ఐడీబీఐ బ్యాంకులో 760 ఎగ్జిక్యూటివ్ పోస్టులు
మూడు సబ్జెక్టులు.. దాదాపు మూడు నెలల సమయం.. ఒకే రాత పరీక్ష. సాధారణ డిగ్రీ అర్హతతో బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగంలో చేరిపోవచ్చు. మౌలికాంశాలను అర్థం చేసుకొని స్థాయుల వారీగా ప్రశ్నలను సాధన చేస్తే విజయాన్ని దక్కించుకోవడం వీలవుతుందంటున్నారు నిపుణులు.
భారత ప్రభుత్వ రంగ సంస్థ ఐడీబీఐ (ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) బ్యాంక్‌ లిమిటెడ్‌ 760 ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ముందుగా 3 సంవత్సరాలపాటు కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియమిస్తారు. ఈ కాలంలో అభ్యర్థులు చూపే ప్రతిభ ఆధారంగా వారిని అసిస్టెంట్‌ మేనేజర్‌లుగా శాశ్వత ప్రాతిపాదికన తీసుకునే అవకాశం ఉంది. కాంట్రాక్టు కాలంలో మొదటి సంవత్సరం నెలకు రూ. 17,000 చొప్పున, రెండో సంవత్సరం రూ. 18,500 చొప్పున, మూడో సంవత్సరం రూ. 20,000 చొప్పున వేతనం చెల్లిస్తారు.
ఎగ్జిక్యూటివ్‌ బాధ్యతలు
సాధారణంగా ఎగ్జిక్యూటివ్‌లుగా నియమితులయ్యే వారు కన్స్యూమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌ లేదా టెల్లర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌లుగా విధులు నిర్వహిస్తారు. కన్స్యూమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌లు చెక్‌ క్లియరెన్స్‌, ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌ మొదలైన వ్యవహారాలు చూస్తారు. టెల్లర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌లు క్యాషియర్‌ నిర్వర్తించే టెల్లర్‌ కౌంటర్‌ బాధ్యతలు నిర్వహిస్తారు.
అభ్యర్థుల ఎంపిక
ఆన్‌లైన్‌ పరీక్ష ద్వారా అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేస్తారు. మొత్తం 150 మార్కులకు పరీక్ష జరుగుతుంది. మూడు సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. అవి రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌. రుణాత్మక మార్కులు ఉన్నాయి. గుర్తించే ప్రతి తప్పు సమాధానానికి నాలుగో వంతు మార్కులు తీసివేస్తారు.
వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి, వారికి మెడికల్‌ టెస్ట్‌ నిర్వహించి తద్వారా తుది ఎంపిక చేస్తారు.
పీవో పరీక్ష స్థాయిలో ప్రశ్నలు
ప్రశ్నలన్నీ బ్యాంక్‌ ప్రొబెషనరీ ఆఫీసర్‌ పరీక్ష స్థాయిలో ఉంటాయి.
రీజనింగ్‌: వీటిలో ప్రశ్నలు కోడింగ్‌-డీకోడింగ్‌, నంబర్‌, లెటర్‌ సిరీస్‌, బ్లడ్‌ రిలేషన్స్‌, డైరెక్షన్స్‌, సిలాజిజమ్‌, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, ఇన్‌పుట్‌ - అవుట్‌పుట్‌, ఎలిజిబిలిటీ టెస్ట్‌, స్టేట్‌మెంట్‌ - అసంప్షన్స్‌, కంక్లూజన్స్‌, ఇన్‌ఫరెన్స్‌, కోర్సెస్‌ ఆఫ్‌ యాక్షన్‌ మొదలైన వాటి నుంచి ఉంటాయి.
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: సింప్లిఫికేషన్స్‌, అప్రాక్సిమేట్‌ వాల్యూస్‌, నంబర్‌ సిరీస్‌, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌, డేటా సఫిషియన్సీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, అరిథ్‌మెటిక్‌లోని వివిధ టాపిక్‌ల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పర్ముటేషన్‌, కాంబినేషన్స్‌ ప్రాబబిలిటీ నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి.
జనరల్‌ ఇంగ్లిష్‌: ఇందులో గ్రామర్‌, కాంప్రహెన్షన్‌, ఒకాబ్యులరీ నుంచి ప్రశ్నలు వస్తాయి. పారాజంబ్లింగ్‌, సెంటెన్స్‌ కంప్లిషన్‌, రీ-అరేంజ్‌మెంట్‌ ఆఫ్‌ సెంటెన్సెస్‌, ఫిల్‌ఇన్‌ ద బ్లాంక్స్‌, ఫైండింగ్‌ గ్రమేటికల్‌ ఎర్రర్స్‌, క్లోజ్‌ టెస్ట్‌ నుంచి ప్రశ్నలడుగుతారు.

చాలినంత సమయం
ఏప్రిల్‌ 28న నిర్వహించబోయే ఆన్‌లైన్‌ పరీక్షకు దాదాపు 3 నెలల సమయం ఉంది. రాతపరీక్షలో కేవలం మూడు సబ్జెక్టులే ఉన్నాయి. కాబట్టి, మొదటిసారిగా ఈ పరీక్షను రాసేవారు కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఈ సమయం వారికి సరిపోతుంది. అయితే వారు ముందుగా ఈ సబ్జెక్టుల్లోని టాపిక్‌లపై అవగాహన ఏర్పరుచుకోవాలి. కాన్సెప్ట్‌ను అర్థం చేసుకొని వాటిపై ఉండే ప్రశ్నలను సాధించాలి. ఆయా టాపిక్‌లలో వివిధ స్థాయుల్లోని ప్రశ్నలను సాధన చేయాలి. వీటిపై అవగాహన వచ్చిన తర్వాత సమయాన్ని నిర్దేశించుకొని మోడల్‌ పేపర్లు ప్రాక్టీస్‌ చేయాలి. ఈ పరీక్షలో ప్రతి ప్రశ్నను సాధించడానికి సగటున 3 సెకన్లు మాత్రమే సమయం ఉంటుంది. ఇది దృష్టిలో ఉంచుకొని నిర్ణీత సమయంలో వీలైనన్ని ప్రశ్నలు సాధించగలిగేలా సాధన చేయాలి.
డాక్ట‌ర్ జి.ఎస్. గిరిధ‌ర్‌, డైరెక్ట‌ర్‌, RACE


posted on 06.02.2018