అణు విద్యుత్‌ను పూర్తిగా పరిత్యజించే అవకాశం తక్కువే. అణ్వస్త్రాలు వ్యాపించకుండా కట్టడి చేస్తూ పౌర అవసరాల కోసం అణు విద్యుత్తును ఉపయోగించుకోవడానికి కజఖ్‌ బ్యాంకు మంచి ముందడుగు!

(రచయిత - ఆర్య)
Posted on 28-08-2015