close

JEE > LATEST NEWS

జేఈఈలో ఒకే ర్యాంకు ఇద్దరికి రాదు

* ఏడు దశాంశాల వరకూ పర్సంటైల్‌ గణన
* సమాన మార్కులు వచ్చే వారిసంఖ్య తగ్గుతుందంటున్న నిపుణులు
ఈనాడు, హైదరాబాద్‌: గతంలో మాదిరిగా ఈసారి జేఈఈ మెయిన్‌లో ఒకే ర్యాంకు ఇద్దరికి కేటాయించే అవకాశం లేదని నిపుణులు సృష్టంచేస్తున్నారు. ఈసారి ఏడు దశాంశాల వరకు పర్సంటైల్‌ను గణిస్తుండటమే అందుకు కారణమని చెబుతున్నారు. జేఈఈ మెయిన్‌ను పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో రోజుకు రెండు సార్లు చొప్పున మొత్తం ఎనిమిది సార్లు పరీక్షలు జరిపారు. దాంతో పర్సంటైల్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. జేఈఈ మెయిన్‌ మార్కులను కటాఫ్‌గా నిర్ణయించి అన్ని కేటగిరీల్లో కలిపి 2.24 లక్షల మందిని జేఈఈ అడ్వాన్సుడ్‌ పరీక్ష రాసేందుకు ఎంపిక చేస్తున్నారు. గత ఏడాది వరకు మార్కులను పరిగణనలోకి తీసుకున్నందున సమాన మార్కులు పొందిన వారు ఉండటంతో మరో 7 వేల మంది విద్యార్థులు లబ్ధి పొంది జేఈఈ అడ్వాన్సుడ్‌కు అర్హుల సంఖ్య 2.31 లక్షలకు చేరుకుంది. ఈసారి 7 దశాంశాల వరకు పర్సంటైల్‌ గణిస్తున్నందున ఇలా లబ్ధి పొందేవారు పదుల సంఖ్యలోనే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దాంతో ఈసారి 2.24 లక్షల మంది జేఈఈ అడ్వాన్సుడు అర్హుల్లో పెరుగుదల స్వల్పంగానే ఉండొచ్చని చెబుతున్నారు. ఒకవేళ ఐఐటీల్లో సీట్లు పెరిగితే ఆ మేరకు అర్హుల సంఖ్యను పెంచే అవకాశం ఉంది. అదే జరిగితే కటాఫ్‌ పర్సంటైల్‌ తగ్గుతుంది. పెరిగే సీట్ల సంఖ్యను బట్టి అది ఆధారపడి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. సాధారణంగా సీట్ల సంఖ్యకు 20 రెట్ల మందిని అడ్వాన్సుడ్‌ పరీక్ష రాసేలా అవకాశం కల్పిస్తున్నారు.
జనరల్‌ కేటగిరీ కటాఫ్‌ పర్సంటైల్‌ ఎంత?
అడ్వాన్సుడ్‌ పరీక్షకు అర్హత సాధించే మొత్తం 2.24 లక్షల మందిలో జనరల్‌ కేటగిరీ కింద 50.50 శాతం అంటే సుమారు 1,13,120 మంది ఉంటారు. వారిలో ఓపెన్‌ కేటగిరీ దివ్యాంగుల 5 శాతాన్ని మినహాయిస్తే 1,07,464 మంది ఉంటారు. ఇది ఈసారి పరీక్షలకు హాజరైన 8,74,469 మందిలో 12.2890577 శాతానికి సమానం. అంటే జనవరిలో జరిగిన పరీక్షలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారనుకుంటే ఓపెన్‌ కేటగిరీలో సుమారు మొదటి 12.2890577 శాతం విద్యార్థులు అడ్వాన్సుడ్‌కు అర్హులవుతారు. పర్సంటైల్‌గా 100.0000000లో దీన్ని తీసివేస్తే సుమారు 87.7109423 పర్సంటైల్‌ను ఓపెన్‌ కేటగిరీలో కటాఫ్‌గా ఉండొచ్చని అంచనా. అయితే ఏప్రిల్‌లో జరిగే పరీక్షల తర్వాతే రెండు పరీక్షల్లో ఉత్తమ పర్సంటైల్‌ను పరిగణలోకి తీసుకొని కటాఫ్‌ నిర్ణయిస్తారు.

Published on 31-01-2019