ICET Counselling Info.

ఎంపికలో ఏం చూడాలి?

ఐసెట్‌-2014 ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమయింది. అభ్యర్థులు తమ అభిరుచి, ప్రావీణ్యం, ఆసక్తులకు అనుగుణంగా ఎంబీఏ, ఎంసీఏల్లో ఏదో ఒక కోర్సును ఎంచుకోవాలి. కోర్సు, కళాశాల కోసం కసరత్తు తప్పనిసరి. అప్పుడే ప్రవేశాల విషయంలో సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు.

ఐసెట్‌ కౌన్సెలింగ్‌లో వెబ్‌ ఆప్షన్లను ఇచ్చేటపుడు ఏ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి?- అనేది ఈ సమయంలో విద్యార్థులను వేధించే ప్రశ్న. ఎంబీఏ, ఎంసీఏల్లో ఏ కోర్సు ఎంచుకున్నప్పటికీ అది వ్యక్తిగత అభిరుచికి అనుగుణంగా జరగాలి. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులను ప్రమాణంగా తీసుకుని ముందుకెళ్ళడం సరికాదు. అది అస్థిరం. అందుకే ప్రతిభను అనుసరించి కోర్సువైపు అడుగెయ్యాలి. సంబంధిత కోర్సులో సత్తా చాటగలిగితే మార్కెట్‌ గడ్డు పరిస్థితుల్లో సైతం ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు.

కోడింగ్‌లో ప్రావీణ్యం ఉండి, ప్రోగ్రాం పరిజ్ఞానం ఉంటే ఎంసీఏ తీసుకోవడం తెలివైన నిర్ణయమే. ఈ కోర్సులో చేరాలనుకునేవారు ఇంజినీరింగ్‌తో పాటు ఎంసీఏ ఉన్న కళాశాలలకు తొలి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఎందుకంటే ఇంజినీరింగ్‌ ఉంది కాబట్టి ఇలాంటి కళాశాలల్లో మంచి ఫ్యాకల్టీ సిబ్బంది ఉండటానికి అవకాశాలెక్కువ. ఇంజినీరింగ్‌ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో కూడా ఎంసీఏ విద్యార్థులు పాల్గొనే అవకాశం దక్కుతుంది.

కమ్యూనికేషన్‌ నైపుణ్యాలున్నవారికి ఎంబీఏ తగిన కోర్సు. దీనికి సంబంధించి... వివిధ విశ్వవిద్యాలయాల సిలబస్‌లో ప్రధానమైన అంశాలు ఒకటే ఉంటాయా లేదా? ఉస్మానియా, జేఎన్‌టీయూల్లో దేని అనుబంధ కళాశాలల్లో ఎంబీఏను చేయటం మేలు.. ఇలాంటి సందేహాలు ముసురుతుంటాయి.
1. ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలు ఎంబీఏ కోర్సును ఫైనాన్స్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌, మార్కెటింగ్‌, సిస్టమ్స్‌ వంటి స్పెషలైజేషన్లతో అందిస్తున్నాయి. విద్యార్థి రెండు (డ్యూయల్‌) స్పెషలైజేషన్లను ఎంచుకోవచ్చు. ఇక్కడ మేజర్‌ స్పెషలైజేషన్‌లో రెండు పేపర్లు, 3, 4 సెమిస్టర్లలో రెండు మైనర్‌ స్పెషలైజేషన్‌లూ ఉంటాయి.
అనుకూలం: విద్యార్థులకు రెండు స్పెషలైజ్‌డ్‌ ఏరియాలపై అవగాహన వస్తుంది. ఫలితంగా ఉద్యోగ విషయంలో ఇష్టమైన రంగాన్ని ఎంచుకునే వీలుంటుంది. అసలు విశ్వవిద్యాలయాన్నింటిలో కీలకమైన పేపర్లన్నీ ఒకేలా ఉంటాయని గుర్తుంచుకోవాలి.
ప్రతికూలం: రెండు స్పెషలైజేషన్లను చదువుతున్న కారణంగా విద్యార్థి స్పెషలైజ్డ్‌ ఏరియాలో లోతైన పరిజ్ఞానాన్ని ఆశించలేడు.
ఉదాహరణకు: అకౌంటెన్సీ ఏరియాలో ఎంబీఏ (ఫైనాన్స్‌) విద్యార్థి నిపుణుడైనప్పటికీ చార్డెడ్‌ ఎకౌంటెంట్‌తో పోల్చినపుడు మాత్రం కొన్ని పరిమితులుంటాయి. ఇది విద్యార్థి తెలివితేటలు, కష్టపడే మనస్తత్వం, చదివే కళాశాలపైనా ఆధారపడి ఉంటుంది.
2. హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్శిటీ (జేఎన్‌టీయూ) ఎంబీఏ విద్యార్థులకు 2013 బ్యాచ్‌ నుంచి కొత్త సిలబస్‌ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం విద్యార్థులు మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌, సిస్టమ్స్‌ల్లో ఏదో ఒక స్పెషలైజేషన్‌ను ఎంచుకోవచ్చు.
అనుకూలం: జేఎన్‌టీయూహెచ్‌ 6 పేపర్లను ఒకే స్పెషలైజేషన్‌కు అందిస్తుండగా, ఓయూ 6 పేపర్లను రెండు స్పెషలైజేషన్లకు అందిస్తోంది (4 మేజర్‌, 2 మైనర్‌).
ప్రతికూలం: కేవలం ఒక స్పెషలైజ్‌డ్‌ ఏరియాలోనే ఉద్యోగం సంపాదించుకునే వీలుంది. ఏదేమైనా ప్రతిభావంతులైన విద్యార్థులు తమ స్పెషలైజ్డ్‌ విభాగంలో ముందుగానే ఉద్యోగం సాధించడం ద్వారా ఈ అవరోధం నుంచి బయటపడొచ్చు. తర్వాత అనుభవం సంపాదించుకుని జనరల్‌ మేనేజ్‌మెంట్‌కి కూడా వెళ్లవచ్చు.
పై సమాచారం పరిశీలించి... ఎంబీఏ విద్యార్థి ఏ విశ్వవిద్యాలయాన్ని ఎంచుకోవాలో నిర్ణయం తీసుకోవచ్చు.
1. విశ్వవిద్యాలయమే నిర్ణయిస్తుంది కాబట్టి సిలబస్‌ అన్ని కళాశాలలకూ ఒకటే. ఏ కళాశాలకూ దాన్ని సవరించడానికీ/ తొలగించడానికీ/ అదనంగా చేర్చడానికీ అవకాశముండదు.
2. అకడమిక్‌ కాలెండర్‌ను విశ్వవిద్యాలయాలు ముందస్తుగానే తయారుచేస్తాయి. ప్రతి కళాశాల తరగతుల కాల పరిమితి, ఇంటర్నల్‌, సెమిస్టర్‌ చివరి పరీక్షల విషయంలో దాన్ని తప్పక పాటించాలి.
3. ఓయూ పరిధిలోని కళాశాలలకు సెమిస్టర్‌ చివరి పరీక్షలకు 80 మార్కులు, 2 ఇంటర్నల్‌ పరీక్షల్లో ప్రతి సబ్జెక్టుకూ 20 మార్కుల చొప్పున కేటాయించారు. కానీ జేఎన్‌టీయూ (కొత్త సిలబస్‌ 2013 బ్యాచ్‌ నుంచి) సెమిస్టర్‌ చివరి పరీక్షలకు 60 మార్కులు, 2 ఇంటర్నల్‌ పరీక్షల్లో ప్రతి సబ్జెక్టుకూ 40 మార్కుల చొప్పున కేటాయించారు.
4. ఉస్మానియా పరిధిలో ఇంటర్నల్‌ పరీక్షల్లో 5 బిట్‌ ప్రశ్నలు మినహా మిగిలినవి చాలావరకు ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. కానీ జేఎన్‌టీయూ ఇంటర్నల్స్‌ సబ్జెక్టివ్‌గా, వివరణాత్మకంగా ఉంటాయి.

ఏమేం గమనించాలి?
కళాశాల ఎంపికకు సంబంధించి ఆప్షన్లు ఇచ్చేముందు విద్యార్థులూ, తల్లిదండ్రులూ కింది అంశాలను తెలుసుకోవడానికి ఒకసారి కళాశాలను సందర్శించడం మంచిది.

మౌలిక సదుపాయాలు
* విద్యార్థుల సంఖ్యను బట్టి తరగతుల సంఖ్య
* ట్యుటోరియల్‌ తరగతి గదులు
* ఎల్‌సీడీ, ఆడియో విజువల్‌ సిస్టమ్‌లతో కూడిన సెమినార్‌ హాళ్ళు
* సమగ్ర గ్రంథాలయం, జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌, పీరియాడికల్స్‌, ఆన్‌లైన్‌ జర్నల్స్‌
* మైదానం/ ఆటలు
* కళాశాల/ ఇతర రవాణా సదుపాయాలు
* ప్రయోగశాల/ గ్రంథాలయంలో తగినన్ని కంప్యూటర్లు
* అంతర్జాల అనుసంధానం
* యూపీఎస్‌/ డీజిల్‌ జెనరేటర్‌
* క్యాంటీన్‌
* జిరాక్స్‌, కంప్యూటర్‌ ప్రింటర్లు
* చక్కగా అమర్చిన తరగతి గదులు, ఫాకల్టీ గదులు, కార్యాలయం
* R/O రక్షణ ఉన్న నీరు, కూలర్లు
* సహజమైన గాలి- వెలుతురు, తరగతి గదిలో వెలుతురు
* విద్యార్థినీ విద్యార్థులకు వేర్వేరుగా వేచివుండే గదులు
* నిరంతరం నీటి సరఫరా సదుపాయం
* డ్రైనేజీ
* కాలుష్య రహిత వాతావరణం
* హాస్టల్‌ వసతి
* విద్యార్థినీ విద్యార్థులకూ, ఫ్యాకల్టీ సభ్యులకూ తగినన్ని మూత్రశాలలు

విద్యా సంబంధమైనవి
* ప్రిన్సిపల్‌ అర్హతలు, అనుభవం, నేపథ్యం
* ఫ్యాకల్టీ సిబ్బంది అర్హతలు, అనుభవం
* క్రమబద్ధంగా తరగతుల నిర్వహణ
* సెమినార్ల నిర్వహణ
* అతిథి ఉపన్యాసాలు
* స్థానిక పరిశ్రమల సందర్శన
* ఇతర ప్రదేశాల్లోని పారిశ్రామిక సందర్శనలు
* ప్రాజెక్టు మార్గదర్శనం
* సాఫ్ట్‌స్కిల్స్‌పై శిక్షణ
* వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు
* శిక్షణ, ఇంటర్వ్యూ నైపుణ్యాలు
* డిగ్రీలో తెలుగు మాధ్యమ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

ఇతరాలు
* సెక్షన్ల సంఖ్య/ గత సంవత్సరంలో నిండిన సీట్ల సంఖ్య
* పూర్వ విద్యార్థులను కలిసి మాట్లాడడం
* ప్రాంగణ నియామకాలపై సహకారం
* సెమిస్టర్‌ ఆఖరి పరీక్ష ఫలితాలు/ పాసైనవారి శాతం
* ఆన్‌లైన్‌ ఉపకారవేతనాల దరఖాస్తుల విషయంలో సహాయం
ఇలాంటి విషయాలు స్వయంగా పరిశీలించి గ్రహించటానికి విద్యార్థులూ, తల్లిదండ్రులూ కళాశాలలను సందర్శించడం అవసరం.
స్పెషలైజేషన్‌ ఎంపికలో మెలకువలు
ఎంబీఏ విద్యార్థులు 3, 4 సెమిస్టర్లలో కోర్‌ సబ్జెక్టులతోపాటుగా స్పెషలైజేషన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌, మార్కెటింగ్‌, సిస్టమ్స్‌ల్లో విశ్వవిద్యాలయాన్ని బట్టి స్పెషలైజేషన్‌ ఎంపిక ఒకటి/ రెండు అనేది ఆధారపడి ఉంటుంది.
ఫైనాన్స్‌
* బీకాం నేపథ్యం కలిగి, అకౌంటింగ్‌, ఫైనాన్స్‌, టాక్సేషన్‌, బ్యాంకింగ్‌, ఇన్స్యూరెన్స్‌ మొదలైన వాటిలో స్థిరపడాలనుకునేవారు ఎంచుకోవచ్చు.
* కుటుంబం ఫైనాన్స్‌ వ్యాపారం నిర్వహిస్తూ, రెండో తరం వ్యవస్థాపకులుగా దాన్ని నిర్వహించడానికి లోతైన థియరీ పరిజ్ఞానం కావాలనుకునేవారు.
* ఎంబీఏ తరువాత ACS, ICWA, CFA, మేనేజ్‌మెంట్‌ అకౌంటెన్సీ మొదలైనవాటిని చదవాలనుకునేవారు. ఫైనాన్స్‌ ఎంచుకుంటే గతంలో చదివిన కొన్ని సబ్జెక్టులకు మినహాయింపు ఉంటుంది.
* నిలకడగా కూర్చుని చేసే ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న విద్యార్థులు. చాలావరకు బీకాం చేసిన అమ్మాయిలు పోటీ పరీక్షలు రాసి బ్యాంకింగ్‌/ ఇన్స్యూరెన్స్‌ వంటి రంగాల్లో ఉద్యోగాలు సంపాదించడానికి ఫైనాన్స్‌ని ఎంచుకోవచ్చు.
హ్యూమన్‌ రిసోర్సెస్‌
* అకౌంటెన్సీ, ఫైనాన్స్‌ తీసుకోవటానికి భయపడే సైన్స్‌, ఆర్ట్స్‌ విభాగాలకు చెందిన విద్యార్థులు దీన్ని ఎంచుకుంటారు. వీరు ఇంటర్‌/ డిగ్రీ స్థాయిలో ఆ సబ్జెక్టులను చదవకపోవటం ఓ కారణం.
* మానవ వనరులు, పారిశ్రామిక సంబంధాలు, కార్మికచట్టాలు, కార్మిక సంక్షేమం వంటి అంశాలపై ఆసక్తి ఉన్నవారు.
* పారిశ్రామిక సంబంధాలపై ఆసక్తి ఉన్న ఎల్‌ఎల్‌బీ విద్యార్థులు
* మంచి వ్యక్తిత్వం, భావప్రకటనా సామర్థ్యం ఉన్నవారు హెచ్‌ఆర్‌ను స్పెషలైజేషన్‌గా ఎంపిక చేసుకోవచ్చు.
మార్కెటింగ్‌
* డిగ్రీ ఏ గ్రూపువారైనా మంచి వ్యక్తిత్వం, భావ ప్రసార సామర్థ్యం కలిగి ఉన్నవారూ, వ్యక్తులను కలుసుకోవడం, భిన్న స్థలాల సందర్శన, వస్తువులను కొనడం/ మార్కెటింగ్‌లపై ఆసక్తి ఉన్నవారూ దీన్ని ఎంచుకోవచ్చు.
సిస్టమ్స్‌
* డిగ్రీ ఏ నేపథ్యమైనా కంప్యూటర్‌ విభాగంలో ఆసక్తి ఉన్నవారు దీనిని ఎంచుకోవచ్చు. కానీ, డిగ్రీస్థాయిలో కొంతైనా కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండడం అవసరం.
* రెండు స్పెషలైజేషన్లను ఎంచుకునే వీలుంటే ఇంజినీరింగ్‌/ బీసీఏ విద్యార్థులు ఫైనాన్స్‌/ హెచ్‌ఆర్‌/ మార్కెటింగ్‌లను మేజర్‌గా తీసుకుని దీనిని మైనర్‌గా ఎంచుకోవచ్చు. లేదంటే.. గతంలో చదివినదే కాబట్టి పక్కన పెట్టొచ్చు.
స్పెషలైజేషన్‌ను ఎంపిక చేసుకోవటానికి నిర్దిష్టమైన నిబంధనలంటూ ఏమీ లేవు. కానీ వ్యక్తిత్వం, భావప్రసార సామర్థ్యం, కుటుంబ నేపథ్యం, త్వరగా ఉద్యోగావకాశాలు, విద్యార్థి ఆసక్తి, కళాశాలలో ఫ్యాకల్టీ వంటి కొన్ని అంశాలను బట్టి దీన్ని ఎంపిక చేసుకోవచ్చు.
- డా. ఆర్. కొండల్ రెడ్డి, కృష్ణమూర్తి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్.

Posted on 23.05.2016