రాజకీయం చేయండి!

రాజకీయ వ్యవహారాలంటే మీకు బాగా ఇష్టమా? సమకాలీన పరిణామాలను ఆసక్తిగా గమనిస్తుంటారా? రోజుకు ఎన్ని గంటలైనా విసుగులేకుండా ఉత్సాహంగా పనిచేయగల సత్తా మీలో ఉందా? వీటన్నిటితో పాటు మీరు 20- 30 సంవత్సరాల్లోపు వయసున్న వారైతే ‘పొలిటికల్‌ ఇంటర్న్‌ షిప్‌లు’ మీకోసం ఎదురుచూస్తున్నాయి. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన; వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈ వైవిధ్యకరమైన ఇంటర్న్‌షిప్‌లకు క్రేజ్‌ పెరుగుతోంది!

దేశానికి సేవ చేయాలనే ఆశయంతో రాజకీయాల్లో చేరాలనుకునే హీరో కథను ‘గోదావరి’ సినిమాలో చూశాం. ప్రజల కష్టసుఖాలు, మనుగడతో రాజకీయాలకు విడదీయలేని సంబంధముంది. ఈ రంగంపై అభిరుచి, అమితాసక్తి ఉన్నవారు విద్యాభ్యాసం తర్వాత నేరుగా దానిలోకి ప్రవేశించటం కష్టం కావొచ్చు. ఈ నిర్ణయానికి ముందు ఆ రంగం ఆనుపానులు అవగాహన చేసుకోవటం సముచితం. అదెలా సాధ్యమవుతుంది? ఇందుకు అద్భుతంగా ఉపయోగపడేవే పొలిటికల్‌ ఇంటర్న్‌షిప్స్‌!
లా, పాలిటిక్స్‌లపై ఆసక్తి ఉన్న విద్యార్థులు రాజకీయ చర్చలను చేయటంతో సంతృప్తిపడకుండా తమ శక్తియుక్తులను సద్వినియోగం చేసుకునే మార్గం- ఈ ఇంటర్న్‌షిప్‌లు చేయటం. రాజకీయ పార్టీలూ, పరిశోధక సంస్థలూ యువ ఇంటర్న్‌లను నియమించుకుంటున్నాయి. ఇలాంటి ఇంటర్న్‌షిప్‌ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
రాజకీయ ప్రచారం అంటే.. కరపత్రాలను పంచటం, గొంతెత్తి నినాదాలు చేయటం మాత్రమే అనేది ఒకప్పటి మాట. డేటా, ఐటీల ద్వారా అనుసంధానమవుతూ రాజకీయ నాయకులు సాధికారికంగా ప్రసంగించటం కొత్త బాట. దీనికి నిర్దిష్ట సమాచార విశ్లేషణ అవసరం. దీనికి ఇంటర్న్‌లు అద్భుతంగా ఉపయోగపడుతున్నారు.
సర్వేలు, పార్టీ నాయకుల రోడ్‌ షోల నిర్వహణ, సోషల్‌ మీడియాలో నాయకులు ప్రముఖంగా కన్పించేలా పోస్టింగులు, బడ్జెట్‌ కేటాయింపుల సమాచారం సేకరించటం.. వీటన్నిటినీ పొలిటికల్‌ ఇంటర్న్‌లు ఉత్సాహంగా, వేగంగా చేస్తారు.
ఈ ఇంటర్న్‌షిప్‌లు చేయాలంటే సాధారణంగా 20-25 సంవత్సరాల వారు అర్హులవుతారు. 30 ఏళ్లలోపు వారిని కూడా తీసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరుకుంటున్న దశలో రోజుకు 18 నుంచి 20 గంటల వరకూ విధులు నిర్వహించాల్సిరావొచ్చు.
ఈ ఇంటర్న్‌షిప్‌లు చేసినందుకు సాధారణంగా స్టైపెండ్‌ లాంటిది ఏమీ ఇవ్వరు. అయితే వారి భోజన, రవాణా ఖర్చులకు కొంతమొత్తం చెల్లిస్తారు.

పై చదువులూ, కొలువులూ
రాజకీయరంగంలో చేరే ఉద్దేశం లేనివారు వివిధ సామాజిక రంగాల్లో అనుభవం సంపాదించటానికి ఈ ఇంటర్న్‌షిప్‌లు చాలా ఉపయోగపడతాయి. ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి వాస్తవ పరిస్థితులను గ్రహించటానికీ, ప్రజాసమస్యలను అధ్యయనం చేసి విశ్లేషించటానికీ ఇవి గొప్ప అవకాశం కల్పిస్తాయి. ఈ క్షేత్రస్థాయి అనుభవం ఉన్నత విద్యాభ్యాసానికీ, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో ప్రవేశించటానికీ ఉపయోగపడుతుంది.

ఎలా మొదలయ్యాయి?
అమెరికన్‌ రాజకీయ విధానంలో పొలిటికల్‌ ఇంటర్న్‌షిప్‌లు ఎక్కువ. మనదేశంలో 2008లో ఐఐఎం- అహ్మదాబాద్‌ విద్యార్థి ఒకరు సీపీఎం కేంద్ర కార్యాలయంలో ఇంటర్న్‌గా చేరటంతో ఈ ధోరణి మొదలైందని చెప్తారు.2009లో ఐఐఎం- కోల్‌కత్‌ విద్యార్థులు బీజేపీ వద్ద సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ చేశారు.2010లో ఐఐఎం-బెంగళూరు విద్యార్థులు కాంగ్రెస్‌ పార్టీ వద్ద ఇంటర్న్‌లుగా పనిచేశారు. 2011లో ఐఐఎం-కోల్‌కత విద్యార్థులు తృణమూల్‌ కాంగ్రెస్‌ వద్ద సమ్మర్‌ ఇంటర్న్‌లుగా విధులు నిర్వహించారు.
2011లో అన్నా హజారే ఆధ్వర్యంలో నడిచిన అవినీతి వ్యతిరేక ఉద్యమం మనదేశంలో పొలిటికల్‌ ఇంటర్న్‌షిప్‌లకు పటిష్ఠమైన భూమికను సిద్ధం చేసింది. ఆ ఉద్యమం యువతను రాజకీయాలూ, పబ్లిక్‌ పాలసీలపై ఆసక్తి పెంచేలా చేసింది. 2012 గుజరాత్‌ ఎన్నికల సమయంలో ఐఐటీలూ ఐఐఎంల్లో చదువుతున్నవారూ, గ్రాడ్యుయేట్లూ వివిధ పార్టీల తరఫున చురుగ్గా విధులు నిర్వహించారు..

ఎకనమిక్స్‌, లా విద్యార్థులు ఎక్కువ
మనదేశంలో ఎక్కువ విశ్వవిద్యాలయాలు రాజకీయాలతో సంబంధమున్న పబ్లిక్‌ పాలసీ కోర్సులను అందించటం లేదు. యంగ్‌ ఇండియా ఫెలోషిప్‌ను అందించే అశోక యూనివర్సిటీ, నేషనల్‌ లా స్కూల్‌ (బెంగళూర్‌) లాంటివి మాత్రమే ఉన్నాయి. ఇంటర్న్‌షిప్‌లు చేశాక అనుభవ సర్టిఫికెట్‌ లభిస్తుంది. ఈ విద్యార్థులు పబ్లిక్‌ పాలసీ, పాలిటిక్స్‌ లాంటి అంశాలపై కోర్సులు చేయదలిస్తే ఈ సర్టిఫికెట్‌ ఉపయోగపడుతుంది.
మరో ప్రత్యామ్నాయం... లెజిస్లేటివ్‌ అసిస్టెంట్స్‌ టు మెంబర్స్‌ ఆఫ్‌ పార్లమెంట్‌ (లాంప్‌) ఫెలోషిప్‌. ఇది 11 నెలల వ్యవధితో ఉంటుంది. మాన్‌సూన్‌ సెషన్‌ నుంచి బడ్జెట్‌ సెషన్‌ వరకూ పార్లమెంటరీ వర్‌్్కలో విస్తృతమైన పరిశోధనకు అవకాశమిచ్చే ఈ ఫెలోషిప్‌కు నెలకు రూ. 20 వేల స్టైపెండ్‌ లభిస్తుంది. ఈ లాంప్‌ ఫెలోషిప్‌ ఎంత ప్రాముఖ్యం పొందిందంటే... ఆక్స్‌ఫర్డ్‌లో మాస్టర్స్‌ చేసిన విద్యార్థులు కూడా మనదేశానికి తిరిగివచ్చి దీన్ని పూర్తిచేస్తున్నారు. వివిధ పార్టీల పరిశోధక బృందాల్లో చేరిపోతున్నారు. ఎకనామిక్స్‌, లా విద్యార్థులు ఎక్కువమంది.సోషల్‌ సైన్సెస్‌, బిజినెస్‌, ఇంజినీరింగ్‌ ల నుంచి కూడా లాంప్‌ ఇంటర్న్‌షిప్‌లకు వస్తున్నారు.

ఇంటర్న్‌లను ఎలా ఎంచుకుంటారు?
ఒక్కో పార్టీ ఒక్కో రకంగా ఇంటర్న్‌లను ఎంపిక చేసుకుంటాయి. బీజేపీ విషయానికొస్తే... సోషల్‌మీడియా సెల్‌కూ, ప్రచారానికీ సాధారణంగా సొంత విద్యార్థి క్యాడర్‌ నుంచీ, క్షేత్రస్థాయి నెట్‌ వర్క్‌ నుంచీ విద్యార్థులను ఎంచుకుంటుంది.
బీజేపీతో అనుబంధంగా ఉండే డా. శ్యామప్రసాద్‌ ముఖర్జీ రిసెర్చి ఫౌండేషన్‌ (ఎస్‌పీఎంఆర్‌ఎఫ్‌) రాజకీయ ఇంటర్న్‌షిప్‌లు అందిస్తోంది. ఎక్కువగా స్టూడెంట్‌ నెట్‌వర్క్స్‌ ద్వారా వచ్చి చేరుతున్నారు.
ఈ ఏడాదిలోనే కాంగ్రెస్‌ పార్టీ స్టూడెంట్‌ వింగ్‌ నాలుగు వారాల ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రాంలో పాల్గొనటానికి 30 ఏళ్లలోపు వయసున్న విద్యార్థులూ, వృత్తినిపుణుల నుంచి ‘ఫ్యూచర్‌ ఇండియా ఫెలోషిప్‌’కు దరఖాస్తులను ఆహ్వానించింది. ఆ పార్టీ మహిళా విభాగం కూడా ఈ సంవత్సరం ఇంటర్న్స్‌ను నియమించుకుంది.
ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఇటీవల ఆన్‌లైన్‌ ప్రకటనల ద్వారా విద్యార్థులనూ, మహిళలనూ నియమించుకుంది. పార్టీ కోసం వివిధ సర్వేలు నిర్వహించటం, డిజిటల్‌ వేదికల పనిచూడటం వీరి విధులు.
ఈ ఇంటర్న్స్‌లో మెరుగైన సేవలందించిన కొందరిని పార్టీలు కీలక స్థానాల్లోకి నియమించుకుంటున్నాయి. వారికిచ్చే వేతనాలు భారీగానే ఉంటాయి.
రాజకీయ వ్యూహకర్తలకు చెందిన కన్సల్టెన్సీలు కూడా తాము చేపట్టే పొలిటికల్‌ ప్రాజెక్టుల కోసం ఇంటర్న్‌లను నియమించుకుంటున్నాయి. ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన ఐ-ప్యాక్‌ సంస్థ బిహార్‌లో జేడీయూ కోసం ‘నేషనల్‌ ఎజెండా ఫోరం’ అనే స్టూడెంట్‌ అవుట్‌రీచ్‌ ప్రోగ్రాంని 7,500 కళాశాలల్లో నిర్వహించింది. ఐఐటీలు, దిల్లీ యూనివర్సిటీ, టిస్‌లాంటి పేరున్న సంస్థలకు చెందిన విద్యార్థులు ఇలాంటి సంస్థలకు పార్ట్‌ టైమ్‌ అసోసియేట్లుగా పనిచేస్తున్నారు.

ఎక్కడ? ఎలా?
ఇంటర్న్‌షిప్‌‌ వ్యవధి: సాధారణంగా రెండు నెలలు
సమాచారం ఎలా తెలుస్తుంది?: పత్రికల్లో, సోషల్‌మీడియా, పార్టీ వెబ్‌సెట్లలో ప్రకటనలు
విధులు ఏ విభాగాల్లో?: మొబిలైజేషన్‌, మీడియా అండ్‌ కమ్యూనికేషన్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, ఐటీ, వెబ్‌సైట్‌ హోస్టింగ్‌..
ఇంటర్న్‌షిప్‌ ముగిశాక?: అనుభవ సర్టిఫికెట్‌ ప్రదానం.

ఎన్నికలతో నిమిత్తం లేకుండా...
మనదేశ జనాభాలో అత్యధికంగా ఉన్న యువత భాగస్వామ్యం రాజకీయాల్లో పెరగాలనే ఆకాంక్షతో పొలిటికల్‌ ఇంటర్న్‌షిప్‌లను శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆరంభించారు. ఎన్నికలతో నిమిత్తం లేకుండా ప్రజాసమస్యల పరిష్కారానికి యువత ఉపయోగపడాలని తాను మెంటర్‌ గా వ్యవహరిస్తూ వీటికి శ్రీకారం చుట్టారు.
దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లోని 47 కళాశాలల నుంచి 210 మంది దరఖాస్తులు పంపితే వారిలో 18మందిని ఎంపిక చేసుకున్నారు. ఈ ఏడాది మే-జులై మధ్యకాలంలో వీరు ఇంటర్న్‌షిప్‌లను కొనసాగించారు.
జులైలో ముగిసిన తొలి ఇంటర్న్‌షిప్‌లు ప్రయోజన కరంగా ఉన్నాయి. వచ్చే వేసవిలో మరోసారి ఇంటర్న్‌షిప్‌లను నిర్వహించాలనుకుంటున్నాం. విభిన్న నేపథ్యాలకు చెందిన 20 మంది యువతీయువకులను ఇంటర్న్‌లుగా తీసుకుంటాం.పొందూరు ఖాదీ, టూరిజం అభివృద్ధి మొదలైన స్థానిక అంశాలతోపాటు ఇతర ప్రజా సంబంధ సమస్యల అధ్యయనం, పరిష్కారాల్లో వీరు భాగస్వాములౌతారు.
దరఖాస్తుదారుల కోసం నెలరోజులముందే ఇంటర్న్‌షిప్‌ల సమాచారాన్ని నా ఫేస్‌బుక్‌, ట్విటర్‌ పేజీల్లో ప్రకటిస్తాను.
- కింజరాపు రామ్మోహన్‌నాయుడు

Posted on 08-10-2018