close

JEE > LATEST NEWS

ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీట్ల పెంపు

* 25% సీట్లు పెంచుతామన్న కేంద్రం
ఈనాడు - హైదరాబాద్‌: ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలైన ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఎంలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం కోసం సన్నద్ధమవుతున్న విద్యార్థులకు శుభవార్త. ఆయా విద్యా సంస్థల్లో ఏకంగా 25 శాతం వరకు సీట్లను పెంచుకోవాలని కేంద్రం ప్రకటించింది. ఆర్థికంగా వెనకబడిన కులాలకు 10 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తున్నందున వచ్చే విద్యా సంవత్సరం నుంచే సీట్ల పెంపు అమల్లోకి రానుందని వెల్లడించింది. దీనికి సంబంధించి వారం రోజుల్లోనే యూజీసీ, ఏఐసీటీఈల నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడనున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అధిక ప్రయోజనం చేకూరనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఐఐటీ, ఎన్‌ఐటీ లాంటి జాతీయ విద్యాసంస్థల్లో స్వల్ప సంఖ్యలో సీట్లు పెరగాలంటే అందుకు పూర్తిస్థాయిలో మౌలిక వసతులు, అధ్యాపకులు అవసరం. విద్యా నాణ్యత విషయంలో రాజీపడకుండా ఉండాలన్నదే దాని వెనుక ఉద్దేశం. ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్సుడ్‌ను ప్రపంచంలోని పది కఠిన పరీక్షల్లో ఒకటిగా నిపుణులు చెబుతుంటారు. వాటిల్లో వేల సంఖ్యలో సీట్లుంటే లక్షల మంది పోటీ పడుతుంటారు. ఆ సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు బహుళజాతి సంస్థలు భారీ వేతనం ఇచ్చి ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటాయి. అలాంటి వాటిల్లో 25 శాతం సీట్లు పెరుగుతాయని కేంద్రం ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
25 శాతం సీట్ల పెంపు ఎలా?
ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్‌కు ఏమాత్రం ఆటంకం కలగకుండా 10 శాతం కొత్త కోటాను అమలు చేయనున్నారు. అంటే సూమర్‌ న్యూమరరీ కింద ఆ సీట్లను పెంచుతారు. ఆ ప్రకారం ప్రస్తుతం ఒక కోర్సులో 50 సీట్లుంటే 10 శాతం పెరిగితే 55 సీట్లవుతాయి. మరి 10 శాతం పెరగాల్సి ఉండగా 25 శాతం వరకు సీట్లు పెరుగుతాయని కేంద్ర మంత్రి చెబుతున్నారు. దీనిపై హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పొదిలె అప్పారావు మాట్లాడుతూ.. 2007లో కేంద్రీయ వర్సిటీల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని కేంద్రం ఆదేశించి ఇతరులకు సమస్య లేకుండా 54 శాతం సీట్లను పెంచాలని ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పారు. అదే విధానం ఇప్పుడూ ప్రకటిస్తే రెట్టింపు అంటే 20 శాతం అవుతుందని విశ్లేషించారు. దీనిపై ఒకటీ రెండు రోజుల్లోనే ఆఫీస్‌ మెమోరాండం (ఓఎం) వస్తుందని ఆశిస్తున్నట్లు, అప్పుడే సీట్లపై స్పష్టత వస్తుందన్నారు. ఎన్‌ఐటీ వరంగల్‌ సంచాలకుడు ఆచార్య ఎన్‌వీ రమణారావు మాట్లాడుతూ.. సీట్లు పెరిగితే ఆ ప్రభావం ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలపై పడుతుందని చెప్పారు. ఇంజినీరింగ్‌లో చేరే విద్యార్థుల సంఖ్య కొద్ది సంవత్సరాలుగా పెరగడం లేదని, అలాంటప్పుడు ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో చేరే వారు పెరిగితే ఆ మేరకు ప్రైవేట్‌ కళాశాలల్లో ప్రవేశాల సంఖ్య తగ్గుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం నుంచి వచ్చే మార్గదర్శకాలను చూసిన తర్వాత స్పష్టత వస్తుందని, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని కళాశాలల్లోనూ సీట్లు పెంచుతామని చెప్పారు. ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లోనూ 10 శాతం తప్పనిసరి అంటే ఆ ప్రకారం నిబంధనల్లో మార్పు చేస్తామన్నారు.
తెలుగు విద్యార్థులకు వరమే
ప్రస్తుతం ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు 15-18 శాతం వరకు సీట్లను సొంతం చేసుకుంటున్నారు. సీట్ల సంఖ్య పెరిగితే అదే నిష్పత్తిలో మన విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈబీసీ రిజర్వేషన్‌ పరిధిలో ఉండి ఐఐటీలు, ఎన్‌ఐటీలకు ఎంపికయ్యే విద్యార్థుల సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో తక్కువగా ఉందని, అందువల్ల ఆ కోటా ద్వారా ప్రయోజనం తక్కువ ఉంటుందన్నారు. మిగిలిన 15 శాతంతో ప్రయోజనం పొందే అవకాశం ఉందని ఐఐటీ శిక్షణ నిపుణుడు కృష్ణ చైతన్య తెలిపారు. సీట్ల సంఖ్య పెరిగితే ఆ మేరకు జేఈఈ మెయిన్‌, అడ్వాన్సుడ్‌లో కటాఫ్‌ మార్కులు కూడా తగ్గుతాయని ఆయన చెప్పారు.

Published on 17-01-2019