Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


సైన్స్ & టెక్నాల‌జీ

అంతరిక్ష మథనం!

* గ్రహ శకలాల్లో గనుల తవ్వకం...
భూమిపై సహజ వనరులు హరించుకుపోవడంతో సంక్షోభంలోకి జారిపోయిన మానవులు, తమ అవసరాలను తీర్చే శక్తి సుదూరంలోని పండోరా ఉపగ్రహంపై దొరికే అనబ్టేనియం ఖనిజానికి ఉందని గుర్తిస్తారు. ఆ నిక్షేపాలను కబ్జాచేసే ప్రయత్నంలో ఏం జరిగిందన్నదే అవతార్‌ సినిమా ఇతివృత్తం. నిర్మాత-దర్శకుడు జేమ్స్‌ కామెరన్‌ ఈ కథను వెండితెర మీద ఆవిష్కరించడంతోనే సరిపెట్టుకోలేదు. తాను కళాత్మకంగా కన్న కలను నిజం చేయడానికి నడుం కట్టారు. గ్రహశకలాల నుంచి ఖనిజ నిక్షేపాలను వెలికితీయడానికి 2010లో స్థాపితమైన ప్లానెటరీ రిసోర్సెస్‌ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఈ కంపెనీలో గూగుల్‌ సహవ్యవస్థాపకుడు ల్యారీ పేజ్‌ వంటి ఉద్దండుల పెట్టుబడులూ ఉన్నాయి. అమెరికాలోనే స్థాపితమైన డీప్‌ స్పేస్‌ ఇండస్ట్రీస్‌ అనే మరో కంపెనీ కూడా అంతరిక్ష నిక్షేపాలను వ్యాపార ప్రాతిపదికపై మానవ వినియోగానికి అందించాలని లక్షిస్తోంది.

రోదసిలో వ్యాపారీకరణ

ఐరోపా అంతరిక్ష సంస్థ (ఇఎస్‌ఏ)కు చెందిన రోజెటా అంతరిక్ష వాహనం 2014 నవంబరులో చుర్యుమోమ్‌-జెరాసిమెంకో తోకచుక్క మీద ఫైలే అనే ల్యాండర్‌ను దింపింది. దీంతో గ్రహ శకలాలపై గనులు తవ్వాలన్న కల సాకారమవుతుందని ఆశలు బలపడ్డాయి. ఇఎస్‌ఏ విజయాన్ని పురస్కరించుకుని అమెరికా జాతీయ వైమానిక-అంతరిక్ష సంస్థ నాసా, గ్రహ శకలాల నుంచి ఖనిజాల వెలికితీత అవకాశాలను పరిశీలించడానికి ప్లానెటరీ రిసోర్సెస్‌, డీప్‌ స్పేస్‌ కంపెనీలకు కాంట్రాక్టు ఇచ్చింది. ఐఎస్‌ఎస్‌కు సరకులను, వ్యోమగాములనూ పంపడం కోసం పునర్వినియోగార్హ రాకెట్‌ల అభివృద్ధికి స్పేస్‌ ఎక్స్‌, బ్లూ ఆరిజిన్స్‌, ఆర్బిటల్‌ ఏటీకే కంపెనీలకు నిధులు ఇస్తోంది. గురు, కుజ గ్రహాల మధ్యనున్న బెన్ను అనే గ్రహశకలం మీదకు 2016కల్లా ఓసిరిస్‌-రెక్స్‌ అంతరిక్ష నౌకను పంపాలని కూడా నాసా సంకల్పించింది. ఇక ఇప్పుడు అమెరికా ప్రభుత్వం రంగంలోకి దిగి అంతరిక్ష వ్యాపారీకరణకు చట్టబద్ధత కల్పించింది. గ్రహ శకలాల్లోని వనరులను వాణిజ్య ప్రాతిపదికపై వినియోగంలోకి తీసుకురావడానికీ అమెరికా పౌరులకు, సంస్థలకు హక్కు ఉందని సాధికారంగా గుర్తిస్తున్న చట్టంపై అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సంతకం చేశారు. దీనితో అంతరిక్షంలో వ్యాపార కార్యకలాపాలకు కొత్త వూపు రానుంది.

గురు-కుజ గ్రహాల మధ్యనున్న గ్రహ శకలాల్లోని ఖనిజ సంపదను ప్రపంచ జనాభాకు పంచితే తలా 10,000 కోట్ల డాలర్లు లభిస్తాయని నాసా అంచనా. గ్రహశకలాల మైనింగ్‌ దిశగా ఇప్పటికే పలు అమెరికన్‌ కంపెనీలు జోరు పెంచాయి. భూ కక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) నుంచి ఈ ఏడాది జూలైలో ప్లానెటరీ రిసోర్సెస్‌ సంస్థ ఆర్కిడ్‌ 3 రీప్త్లెట్‌ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. మరో పదేళ్లలో గ్రహ శకలాల నుంచి నీరు, ప్లాటినం వంటి ఖనిజ నిక్షేపాలను సంగ్రహించడానికి ఉపకరించే సాంకేతిక పరిజ్ఞానాలను ఆర్కిడ్‌ పరీక్షిస్తుంది. స్పేస్‌ ఎక్స్‌ అనే సంస్థకు చెందిన ఫాల్కన్‌ రాకెట్‌ ఐఎస్‌ఎస్‌కు ఆర్కిడ్‌ ఉపగ్రహాన్ని చేరవేసింది. మున్ముందు మరిన్ని ఆర్కిడ్‌ తరహా ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. స్పేస్‌ ఎక్స్‌ కంపెనీని స్థాపించిన వ్యక్తి- టెస్లా కంపెనీ వ్యవస్థాపకుడైన ఎలాన్‌ మస్క్‌. భూమి, అంతరిక్షాల మధ్య వస్తు రవాణా కోసం పునర్వినియోగార్హ రాకెట్ల అభివృద్ధిలో అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బిజోస్‌ స్పేస్‌ ఎక్స్‌ కన్నా ఒక అడుగు ముందుకేశారు. ఆయన స్థాపించిన బ్లూ ఆరిజిన్స్‌ కంపెనీ గత నెలలో న్యూ షెపర్డ్‌ రాకెట్‌ను కక్ష్యలోకి ప్రయోగించి, మళ్లీ భద్రంగా భూమికి దింపింది. ఈ పరిణామాలన్నీ అంతరిక్షంలో మున్ముందు పెరగబోతున్న వ్యాపార పోటీని, రవాణా రద్దీని సూచిస్తున్నాయి. గ్రహశకలాలపై మైనింగ్‌తో పాటు అంతరిక్ష పర్యటనలకు, భూమ్యోపరితలంపై ఒక చోటి నుంచి మరోచోటికి కక్ష్య గుండా వేగంగా చేరుకోవటానికీ ఈ సంస్థలు రూపొందిస్తున్న పునర్వినియోగార్హ రాకెట్లు ఉపకరిస్తాయి.

గ్రహ శకలాలపై గనుల తవ్వకం లక్షల కోట్ల డాలర్ల పరిశ్రమగా అవతరిస్తుందని ప్లానెటరీ రిసోర్సెస్‌ సంస్థ అంచనా. తోకచుక్కలతో పాటు అనేక గ్రహ శకలాలపై నీరు పుష్కలంగా ఉంది. దీన్ని అంతరిక్ష ఫ్యాక్టరీలలోనే హైడ్రోజన్‌, ఆక్సిజన్‌లుగా విడగొట్టి రాకెట్‌ ఇంధనంగా, వ్యోమగాములు పీల్చడానికి అనువైన గాలిగా రూపాంతరం చెందించవచ్చు. అంతరిక్ష యాత్రికులు తాగడానికి కొదవ లేనంత నీరు గ్రహశకలాల్లో ఉంది. సౌర కుటుంబంలోని 20శాతం గ్రహ శకలాలు విలువైన లోహాలకు ఆలవాలం. వజ్రాలు, బంగారం, వెండి టైటానియం, ప్లాటినం, నికెల్‌, ఇనుము, మెగ్నీషియంలతో పాటు ఆస్మియం, పలాడియం, రోడియం వంటి అరుదైన లోహాలూ గ్రహ శకలాల్లో ఉన్నాయి. కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్‌ వంటి ఆధునిక పరిశ్రమలకు అవసరమైన ఈ అరుదైన లోహాలు మరి యాభై-అరవై ఏళ్లలో భూమండలంలో ఖాళీ అవుతాయి. వీటిని గ్రహశకలాల నుంచే పొందాలి. ఒక కిలోమీటరు వ్యాసం ఉండే గ్రహశకలం 200 కోట్ల టన్నుల ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది. అర మైలు వ్యాసమున్న శకలంలో 600 కోట్ల డాలర్ల విలువైన 130 టన్నుల ప్లాటినం లభించవచ్చు. ఇలాంటి లోహాలను వెలికితీసి అంతరిక్షంలోనే ఎలక్ట్రానిక్స్‌ తదితర పరిశ్రమలను ఏర్పాటు చేయడం మానవ నాగరికతలో మలి ఘట్టమవుతుంది. అందుకే జపాన్‌ హయబుస-2 అంతరిక్ష పరిశోధక నౌకను గ్రహ శకల వలయ అధ్యయనానికి పంపింది. అది 2018లో రైయుగు గ్రహ శకలానికి చేరుకుని కొన్ని ఖనిజ మచ్చులను భూమికి తీసుకొస్తుంది. మరి వందేళ్లలో గ్రహ శకలాలతోపాటు చంద్ర, కుజ గ్రహాలమీద కూడా పరిశ్రమలు, వాటిలో పనిచేసే మానవులకు ఆవాసాల నిర్మాణం అనివార్యమవుతుంది. వాటికి నీరు, ఇతర వస్తువుల సరఫరాకు పునర్వినియోగార్హ రాకెట్లే శరణ్యం. భూమ్యాకర్షణ శక్తిని అధిగమించాలంటే ఒక రాకెట్‌ను సెకనుకు ఏడున్నర కిలోమీటర్ల వేగంతో పయనించేట్లు చేయాలి. అందులో వాడే ద్రవీకృత ఆక్సిజన్‌ తదితర ఇంధనాలకు ప్రస్తుతం కిలోకు పది వేల డాలర్ల చొప్పున ఖర్చవుతోంది. ఈ లెక్కన లీటరు నీటిని అంతరిక్షంలోకి పంపడానికి 20 వేల డాలర్ల వ్యయమవుతుంది. అందుకే గ్రహాలు, గ్రహ శకలాల నుంచి తవ్వితీసిన నీరు, ఖనిజాలపై అమెరికన్‌ సంస్థలకు యాజమాన్య, అమ్మకం హక్కులు దఖలు పరుస్తూ అమెరికా చట్టం చేసింది.

యావత్‌ మానవాళి ఆస్తి

ఈ చట్టం మానవ జాతి చరిత్రలో అతి గొప్ప ఆస్తి హక్కుల గుర్తింపు చట్టమని ప్లానెటరీ రిసోర్సెస్‌ సంస్థ శ్లాఘించినా, అంతరిక్షం ఎవడబ్బ సొత్తని పలువురు విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. అంతరిక్షం, గ్రహాలు, గ్రహ శకలాల మీద ఏ దేశానికీ సార్వభౌమత్వం లేదనీ, అక్కడ ఇష్టారాజ్యంగా జనావాసాలు ఏర్పాటుచేసి, గనుల తవ్వకాలు చేపట్టి కాలుష్యం కలిగించరాదని 1967 నాటి అంతర్జాతీయ బాహ్య అంతరిక్ష ఒప్పందం నిర్దేశిస్తోంది. అంతరిక్షం యావత్‌ మానవాళికి చెందుతుందనీ, అక్కడ జరిపే కార్యకలాపాలు అన్ని దేశాలకూ లబ్ధి చేకూర్చాలని స్పష్టం చేసింది. 1979 నాటి చందమామ చట్టంలోనూ ఇదేవిషయం ఉంది. మొదటి చట్టం మీద అమెరికా సంతకంచేసినా, రెండోదానిపై చేయలేదు. అమెరికా తాజాగా చేసిన అంతరిక్ష చట్టం ఈ రెండింటినీ ఉల్లంఘిస్తోంది. అంతరిక్ష అన్వేషణ అంతర్జాతీయ కార్యకలాపం కాబట్టి అది అంతర్జాతీయ నియంత్రణలకు లోబడి ఉండాలి తప్ప ఏదో ఒక్క దేశ చట్టం పరిధిలో కుంచించుకుపోరాదు. ప్రస్తుతం రష్యా, భారతదేశం, చైనాలతోపాటు డజను దేశాలు అంతరిక్ష అన్వేషణ సాగిస్తున్నాయి. అవికూడా తమ మానాన తాము చట్టాలు చేసుకుంటూ పోతే భవిష్యత్తులో రోదసిలో ఘర్షణ ఏర్పడుతుంది. ఇలాంటి అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని అంతరిక్ష అన్వేషణ, వనరుల వినియోగానికి సరికొత్త అంతర్జాతీయ ఒప్పందం కుదుర్చుకొని, దాని చట్రంలోనే ప్రపంచ దేశాలు అంతరిక్ష కార్యకలాపాలు సాగించాలి.

(రచయిత - ఆర్య)
Posted on 02-12-2015