IBPS Clerical - Preparation Plan

ఐబీపీఎస్‌: ప్ర‌భుత్వ‌రంగ‌ బ్యాంకుల్లో 7275 క్లర్కు పోస్టులు

దేశ‌వ్యాప్తంగా జాతీయ బ్యాంకుల్లోని 7275 క్లరికల్‌ పోస్టుల భర్తీ కోసం క్లర్క్స్ - VIII ప్రకటనను ఐబీపీఎస్‌ విడుదల చేసింది. బ్యాంకు ఉద్యోగార్థులకు ఇదో మంచి అవకాశం. ఈ క్లర్కు పోస్టుల ముఖ్యాంశాలు, రాతపరీక్ష విధానం, సన్నద్ధతలో పాటించాల్సిన మెలకువలు తెలుసుకుందాం...
ఎస్‌బీఐ మినహా మిగిలిన జాతీయ బ్యాంకుల్లో రోజువారీ బ్యాంకింగ్‌ సేవలను అందించడానికి క్లరికల్‌ ఉద్యోగుల అవసరం ఉంది. బ్యాంకు ఖాతా తెరవడం, డబ్బు జమచేయడం, తీసుకోవడం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, రుణాల ప్రక్రియ, మనీ ఎక్స్ఛేంజి, డిమాండ్‌ డ్రాఫ్ట్స్‌, ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌, చెక్‌ ఇష్యూ తదితర రోజువారీ సేవలను అందించడానికి క్లరికల్‌ సిబ్బంది అవసరం. ఖాతాదారులు బ్యాంకుల్లో మొదటగా వచ్చి కలిసేది వీరినే కాబట్టి ఈ ఉద్యోగులకు తప్పనిసరిగా సంబంధిత రాష్ట్రభాషలో మాట్లాడటం, చదవడం, రాయడం వంటివి వచ్చుండాలి. పరీక్ష నిమిత్తం తెలుగు రాష్ట్రాల్లో దేన్నుంచైనా లేదా దేశంలోని ఏదైనా ఒక రాష్ట్రానికి మాత్రమే దరఖాస్తు చేయవచ్చు.

ముఖ్యమైన తేదీలు
* ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌: 18.09.2018 నుంచి 10.10.2018 వ‌ర‌కు
* ప్రిలిమినరీ ఆన్‌లైన్‌ పరీక్ష: 2018 డిసెంబరు 8, 9, 15, 16 తేదీలు
* మెయిన్స్‌ రాతపరీక్ష: 20.01.2019

వయ:పరిమితి: 20 నుంచి 28 సంవత్సరాల వయసువారై ఉండాలి. అభ్యర్థులు తమ వయసును 01.09.2018తో పోల్చి చూసుకోవాలి. ఎస్‌సీ/ ఎస్‌టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సం., ఓబీసీ కేటగిరీవారికి 3 సం., అంగవైకల్యం ఉన్నవారికి 10 సంవత్సరాల మినహాయింపు ఉంది.

విద్యార్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణ‌త‌.. కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం త‌ప్ప‌నిస‌రి. అభ్య‌ర్థి ద‌ర‌ఖాస్తు చేసుకునే రాష్ట్రానికి సంబంధించిన‌ ప్రాంతీయ భాష‌లో చ‌ద‌వ‌డం, రాయ‌డం, మాట్లాడ‌టం వ‌చ్చి ఉండాలి.
దరఖాస్తు: అభ్యర్థులు తమ వివరాలను ఆన్‌లైన్‌లో పూర్తిచేసి, రూ.600 పరీక్ష ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఎస్‌సీ/ ఎస్‌టీ/ పీడబ్ల్యూడీ/ ఎక్స్‌స‌ర్వీస్‌మెన్‌ వారు రూ.100 చెల్లించాలి.

పరీక్ష కేంద్రాలు
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్రిలిమిన‌రీ కేంద్రాలు: చీరాల‌, చిత్తూరు, ఏలూరు, గుటూరు, క‌డ‌ప‌, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజ‌మండ్రి, శ్రీకాకుళం, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం.
మెయిన్స్‌ కేంద్రాలు: గుంటూరు, క‌ర్నూలు, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం.
తెలంగాణలో ప్రిలిమిన‌రీ కేంద్రాలు: హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌
మెయిన్స్‌: హైదరాబాద్‌.

పోస్టుల వివరాలు: ఆంధ్రప్రదేశ్‌-167, తెలంగాణ-162, కర్ణాటక-618, తమిళనాడు-792. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో అత్యధికంగా 944 పోస్టులు ఉన్నాయి.

ఏపీలో ఖాళీల వివ‌రాలు
అల‌హాబాద్ బ్యాంకు-15, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా-16, బ్యాంక్ ఆఫ్ ఇండియా-09, కార్పొరేష‌న్ బ్యాంక్‌-10, ఇండియ‌న్ బ్యాంక్‌-52, ఓరియంట‌ల్ బ్యాంక్ ఆఫ్ కామ‌ర్స్‌-10, యూకో బ్యాంక్-08, యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-39, విజ‌యా బ్యాంక్‌-08.

తెలంగాణ‌లో ఖాళీల వివ‌రాలు
అల‌హాబాద్ బ్యాంకు-20, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా-13, బ్యాంక్ ఆఫ్ ఇండియా-06, కెన‌రా బ్యాంక్‌-60, కార్పొరేష‌న్ బ్యాంక్‌-07, ఇండియ‌న్ బ్యాంక్‌-15, ఓరియంట‌ల్ బ్యాంక్ ఆఫ్ కామ‌ర్స్‌-05, యూకో బ్యాంక్-08, యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-20, విజ‌యా బ్యాంక్‌-08.

ఎంపిక ప్రక్రియ
రెండంచెలుగా జరిగే రాతపరీక్షలో అభ్యర్థులు మొదటగా ప్రిలిమినరీ ఆన్‌లైన్‌ పరీక్ష రాయాలి. ప్రతి విభాగంలో కనీస అర్హత మార్కులతోపాటు మొత్తంగా కటాఫ్‌ మార్కులు వచ్చినవారికి మాత్రమే మెయిన్స్‌ ఆన్‌లైన్‌ పరీక్షను నిర్వహిస్తారు. మెయిన్స్‌ పరీక్షలో అభ్యర్థులకు వచ్చే మార్కులను బట్టి మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా పోస్టులను కేటాయిస్తారు. ప్రిలిమ్స్‌లో వంద ప్ర‌శ్న‌ల‌కు వంద మార్కులు కేటాయించారు. 60 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. మెయిన్స్‌ పరీక్షలో 190 ప్రశ్నలుంటాయి. 200 మార్కులు. 2.40 గంటల వ్యవధిలో పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రతి విభాగంలో కనీసార్హత మార్కులతోపాటు ఓవరాల్‌ కటాఫ్‌ మార్కులను కూడా పొందాలి. ప్రిలిమినరీ పరీక్షలో వచ్చే మార్కులు క్వాలిఫయింగ్‌ మార్కులు మాత్రమే. ఓబీసీ కేటగిరీ ఎంచుకునేవారు వారి కుల ధ్రువీకరణ సెంట్రల్‌ ఓబీసీ జాబితాలో ఉండి, నాన్‌క్రీమీలేయర్‌, క్రీమీలేయర్‌ మధ్య వ్యత్యాసాలను తెలుసుకుని, అర్హత ఉంటేనే ఓబీసీ కేటగిరీకి దరఖాస్తు చేయాలి. లేనివారు యూఆర్‌ (జనరల్‌) కేటగిరీని ఎంచుకోవాలి.


తొలి యత్నంలో గెలుపు సాధ్యమే!
గత ఏడేళ్లుగా ఐబీపీఎస్‌ నిర్వహిస్తున్న ఉమ్మడి రాతపరీక్ష ద్వారా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వేలాది ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి. పోటీ తీవ్రమవుతోంది. పరీక్ష విధానంలో, ప్రశ్నల స్థాయిలో కూడా ఎంతో మార్పు వచ్చింది. ఈ మార్పులకు అనుగుణంగా సిద్ధమైతేనే విజయం సాధ్యం! ఐబీపీఎస్‌ క్లరికల్‌ ప్రకటన వెలువడిన నేపథ్యంలో అభ్యర్థులు తరచూ లేవనెత్తే సందేహాలూ...వాటిని నివృత్తి చేసే జవాబులూ...

ప్ర: పీఓతో పోలిస్తే క్లరికల్‌ పరీక్ష ఏ మేరకు సులభం?
జ: పీఓతో పోలిస్తే క్లరికల్‌ పరీక్ష తప్పకుండా తక్కువ స్థాయిలోనే ఉంటుంది. అయితే సిలబస్‌పరంగా పెద్దగా మార్పు లేకుండా ఒకేలా ఉంటుంది. ప్రశ్నలస్థాయి మాత్రం పీఓతో పోల్చినపుడు కొంచెం తక్కువ స్థాయి. అందుకని పీఓకు సిద్ధమైనవారికి క్లరికల్‌ పరీక్ష రాయాలంటే ప్రత్యేక సన్నద్ధత అవసరం ఉండదు.

ప్ర: ప్రిలిమ్స్‌లో అర్హత పొందాక మెయిన్స్‌ పరీక్షకు సిద్ధమవాలా? రెండింటికీ ఒకేసారి సన్నద్ధమవాలా?
జ: మెయిన్స్‌ పరీక్షలో ఉన్న అయిదు సబ్జెక్టుల్లో మూడు ప్రిలిమ్స్‌లోనూ ఉన్నాయి. కాబట్టి రెండింటికీ కలిపి సన్నద్ధమైతే ఉపయోగకరం. ప్రిలిమ్స్‌ సమయానికి మెయిన్స్‌కు కూడా సన్నద్ధత పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాతి 40-50 రోజుల సమయాన్ని మెయిన్స్‌ పరీక్ష విధానంలో వివిధ మోడల్‌ పేపర్లను సాధన చేయడం మంచిది.

ప్ర: ప్రిలిమ్స్‌లో అన్ని విభాగాలకూ కలిపి ఉమ్మడిగా 60 నిమిషాల సమయం కేటాయించారు. అయితే ఏ విభాగానికి ఎంత సమయాన్ని కేటాయించాలి?
జ: ప్రిలిమ్స్‌లో అభ్యర్థులు మూడు విభాగాల్లోనూ కనీస మార్కులు సాధించి ఉత్తీర్ణులు అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి సబ్జెక్టుల కఠినత్వస్థాయి ఆధారంగా ప్రతి విభాగానికీ కనీస సమయాన్ని కేటాయించుకోవాలి. ఇంగ్లిష్‌కు 15, రీజనింగ్‌కు 20, న్యూమరికల్‌ ఎబిలిటీకి 25 నిమిషాల చొప్పున సమయం కేటాయించుకుంటే ఉపయోగకరం. అభ్యర్థులు సాధారణ ప్రశ్నల సంఖ్యతో సంబంధం లేకుండా తమకు కేటాయించిన సమయం పూర్తవ్వగానే ఆ విభాగాన్ని ఆపేయాలి. అప్పుడే ప్రతి విభాగంలోనూ కనీస సంఖ్యలో ప్రశ్నలను సాధించగలిగి ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉంటుంది.

ప్ర: మొదటిసారి ఆన్‌లైన్‌ పద్ధతిలో పరీక్షరాసే అభ్యర్థులకు ఏదైనా ఇబ్బంది ఉంటుందా?
జ: ఎటువంటి ఇబ్బందీ ఉండదు. పరీక్ష హాలులో వారి కోసం సహాయకులు ఉంటారు. అయితే అభ్యర్థులు ఐబీపీఎస్‌ తరహాలో వివిధ రకాల ఆన్‌లైన్‌ పరీక్షలను బాగా సాధన చేయాలి.

ప్ర: ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షల్లో ఎన్ని మార్కులు వస్తే అర్హత పొందుతారు?
జ: ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ రెండింటిలోనూ అభ్యర్థులు అన్ని విభాగాల్లో కనీస మార్కులు సాధిస్తూ మొత్తంగా నిర్ణయించిన కటాఫ్‌ మార్కులకంటే ఎక్కువ సాధించాల్సి ఉంటుంది. గత సంవత్సరం నిర్వహించిన పరీక్షలోని కటాఫ్‌ మార్కులను పరిశీలిస్తే ఈ ఏడాది కటాఫ్‌ మార్కులపై ఒక అంచనాకు రావచ్చు.

ప్ర: పరీక్షలో తెలియని ప్రశ్నలకు వూహించి జవాబులను గుర్తిస్తే ఉపయోగం ఉంటుందా?
జ: ప్రతి ప్రశ్నకూ రుణాత్మక మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికీ 0.25 మార్కులు కోల్పోవాల్సి వస్తుంది. వూహించి గుర్తిస్తే, సరైన సమాధానం అవడానికి 20% మాత్రమే అవకాశం ఉంటుంది (5 ఆప్షన్లు కాబట్టి..). ఏవైనా రెండు ఆప్షన్ల మధ్య సందేహం ఉంటే జవాబును వూహించవచ్చు.

ప్ర: అరిథ్‌మెటిక్‌ అంశాలన్నింటినీ నేర్చుకోవాలా? కొన్నింటిని వదిలేయవచ్చా?
జ: క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ లేదా న్యూమరికల్‌ ఎబిలిటీ విభాగంలో ప్రశ్నలన్నీ అరిథ్‌మెటిక్‌ నుంచి మాత్రమే ఉండవు. 50 ప్రశ్నలుంటే వాటిలో 8-10 ప్రశ్నలు అరిథ్‌మెటిక్‌ నుంచి ఉంటాయి. సాధారణంగా నంబర్‌ సిరీస్‌ నుంచి 5, సింప్లిఫికేషన్స్‌ నుంచి 5-10, డేటా సఫిషియన్సీ 5, అప్రాక్సిమేట్‌ వాల్యూస్‌ 5, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌ 5, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ 10-15 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో అరిథ్‌మెటిక్‌ అంశం నుంచి 1 లేదా 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా టాపిక్‌ కఠినంగా భావించి వదిలేస్తే పెద్దగా నష్టం ఉండదు. అయితే అన్ని టాపిక్‌లను నేర్చుకోవడం వల్ల డేటా సఫిషియన్సీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ ప్రశ్నలను తేలికగా సాధించవచ్చు.

ప్ర: మొదటిసారి పరీక్ష రాస్తున్నవారికి దీనిలో విజయం సాధించడానికి ఏమేరకు అవకాశం ఉంటుంది?
జ: బ్యాంకు పరీక్షలోని సబ్జెక్టులన్నీ జనరల్‌ సబ్జెక్టులు లేదా స్కూలు స్థాయిలో చదివినవే. వాటన్నింటినీ పునశ్చరణ/ అవగాహన చేసుకోవడానికి 30-45 రోజుల సమయం సరిపోతుంది. కానీ ఈ పరీక్షలో సమయం తక్కువ. వీలైనంత వేగంగా ప్రశ్నలను సాధించాలి. దానికోసం వీలైనంత సాధన అవసరం. ప్రిలిమ్స్‌ పరీక్షకు దాదాపు 3 నెలలు, మెయిన్స్‌కు దాదాపుగా నాలుగున్నర నెలల సమయం ఉంది. తగినవిధంగా సన్నద్ధమవడానికి సరిపోయే సమయమే. మొదటిసారి రాస్తున్న అభ్యర్థులు కూడా ఎలాంటి సందేహం లేకుండా సమగ్రంగా తయారైతే నెగ్గవచ్చు.


Notification Website

Posted on 14-9-2018