close

JEE > LATEST NEWS

భారీగా బీఆర్క్‌ సీట్లు

* 18 ఐఐటీ, ఎన్‌ఐటీలలో ప్లానింగ్‌, ఆర్కిటెక్చర్‌ విభాగాలు
* వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి 2,160 సీట్లు
ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (బీఆర్క్‌) సీట్లు భారీగా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం స్వల్ప సంఖ్యలో సీట్లున్నాయి. ఒకవైపు పట్టణీకరణ పెరుగుతుండగా.. మరోవైపు ఆ రంగంలో నిపుణులు కొద్ది సంఖ్యలోనే ఉన్నారని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మొత్తం 18 జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ విభాగాల(డీపీఏ)ను ప్రారంభించనుంది. ఒక్కో విభాగంలో మొదటి బ్యాచ్‌ కింద 120 మందికి ప్రవేశాలు కల్పిస్తామని పేర్కొంది. 18 సంస్థల్లో మొత్తం 2,160 సీట్లు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం జేఈఈ మెయిన్‌ పేపర్‌-2, జేఈఈ అడ్వాన్సుడ్‌ ఏఏటీ (ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌)లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా దేశంలోని 9 ఎన్‌ఐటీలు, మూడు స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ (స్పా), ఖరగ్‌పూర్‌.. రూర్కీ ఐఐటీలలో నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌, అయిదేళ్ల బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. వాటిల్లో 1500 వరకు మాత్రమే సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటికోసం ఏటా సుమారు 2 లక్షల మందికి పైగా పోటీ పడుతున్నారు. సీట్లను పెంచాలని నిర్ణయించిన కేంద్రం 2018-19 బడ్జెట్‌లో కొత్తగా రెండు స్పాలను, 18 ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో కొత్త విభాగాలను ప్రారంభిస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో జనవరి 7 లోపు ప్రతిపాదనలు పంపించాలని కేంద్ర మానవ వనరులశాఖ ఐఐటీలు, ఎన్‌ఐటీలను కోరింది. దీంతో జనవరి 3న వరంగల్‌ ఎన్‌ఐటీ ప్రతిపాదనలు సమర్పించింది.
మేం సంసిద్ధం
- ఆచార్య ఎన్‌వీ రమణారావు, సంచాలకుడు, ఎన్‌ఐటీ వరంగల్‌
వచ్చే జులై నుంచి 120 సీట్లతో కొత్తగా ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ విభాగాన్ని(డీపీఏ) ప్రారంభించేందుకు మేం సిద్ధం. అందుకు అవసరమైన తరగతి గదులు, వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. మొదటి ఏడాది విద్యార్థులకు బోధించేందుకు 60 శాతం అధ్యాపకులు సంస్థలోనే ఉన్నారు. కొత్త విభాగం మంజూరైతే రూ.300 కోట్ల వరకు కేంద్రం నుంచి నిధులు వస్తాయి. బీప్లానింగ్‌, బీఆర్క్‌ కోర్సులతో పాటు 2022 జులై నుంచి పీహెచ్‌డీ, 2023 నుంచి పీజీ కోర్సులు ప్రవేశపెట్టాలన్నది మా భవిష్యత్తు ప్రణాళిక..

Published on 11-01-2019