close

JEE > TOPPER VOICE

JEE(ADVANCED) 2018 Toppers

మెయిన్స్‌ నేర్పిన పాఠంతో అడ్వాన్స్‌డ్‌లో ఐదో ర్యాంకు!

జేఈఈ మెయిన్స్‌లో 59వ ర్యాంకు. దానిలో చేసిన చిన్నచిన్న తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని అడ్వాన్స్‌డ్‌లో ఆ పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్త పడడంతో అడ్వాన్స్‌డ్‌లో అఖిలభారతీయ ఓపెన్‌ కేటగిరిలో ఐదో ర్యాంకు సాధించాడు మావూరి శివకృష్ణ మనోహర్‌. తన ప్రిపరేషన్‌, పరీక్ష రాయడంలో తీసుకున్న జాగ్రత్తలు అతడి మాటల్లోనే..!
ఐఐటీ బాంబేలో ఇంజినీరింగ్‌ చేయాలన్నది నా కల. జేఈఈలో మంచి ర్యాంకు వస్తుందనే నమ్మకంతో ఏపీ ఎంసెట్‌ రాయలేదు. జేఈఈ మెయిన్స్‌లో చేసిన చిన్నచిన్న పొరపాట్ల కారణంగా 59వ ర్యాంకు వచ్చింది. జేఈఈ మెయిన్స్‌ వరకు ఇంటర్‌ విద్యతోపాటే జేఈఈ సిలబస్‌ను చదువుతూ వచ్చాను. మెయిన్స్‌ పూర్తయిన తర్వాత అడ్వాన్స్‌డ్‌కు వచ్చేసరికి సుమారు 40 రోజులపాటు ప్రశ్నపత్రాలను ప్రాక్ట్టీస్‌ చేయడం, చదవడంపై పూర్తిగా దృష్టిసారించాను. ఉదయం 8.30 గంటలకు తరగతులకు వెళ్తే భోజనం, ఇతరాత్ర చిన్నచిన్న విరామాలు మినహా రాత్రి 12.30 గంటల వరకు కళాశాలలో ఇచ్చే ప్రశ్నపత్రాలను రాయడం, వాటిల్లో చేసిన తప్పిదాలను గుర్తించడం, చదవడం చేసేవాడిని.
* జేఈఈ మెయిన్స్‌లో 360మార్కులకు జరిగిన పరీక్షలో గణితంలో ఎక్కువగా సుదీర్ఘ ప్రశ్నలు రావడంతో సమయం ఎక్కువగా తీసుకుంది. పరీక్ష రాసే ఒత్తిడిలో హడావుడిగా జవాబులు గుర్తించడంతో నాలుగు ప్రశ్నలకు తప్పుడు సమాధానాలు రాశాను. రసాయన శాస్త్రంలో రెండు ప్రశ్నలకు సమాధానాలు తెలిసినా తొందరగా రాయాలనే ఒత్తిడిలో తప్పుగా రాశాను. దీంతో మార్కులు కోల్పోయాను. మొత్తం 325 మార్కులు రాగా.. 59వ ర్యాంకు లభించింది.
* జేఈఈ మెయిన్స్‌లో ఒత్తిడికి గురికావడం, తొందరగా రాయాలనే ఉద్దేశంతో చేసిన తప్పులను గుర్తించి అడ్వాన్స్‌డ్‌లో వాటి నుంచి బయటపడ్డాను. 360 మార్కులకు గాను 319 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్స్‌కు సిద్ధమయ్యే సమయంలో అటు ఇంటర్‌తోపాటు దానికి ప్రిపేర్‌ కావాల్సి వచ్చింది. మెయిన్స్‌ తర్వాత సమయం ఉండడంతో రివిజన్‌, ప్రశ్నపత్రాల ప్రాక్టీస్‌ ఎక్కువ చేశాను. కఠినంగా అనిపించేవాటిని ఒకటికి రెండు పర్యాయాలు చదవడం, రాయడం, ప్రాక్టీస్‌ చేయడం చేశాను. నమూనా ప్రశ్నపత్రాలను ఎక్కువగా చేయడం వల్ల అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో ఇబ్బందులు ఎదురు కాలేదు. రసాయనశాస్త్రంలో ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సి వచ్చేది. గణితంలో సమయం ఎక్కువ తీసుకునే ప్రశ్నలు రావడంతో సమయాన్ని ఆదా చేసుకునేందుకు ప్రయత్నించాల్సి వచ్చింది. భౌతికశాస్త్రంలో కొన్ని తేెలికైన జవాబులు రావడంతో కొంత సమయం కలిసొచ్చింది. కళాశాలలో వారానికి రెండు పరీక్షలు పెట్టేవారు. వీటిల్లో చేసిన తప్పిదాలను అధ్యాపకులు వివరించేవారు. జేఈఈ పరీక్ష రాసేటప్పుడు ఒకసారి పైపైన ప్రశ్నపత్రం మొత్తాన్ని చూడాలి. ఇందుకు రెండు, మూడు నిమిషాలు సమయం పడుతుంది. ఆ తర్వాత తేలికగా ఉన్నవాటికీ¨, ఏ సబ్జెక్టుపై ఎక్కువ పట్టు ఉంటుందో ఆ ప్రశ్నలకూ సమాధానాలు రాస్తే మంచిది.