Top Stories

ఐఐటీల్లోకి మరో రూటు!

* గ్రాడ్యుయేట్లకు ‘జామ్‌’ దారి

ఇంటర్‌ తర్వాత జేఈఈలో ర్యాంకు రాకపోతే ఐఐటీల్లోకి వెళ్లాలనే మీ కల ముగిసిపోయినట్లు కాదు. సైన్స్‌ సబ్జెక్టులతో సాధారణ డిగ్రీ చేసిన తర్వాత కూడా ఎమ్మెస్సీ చేయడానికి ఐఐటీలు ఆహ్వానం పలుకుతున్నాయి. జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ ఎమ్మెస్సీ (జామ్‌) ఆ అవకాశం కల్పిస్తోంది. ఐఐటీ ఖరగ్‌పూర్‌ 2019 సంవత్సరానికి ప్రకటన విడుదల చేసింది. ఇందులో మంచి స్కోరు సాధిస్తే ఎమ్మెస్సీలో వివిధ కోర్సులను ఐఐటీల్లో చేయవచ్చు. ఈ స్కోరుతోనే ఐఐఎస్సీ, ఎన్‌ఐటీలు, ఐసర్‌లు... పీజీ, ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి.

సమగ్రతకు పెట్టింది పేరు ఐఐటీ విద్యావిధానం. ప్రవేశపరీక్ష జామ్‌ కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. విద్యార్థుల విశ్లేషణ, తార్కిక సామర్థ్యాలను పరీక్షించేలా ప్రశ్నలను ఇస్తారు.
* ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ పేపర్‌ రాయటానికి ఏదైనా సైన్స్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులతోపాటు అగ్రికల్చర్‌ విద్యార్థులు, ఫార్మసీ, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ విద్యార్థులు అర్హులు.
* ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పరీక్ష ద్వారా ఐఐటీల్లో, ఐఐఎస్‌సీలో ప్రవేశం పొందటానికి ఇంటర్లో మ్యాథ్స్‌ కలిగినవారే అర్హులు. కానీ ఎన్‌ఐటీలో ప్రవేశం పొందటానికి బీఎస్‌సీ బయాలజీ విద్యార్థులు కూడా అర్హులే.
* ఎమ్మెస్సీ మ్యాథ్స్‌ ప్రవేశపరీక్షను బీఎస్‌సీలో మ్యాథ్స్‌ కలిగినవారు రాయవచ్చు.
* ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ ఎంట్రన్స్‌కు బీఎస్‌సీలో ఫిజిక్స్‌ ఉన్న విద్యార్థులు అర్హులు.

ఐఐటీ జామ్‌లో పశ్చిమ్‌బంగ విద్యార్థులు 50% పైగా సీట్లను సాధిస్తున్నారు. దీనికి కారణం- వారు సంబంధిత సబ్జెక్టులో బీఎస్‌సీ ఆనర్స్‌ చేసి, సబ్జెక్టు మీద పట్టు సాధించటం. మన రాష్ట్ర విద్యార్థులు ఆనర్స్‌ చదివినవారిని దృష్టిలో ఉంచుకొని, క్షుణ్ణంగా సిద్ధం కావాలి. మొదట 10+2 సిలబస్‌తో ప్రిపరేషన్‌ మొదలుపెట్టాలి. అంటే తెలుగు అకాడమీ, సీబీఎస్‌సీ పుస్తకాల సాయంతో మౌలిక కాన్సెప్టులను వృద్ధి చేసుకోవాలి. తర్వాత బీఎస్‌సీ సిలబస్‌ను టాపిక్‌లవారీగా పూర్తిగా చదవాలి.
ఏయే కోర్సులు: బయోటెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, కెమిస్ట్రీ, అట్మాస్ఫియర్‌ అండ్‌ ఓషన్‌ సైన్సెస్‌, అప్లైడ్‌ జియాలజీ, జియో ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌, మ్యాథ్స్‌, అప్లైడ్‌ మ్యాథ్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌, ఆపరేషన్స్‌ రిసెర్చ్‌, అప్లైడ్‌ స్టాటిస్టిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మాటిక్స్‌, స్టాటిస్టిక్స్‌, ఫిజిక్స్‌, అప్లైడ్‌ జియో ఫిజిక్స్‌, ఆస్ట్రానమీ కోర్సుల్లో పీజీ, జాయింట్‌ ఎమ్మెస్సీ పీహెచ్‌డీ, ఎమ్మెస్సీ పీహెచ్‌డీ డ్యూయల్‌ డిగ్రీ. ఐఐఎస్సీ బెంగళూరులో బయలాజికల్‌ సైన్సెస్‌, కెమికల్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ సైన్సెస్‌, మ్యాథమేటికల్‌ సైన్సెస్‌ కోర్సుల్లో ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ.

ప్రవేశం కల్పించే సంస్థలు
ఐఐటీలు: భువనేశ్వర్‌, బాంబే, దిల్లీ, గాంధీనగర్‌, గువాహటి, హైదరాబాద్‌, ఇండోర్‌, జోధ్‌పూర్‌, కాన్పూర్‌, ఖరగ్‌పూర్‌, మద్రాస్‌, పట్నా, రూర్కీ, రోపార్‌, వారణాసి, బిలాయ్‌, ధన్‌బాద్‌, పలక్కాడ్‌; ఐఐఎస్సీ- బెంగళూరు.
ఎన్‌ఐటీలు: అగర్తల, అలహాబాద్‌, యుపియా (అరుణాచల్‌ ప్రదేశ్‌), కాలికట్‌, దుర్గాపూర్‌, జయపుర, జలంధర్‌, జంషెడ్‌పూర్‌, ఇంఫాల్‌ (మణిపూర్‌), నాగాలాండ్‌, నాగ్‌పుర్‌, రవుర్కెలా, సిల్చార్‌, శ్రీనగర్‌, వరంగల్‌.
ఐఐఎస్‌ఈఆర్‌లు: తిరుపతి, పుణె, భోపాల్‌.
ఇతర సంస్థలు: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, శివ్‌పూర్‌, సంత్‌ లోంగోవాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ పంజాబ్‌

పరీక్ష ఇలా...
పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఇందులో రెండు సెషన్లు ఉంటాయి. సెషన్‌ -1లో బయలాజికల్‌ సైన్సెస్‌, మ్యాథమేటిక్స్‌, ఫిజిక్స్‌ సెషన్‌ -2లో బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమేటికల్‌ స్టాటిస్టిక్స్‌ పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులు గరిష్ఠంగా రెండు పేపర్లలో పరీక్ష రాసుకోవచ్చు. ఒక్కో సెషన్‌లో ఒక్కోటి చొప్పున రాయడానికి వీలవుతుంది. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటుంది. మూడు రకాల ప్రశ్నలు వస్తాయి. అవి.. మల్టిపుల్‌ ఛాయిస్‌, మల్టిపుల్‌ సెలక్ట్‌, న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్‌. పరీక్ష వ్యవధి 3 గంటలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌ మాధ్యమంలో ఉంటుంది. 60 ప్రశ్నలు- వంద మార్కులు. సెక్షన్‌ సి మినహా అన్ని ప్రశ్నలకు 4 ఆప్షన్లు ఉంటాయి.
సెక్షన్‌ ఎ: 30 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు వస్తాయి. వీటిలో ఒక మార్కువి 10, 2 మార్కులవి 20 ఉంటాయి.
సెక్షన్‌ బి: ఇందులో 10 మల్టిపుల్‌ సెలక్ట్‌ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు. మల్టిపుల్‌ సెలక్ట్‌ ప్రశ్నలకు నాలుగు ఐచ్ఛికాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సరైన జవాబులు ఉండవచ్చు.
సెక్షన్‌ సి: ఇందులో 20 న్యూమరికల్‌ ఆన్సర్‌ టైపు ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఒక మార్కు, 2 మార్కుల ప్రశ్నలు 10 చొప్పున ఉంటాయి. ఈ ప్రశ్నలకు ఛాయిస్‌ ఉండవు. వర్చువల్‌ కీబోర్డు ఉపయోగించి సమాధానం రాబట్టాలి. జవాబు అంకెల రూపంలో ఉంటుంది.
రుణాత్మక మార్కులున్నాయి. సెక్షన్‌-ఎలో ఒక మార్కు ప్రశ్నలకు తప్పు జవాబు గుర్తిస్తే 1/3 మార్కులు తగ్గిస్తారు. అదే రెండు మార్కుల ప్రశ్నలకైతే 2/3 మార్కులు తగ్గిస్తారు. సెక్షన్‌ బిలో రుణాత్మక మార్కులు లేవు. అలాగే సరైన అన్ని ఆప్షన్లూ గుర్తిస్తేనే పూర్తి మార్కులు కేటాయిస్తారు. పాక్షిక సమాధానాలకు మార్కులు ఉండవు. సెక్షన్‌ సి రుణాత్మక మార్కులు లేవు.

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు: సెప్టెంబరు 1 నుంచి
పరీక్ష తేదీ: ఫిబ్రవరి 10 (సెషన్‌ 1 ఉదయం 9 నుంచి 12 వరకు, సెషన్‌ 2 మధ్యాహ్నం 2 నుంచి 5)
వెబ్‌సైట్‌: http://jam.iitkgp.ac.in

ఇలా చదవండి..
స్థానిక విశ్వవిద్యాలయాల పీజీ ప్రవేశపరీక్షలతో పోల్చినప్పుడు ఐఐటీ జామ్‌లో పోటీ తీవ్రత శాతం కొంత తక్కువే. సరైన ప్రణాళికలతో కృషి చేస్తే విజయం సాధించడం సులభమే. జామ్‌లో ఏ సబ్జెక్టులోనైనా సుమారు 60% స్కోరు చేయగలిగితే సీటు దక్కించుకోవటం సాధ్యమే!
జామ్‌ సిలబస్‌నూ, తాము చదివే సిలబస్‌తో పోల్చుకుని చూసుకోవాలి. కొత్త టాపిక్స్‌ ఏమైనా ఉంటే వాటి మెటీరియల్‌ను కూడా సేకరించి చదవాలి. సబ్జెక్టును విశ్లేషణాయుతంగా చదవటం, అన్వయించటం ముఖ్యం. ప్రవేశపరీక్ష మోడల్‌ పేపర్‌ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. దాని ప్రకారం ముందుకు సాగాలి.
ఫైÆనలియర్‌ చదువుతున్న విద్యార్థులకు మార్చిలో బీఎస్‌సీ పరీక్షలుంటాయి. సమయం తక్కువగా ఉంది కాబట్టి సబ్జెక్టులోని ముఖ్యమైన అంశాలపై దృష్టిపెట్టాలి. ఇప్పటినుంచే కొంత సమయం జామ్‌ సబ్జెక్టుకు కేటాయించాలి. రోజూ కొంత సమయం మోడల్‌ పేపర్లు సాధన చేయాలి. ఆరు సంవత్సరాల పూర్వ జామ్‌ పేపర్లు వెబ్‌సైట్లో ఉన్నాయి. ఇంటర్నెట్‌ను ఉపయోగించుకుని నమూనా ప్రశ్నలను సాధన చేసుకోవచ్చు.
తెలుగు మీడియం విద్యార్థులు కూడా ఏటా ఈ ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తున్నారు. గతంలో మాదిరిగా వ్యాసరూప ప్రశ్నలు లేకపోవడం వీరికి అనుకూలాంశం. గ్రామీణప్రాంత విద్యార్థులు కంప్యూటర్‌ ఆధారిత ప్రశ్నలను ఎక్కువగా సాధన చేయాలి. డిగ్రీ మార్కుల శాతం గురించి ఎక్కువగా ఆలోచించకుండా అర్హత ఉన్న అభ్యర్థులందరూ జామ్‌కు దరఖాస్తు చేసుకోవటం సముచితం. ఆశావహ దృక్పథంతో సబ్జెక్టుపై అవగాహన పెంచుకుంటే అనుకూల ఫలితం వస్తుంది.

ఏ సబ్జెక్టువారు ఎలా చదవాలి?
వివిధ సబ్జెక్టుల్లో కీలక అంశాలు చూద్దాం.
బయొలాజికల్‌ సైన్స్‌: దీనిలో అధికశాతం బయాలజీ సిలబస్‌, కొంత మ్యాథమేటిక్స్‌ సిలబస్‌ ఉంటుంది. జనరల్‌ బయాలజీ, బేసిక్స్‌ ఆఫ్‌ బయోకెమిస్ట్రీ, బయో ఫిజిక్స్‌, మాలిక్యులర్‌ బయాలజీ, మైక్రో బయాలజీ, సెల్‌ బయాలజీ అండ్‌ ఇమ్యునాలజీ; మ్యాథమేటికల్‌ సైన్స్‌, మ్యాథమేటికల్‌ ఫంక్షన్స్‌ ముఖ్యమైనవి.
బయో టెక్నాలజీ: ఈ ప్రవేశపరీక్ష ద్వారా అధిక సీట్లను ఎంపీసీ విద్యార్థులు కైవసం చేసుకుంటున్నారు. కాబట్టి బైపీసీ విద్యార్థులు బయాలజీ, కెమిస్ట్రీలతోపాటు మ్యాథమేటిక్స్‌, ఫిజిక్స్‌ల మీద దృష్టిపెట్టాలి. బీఎస్‌సీలో మోడర్న్‌ బయాలజీ గ్రూపులున్న విద్యార్థులు బోటనీ, జువాలజీల సిలబస్‌ను కూడా సమగ్రంగా చదవాలి. మ్యాథమేటిక్స్‌లో మ్యాట్రిక్స్‌, డెరివేేటివ్స్‌, కాల్‌క్యులస్‌, వెక్టర్స్‌, ట్రిగనోమెట్రీ, కోఆర్డినేట్‌ జామెట్రీలను క్షుణ్ణంగా సాధన చేయాల్సివుంటుంది.ఈ విద్యార్థులు, ఇతర ఎంట్రన్స్‌ సబ్జెక్టులు రాసేవారికంటే ప్రిపరేషన్‌కు అధిక సమయం కేటాయించాలి.
కెమిస్ట్రీ: ఫిజికల్‌, ఆర్గానిక్‌ కెమిస్ట్రీల మీద అధిక దృష్టి అవసరం. కెమిస్ట్రీతోపాటు మ్యాథ్స్‌లో పేర్కొన్న బేెసిక్‌ సిలబస్‌ను కూడా అధ్యయనం చేయాలి.
ఫిజిక్స్‌: ఫిజికల్‌ ఆప్టిక్స్‌, క్వాంటమ్‌ మెకానిక్స్‌, థర్మో డైనమిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ఆసిలేెషన్స్‌, వేవ్స్‌, క్వాంటమ్‌, స్పెక్ట్రోస్కోపి, న్యూక్లియర్‌, అటామిక్‌ ఫిజిక్స్‌ హీట్‌, మోడర్న్‌ ఫిజిక్స్‌ సంబంధిత సిలబస్‌ను ఆచరణాత్మక (అనువర్తిత) ధోరణిలో సంపూర్ణంగా చదవాలి.
మాథమేటిక్స్‌: మ్యాట్రిక్స్‌, డెరివేటివ్స్‌, కాల్‌క్యులస్‌, వెక్టర్స్‌, ట్రిగొనామెట్రీ, కోఆర్డినేట్‌ జామెట్రీ సబ్జెక్టులను క్షుణ్ణంగా ప్రాక్టీస్‌ చేయాలి.

జామ్‌: రెఫరెన్స్‌ పుస్తకాలు
కెమిస్ట్రీ
ఆర్గానిక్‌ కెమిస్ట్రీ: Clayden, Carey Sundberg
ఫిజికల్‌ కెమిస్ట్రీ: P.W.Atkins, K.L.Kapoor
ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ: J.D. Lee, Shriver & Atkins

బయాలజీ
బయోకెమిస్ట్రీ: Voet & Voet, Albert Lehninger
మైక్రోబయాలజీ: Prescott
సెల్‌బయాలజీ: Alberts, Lodish
మాలిక్యులర్‌ బయాలజీ: Weaver
ఇమ్యునాలజీ: Kuby
జెనెటిక్స్‌: Griffith, Suzuki
యానిమల్‌ ఫిజియాలజీ: Nielsen
ప్లాంట్‌ ఫిజియాలజీ: Teiz and Zeiger

మ్యాథ్స్‌
ఆల్జీబ్రా: Bhattacharya, Devid C Lay
కాల్‌క్యులస్‌: M.J.Strauss, H.Anton
రియల్‌ అనాలిసిస్‌: Shanti Narayan, Richard R Goldberg
డిఫరెన్షియల్‌ ఈక్వేషన్స్‌: Sastri SS, Collins P.J.
కాంప్లెక్స్‌ నంబర్స్‌: Murry R Spiegel
ప్రాబబిలిటీ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌: C.E.Weatherban, Das Gupta, Ray & Sharma

ఫిజిక్స్‌
మెకానిక్స్‌: D S Mathur, Daniel
వేవ్స్‌ అండ్‌ ఆప్టిక్స్‌: D R Brown, N K Bajaj
ఎలక్ట్రిసిటీ అండ్‌ మాగ్నెటిజమ్‌: D C Tayal, Edward M Purcell
కైనటిక్‌ థియరీ, థెర్మో డైనమిక్స్‌: D John, Charles E Hecht
మోడర్న్‌ ఫిజిక్స్‌: D.C. Pandey, B L Theraja
సాలిడ్‌ స్టేట్‌ ఫిజిక్స్‌: S.P. Singh, D.K. Bhattacharya

Posted on 16-8-2018

Previous Papers

2018

 • Biological Science
 • Biotechnology
 • Chemistry
 • Geology
 • Mathematics
 • Mathematics Statistics
 • Physics

 • 2017

 • Biological Science
 • Biotechnology
 • Chemistry
 • Geology
 • Mathematics
 • Mathematics Statistics
 • Physics

 • More Papers...