చేవ చూపి.. చొరవ చేసి..!

* నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ కాలేజెస్‌ అండ్‌ ఎంప్లాయర్స్‌ (ఎన్‌ఏసీఈ) నివేదిక ప్రకారం 52% మందిని ఇంటర్న్‌షిప్‌లు ఇచ్చిన సంస్థలే ఫుల్‌టైం ఉద్యోగులుగా తీసుకున్నాయి.

ఇంటర్న్‌షిప్‌ ఇప్పుడో మామూలు విషయంగా మారిపోయింది. చేసినా.. చేయకపోయినా.. చెల్లిపోతుందిలే.. సర్టిఫికెట్‌ తెచ్చుకుంటే సరిపోదా.. అనుకుంటున్నారు. కానీ సంస్థలు వాటిని తేలిగ్గా తీసుకోవడం లేదు. నియామక ప్రక్రియలో భాగంగా భావించి ప్రాధాన్యం ఇస్తున్నాయి. అభ్యర్థులను పూర్తిగా పరీక్షించడానికి అవకాశంగా పరిగణిస్తున్నాయి. ఈ అంశాలను గుర్తించి ఇంటర్న్‌షిప్‌ల కోసం ప్రయత్నిస్తున్నవారు, ఇప్పటికే చేరిన వారు తాము ఆ సంస్థలకు ఎంతవరకూ సరిపోతామో నిరూపించుకోడానికి తగిన విధంగా సన్నద్ధం కావాలి.

ఎవరైనా.. కలం నుంచి కారు వరకు ఏది కొనాలన్నా ఎన్నో అంశాలను పరిశీలిస్తారు. అలాంటిది కీలకమైన మానవ వనరుల ఎంపికలో నియామక సంస్థలు ఎంతగా పరీక్షిస్తాయో తేలిగ్గా ఊహించవచ్చు. అభ్యర్థులు తమ అవసరాలకు ఎంతవరకూ సరిపోతారో తెలుసుకోవడానికి సంస్థలు ఎంచుకుంటున్న కొత్త మార్గం ఇంటర్న్‌షిప్‌లు. వీటిని ‘లాంగ్‌టర్మ్‌ జాబ్‌ ఇంటర్వ్యూలు’గా పరిగణిస్తున్నాయి. ఉద్యోగ అనుభవాన్ని పొందŸడంతోపాటు ప్రొఫెషనల్‌ వాతావరణానికి తామెంతవరకూ సరిపోతామో నిరూపించుకోడానికి విద్యార్థులకు అందే అవకాశమూ ఇదే! విద్యార్థి దశలోనే భవిష్యత్తు ఉద్యోగం, పరిశ్రమల తీరుతెన్నులు తెలుసుకోడానికి ఇంటర్న్‌షిప్‌ చక్కటి మార్గం. అందుకే వాటిని తేలిగ్గా తీసుకోకూడదు. అనాసక్తిగా పూర్తిచేయకూడదు. అలాచేస్తే తర్వాతి దశలో కొలువుకు మార్గాలు మూసుకుపోయే అవకాశం ఉంది.

తేలిక భావన వద్దు
ఇప్పుడు జాబ్‌ మార్కెట్‌లో ఎంతో పోటీ ఉంది. దాన్ని తట్టుకుని నిలబడాలంటే తగిన ప్రయత్నం ఉండాలి. ఇంటర్న్‌షిప్‌ సమయంలో తనను తాను విద్యార్థిగా కాకుండా ఉద్యోగిగా భావించాలి. అధికారికంగా ఇంటర్న్‌గా చేరడానికి ముందే సంస్థ, అక్కడి పని గురించి ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకోవాలి. ఇంటర్న్‌షిప్‌లో ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో నిర్దిష్టంగా లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. వాటిని సాధించేందుకు కృషి చేయాలి.

పని వాతావరణంలో ప్రతిఒక్కరికీ అన్ని పనులూ నచ్చాలని లేదు. ఉదాహరణకు మేనేజ్‌మెంట్‌ విభాగంలో వారికి తరచూ జరిగే సమావేశాల పట్ల విముఖత ఉండవచ్చు. అయినా ఆ అయిష్టతను వ్యక్తపరచకూడదు. ఇంటర్న్‌గా డాక్యుమెంట్లను ఫైల్‌ చేయమని బాధ్యత అప్పగిస్తే, అది విసుగ్గా అనిపించవచ్చు. అప్పుడు అసంతృప్తితో నీరసంగా పనిచేయకూడదు. అలాంటి పనులనూ వేగంగా, ఉత్సాహంగా చేస్తే, అది అభ్యర్థి శ్రద్ధనూ, వ్యక్తిత్వ సానుకూల స్వభావాన్నీ సూచిస్తుంది. ఇతరుల దృష్టిలో గౌరవాన్నీ తెచ్చిపెడుతుంది. సాధారణంగా చిన్న చిన్న పనుల్లో చూపిన ఉత్సాహమే పెద్ద పెద విధులను అప్పగించేలా చేస్తుందని గుర్తించాలి.

ఆలస్యం.. అలసత్వం
సమయపాలన ఉద్యోగుల ప్రాథమిక లక్షణం. ఇది అభ్యర్థి నడతనూ, క్రమశిక్షణనూ సూచిస్తుంది. కళాశాలకూ, కార్యాలయానికీ తేడా ఉంటుందనేది మొదట గ్రహించాలి. ఇంటర్న్‌షిప్‌ చేసేటప్పుడు విధులకు ఆలస్యంగా రావడం, ఎక్కువసేపు విరామాలు తీసుకోవడం లాంటివి చేయవద్దు. ఇవి వ్యతిరేక అభిప్రాయాన్ని ఏర్పరుస్తాయి. పనివేళలకు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే తెలుసుకుని విధిగా పాటించాలి. అప్పజెప్పిన పనులను సమయానికి పూర్తిచేయాలి. ఒకటి కంటే ఎక్కువ పనులు చేయాల్సి వస్తే వాటిని ప్రాధాన్యం ప్రకారం పూర్తి చేయాలి. ఈ విషయంలో స్పష్టత లేకపోతే పై అధికారిని అడిగి నిర్ణయం తీసుకోవచ్చు.

దుస్తుల విషయంలో జాగ్రత్త
‘కంపెనీ ఉద్యోగులం కాదు.. కాలేజీ విద్యార్థులం.. ఎలాంటి దుస్తులైనా వేసుకుని వెళ్లవచ్చు’ లాంటి అభిప్రాయాలు చాలామంది ఇంటర్న్‌ల్లో కనిపిస్తుంటుంది. ఇది సరైంది కాదు. ఎక్కువమంది చేసే తప్పుల్లో ఇదొకటి. చేసే పనికి తగిన విధంగా వస్త్రధారణ ఉండాలి. దాన్ని తెలుసుకొని, అనుసరించటం మేలు. పూర్తి ప్రొఫెషనల్‌గా వెళ్లకపోయినా.. ఫ్యాషన్‌, స్టైల్‌ తదితరాలకు దూరంగా ఉండాలి. సింపుల్‌గా కనిపించాలి. తోటి ఉద్యోగులను పరిశీలిస్తే దీనికి సంబంధించి అవగాహన వస్తుంది.

ఉత్సాహం.. క్రియాశీలత
ఇంటర్న్‌షిప్‌ అంటే నేర్చుకునే అవకాశం. ఉదయం 9 నుంచి 5 గంటల వరకు ఏదో గడిపి వచ్చినట్లుగా ఉండకూడదు. ఉద్యోగానికి సంబంధించి ఎన్నో అంశాలుంటాయి. వాటిని గమనించాలి. క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దానివల్ల ఇంటర్న్‌షిప్‌పై ఆసక్తి కలుగుతుంది. ప్రొఫెషన్‌కు అవసరమైన అన్ని నైపుణ్యాలపైనా అవగాహన ఏర్పడుతుంది. ప్రతిదానిలో ఉత్సాహం, క్రియాశీలత ఉట్టిపడాలి. అప్పగించిన పనిలో ఏవైనా సందేహాలు వస్తే అడగడానికి మొహమాట పడొద్దు. ఇబ్బంది పడకుండా అడగడం అనేది అభ్యర్థిలోని నేర్చుకోవాలన్న ఆసక్తిని సూచిస్తుంది.

ఇచ్చిన పని పూర్తవగానే ఖాళీగా ఉండొద్దు. చొరవ చూపించాలి. స్వయంగా వెళ్లి ఇంకా ఏదైనా పని ఇవ్వమని అడగవచ్చు. సాయం అందించడానికి సంసిద్ధతను వ్యక్తం చేయవచ్చు. కేటాయించిన పనికే పరిమితం కాకుండా, అనుబంధ విభాగాల్లో పని ఏవిధంగా జరుగుతుందో పరిశీలించి అవగాహన పెంచుకోవాలి. పనివేళల్లో ఏమీ పట్టనట్టు ఇంటర్నెట్‌, ఫోన్‌ చూసుకుంటూ, మెసేజ్‌లు ఇచ్చుకుంటూ కాలక్షేపం చేయకూడదు.

ఫీడ్‌బ్యాక్‌ తప్పనిసరి
ఇచ్చిన పని పూర్తిచేసిన తర్వాత ఫీడ్‌బ్యాక్‌ తప్పకుండా అడగాలి. దానివల్ల అభ్యర్థి తన పనితీరు గురించి తెలుసుకోవచ్చు. తర్వాతి పని ఎలా చేయాలన్నదానిపై స్పష్టత ఏర్పరచుకోవచ్చు. ఎవరైనా తమ పనిఒత్తిడిలో ‘బాగుంది’, ‘బాగా లేదు’ అనే మాటలకే పరిమితమైనా.. వేరే సీనియర్‌ ఉద్యోగులను సంప్రదించి వివరంగా అడిగి తెలుసుకోవాలి. ‘వాళ్లే చెబుతారులే’ అనుకుని ఆగితే పని మీద అంతగా ఆసక్తి లేదనే నెగెటివ్‌ అభిప్రాయం కలిగే అవకాశం ఉంది. ఒకవేళ చేసిన పనిలో తప్పులున్నాయని చెబితే కంగారుపడటం, ఆందోళనతో కుంగిపోవడం చేయకూడదు. పొరపాట్లను సవరించుకొని ముందుకుసాగటం నేర్చుకోవాలి. తర్వాతి పనిలో అలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తపడాలి. తప్పులే కాదు, అభ్యర్థిలో తనకు తెలియని తన ప్రతిభ, నైపుణ్యాల గురించి ఇంటర్న్‌షిప్‌ తెలియజేస్తుంది.

వ్యక్తిగత విషయాలను కలపొద్దు
తెలిసినవారి ద్వారా లేదా స్నేహితులతో కలిసి ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తు చేసేవారే ఎక్కువ. ఆ సంస్థలో చేసేది కొన్నిరోజులే అయినా ప్రొఫెషనల్‌గానే ప్రవర్తించాలి. ఒకే విభాగంలో పనిచేస్తున్నా.. తెలిసినవారని/ స్నేహితులని వారితోనే ఉండటం, కబుర్లు, పనివేళల్లో బయటకు వెళ్లడం వంటివి చేయవద్దు. స్నేహితులు, కుటుంబ సభ్యులను పని ప్రదేశానికి ఆహ్వానించవద్దు. తప్పనిసరైతే ముందస్తు అనుమతి తీసుకోవాలి. పనిచేసే చోట ఎవరైనా నచ్చకపోతే వారికి పేర్లు పెట్టడం, కామెంట్లు చేయడం వంటివాటిని పరిహరించాలి. ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న సంస్థకు సంబంధించి పని, అక్కడి వ్యక్తుల గురించి సోషల్‌ మీడియాలో పెట్టవద్దు. ఆఫీసు వస్తువులను సొంత పనికి ఉపయోగించకూడదు. ఇలా అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఇంటర్న్‌షిప్‌లను బాధ్యతగా, శ్రద్ధగా ముగించాలి. అప్పుడే సీనియర్‌ ఉద్యోగుల మెప్పు పొందడానికి వీలవుతుంది. పని నైపుణ్యాలను, తగిన అనుభవాన్ని సంపాదించవచ్చు. ఉద్యోగజీవితంలోకి సమర్థంగా అడుగుపెట్టవచ్చు.

Posted on 22-10-2019