Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


సైన్స్ & టెక్నాల‌జీ

మరో సాంకేతిక విప్లవం!

* అంకుర పరిశ్రమలకు వూతం
'సాంకేతిక భారతం అవకాశాల గని. నూట పాతికకోట్ల ప్రజలనూ అనుసంధానించడమే నా లక్ష్యం' అని ఆమధ్య సిలికాన్‌ వ్యాలీలో జరిగిన ఐటీ దిగ్గజాల భేటీలో మోదీ నినదించారు. ఆ సందర్భంగా మహా మహా కంపెనీలన్నీ భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ముందుకొచ్చాయి. భారత్‌లో అంకుర పరిశ్రమ(స్టార్టప్‌)ల అభివృద్ధికిభారీగా పెట్టుబడులు పెట్టేందుకు 'క్వాల్‌కమ్‌' ముందుకొస్తే, అయిదు లక్షల గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్‌ సేవల కల్పనకు 'మైక్రోసాఫ్ట్‌' వాగ్దానం చేసింది, దేశంలో తయారీ కేంద్రం ఏర్పాటుకు 'ఆపిల్‌' సన్నద్ధత వ్యక్తపరిచింది, డిజిటల్‌ అక్షరాస్యతతోపాటు 500రైల్వేస్టేషన్లలో ఉచిత 'వైఫై' సదుపాయం కల్పిస్తామని 'గూగుల్‌' ప్రకటించింది. ఐటీ దిగ్గజాల ఈ వరాలను క్షేత్రస్థాయిలో కార్యరూపంలోకి తీసుకువచ్చేందుకు తగిన వాతావరణం సృష్టించేందుకు ప్రభుత్వం గట్టి కృషి చేయాల్సి ఉంది.
లక్ష కోట్ల రూపాయల వ్యయంతో తలపెట్టిన 'డిజిటల్‌ ఇండియా' కార్యక్రమంలో భాగంగా- గ్రామ పంచాయతీల స్థాయిలో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌, ప్రభుత్వ విద్య, వైద్య సేవల్లో పురోగతి, ఇ-పాలన, ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల తయారీ, ఉద్యోగ కల్పన, వ్యవసాయంలో ఐటీ వినియోగం వంటి లక్ష్యాలను కేంద్రం నిర్దేశించింది. ఇప్పటివరకూ ప్రభుత్వపరంగా చేపట్టిన ఇ-పాలన తరహా కార్యక్రమాలన్నీ పట్టణాలకూ, కంప్యూటర్‌తో బాగా పరిచయం ఉన్న ప్రజానీకానికే పరిమితమయ్యాయి. కేంద్రప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలను అంతర్జాలంతో అనుసంధానించే లక్ష్యంతో 'డిజిటల్‌ ఇండియా' పథకానికి రూపకల్పన చేసింది. ప్రాథమికంగా ప్రజలను చైతన్యపరచి, పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన దిశగా అడుగులు వేయడమే ఇందుకు సరైన మార్గం. ఇప్పటివరకు దేశంలో కేరళ మాత్రమే సంపూర్ణ ఇ-(ఎలక్ట్రానిక్‌) అక్షరాస్యత సాధించిన డిజిటల్‌ రాష్ట్రంగా అవతరించింది.

ఎన్నెన్నో లాభాలు!

అంతర్జాల వాడకందార్ల సంఖ్యలో చైనా తరవాతి స్థానం భారత్‌ది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని, పౌరసేవలకు పెద్దపీట వేస్తూ ప్రపంచ దేశాలు పురోగమిస్తున్నాయి. ఇ-పాలనలో ధ్రువపత్రాలు, పన్నుచెల్లింపులు వంటి అనేక రకాల పౌరసేవలు 'ఆన్‌లైన్‌' వ్యవస్థతో ముడివడి ఉంటాయి గనుక లంచాలు, అవినీతి తగ్గుముఖం పడుతుంది. మరోవంక 'స్మార్ట్‌సిటీ'ల నిర్మాణానికి అధునాతన డిజిటల్‌ సాంకేతిక పరిజ్ఞానమే కీలక వనరు. సాంకేతిక విజ్ఞాన విస్తరణలో భాగంగా 2.5లక్షల గ్రామాలను 'ఫైబర్‌గ్రిడ్‌'తో అనుసంధానిస్తే నామమాత్ర రుసుముతోనే గ్రామీణులకు అంతర్జాల సేవలు అందుబాటులోకి వస్తాయి. దేశవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఎప్పటికప్పుడు తెలుసుకునే సౌలభ్యం ఏర్పడితే రైతుల ఆదాయానికి దళారులు గండికొట్టే రోజులు పోతాయి. జాతీయ రిమోట్‌ సెన్సింగ్‌ సిద్ధం చేసిన 'మ్యాపుల'ను అంతర్జాలంలో పొందుపరిచి భూసార పరీక్షల వివరాలు నమోదు చేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. పైరును ఆవహించిన పురుగు ఫొటోతీసి వ్యవసాయ పోర్టల్‌ ద్వారా పంపితే- దేశ విదేశాల్లోని వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిష్కార మార్గాలు సూచిస్తారు. ముఖ్యంగా గ్రామీణ ఉత్పత్తులకు వ్యాపార సంస్థలతో ఒప్పందాలు కుదిర్చి 'మార్కెటింగ్‌' చేయడంవల్ల సమ్మిళితాభివృద్ధి సాధ్యమవుతుంది. విద్యా-ఉద్యోగ వ్యవస్థల్లోనూ డిజిటల్‌ టెక్నాలజీ ప్రభంజనం సృష్టించబోతోంది. స్కూళ్లలో 'వీడియో కాలింగ్‌' బోధనకు ఆంధ్రప్రదేశ్‌ సర్కారు శ్రీకారం చుట్టింది. దేశమంతటా ఈ తరహా బోధన అమలుచేస్తే పిల్లలకు చిన్నప్పటి నుంచే డిజిటల్‌ టెక్నాలజీపై అవగాహన ఏర్పడి భవిష్యత్తు తరాలకు మేలుబాట ఏర్పడుతుంది. 'ఆధార్‌' సంఖ్యతో అనుసంధానమై ఉచితంగా లభించే 'డిజిటల్‌ లాకర్‌' కల్పిస్తున్న సదుపాయాలను, దాని వినియోగంలో సౌలభ్యాన్ని గుర్తిస్తే కొత్తగా ఎంతోమంది జన్‌ధన్‌ ఖాతాలు తెరిచే అవకాశం ఉంది. నకిలీ పట్టాలకు ముకుతాడువేస్తూ 'ఆన్‌లైన్‌'లోనే డిగ్రీ సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించేలా 'జాతీయ విద్యానిధి' (నేషనల్‌ అకడమిక్‌ డిపాజిటరీ) త్వరలో అందుబాటులోకి రానుంది. మరోవంక వస్తు-సేవల పన్ను(జీఎస్‌టీ)ను డిజిటల్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానిస్తే మున్ముందువ్యాపారులు సులభంగా పన్ను చెల్లించడమే కాకుండా, వారికి అనేక ఇతర వివరాలు సులభంగా తెలుసుకొనే వెసులుబాటూ కలుగుతుంది. భవననిర్మాణ ప్రణాళికలకూ ఆన్‌లైన్‌లోనే ఆమోదం తెలిపే విధానం త్వరలో అమల్లోకి రానుంది. పురపాలక సంఘాల్లో ఆస్తిపన్ను వసూళ్లకు సంబంధించి 'జీఐఎస్‌ ట్యాగింగ్‌' ద్వారా పన్ను ఎగవేతదారుల ఆటకట్టించే వీలుంది. సరికొత్త విప్లవానికి, టెలికాం రంగంలో మార్పులకు నాలుగోతరం(4జీ) సేవలు నాంది పలుకుతున్నాయి. మరోవైపు 'వైఫై' విజ్ఞానానికి ప్రత్యామ్నాయంగా ఇంకో మూడు నాలుగేళ్లలో 'లైఫై' పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. ఈ పరిజ్ఞానంతో సెకనుకు 1 గిగాబైట్ల వేగంతో సమాచార మార్పిడి సాధ్యమవుతుంది.

అవకాశాల సృష్టి

దేశ జనాభాలో 65శాతానికిపైగా యువతే. అతిపెద్ద వినియోగ మార్కెట్‌ను సొంతం చేసుకున్న భారత్‌లో ఉపాధికి కొదవ లేదు. ఉన్నదల్లా నైపుణ్యాల కొరతే! ప్రధాని మోదీ ప్రతిపాదిస్తున్న 'డిజిటల్‌ ఇండియా' కార్యక్రమం దేశంలో అంకుర పరిశ్రమలకు ఆయువుపట్టుగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం వ్యాపారమంటే కోట్ల రూపాయల పెట్టుబడి కాదు... ఓ వినూత్న ఆలోచన, సృజనాత్మకత ఆచరణ! తక్కువ పెట్టుబడితో ప్రారంభమైన కంపెనీలు సైతం ఇప్పుడు ప్రపంచ వాణిజ్యాన్ని శాసించే స్థాయికి చేరుకుంటున్నాయి. అంతర్జాలం ఆగమనంతో వాణిజ్య గతిరీతులే మారిపోయాయి. ఈబే, ఫ్లిప్‌కార్ట్‌ వంటి అంకుర పరిశ్రమలే ఇందుకు ఉదాహరణ. దేశ జనాభాలో 40శాతాన్ని ఇంటర్నెట్‌ వినియోగదారులుగా మార్చగలిగితే భారత ఆర్థిక రంగం రూపురేఖలే మారిపోతాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సమాచార సాంకేతిక విజ్ఞాన పెట్టుబడి ప్రాంతాలు (ఐటీఐఆర్‌) కొలువుదీరనున్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ద్వితీయ శ్రేణి నగరాల్లో, పట్టణాల్లోనూ ఐటీ పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక వ్యూహాలు అమలుచేస్తే మరింత ప్రయోజనం చేకూరుతుంది. దేశంలో పెరుగుతున్న అంతర్జాల వినియోగాన్ని సరైన దారిలో పెట్టడంతోపాటు- సైబర్‌ నేరగాళ్లనుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనే వ్యూహాలూ రూపొందించాలి. సాంకేతిక యుగంలో యుద్ధాలకు సరిహద్దులు ఉండవు. సైబర్‌ దాడులను ఎదుర్కొనే క్రమంలో జాతీయ అంతర్జాల భద్రత విధానాన్ని మరింత పటిష్ఠంగా రూపొందించాల్సిన అవసరం ఉంది. వచ్చే ఏడాది మార్చినాటికి జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (ఎన్‌ఎస్‌ఎపీ)కింద అమల్లో ఉన్న అన్ని పథకాల లబ్ధిదారుల వివరాలనూ 'ఆధార్‌'తో అనుసంధానించాలని కేంద్రప్రభుత్వం నిర్దేశించింది. అదే జరిగితే- డిజిటల్‌ఇండియా సాకారంలో అదో కీలక మలుపవుతుంది. గ్రామీణ స్థాయిలో మౌలిక సౌకర్యాలు, చైతన్యం పెంచే దిశగా దృష్టిపెడితే- మోదీ సర్కారు సాంకేతిక స్వప్నం అమలు మరెంతో దూరం లేదు.

(రచయిత - పీవీ రావు)
Posted on 01-12-2015