ICET Info.

ఎంబీఏ ప్రవేశాల్లో ఏం చూడాలి?

అయిదంకెల జీతం, కార్పొరేట్‌ ఉద్యోగం, హోదా.. ప్రతి ఎంబీఏ ఔత్సాహికుని కల. తెలుగు రాష్ట్రాల్లో ఐసెట్‌ ఫలితాలు వెలువడ్డాయి. ఇది ఎంబీఏ/ ఎంసీఏ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు అవకాశం కల్పిస్తుంది. ప్రస్తుతం వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా కళాశాలను ఎంచుకునే సమయం ఆసన్నమైంది. ఐసెట్‌ ఉత్తీర్ణులై ర్యాంకు సాధించి, ఎంబీఏ అభ్యసించదలచేవారు కళాశాలను ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి? ఎలా సన్నద్ధం కావాలి?
వృత్తి విద్యా కోర్సు అయిన ఎంబీఏను చదివినవారికి వాణిజ్య, వినియోగ, సేవా రంగాల్లో ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉంటాయి. సంప్రదాయ కోర్సులకు భిన్నంగా మేనేజ్‌మెంట్‌ కోర్సు... థియరీ, ప్రాక్టికల్‌ సమ్మిళితంగా ఉంటుంది. ఇదే దీని ప్రధాన ప్రత్యేకత. విద్యార్థులు తాము ఎంచుకున్న రంగంలో మేనేజర్‌, కన్సల్టెంట్‌, సొంత సంస్థలను నెలకొల్పే సామర్థ్యాన్ని ఈ కోర్సు విద్యార్థులకు అందిస్తుంది. విద్యార్థిని పూర్తి తరహా వృత్తినిపుణునిగా తీర్చిదిద్దడంలో ఎంబీఏ డిగ్రీ తోడ్పడుతుంది.

కళాశాల ఎంపిక
సరైన కళాశాల ఎంపిక అనేది ఎంబీఏ విద్యార్థి కెరియర్‌కు పునాది రాయి వంటిది. కళాశాల ఎంపికలో విద్యార్థి ఈ దిగువ అంశాలను పరిగణనలోకి తీసుకుని వెబ్‌ కౌన్సెలింగ్‌లో ఆప్షన్లను ఎంచుకోవాలి. మొదటగా నిష్ణాతులైన బోధనానుభవం లేదా పరిశ్రమ అనుభవం, పీహెచ్‌డీ పట్టా ఉన్న అధ్యాపకులున్న కళాశాలను ఎంపిక చేసుకోవాలి. సంబంధిత కళాశాల మౌలిక సదుపాయాలు, ప్లేస్‌మెంట్‌ రికార్డు, పూర్వ విద్యార్థుల ప్రస్తుత హోదా, కళాశాల గుర్తింపు, ర్యాంకింగ్‌ వంటివి గమనించాలి.
ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ఫోన్‌ లాంటివి ఇస్తారనో.. ఫీజు రీయంబర్స్‌మెంట్‌ ఉంటుందనో.. హాజరు లేకపోయినా ఇతర ఉద్యోగం చేసుకుంటూ రెగ్యులర్‌ విధానంలో పరీక్షకు అనుమతిస్తారనో కళాశాలను ఎంచుకోకూడదు. ఈ విధానంలో అభ్యసించిన విద్యకూ, దూరవిద్యకూ ఏం తేడా ఉండదు. వీటి ద్వారా మంచి మార్కులు సాధించొచ్చేమో కానీ మంచి భవిష్యత్తు సాధ్యం కాదు. ఎంబీఏ కోర్సు కేవలం డిగ్రీ పట్టా కోసం కాదనీ, మెరుగైన భవిష్యత్తుకు సోపానమనీ అర్థం చేసుకోవాలి. అందుకే మంచి కళాశాల ఎంపిక విద్యార్థి జీవితాన్ని ప్రభావితం చేస్తుందన్న విషయం గమనించాలి.

ఎలా సన్నద్ధం కావాలి?
* విద్యార్థి తరగతి గదిలో పాఠాలకు మాత్రమే పరిమితం కాకుండా సమకాలీన అంశాలైన జీఎస్‌టీ, స్టాక్‌ మార్కెట్‌, వ్యాపార రంగాల్లో వస్తున్న మార్పులు, అంకుర పరిశ్రమల ఏర్పాట్లు, రాజకీయ, సామాజిక అంశాలు వ్యాపారాల మీద చూపిస్తున్న ప్రభావం పట్ల అవగాహనను పెంచుకోవాలి.
* సాధారణంగా ఎంబీఏ విద్య 20 నెలల కాలవ్యవధిలో ఉంటుంది. ఈ సమయం విద్యార్థి జీవితాన్ని మలుపు తిప్పడంలో ఎంతో కీలకం. కాబట్టి సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి; దానికి అనుగుణంగా ముందుకు సాగాలి. పట్టాతోపాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, సాఫ్ట్‌స్కిల్స్‌ను అలవరచుకోవడంపై దృష్టిసారించాలి.
* విద్యార్థి తన సమయాన్ని సబ్జెక్టు మీద మాత్రమే కాకుండా ఉద్యోగానికి ఉపయోగపడే వాటిపై వెచ్చించాలి. కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ను నేర్చుకోవడం, ఆంగ్ల దినపత్రికలు, వ్యాపార మేగజీన్లు, జర్నల్స్‌ చదవడం, సంబంధిత సబ్జెక్టుల్లో సహ విద్యార్థులతో కలిసి కేస్‌ స్టడీస్‌ను సాధించడం వంటివి చేస్తుండాలి. ఫైనాన్స్‌, మార్కెటింగ్‌, ఆపరేషన్స్‌, బిజినెస్‌ క్విజ్‌ లాంటి క్లబ్‌లను ఏర్పాటు చేసుకోవడం, వాటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం, వీటిల్లో ఏదైనా ఒకదానికి నాయకత్వం వహించడం వంటి వాటిద్వారా సృజనాత్మక శక్తిని మెరుగుపరచుకోవాలి. ఎంబీఏ డిగ్రీ బలవంతుడి చేతిలో విల్లు లాంటిది. విద్యార్థి అమ్ములపొదిలో ఎన్ని ప్రత్యేకతలు ఉంటే, అన్ని విలువైన అస్త్రాలు వెంట ఉన్నట్టే.

సాఫ్ట్‌ స్కిల్స్‌ మెరుగుపరచుకోవాలి
కేవలం అత్యధిక మార్కులను సాధించడం ద్వారా ఎంబీఏ విద్యార్థి తాను కోరుకున్న ఉద్యోగ గమ్యస్థానాన్ని చేరుకోలేడు. నియామక సంస్థలు విద్యార్థి మార్కులతోపాటు భావప్రకటన నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, బృంద నైపుణ్యాలు వంటి వివిధ సాఫ్ట్‌స్కిల్స్‌ ఉన్నవారికి ప్రాధాన్యమిస్తున్నాయి. వీటిని మెరుగుపరచుకోవడానికి ప్రముఖ మేనేజ్‌మెంట్‌ విద్యాలయాల్లో జరిగే ఈవెంట్లు, కాన్ఫరెన్సులు, బిజినెస్‌ లేదా ఫైనాన్స్‌ క్విజ్‌, పరిశోధన పత్రాల ప్రజెంటేషన్స్‌కు హాజరుకావాలి. తమ ప్రతిభను ఇతర విద్యాలయ విద్యార్థులతో బేరీజు వేసుకోవాలి. ఏయే విషయాల్లో వెనుకబడి ఉన్నారో తెలుసుకోవాలి; తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. ఇలాంటివాటికి వెళ్లడం ద్వారా నెట్‌వర్కింగ్‌ అనే ముఖ్యమైన సాఫ్ట్‌స్కిల్‌నూ పెంచుకోవచ్చు.
ఎంబీఏ కోర్సు కేవలం డిగ్రీ పట్టా కోసం కాదు. మెరుగైన భవిష్యత్తుకు ఇది సోపానం. అందుకే మంచి కళాశాల ఎంపిక విద్యార్థి జీవితాన్ని ప్రభావితం చేస్తుందన్న విషయం గమనించి, నిర్ణయం తీసుకోవాలి.

ఐచ్ఛికాల ఎంపిక ఇలా!
ఎంబీఏ మొదటి సంవత్సరం మేనేజ్‌మెంట్‌ ప్రాథమికాంశాలతో కూడి ఉంటుంది. మేనేజ్‌మెంట్‌ విద్య పట్ల పూర్తి ఆచరణాత్మక అవగాహన మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈ కోర్సుల వల్ల కలుగుతుంది. రెండో సంవత్సరంలోకి చేరుకున్నవారు తమకు నచ్చిన ఐచ్ఛిక సబ్జెక్టును ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ఫైనాన్స్‌, మార్కెటింగ్‌, హ్యూమన్‌ రిసోర్స్‌, ఆపరేషన్స్‌, బ్యాంకింగ్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌, సిస్టమ్స్‌ వంటి ఐచ్ఛికాలు విద్యార్థుల ఎంపికకు అందుబాటులో ఉంటాయి. ఈ మధ్యకాలంలో డ్యూయల్‌ స్పెషలైజేషన్‌ అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల విద్యార్థులకు రెండు ఐచ్ఛికాలను ఎన్నుకునే వెసులుబాటును ఆయా విశ్వవిద్యాలయాలు కల్పిస్తున్నాయి.
రెండు ఐచ్ఛికాల ఎంపికలో రెండు మేజర్‌ లేదా ఒకటి మేజర్‌, రెండోది మైనర్‌ ఐచ్ఛికంగా సంబంధిత విశ్వవిద్యాలయ నియమాల ప్రకారం ఎంపిక చేసుకోవచ్చు. దీన్ని విద్యార్థి తన ఆసక్తిమేరకు ఎంచుకోవాలి. ఐచ్ఛికాల ఎంపికతోపాటు సంబంధిత వాల్యూయాడెడ్‌ కోర్సులు చేయడం విషయ పరిజ్ఞానం అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ వాల్యూయాడెడ్‌ కోర్సులు edx.org, courseera.com వంటి వెబ్‌సైట్లలో ఉచితంగా లేదా నామమాత్రపు రుసుముతో అందుబాటులో ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు ఈ కోర్సులను ఈ వెబ్‌సైట్ల ద్వారా అందుబాటులోకి తెస్తున్నాయి.

ఇంటర్న్‌షిప్‌
మొదటి సంవత్సరం పూర్తిచేసిన విద్యార్థులు 45 రోజులు వేసవి కాలపు ఇంటర్న్‌షిప్‌కు వెళ్లవలసి ఉంటుంది. వీటి వల్ల విద్యార్థులు ఉద్యోగానుభవాన్ని పొందగలరు. తరగతిలో నేర్చుకున్న భావనలు, సిద్ధాంతాలు సంస్థ కార్యకలాపాల్లో ఎలా వినియోగిస్తున్నారో ఈవిధంగా తెలుసుకోవచ్చు. కాబట్టి ఇంటర్న్‌షిప్‌ను తేలికగా తీసుకోకూడదు. విద్యార్థులను రేపటి ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దడంలో ఇంటర్న్‌షిప్‌ అన్నివిధాలా తోడ్పడుతుంది. విద్యార్థులు తాము ఎంచుకున్న ఐచ్ఛికం మీద ఇంటర్న్‌షిప్‌ చేస్తే సంబంధిత కోర్సును లోతుగా అధ్యయనం చేయడంలో, అనువర్తనంలో తోడ్పడుతుంది.
కొన్ని సంస్థలు తమ వద్ద ఇంటర్న్‌షిప్‌ చేసినవారికి చదువు పూర్తయ్యాక ఉద్యోగ కల్పనలో ప్రాధాన్యాన్ని ఇస్తున్నాయి. ఇంటర్న్‌షిప్‌ చేసేవారు సంస్థ ఉద్యోగులతో స్నేహభావంతో మెలగాలి. వారి ద్వారా మెలకువలు, భావప్రకటన, బృంద నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. కొన్ని సంస్థలు ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న విద్యార్థులకు స్టైపెండ్‌ను కూడా చెల్లిస్తాయి.

Posted on 03.07.2017