close

JEE > LATEST NEWS

జేఈఈ మెయిన్‌ - 2 (ఆర్కిటెక్చర్‌) ఫలితాల విడుదల

* 100 పర్సంటైల్‌ సాధించిన ఏపీ విద్యార్థులు
ఈనాడు, అమరావతి: జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 (ఆర్కిటెక్చర్‌, ప్లానింగ్‌ కోర్సుల) ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచారు. దేశవ్యాప్తంగా పేపర్‌-2 ఫలితాల్లో కేవలం ఇద్దరు మాత్రమే 100 పర్సంటైల్‌ సాధించగా, వీరిద్దరూ ఏపీకి చెందిన వారే. గుంటూరు జిల్లా చెరుకుపల్లికి చెందిన గొల్లపూడి ఎన్‌.లక్ష్మీనారాయణ, అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన గుడ్ల రఘునందన్‌ రెడ్డిలు ఈ ఘనత సాధించారు. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) ఫలితాలను విడుదల చేసింది. బి.ఆర్క్‌, బి.ప్లానింగ్‌ల్లో ప్రవేశాలకు జనవరి 8న ఎన్‌టీఏ రెండు విడతలుగా పరీక్షలు నిర్వహించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి సుమారు 15 వేల మంది హాజరయ్యారు. ఆన్‌లైన్‌లో ఒక్కసారి కంటే ఎక్కువ పరీక్షలు నిర్వహిస్తే ఫలితాలకు పర్సంటైల్‌ విధానాన్ని అవలంబిస్తారు. విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా ఈ విధానాన్ని పాటిస్తున్నారు. ఈ ఏడాది నుంచి రెండు పర్యాయాలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్‌లో మరోసారి పరీక్షలు నిర్వహిస్తారు. రెండు పర్యాయాలు పరీక్షలు రాయాలన్న తప్పని సరేమి లేదు. ఏప్రిల్‌ ఫలితాలు విడుదల చేసిన తర్వాత జాతీయ స్థాయి ర్యాంకులను ప్రకటించే అవకాశం ఉంది.
శాస్త్రవేత్త అవ్వాలనేది లక్ష్యం
‘మాది అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన మధ్యతరగతి కుటుంబం. మా నాన్న తిమ్మారెడ్డి చిరు వ్యాపారం చేసుకుంటూ చదివిస్తున్నారు. ప్రాథమిక స్థాయి నుంచే పాఠ్యాంశాలలోని అన్ని విషయాలను చదవడం నాకు అలవాటు. తరగతి గదిలో అధ్యాపకులు చెప్పే పాఠ్యాంశాలను శ్రద్ధగా వింటూ.. రోజూ రాత్రి 11 గంటల వరకు చదివాను. సందేహాలు ఉంటే మరుసటి రోజూ అధ్యాపకులను అడిగి నివృత్తి చేసుకుంటూ పక్కా ప్రణాళికతో సాధన చేశాను. అదే నేను మంచి ఫలితాలు సాధించడానికి దోహదపడింది. శాస్త్రవేత్త కావాలన్నదే నా లక్ష్యం’’
- జి.రఘునందన్‌రెడ్డి
సమయాన్ని సద్వినియోగం చేసుకున్నా
‘‘పాఠశాల స్థాయి నుంచే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే నా విజయానికి కారణం. మాది గుంటూరు జిల్లా చెరుకుపల్లి గ్రామం. మా నాన్న శ్రీనివాసరావు చిరు వ్యాపారి. తల్లి అరుణకుమారి గృహిణి. మా అమ్మ బీఈడీ వరకు చదువుకుంది. అమ్మ వల్లే నాకు చదువు అంటే ఆసక్తి పెరిగింది. తల్లిదండ్రుల ప్రోత్సాహం.. నాలో పట్టుదలను పెంచింది. పేపరు-1లో 99.91 పర్సంటైల్‌, పేపరు-2లో 100 పర్సంటైల్‌ సాధించాను. ఐఐటీ ముంబైలో కంప్యూటర్‌ సైన్సులో సీటు సాధించాలనేది లక్ష్యం’.
- జి.ఎన్‌.లక్ష్మినారాయణ

Published on 02-02-2019