IBPS POs NOTIFICATION

ఐబీపీఎస్‌: ప్ర‌భుత్వ‌రంగ‌ బ్యాంకుల్లో 4252 పీఓ పోస్టులు

దేశ‌వ్యాప్తంగా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ అధికారులు/ మేనేజ్‌మెంట్ ట్రైనీ (పీఓ/ ఎంటీ) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్స‌న‌ల్ సెల‌క్ష‌న్ (ఐబీపీఎస్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 7 బ్యాంకుల్లో మొత్తం 4252 పోస్టులను ప్రకటించారు. డిగ్రీ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండంచెల రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా పీఓ అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. మొదటి అంచెలో నిర్వహించే ప్రిలిమినరీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు రెండో అంచెలోని మెయిన్స్‌కు అర్హత సాధిస్తారు. దీనిలో ఉత్తీర్ణులైన నిర్ణీత అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మెయిన్స్‌ పరీక్ష, ఇంటర్వ్యూల్లో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

* ఐబీపీఎస్ - సీఆర్‌పీ పీఓ/ ఎంటీ-8
పోస్టు: ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్/ మేనేజ్‌మెంట్ ట్రైనీ
మొత్తం పోస్టుల సంఖ్య‌: 4252
బ్యాంకుల వారీ ఖాళీలు: అల‌హాబాద్ బ్యాంక్‌-784, బ్యాంక్ ఆఫ్ ఇండియా-965, కెన‌రా బ్యాంక్-1200, కార్పొరేష‌న్ బ్యాంక్-84, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ - 150, యూసీవో బ్యాంక్-550, యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-519.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.
వయసు: 01.08.2018 నాటికి 20 నుంచి 30 సంవ‌త్స‌రాల‌ మధ్య ఉండాలి. 02.08.1988 - 01.08.1998 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ (ప్రిలిమిన‌రీ, మెయిన్స్‌) రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా.

ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు:
ఆంధ్రప్రదేశ్‌: చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, క‌డ‌ప‌, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
తెలంగాణలో: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
మెయిన్స్ పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ద‌ర‌ఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగుల‌కు రూ.100, ఇత‌రుల‌కు రూ.600.

ముఖ్యమైన తేదీలు...
* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌ ప్రారంభం: 14.08.2018.
* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివరితేది: 04.09.2018.
* ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు ప్ర‌క్రియ‌: 14.08.2018 నుంచి 04.09.2018 వ‌ర‌కు.
* ప్రి-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్‌లెట‌ర్‌ డౌన్‌లోడ్‌: సెప్టెంబ‌రు 2018లో.
* ప్రి-ఎగ్జామ్ ట్రైనింగ్ ప‌రీక్ష‌ తేది: 01.10.2018 నుంచి 07.10.2018 వ‌ర‌కు.
* ప్రిలిమిన‌రీ ప‌రీక్ష (ఆన్‌లైన్) కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌: అక్టోబ‌రు 2018లో.
* ప్రిలిమిన‌రీ ప‌రీక్ష (ఆన్‌లైన్) తేదీ: అక్టోబ‌రు 13, 14, 20, 21 తేదీల్లో.
* ప్రిలిమిన‌రీ ప‌రీక్ష (ఆన్‌లైన్) ఫ‌లితాలు: అక్టోబ‌రు/ న‌వంబ‌రు 2018.
* మెయిన్ ఎగ్జామ్ (ఆన్‌లైన్‌) కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌: న‌వంబ‌రు 2018.
* మెయిన్ ఎగ్జామ్ (ఆన్‌లైన్‌) తేది: 18.11.2018
* మెయిన్ ఎగ్జామ్ ఫ‌లితాలు: డిసెంబ‌రు 2018.
* ఇంట‌ర్వ్యూ కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌: జ‌న‌వ‌రి 2019.
* ఇంట‌ర్వ్యూ తేది: జ‌న‌వ‌రి/ ఫిబ్ర‌వ‌రి 2019.
* ప్రొవిజినల్ అలాట్‌మెంట్‌: ఏప్రిల్ 2019

పరీక్షా విధానం
ప్రిలిమినరీలో మూడు విభాగాలుంటాయి. 100 ప్రశ్నలతో 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. కేటాయించిన మొత్తం సమయం 60 నిమిషాలు. విభాగాల‌వారీ స‌మ‌యాన్ని కేటాయించారు. ఒక్కో విభాగాన్ని 20 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. మెయిన్స్‌లో మొత్తం అయిదు సబ్జెక్టులతో నాలుగు విభాగాలుంటాయి. విభాగాల వారీగా సమయాన్ని కేటాయించారు. మొత్తం 3 గంటలు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో డిస్క్రిప్టివ్‌ పేపర్‌కు అదనంగా 30 నిమిషాల వ్యవధి. అంటే మెయిన్స్‌ మొత్తానికి కేటాయించిన సమయం 3.30 గంటలు. అభ్యర్థులు ఈ విభాగాలన్నింటిలో విడివిడిగా ఉత్తీర్ణులవ్వాలి. ప్రతి తప్పు సమాధానానికీ ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో నాలుగోవంతు కోత (రుణాత్మక మార్కు) విధిస్తారు.

సబ్జెక్టులు- ప్రశ్నల సరళి
డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌/ క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: ప్రిలిమినరీలోని క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లోని ప్రశ్నలు, సింప్లిఫికేషన్స్‌, నంబర్‌ సిరీస్‌, డేటా సఫిషియన్సీ, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, వివిధ అరిథ్‌మెటిక్‌ అంశాల నుంచి వస్తాయి. మెయిన్స్‌లోని డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లోని ప్రశ్నలు, పట్టికలు, లైన్‌గ్రాఫ్‌లు, బార్‌ డయాగ్రమ్‌లు, పైచార్టులు, కేస్‌లెట్స్‌ నుంచి ఎక్కువగా ఉంటాయి. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ ప్రశ్నలను సాధించడానికి పర్సంటేజీ, యావరేజ్‌, రేషియో- ప్రపోర్షన్‌, కాల్‌క్యులేషన్స్‌పై పట్టు ఉండాలి. అంతర సంబంధం ఉన్న రెండు లేదా అంతకన్నా ఎక్కువ గ్రాఫ్‌లను ఇచ్చినపుడు సమాచారాన్ని పట్టిక రూపంలోకి మార్చుకుంటే ప్రశ్నలను త్వరగా సాధించవచ్చు.

రీజనింగ్‌: మెయిన్స్‌ పరీక్షలోని ప్రశ్నలు హెచ్చు స్థాయిలో ఉంటాయి. అనలిటికల్‌ రీజనింగ్‌/ క్రిటికల్‌ రీజనింగ్‌ నుంచి ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి. సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌లో ప్రశ్నల సంక్షిష్టతతోపాటు ప్రశ్నల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలు రెండింటిలో ఈ అంశం నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. కోడింగ్‌-డీకోడింగ్‌, డైరెక్షన్స్‌, బ్లడ్‌ రిలేషన్స్‌, వెన్‌ డయాగ్రమ్‌, సిలాజిజమ్‌, ఇన్‌పుట్‌- అవుట్‌పుట్‌, ఎలిజిబిలిటీ టెస్ట్‌, పజిల్‌ టెస్ట్‌, స్టేట్‌మెంట్‌ సంబంధ ప్రశ్నలు ఉంటాయి.

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: చాలా ముఖ్యమైన, ఎక్కువమంది విఫలమవుతున్న విభాగమిది. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ రెండింటితోపాటు మెయిన్స్‌ పరీక్షలో అదనంగా డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌లోనూ ఈ సబ్జెక్టు ఉంది. గ్రామర్‌ బాగా చూసుకోవాలి. డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌లోని ఎస్సే, లెటర్‌ రైటింగ్‌లను బాగా సాధన చేయాలి.

జనరల్‌/ ఎకానమీ/ బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌: మెయిన్స్‌లో మాత్రమే ఉన్న ఈ విభాగంలో దాదాపు 80% ప్రశ్నలు పరీక్ష సమయానికి 5, 6 నెలల ముందు వరకు ఉన్న కరెంట్‌ అఫైర్స్‌ నుంచి ఉంటాయి. బ్యాంకింగ్‌, ఆర్థిక సంబంధ విషయాలపైనే ప్రశ్నలు ఎక్కువ. భారత ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్‌, ఆర్థిక సంస్థలు, కేంద్రప్రభుత్వ పథకాలు, ఆర్‌బీఐ, స్టాక్‌ మార్కెట్‌, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, జాతీయ, అంతర్జాతీయ విషయాలు మొదలైనవాటి నుంచి కూడా ప్రశ్నలు ఉంటాయి. విషయాలన్నింటినీ క్షుణ్ణంగా తెలుసుకోవాలి, కేవలం ప్రశ్నకు జవాబు అన్న రీతిలో కాకుండా పరిణామాలను విశ్లేషించేలా సన్నద్ధత ఉండాలి.

కంప్యూటర్‌ నాలెడ్జ్‌: ఇది మెయిన్స్‌లో రీజనింగ్‌తో కలిపి ఉన్న సబ్జెక్టు. జనరేషన్స్‌ ఆఫ్‌ కంప్యూటర్స్‌, హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌, ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌, ఎంఎస్‌ ఆఫీస్‌, ఇంటర్నెట్‌, వైరస్‌-యాంటీ వైరస్‌, నెట్‌వర్కింగ్‌, డీబీఎంఎస్‌, ఈ రంగంలోని తాజా పరిణామాలు మొదలైనవి బాగా చూసుకోవాలి.




Notification Website

posted on 09-08-2018