TREIRB Notification

అధ్యాపకులూ.. ఆహ్వానమిదిగో!

* గురుకులాల్లో 746 పోస్టుల నియామకాలు
ఉపాధితో పాటు ఉద్యోగ సంతృప్తినిచ్చే అధ్యాపక పోస్టులకు నగారా మోగింది! తెలంగాణ గురుకులాలకు సంబంధించిన డిగ్రీ కాలేజీల్లో 465, జూనియర్‌ కాలేజీల్లో 281 అధ్యాపక పోస్టుల భర్తీ జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థులు కూడా ఓపెన్‌ కోటాలో వీటికి అర్హులే.
సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉండి, బీఈడీ, నెట్‌ లేదా స్లెట్‌ లేదా పీహెచ్‌డీ ఉన్న అభ్యర్థులు ఈ రెండు రకాల ఉద్యోగాలకూ పోటీ పడవచ్చు!

పోస్టుల సంఖ్య భారీగానే ఉన్నప్పటికీ పోటీ అంతకంటే ఎక్కువ ఉంటుంది. అలాగని నిరుత్సాహపడనవసరం లేదు. ఈ పోటీ ప్రపంచంలో ఎన్ని పోస్టులు, ఎంత పోటీ ఉన్నా ఆత్మస్థైర్యంతో సన్నద్ధం కావలసి ఉంటుంది.
ప్రిపరేషన్‌ ప్రారంభించేటప్పుడు అభ్యర్థులు ముందుగా గ్రహించవలసినవి రెండు అంశాలు. 1. ఏం చదవాలి? 2. వాటిని ఎలా చదవాలి?
డిగ్రీ లెక్చరర్లు: డిగ్రీ కాలేజీ అధ్యాపకుల నియామక విధానం పూర్తిగా రాత పరీక్ష 200 మార్కుల్శు, బోధనా నైపుణ్యాల డెమన్‌స్ట్రేషన్‌ 25 మార్కుల్శు పరీక్షపై ఆధారపడి ఉంటుంది. ఇంటర్వ్యూ ఉండదు. అందుకని నిర్దేశించిన సిలబస్‌ ప్రకారం సిద్ధమవుతూనే బోధనా అభిరుచినీ, బోధనా నైపుణ్యాలనూ మెరుగుపరుచుకోవాలి.
రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కొక్క పేపరు 100 మార్కులకు 100 ఆబ్జెక్టివ్‌ టైపు ప్రశ్నలతో ఉంటుంది. సమయం రెండు గంటలు.
జూనియర్‌ లెక్చరర్లు: జూనియర్‌ అధ్యాపకుల పరీక్షలో మాత్రం మూడు పేపర్లుంటాయి. ఒక్కొక్క పేపరు 100 మార్కులు. మరో 25 మార్కులకు బోధనా నైపుణ్యాలకు (డెమన్‌స్ట్రేషన్‌)ఉంటాయి.
ఈ విధంగా జూనియర్‌ అధ్యాపకులకు 325 మార్కులకు పోటీ పరీక్ష ఉండగా, డిగ్రీ అధ్యాపకులకు మాత్రం మొత్తం 225 మార్కులకే ఉంటుంది.
జూనియర్‌ అధ్యాపకులకు అదనంగా ఒక పేపరు బోధనా శాస్త్రం (పెడగాజి) అనే పేపర్‌ ఉంటుంది. ఇందులో బీఈడీ సిలబస్‌కు సంబంధించిన, విద్యా విలువలు, లక్ష్యాలు, బోధనా పద్ధతులు, విద్యా మనోవిజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు, మూల్యాంకనా పద్ధతులు, విద్యా హక్కు చట్టం 2009 మొదలైన అంశాలపై ప్రశ్నలుంటాయి. ఈ పేపరు డిగ్రీ అధ్యాపకులకు ఉండదు. వారు నెట్‌/ స్లెట్‌లో అర్హత సాధించినవారే కాబట్టి ఈ పేపర్‌ వారికి ఉండదు.
రెండు పరీక్షలూ రాయటానికి అర్హతలున్నవారు మొదటి పేపరు, సబ్జెక్టు పేపర్స్‌లోని సిలబస్‌ పూర్తిగా ఒక్కటేనని గమనించాలి. ఇలాంటివారు రెండు పరీక్షలకూ ఏక కాలంలో ప్రిపేరైతే రెండింటిలోనూ విజయం సాధించవచ్చు!
ఎంపికను నిర్ధారించే పేపర్‌- 1
దీనిలో మూడు విభాగాలున్నాయి. 1. జనరల్‌ స్టడీస్‌ 2. జనరల్‌ ఎబిలిటీస్‌ 3. బేసిక్‌ ఇంగ్ల్లిష్‌. ఒక్కొక్క విభాగం ఎన్ని మార్కులకు ఉంటుందని పేర్కొనక పోయినప్పటికీ ప్రాధాన్యం దృష్ట్యా ఎక్కువ ప్రశ్నలు జనరల్‌ స్టడీస్‌ నుంచి రావొచ్చు.
ప్రతి ఒక్క ప్రశ్నా కీలకమని మరువరాదు. ఏ విభాగం నుంచి ఎన్ని ప్రశ్నలు? ఏ సబ్జెక్టు నుంచి ఎన్ని ప్రశ్నలు? అని ఆలోచించకుండా ఒక్క ప్రశ్నకైనా చదవవలసిందేనని గుర్తించాలి.
అభ్యర్థుల తుది ఎంపికను నిర్ధారించేది ఈ మొదటి పేపరే. ఎందుకంటే రెండో పేపరు అభ్యర్థుల సంబంధిత సబ్జెక్టుకు చెందినది. ఆ పేపర్‌లో అభ్యర్థులు సాధించే మార్కుల్లో వ్యత్యాసం పెద్దగా ఉండదు. కాని మొదటి పేపర్‌లో మాత్రం చాలా తేడా ఉంటుంది. అదే విజయాన్ని నిర్ణయిస్తుంది.
సమగ్రంగా చదవాల్సిందే!
జనరల్‌ స్టడీస్‌కు సంబంధించి సిలబస్‌లో అనేక అంశాలను పేర్కొన్నారు. అయితే సాధారణంగా అన్ని అంశాలనూ కవర్‌ చేస్తూ ప్రశ్నల సమతుల్యతను పాటిస్తారు. ఒక్కొక్కప్పుడు కొన్ని అంశాలనుంచే ఎక్కువ ప్రశ్నలు అడగవచ్చు కూడా. అందుకే ప్రతి అంశాన్నీ సమగ్రంగా చదవాల్సిందే. అంతేకానీ గతంలో ఫలానా సబ్జెక్టు నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయని ఈ సారి దానికే ప్రాధాన్యమిచ్చి చదివితే ఈసారి దానినుంచి అసలు ప్రశ్నలే రాకపోవచ్చు. లేదా నామమాత్రంగా ఒకటి రెండు ప్రశ్నలు రావచ్చు.
మొదటి పేపర్‌లోని 100 మార్కుల కోసం... 80 శాతం సమయాన్ని జనరల్‌ స్టడీస్‌కూ, 10 శాతం సమయాన్ని జనరల్‌ ఎబిలిటీస్‌కూ, మిగతా 10 శాతం సమయాన్ని ఆంగ్ల భాషా ప్రావీణ్యానికీ కేటాయించి చదవాల్సివుంటుంది.
జనరల్‌ ఎబిలిటీస్‌
మొదటి పేపర్‌ రెండో విభాగంలోని తొలి అంశం- ‘మానసిక సామర్థ్యం’
ఇది విశ్లేషణ సామర్థ్యం- లాజికల్‌ రీజనింగ్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్స్‌కు సంబంధించింది. ఇచ్చిన ప్రశ్నలను భిన్న కోణాల్లో పరిశీలించి, విశ్లేషిస్తే సరైన సమాధానాన్ని గుర్తించవచ్చు. అవగాహనా సామర్థ్యానికి సంబంధించినది ఇది. వివిధ రకాల ప్రశ్నలకు సంబంధిత మౌలిక భావనలను అర్థం చేసుకొని, సాధ్యమైనంత ఎక్కువ ప్రశ్నలను సాధన చేయవలసిఉంటుంది.
గత ప్రశ్నపత్రాల పరిశీలన మేలు చేస్తుంది. మార్కెట్‌లో లభ్యమయ్యే ప్రామాణిక పుస్తకాలను చదివి ఆపై మోడల్‌ పేపర్స్‌ సాధన చేయవలసి ఉంటుంది.
రెండో అంశం - విద్యాసంబంధమైన నైతిక విలువలకు సంబంధించినది.
మూడో అంశం - బోధనా అభిరుచికి సంబంధించినది.
వీటికి సాధారణంగా అనుభవంతోగానీ, అవగాహనతోగానీ సమాధానాలను గుర్తించవలసిఉంటుంది. ప్రశ్నలను అభ్యాసం చేస్తే స్పష్టత వస్తుంది.
ఈ రెండు అంశాలకు సంబంధించి మౌలిక భావనలను అర్థం చేసుకుని విశ్లేషించి, అత్యుత్తమ సమాధానాన్ని గుర్తించవలసిఉంటుంది. చాలావరకు ఈ రెండు అంశాల నుంచి వచ్చే ప్రశ్నలకు సందర్భానుసారంగా, సందర్భోచితంగా సమాధానాలను గుర్తించవచ్చు. ఈ ప్రశ్నలు విషయ పరిజ్ఞానానికి సంబంధించినవి కావని గుర్తించండి.
జనరల్‌ స్టడీస్‌
మొదటి అంశం: వర్తమాన విషయాలకు సంబంధించినది. ఇందులో ప్రశ్నలన్నీ ప్రముఖ వార్తాపత్రికల ప్రధాన శీర్షికల నుంచి వస్తాయి. దీనికోసం ఇప్పటినుంచి టీవీ ఛానల్స్‌లో ప్రసారమయ్యే వార్తలను ఉదయం, రాత్రి చూసి, ఆ తర్వాత వార్తా పత్రికలను చదివితే అవగాహన వస్తుంది.
రెండో అంశం: భారత రాజ్యాంగం- భారత రాజకీయ వ్యవస్థ- పరిపాలన, ప్రభుత్వ విధానాలకు సంబంధించినది. పూర్తి పట్టు సాధించాలంటే వివిధ అంశాలకు సంబంధించిన భావనలను అర్థం చేసుకొని చదవాల్సివుంటుంది.
మూడో అంశం: సామాజిక వెలికి సంబంధించినది. అస్పృశ్యత, దళితులు, గిరిజనులు, వెనుకబడినవారి సమస్యలు- హక్కులు, ప్రభుత్వ విధానాలు- చట్టాలు, మహిళా సమస్యలు- పథకాలు- చట్టాలు మొదలైనవి. నిజానికిది విస్తృతమైన అంశమైనా ప్రాథ]మిక అవగాహన ఉండాలి.
నాలుగో అంశం: తెలంగాణ సమాజం, సంస్కృతి వారసత్వం- కళలు- సాహిత్య అంశాలపై సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలి. తెలంగాణ సాహిత్యానికి సంబంధించిన కవులు- వారి రచనలపై ప్రశ్నలుంటాయి. ముఖ్యంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, నాటక రచనలు- గేయాలు, ఉద్యమ పాటలు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని వాడుక పదాలపై ప్రశ్నలుంటాయి. రాష్ట్ర సాహిత్య అకాడమి, తెలుగు అకాడమి ప్రచురణలు ఉపయోగకరం. ఉగాది రోజున ప్రభుత్వం ఉచితంగా అందించిన- ‘తెలంగాణ వెలుగు’ అనే చిన్న పుస్తకం కొంత ఉపయోగపడుతుంది.
ఐదో అంశం: సాధారణ శాస్త్రీయ పరిజ్ఞానం, దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల పురోభివృద్ధికి సంబంధించినది. టెన్త్‌ స్థాయిలోని సైన్స్‌ పాఠ్యాంశాల మౌలిక భావనలూ, నిత్యజీవితంలో వాటి వినియోగాన్ని అవగాహన చేసుకోవాలి.
జనరల్‌ స్టడీస్‌లో తరువాతి అంశం: పర్యావరణ సమస్యలు- విపత్తు నిర్వహణ, సుస్థిరాభివృద్ధికి చెందినది. తెలుగు అకాడమీ ప్రచురణల సమాచారం దీనికి ఉపయుక్తం. ప్రశ్నల సరళినీ, స్థాయినీ తెలుసుకునేందుకు టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల అధ్యయనం మేలు.
తరువాతి అంశం: భారతదేశ, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, ఆర్థికాభివృద్ధికి చెందినది. ఆర్థిక వ్యవస్థ మౌలికాంశాలపై అవగాహన అవసరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచురించే సామాజిక - ఆర్థిక సర్వేలు చదవాలి.
చివరి అంశం: తెలంగాణ సామాజిక, ఆర్థిక రాజకీయ సాంస్కృతిక చరిత్ర. దీనికోసం శాతవాహనుల నుంచి 1948 వరకు పూర్తిగా పరీక్షా పద్ధతిలో చదవాలి. ముఖ్యంగా శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణు కుండినులు, వేములవాడ చాళుక్యులు- కాకతీయులు- కుతుబ్షాహీలు, ఆసఫ్‌ జాహీల వరకు. 1948 నుంచి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకూ ప్రధాన ఘట్టాల అవగాహన అవసరం. ఈ పోటీ పరీక్షల ప్రిపరేషన్‌లో భాగంగా టీఎస్‌పీఎస్‌సీ గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు పరిశీలిస్తే ప్రశ్నల సరళీ, స్థాయీ తెలుస్తాయి. తద్వారా పరీక్షకు ఏ విధంగా సిద్ధం కావాలో సులువుగా తెలుస్తుంది.
బేసిక్‌ ఇంగ్లిష్‌
మొదటిపేపర్‌లోని చివరి విభాగం- ఆంగ్ల భాషా ప్రావీణ్యానికి సంబంధించిన ప్రాథమిక అంశాలు. 10వ తరగతి స్థాయిలో వీటిని అధ్యయనం చేయాలి. 8, 9, 10 తరగతుల ఇంగ్లిషు పుస్తకాల వర్క్‌ బుక్స్‌ను సిలబస్‌ ప్రకారం అభ్యసించాలి. ఆ సాధనకు ముందు సిలబస్‌ అంశాల మౌలిక భావనలు- నిర్వచనాలను ఉదాహరణలతో అవగాహన చేసుకోవాలి. సాధ్యమైనన్ని ఎక్కువ ప్రశ్నల సాధన ఎంతో మేలు చేస్తుంది.

Posted on 06-08-2018

Study Material