Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


సైన్స్ & టెక్నాల‌జీ

మెరుపు వేగమే రణరీతి

* దన్నుగా ఆధునిక సాంకేతికత
గొప్ప విజయం సాధించానని శత్రువు మిడిసిపడుతున్న సమయంలోనే అతడిని దెబ్బకొట్టాలి. అతడు దొరికిపోయేది సరిగ్గా ఆ క్షణంలోనే. మణిపూర్‌ లో 18 మంది భారతీయ సైనికులను పొట్టనబెట్టకుని మియన్మార్‌ అడవుల్లో సంబరాలు చేసుకుంటున్న నాగా తీవ్రవాదులపై భారతీయ ప్రత్యేక దళాలు విరుచుకుపడి 50 నుంచి 100 మంది తీవ్రవాదులను సఫా చేశాయి. ఈ సంఘటన తర్వాత భారత సైన్యాధిపతి దల్బీర్‌ సింగ్‌ సుహాగ్‌ సరిహద్దులో కిరికిరి చేస్తున్న పాకిస్థాన్‌పై స్వల్ప వ్యవధి మెరుపు యుద్ధాలకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. భారతదేశ సైనిక వ్యూహంలో వచ్చిన మార్పుకు ఇది ప్రబల సంకేతం. దీనికి ప్రతిగా పాకిస్థాన్‌ ప్రధాన సైన్యాధికారి రహీల్‌ షరీఫ్‌ భారత్‌ దుందుడుకు చర్యకు పాల్పడితే తీవ్ర నష్టం కలిగిస్తామని హెచ్చరించారు. ఈ బెదిరింపులను నరేంద్ర మోదీ ప్రభుత్వం ఖాతరు చేయబోవడం లేదు. యుద్ధమంటే శత్రువు సంకల్పాన్ని నెరవేరనీయకుండా బలప్రయోగంతో మన అభీష్టాన్ని నెగ్గించుకోవడమే. మరి భారతదేశానికి మెరుపు యుద్ధం చేసే సత్తా నిజంగా ఉందా, దాన్ని సంతరించుకోవడం కోసం ఏం చేస్తోంది అన్నది ప్రశ్న. వేగంగా ముగిసిపోయే మెరుపు యుద్ధాలకు పోరాటపరంగా, సాంకేతికంగా మెరికలైన స్మార్ట్‌ సైనికులు అవసరం. స్మార్ట్‌ సైనికులు పెరుగుతున్న కొద్దీ సంప్రదాయ సైనికుల సంఖ్యాబలాన్ని తగ్గించవచ్చు. అమెరికా ఇప్పటికే ఆ పనిలో ఉంది. రిమోట్‌ కంట్రోల్‌ ఆయుధాలు, కృత్రిమ మేధతో పనిచేసే స్వయంచాలిత అస్త్రాలను రూపొందిస్తూ క్రమంగా పదాతి సేనల సంఖ్యాబలాన్ని తగ్గిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసి 70 ఏళ్లయిన సందర్భంగా జరిపిన సైనిక కవాతులో చైనా కూడా ఇదే వ్యూహాన్ని ప్రకటించింది. 23లక్షల చైనా సైనిక బలగంలో మూడు లక్షల మందిని తగ్గించి, మొత్తం బలాన్ని 20లక్షలకు పరిమితం చేస్తామని అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌ వెల్లడించారు. 2017కల్లా పదాతి దళంలో పది లక్షల మంది, వైమానిక, నౌకా దళాలలో చెరి అయిదు లక్షల మందితో త్రివిధ సేనలను స్థిరీకరిస్తారు. సైన్య వైద్య దళాలను కుదించి వినోద బృందాలపై వేటు వేస్తారు. ఉపగ్రహ, కంప్యూటర్‌ యంత్రాంగాలు వచ్చిన నేపథ్యంలో చైనా పాతకాలపు కమ్యూనికేషన్‌ సిబ్బందినీ తగ్గించబోతోంది.

మెరికల్లాంటి సైనికులే కీలకం

భావి యుద్ధాల్లో దూరంగా కూర్చుని నడిపే రోబోలు, రిమోట్‌ కంట్రోల్‌ ఆయుధాల పాత్ర పెరగబోతోంది. టెర్రరిస్టుల వేటకు భారీయెత్తున డ్రోన్‌లను, రోబోలను నియోగించవచ్చు. ఈ పరోక్ష పోరాట విధులకు కాకలుదీరిన యోధులు అక్కర్లేదు. సాంకేతిక నైపుణ్యాలున్న యువతీయువకులను నియోగిస్తే చాలు, అంటే, సైనిక శిక్షణ వ్యయం, యుద్ధరంగంలో హతులు, క్షతుల సంఖ్య తగ్గుతాయన్నమాట. రణతంత్రంలో వస్తున్న కొత్త మార్పులకు అనుగుణంగానే అమెరికా, చైనాలు సైనిక సిబ్బంది సంఖ్యను తగ్గించుకొంటున్నాయి. భారతదేశమూ అదే ఆలోచనలో ఉంది. ఇటీవల ప్రకటించిన 'ఒకే హోదాకు ఒకే పింఛను' పథకం వల్ల భారతదేశ రక్షణ పెన్షన్‌ బిల్లు రూ. 10,000 కోట్ల మేర పెరుగుతుంది. దీనికి తోడు రాగల రెండేళ్లలో రూ. 12,000 కోట్ల బకాయిలూ చెల్లించాల్సి వస్తుంది. బలగాల సంఖ్యను పెంచిన కొద్దీ జీతభత్యాలు, పెన్షన్‌ బిల్లు పెరిగిపోవడం సహజం. ఈ ఖర్చును తగ్గించి హైటెక్‌ పోరాట సాధనాలకు కేటాయింపులు పెంచక తప్పదు. చైనా సరిహద్దులో మరి ఏడేళ్లలో మోహరించే పర్వత పోరాట దళంలో మొదట అనుకొన్నట్లు 90,000 మందిని కాకుండా 35,000 మందిని మాత్రమే నియోగించబోతున్నారు. క్రమంగా భారతదేశం హైటెక్‌ యుద్ధాల కోసం స్మార్ట్‌ సైనికులనూ, యుద్ధరంగ నిర్వహణ వ్యవస్థ (బిఎంఎస్‌)ను సిద్ధం చేసుకుంటోంది. రూ. 40,000 కోట్ల విలువైన బిఎంఎస్‌ ప్రాజెక్టును మేక్‌ ఇన్‌ ఇండియా పథకం కింద చేపడుతోంది. ఇటీవలే ఈ కాంట్రాక్టును భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌)-రోల్టా ఇండియా; టాటా పవర్‌ ఎస్‌ఇడి-లార్సెన్‌ అండ్‌ టూబ్రో కన్సార్టియంలకు ఇచ్చారు. స్మార్ట్‌ సైనికునికి కెమేరా అమర్చిన ఎలక్ట్రానిక్‌ హెల్మెట్‌, తూటా రక్షక కవచం, శక్తిమంతమైన రైఫిల్‌ సమకూరుస్తారు. ప్రస్తుతం పరీక్షిస్తున్న బెరెట్టా (ఇటలీ), కోల్ట్‌ (అమెరికా), బ్రెన్‌ (చెక్‌), టేవర్‌ (ఇజ్రాయెల్‌) రైఫిళ్లలో ఉత్తమమైనదాన్ని ఎంపిక చేసి మన సైనికులకు ఇస్తారు. మరో అయిదు నుంచి ఏడేళ్లలో 70 శాతం సైనికులను బిఎంఎస్‌ పరిధిలోకి తీసుకొస్తారు. సైనికులకు అరచేతిలో ఇమిడే పామ్‌ టాప్‌ కమ్యూనికేషన్‌ పరికరం ఇచ్చి వైర్‌లెస్‌ అనుసంధానత కల్పిస్తారు. రక్షణ శాఖ అంతకుముందు టాటా, ఎల్‌ అండ్‌ టి, హెచ్‌.సి.ఎల్‌. కంపెనీలకు రూ. 10,000 కోట్ల ట్యాక్టికల్‌ కమ్యూనికేషన్స్‌ సిస్టమ్‌ రూపకల్పన ప్రాజెక్టును ఇచ్చింది. ఈ ప్రాజెక్టు వల్ల యుద్ధకాలంలో శత్రు భూభాగంలోనూ మన సైనికులకు అధిక బ్యాండ్‌ విడ్త్‌ కలిగిన మొబైల్‌, డేటా, వాయిస్‌ యంత్రాంగం అందుబాటులో ఉంటుంది. బిఎంఎస్‌ మన స్మార్ట్‌ సైనికుల వద్ద ఉండే డిజిటల్‌ సాధనాలను, యుద్ధరంగ సెన్సర్లను వైర్‌లెస్‌ ద్వారా సేనాపతులతో అనుసంధానిస్తుంది.

డ్రోన్‌లూ ముఖ్యమే

కొన్ని రోజలు క్రితం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా ప్రయోగించిన జీశాట్‌-6 ఉపగ్రహం మన సైనికులు ఎడారిలో ఉన్నా, మంచు కొండల్లో ఉన్నా, మైదానాల్లో ఉన్నా నిరంతరాయ కమ్యూనికేషన్‌ సౌకర్యాలను అందిస్తుంది. పామ్‌ టాప్‌ సాధనాలతో వారు సంభాషిస్తారు కాబట్టి గతంలో మాదిరిగా బరువైన కమ్యూనికేషన్‌ పరికరాలను వీపున మోయవలసిన అగత్యం ఉండదు. కనుక కమ్యూనికేషన్‌ సిబ్బందిని తగ్గించుకోవచ్చు. సరిహద్దు దాటి టెర్రరిస్టు శిబిరాలపై దాడి చేయడానికీ, పరిమిత యుద్ధాలకు దిగడానికీ డ్రోన్‌లు చాలా కీలకమైనవి. అమెరికా అమ్ముల పొదిలో 10,000 డ్రోన్‌లు ఉండగా, 2023 కల్లా 41,800 డ్రోన్‌లను తయారుచేయాలని చైనా తలపెట్టింది. అది ఇప్పటికే పాకిస్థాన్‌కు డ్రోన్‌లను సరఫరా చేస్తోంది. ఈ పరిణామాల రీత్యా భారత్‌ 2016 నుంచి మేక్‌ ఇన్‌ ఇండియా కింద 600 డ్రోన్‌లు తయారుచేయాలని యోచిస్తోంది. దీనిపై రెండు అమెరికన్‌, రెండు ఇజ్రాయెలీ సంస్థలు ఆసక్తి కనబరిచాయి. లష్కరే తోయిబా వంటి టెర్రరిస్టు శక్తులపై విరుచుకుపడటానికి డ్రోన్‌లు ఒక్కటే చాలవు. అవసరమైతే మన సైనికులు సరిహద్దు దాటి మెరుపు యుద్ధానికి దిగడమూ అవసరమని భారత సైన్యం గుర్తించింది. దీనికి భారత్‌ చేసుకోవలసిన ఏర్పాట్లు చాలానే ఉన్నాయి.

దాదాపు 3000 కిలోమీటర్ల పొడవున వ్యాపించిన భారత్‌-పాక్‌ సరిహద్దు భౌగోళికంగా వైవిధ్యభరితం. కశ్మీర్‌ సరిహద్దుల్లో కొండలు, లోయలు, అడవులే తప్ప విశాలమైన రహదారులు లేవు. అందువల్ల అక్కడ ట్యాంకులు, శతఘ్నులతో భారీ సేనా వాహినులను ఉరికించడం కష్టం. దక్షిణ జమ్మూ-కశ్మీర్‌ లోయలో అధీన రేఖ (ఎల్వోసీ) వెంబడి ఉధృత స్థాయిలో సంప్రదాయ దాడులు నిర్వహించవచ్చు. కానీ, ఎల్వోసీని దాటి పాక్‌ లోతట్టు భాగంలో ప్రవేశించి దాడి జరపడం తేలిక కాదు. దక్షిణ జమ్మూ, కశ్మీర్‌ల నుంచి పంజాబ్‌, ఉత్తర రాజస్థాన్‌ వరకు 2,000 కిలోమీటర్ల మేర సాగు నీటి కాల్వలు, అనేక ఉపనదులూ, వాగులూ వంకలూ విస్తరించి ఉంటాయి. వీటి ఒడ్డున పాకిస్థాన్‌ కరకట్టలు, కాంక్రీటు బంకర్లు, మందు పాతరలు, మరతుపాకీ స్థావరాలను నిర్మించింది. వీటిని అధిగమించాలంటే భారత సేనలు హోరాహోరీగా పోరాడాల్సి ఉంటుంది. తాజాగా దిల్లీలో సమావేశమైన భారత్‌, పాక్‌ సరిహద్దు దళాల డైరెక్టర్‌ జనరళ్లు సరిహద్దుల్లో ఇప్పటికే ఉన్న బంకర్లు, కరకట్టల నిర్వహణకే పరిమితం కావాలి తప్ప కొత్త నిర్మాణాలేవీ చేపట్టరాదని నిర్ణయించారు. పాకిస్థాన్‌ దీనికి ఎంతకాలం కట్టుబడి ఉంటుందో చెప్పలేం.

భారీగా ఆయుధ సమీకరణ

పాకిస్థానీ పంజాబ్‌, సింధ్‌ రాష్ట్రాలకూ, భారత్‌లోని రాజస్థాన్‌, గుజరాత్‌ ఎడారులకూ మధ్యనున్న అంతర్జాతీయ సరిహద్దు వెంట 80 శాతం పాక్‌ సైన్యాన్ని మోహరించారు. వీటిని చిత్తు చేయడానికి ఆధునిక ట్యాంకులు, సంచార శతఘ్నులూ అవసరం. అందుకే భారత రక్షణ శాఖ గత ఏడాది రూ. 16,000 కోట్లతో 814 శతఘ్నుల సమీకరణకు పచ్చజెండా వూపింది. వీటిలో 100 శతఘ్నులను విదేశాల నుంచి కొనుగోలు చేసి, మిగతా వాటిని మేక్‌ ఇన్‌ ఇండియా కింద స్వదేశంలో తయారుచేస్తారు. వీటికితోడు 114 స్వదేశీ ధనుష్‌ క్షిపణులనూ సైన్యానికి అందిస్తారు. కాలం చెల్లిన టి-72 ట్యాంకుల స్థానంలో అధునాతన యుద్ధ ట్యాంకులను ప్రవేశపెట్టడానికి రక్షణ శాఖ విదేశాల నుంచి సమాచారం కోరింది. ప్రస్తుతం మన వద్ద ఉన్న తూటాలు, టాంకు, శతఘ్ని గుళ్లు 20 రోజుల యుద్ధానికి మాత్రమే సరిపోతాయి. ఈ కొరత తీర్చడానికి రక్షణ శాఖ చర్యలు తీసుకుంటోంది. రఫేల్‌, తేజస్‌, అయిదో తరం యుద్ధ విమానాలూ, ఆకాశ్‌, నాగ్‌ వంటి క్షిపణులతో పాక్‌ పీచమణచడానికి భారత్‌ సిద్ధమవుతోంది. హిందూ మహాసముద్రంలో చైనా దూకుడును ఎదుర్కోవడానికి 2027 కల్లా 200 నౌకలను సమకూర్చుకోవాలని పథకం రచించింది. ప్రస్తుతం మన వద్ద 137 నౌకలున్నాయి.

భారత్‌ కనుక యుద్ధానికి దిగితే అణ్వస్త్రాలతో ఢీకొంటామని పాక్‌ బెదిరిస్తున్న సంగతి తెలిసిందే. పాక్‌, చైనాలు అణు క్షిపణులను ప్రయోగించగానే వాటిని సాపేక్ష ఎలక్ట్రానిక్‌ పుంజాలతో మార్గమధ్యంలోనే మాడ్చివేసే కాళి (కిలో యాంపియర్‌ లీనియర్‌ ఇంజెక్టర్‌)ను భారతీయ శాస్త్రజ్ఞులు రహస్యంగా రూపొందిస్తున్నారు. 2012లో కాళి టెక్నాలజీలో ప్రథమ దశను విజయవంతంగా పరీక్షించినట్లు వినికిడి. సియాచిన్‌లో భారత సైన్యం కాళి ఎలక్ట్రానిక్‌ పుంజాలను ప్రయోగించడం వల్లనే మంచు పెళ్లలు విరిగిపడి 133 మంది పాక్‌ సైనికులు సజీవ సమాధి అయ్యారని అప్పట్లో పాక్‌ సమాచార సాధనాలు గగ్గోలు పెట్టాయి. భారతదేశం పాకిస్థాన్‌తో శాంతికి ప్రయత్నిస్తూనే కాళి వంటి అస్త్రాలతో సమరసన్నద్ధంగా ఉండాలి. దిల్లీలో భారత్‌-పాక్‌ సరిహద్దు భద్రతా దళాదికారులు అక్రమ చొరబాట్లనూ, కాల్పులనూ నిరోధించాలని అంగీకరించడం హర్షణీయమే. అదే సమయంలో రెండు యుద్ధాల మధ్య విరామమే శాంతి అనే సత్యాన్ని భారత్‌ విస్మరించకూడదు. శాంతి కాలంలో యుద్ధానికీ, యుద్ధకాలంలో శాంతికీ సన్నాహాలు చేసుకోవడం విధాయకం.

(రచయిత - ఏఏవీ ప్రసాద్‌)
Posted on 17-10-2015