Latest News

గురుకుల 'ధర'ఖాస్తు పెరిగింది

* అభ్యర్థులు రూ.1200 చెల్లించాల్సిందే
* ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.600
* ప్రకటనల్లో పేర్కొన్న గురుకుల బోర్డు

ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ గురుకులాల్లో నియామకాల కోసం ఏర్పాటైన గురుకుల బోర్డు దరఖాస్తు ధరల్లో ప్రత్యేకత చాటుకుంటోంది. ప్రత్యేక నియామక బోర్డు ఏర్పాటు, పరీక్ష విధానం, ఉద్యోగ ప్రకటనల వరకు గోప్యంగా వ్యవహరించిన గురుకులాల నియామక బోర్డు దరఖాస్తు ఫీజు రూ.1200గా పేర్కొంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) ఫీజుతో పోలిస్తే దాదాపు నాలుగింతలు పెరిగింది. దీంతో గురుకుల పోస్టులకు ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగ ప్రకటనలు పరిశీలించిన వారంతా పెంచిన ఫీజులను తగ్గించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఏడాది క్రితం గురుకుల నియామక ప్రకటనలు జారీ చేసిన టీఎస్‌పీఎస్సీ టీజీటీ, పీజీటీ పోస్టులకు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.200 ఖరారు చేసింది. దీనిని అభ్యర్థులందరూ కచ్చితంగా చెల్లించాల్సిందే. ఇక పరీక్ష ఫీజుగా రూ.120గా పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చింది. గురుకుల బోర్డు దీనికి భిన్నంగా వ్యవహరించింది. పరీక్ష నిర్వహణ బాధ్యతను జేఎన్‌టీయూకి అప్పగించినందునా ఫీజును భారీగా పెంచింది. దరఖాస్తు ఫీజును రూ.1200గా నిర్ణయిస్తూ బోర్డు ఛైర్మన్, ఎస్సీ గురుకులాల సొసైటీ కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలో జరిగిన కమిటీ నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.600గా పేర్కొంది. సాధారణ అభ్యర్థులకు నాలుగింతలు పెరిగితే..ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు మూడింతలు పెరిగింది. పరీక్షల నిర్వహణ కోసం జేఎన్‌టీయూ పేర్కొన్న ఫీజు కన్నా ఎక్కువగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వ విభాగాల కన్నా భారీగా ఈ ఫీజు ఉండటం గమనార్హం. అత్యధిక డిమాండ్ ఉండే ఎస్‌బీఐ పీవో పోస్టులకు మూడు దఫాలుగా ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.100, సాధారణ, ఓబీసీ అభ్యర్థులకు రూ.600గా తీసుకుంటోంది. నాలుగు దశల్లో పరీక్షలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్షకు ఫీజు రూ.100కు మించి అదనంగా తీసుకోవడం లేదు. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు లభిస్తోంది. వీటికి భిన్నంగా ప్రభుత్వ పరిధిలో గురుకుల సొసైటీ పరీక్షలకు రూ.1200 నిర్ణయించడంపై విమర్శలు వస్తున్నాయి.
పరీక్ష నిర్వహణ : ఆఫ్‌లైన్లో
ఆన్‌లైన్ దరఖాస్తు : జులై 9 నుంచి
దరఖాస్తు గడువు తేదీ : ఆగస్టు 8
పరీక్ష విధానం
పీజీటీ, టీజీటీ : పేపర్-1, 2, 3
పేపర్-1 : జనరల్ స్టడీస్, అబిలిటీస్, ఆంగ్ల పరిజ్ఞానం
పేపర్-2 : సంబంధిత సబ్జెక్టులో బోధన సామర్థ్యం
పేపర్-3 : సంబంధిత సబ్జెక్టు పరిజ్ఞానం
* ఒక్కోపేపర్‌లో 100 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు ఒకమార్కు
* తప్పుడు సమాధానానికి నాలుగోవంతు మార్కు కోత
* ఒక్కో పేపర్‌కు ఇచ్చే సమయం : రెండు గంటలు

Posted on 01-07-2018