Institute of Banking Personnel Selection - RRBs


బ్యాంకు కొలువుల పల్లెబాట!

గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్ల్ల, ఆఫీస్‌ అసిస్టెంట్ల నియామకానికి ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా 45 గ్రామీణ బ్యాంకుల్లో దాదాపు 3500 ఖాళీలు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 5 గ్రామీణ బ్యాంకుల్లో దాదాపు 350) భర్తీ చేస్తారు. డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు పోటీ పడవచ్చు. రోజుకు 10 గంటలకు పైగా సమయాన్ని కేటాయిస్తూ ప్రణాళిక ప్రకారం సిద్ధమయితే బ్యాంకు ఉద్యోగం సంపాదించవచ్చు. దరఖాస్తుల గడువు జులై 4. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసి, వెంటనే ప్రిపరేషన్‌ ఆరంభించటం ఉత్తమం!

తాజా నోటిఫికేషన్లో ఆఫీస్‌ అసిస్టెంట్లను రెండంచెల ద్వారా నిర్వహించే ఆన్‌లైన్‌ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. స్కేల్‌-1 ఆఫీసర్లకు రెండంచెల ఆన్‌లైన్‌ రాతపరీక్ష, ఇంటర్వ్యూలు, స్కేల్‌- 2, 3 ఆఫీసర్లకు ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించే ఒకే ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూలుంటాయి.
స్కేల్‌- 1 ఆఫీసర్లు, ఆఫీస్‌ అసిస్టెంట్ల రాత పరీక్షలు ఒకే విధం. స్కేల్‌- 1 ఆఫీసర్ల పరీక్షలో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ విభాగం స్థానంలో ఆఫీస్‌ అసిస్టెంట్ల పరీక్షలో న్యూమరికల్‌ ఎబిలిటీ ఉంటుంది. ఇది మినహా ఇతర విభాగాలూ, పరీక్ష విధానం ఒకే రకం. ప్రిలిమినరీ పరీక్షలలో రెండు విభాగాల్లోని మొత్తం 80 ప్రశ్నలకు 45 ని. సమయం ఉంటుంది. మెయిన్‌ పరీక్షలో 5 విభాగాల్లోని 200 ప్రశ్నలకు 2 గంటల సమయం ఉంటుంది.
స్కేల్‌- 1, స్కేల్‌- 3 రాత పరీక్షలు స్కేల్‌- 1 మెయిన్స్‌ పరీక్ష మాదిరిగా ఉంటాయి. అయితే జనరల్‌ అవేర్‌నెస్‌ స్థానంలో ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ విభాగం వుంటుంది. స్కేల్‌- 2 స్పెషలిస్ట్‌ ఆఫీసర్ల పరీక్షలో వీటికి అదనంగా ప్రొఫెషనల్‌ నాలెడ్జి విభాగం ఉంటుంది.ఆఫీస్‌ అసిస్టెంటు, ఆఫీసర్ల (1 2 3) పరీక్షలన్నింటిలనూ అన్ని విభాగాలలో కనీస మార్కులతో విడివిడిగా ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికీ ప్రశ్నకు కేటాయించిన మార్కులలో 4వ వంతు తగ్గిస్తారు.
డిగ్రీ/ఇంజినీరింగ్‌ పూర్తయిందా?
బ్యాంకింగ్‌ కార్యకలాపాలు, సదుపాయాలు, గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు అందజేసే ప్రధాన ఉద్దేశ్యంతో స్థాపించినవే ఈ గ్రామీణ బ్యాంకులు. ప్రభుత్వరంగ బ్యాంకులతో పోలిస్తే జీతభత్యాలు తక్కువ అయినప్పటికీ తమ ప్రాంతాల్లోనే ఉద్యోగం చేయాలనుకునేవారికీ, గ్రామీణ ప్రాంతాలకు సేవచేసే ఉద్దేశమున్న అభ్యర్థులకూ ఇది చక్కని అవకాశం. స్కేల్‌-1 ఆఫీసర్‌ (అసిస్టెంట్‌ మేనేజర్‌)గా చేరిన అభ్యర్థి మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, చీఫ్‌ మేనేజర్‌/రీజనల్‌ మేనేజర్‌, జనరల్‌ మేనేజర్‌ స్థాయి వరకు ఆపై ఛైర్మన్‌/మేనేజింగ్‌ డైరెక్టర్‌ స్థాయి వరకు చేరుకోవచ్చు. అసిస్టెంట్‌గా జాయిన్‌ అయిన అభ్యర్థులు చీఫ్‌ మేనేజర్‌, జనరల్‌ మేనేజర్‌ స్థాయిల వరకు చేరుకోవచ్చు.
తాజాగా డిగ్రీ లేదా ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన విద్యార్థులు బ్యాంక్‌ ఉద్యోగం తమ లక్ష్యంగా వుంటే ఈ నోటిఫికేషన్‌తో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పీవో, క్లర్క్‌, స్పెషలిస్ట్‌ ఆఫీసర్ల భర్తీకి ఐబీపీఎస్‌ త్వరలో విడుదల చేయబోయే నోటిఫికేషన్లలోని పరీక్షలకు శ్రద్ధగా సిద్ధం కావాలి. పరీక్షలన్నీ దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ పరీక్షకు బాగా ప్రిపేర్‌ అయితే మిగిలిన పరీక్షలకు సన్నద్ధత తేలిక అవుతుంది.
ప్రిలిమ్స్‌ పరీక్షలకు దాదాపు 2 నెలల సమయం, మెయిన్స్‌ పరీక్షకు దాదాపు 3 నెలలకు పైగా సమయం ఉంది. ప్రిలిమ్స్‌ పరీక్షలో కేవలం రెండు సబ్జెక్టులే వున్నాయి. కాబట్టి రెండు నెలల సమయం సరిపోతుంది. అయితే ప్రిలిమ్స్‌ పరీక్షలో 80 ప్రశ్నలు సాధించడానికి 45 ని. సమయం వుంటుంది.అందుచేత సాధన చాలా అవసరం.
ప్రిపరేషన్‌ మెలకువలు
గత సంవత్సం జరిగిన ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ పరీక్ష ప్రశ్నపత్రాన్ని పరిశీలిస్తే ఈ సంవత్సరం పరీక్షలో ఏయే విభాగాల్లో ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశముందో తెలుస్తుంది.
రీజనింగ్‌: స్కేల్‌- I ఆఫీసర్‌ గత ఏడాది ప్రిలిమ్స్‌ పరీక్షలో సీటింగ్‌ ఎరేంజ్‌మెంట్‌/ పజిల్‌ టెస్ట్‌ నుంచి దాదాపు 18 ప్రశ్నలు, స్టేట్‌మెంట్‌- కంక్లూజన్‌- 10 ప్రశ్నలు, కోడింగ్‌- డీకోడింగ్‌- 5, డేటా సఫిషియన్సీ- 5 , డైరెక్షన్స్‌- 2 ప్రశ్నలు ఉన్నాయి. మెయిన్స్‌ పరీక్షలో పైవాటికి అదనంగా కాజ్‌-ఎఫెక్ట్, స్టేట్‌మెంట్‌-ఇన్‌ఫరెన్స్, ఆర్గ్యుమెంట్, కోర్సెస్‌ ఆఫ్‌ యాక్షన్, ఇన్‌పుట్, అవుట్‌పుట్, బ్లడ్‌ రిలేషన్స్‌ల నుంచి ప్రశ్నలను గమనించవచ్చు. ఇంచుమించు ఇవే టాపిక్స్‌పై ఆఫీస్‌ అసిస్టెంట్ల పరీక్షలోనూ ప్రశ్నలున్నాయి. ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షలు రెండింటిలో 15-20 ప్రశ్నలు సీటింగ్‌ ఎరేంజ్‌మెంట్‌/ పజిల్‌ టెస్ట్‌ల నుంచి ఉంటున్నాయి. ఇతర టాపిక్స్‌ కూడా బాగా ప్రిపేర్‌ అవాలి.
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌/ న్యూమరికల్‌ ఎబిలిటీ: ఈ విభాగం నుంచి అన్ని పరీక్షలలోనూ ప్రశ్నల సంఖ్యలో తప్ప ప్రశ్నలు వచ్చే టాపిక్స్‌లో పెద్దగా మార్పు ఉండదు. సింప్లిఫికేషన్స్‌ (అసిస్టెంట్స్‌ పరీక్షలో దాదాపు 15 ప్రశ్నలు దీని నుంచి ఉంటాయి) నంబర్‌ సిరీస్‌ (5), క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌ (5), డేటా సఫిషియన్సీ (5), డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ (10-15), అరిథ్‌మెటిక్‌ ప్రశ్నలు (10) తప్పనిసరి. ఇవి బాగా సాధించగలగాలి. సమయం తక్కువ ఉంటుంది కాబట్టి వీటిని వేగంగా సాధించేలా షార్ట్‌కట్‌ పద్ధతులు, సింప్లిఫికేషన్స్‌ వేగంగా చేయడానికి స్పీడ్‌మేథ్స్‌/ వేదగణితం పద్ధతులు బాగా ఉపయోగపడతాయి. వీటికి చాలా ఎక్కువ సాధన అవసరం.
ఇంగ్లిష్‌: గత ఏడాది స్కేల్‌- I ఆఫీసర్‌ మెయిన్స్‌ పరీక్షలో రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ (10 ప్రశ్నలు), క్ల్లోజ్‌ టెస్ట్‌ (10), ఫైండింగ్‌ గ్రమాటికల్లీ కరెక్ట్‌ స్టేట్‌మెంట్‌ (5), కరెక్షన్‌ ఆఫ్‌ సెంటెన్సెస్‌ (5), ఫిల్లిన్‌ ది బ్లాంక్స్‌ (5), రీ-అరేంజ్‌మెంట్‌ ఆఫ్‌ సెంటెన్సెస్‌ (5) ప్రశ్నలు ఉన్నాయి. దాదాపు ఇదే విధంగా ఆఫీస్‌ అసిస్టెంట్‌ పరీక్షలోని ప్రశ్నలు ఉన్నాయి. వీటిని గమనించి సిద్ధమవ్వాలి.
జనరల్‌ అవేర్‌నెస్‌: ఈ విభాగంలోని బ్యాంకింగ్‌ అవేర్‌నెస్, ఆర్థికాంశాలకు ప్రాధాన్యమిస్తూ కరెంట్‌ అఫైర్స్‌ నుంచి ఎక్కువ సంఖ్యలో ప్రశ్నలు వస్తాయి. వీటన్నింటిపై ప్రిపేర్‌ అవ్వాలి. ముఖ్యాంశాలన్నీ నోట్‌ చేసుకోవాలి. వీటితో పాటుగా జాతీయ, అంతర్జాతీయ, ఆర్థిక సంస్థలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, భారతీయ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్‌ వ్యవస్థ, స్టాక్‌ మార్కెట్, జాతీయ/ అంతర్జాతీయ దినోత్సవాలు, పుస్తకాలు-రచయితలు, అవార్డులు చూసుకోవాలి.
కంప్యూటర్‌ నాలెడ్జ్జ్‌: బ్యాంక్‌ ఉద్యోగులకు కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి. దానిని తెలుసుకునేలా ప్రశ్నలుంటాయి ఎవల్యూషన్‌ ఆఫ్‌ కంప్యూటర్స్, హార్డ్‌వేర్, ఎం.ఎస్‌. ఆఫీస్‌ వర్డ్, ఎక్సెల్, లితివి, జూతివి, వైరస్, యాంటీవైరస్, డేటాబేస్‌ మేనేజ్‌మెంట్, కంప్యూటర్‌ రంగంలో వర్తమానాంశాలపై ప్రశ్నలు వస్తాయి.

Posted on 17-06-2019