close

JEE > LATEST NEWS

జేఈఈ మెయిన్‌లో తెలుగు హవా

* దేశవ్యాప్తంగా 15 మందికి 100 పర్సంటైల్‌
* ఏపీ విద్యార్థులు ముగ్గురు, తెలంగాణ నుంచి ఇద్దరు
* పేపర్‌-1 ఫలితాలు విడుదల చేసిన ఎన్‌టీఏ
* రెండో విడతకు ఫిబ్రవరి 8 నుంచి దరఖాస్తుల ప్రక్రియ

ఈనాడు - హైదరాబాద్‌, అమరావతి: జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించే దిశగా ప్రతిభ కనబరుస్తున్నారు. దేశవ్యాప్తంగా మెయిన్‌ పేపర్‌-1 ఫలితాల్లో 15 మంది 100 పర్సంటైల్‌ సాధించగా, అందులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ఇద్దరు విద్యార్థులు ఉండటం విశేషం. జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) మాత్రం తెలంగాణ అగ్రగణ్యులుగా నలుగురు విద్యార్థులను, ఏపీ టాపర్‌గా బొజ్జా చేతన్‌రెడ్డిని ప్రకటించింది. ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశంకోసం.. జేఈఈ అడ్వాన్స్డ్‌ పరీక్షకు అర్హత పొందేందుకు జనవరి 9 - 12 తేదీల మధ్య ఎన్‌టీఏ జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 ఆన్‌లైన్‌ పరీక్షలను నిర్వహించింది. ఆ ఫలితాలను శనివారం వెల్లడించింది. ఆన్‌లైన్‌లో ఎక్కువ రోజులు పరీక్షలు జరిగితే ఫలితాలకు పర్సంటైల్‌ విధానాన్ని అవలంభిస్తారు. పేపర్‌-1ను రోజుకు రెండుసార్లు చొప్పున మొత్తం ఎనిమిది సార్లు నిర్వహించారు. ఎనిమిది ప్రశ్నపత్రాలు ఉండటంతో ఒకటి కఠినంగా.. మరొకటి సులభంగా ఉండొచ్చు కాబట్టి, విద్యార్థులకు నష్టం జరగకూడదని పర్సంటైల్‌ విధానాన్ని పాటిస్తున్నారు. ఈ ఏడాది నుంచి రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్‌లో మరోసారి ఈ పరీక్షలు జరుపుతారు. ఆసక్తి ఉన్నవారు ఆ పరీక్షకూ హాజరుకావొచ్చు. ఈ రెండింటిలో వచ్చిన ఉత్తమ పర్సంటైల్‌ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని ర్యాంకులు కేటాయిస్తారు. దేశవ్యాప్తంగా మొదటి పరీక్షకు 8,74,469 మంది హాజరయ్యారు. ఏపీ, తెలంగాణల నుంచి సుమారు 1.40 లక్షల మంది రాసి ఉంటారని అంచనా. 100 పర్సంటైల్‌ సాధించిన తెలుగు విద్యార్థులు కార్పొరేట్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ చదువుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు హైదరాబాద్‌లోనే ఇంటర్‌ చదువుతూ ఇక్కడే పరీక్ష రాశారు. దాంతో జాతీయ పరీక్షల సంస్థ వారిని తెలంగాణకు చెందినవారిగా ప్రకటించింది. మిగిలిన 10 మందిలో మహారాష్ట్రకు చెందిన వారు ముగ్గురు, రాజస్థాన్‌ నుంచి ఇద్దరు, ఉత్తర్‌ ప్రదేశ్‌ నుంచి ఇద్దరు, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, పంజాబ్‌కు చెందిన వారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 (ఆర్కిటెక్చర్‌ కోర్సులకు) పరీక్ష జనవరి 8న జరగగా, వాటి ఫలితాలను తర్వాత ప్రకటిస్తామని ఎన్‌టీఏ ప్రకటించింది.
ఇదీ లెక్క
* పరీక్షకు దరఖాస్తు చేసినవారి సంఖ్య : 9,29,198
* హాజరైనవారి సంఖ్య : 8,74,469
* ఏప్రిల్‌ పరీక్షకు దరఖాస్తులు: ఫిబ్రవరి 8 నుంచి మార్చి 7 వరకు
* ఏప్రిల్‌ పరీక్ష తేదీలు : 6 - 20 తేదీల మధ్య
వెబ్‌సైట్‌: https://jeemain.nic.in/

 

Published on 20-01-2019