close

JEE > LATEST NEWS

దేశంలో తొలిసారిగా బీటెక్‌లో ‘కృత్రిమ మేధ’

* పూర్తిస్థాయి కోర్సును అందుబాటులోకి తెస్తున్న ఐఐటీ హైదరాబాద్‌
* జేఈఈ అడ్వాన్స్డ్‌ ద్వారా ఏటా 20 మందికి ప్రవేశాలు

ఈనాడు, సంగారెడ్డి: కృత్రిమ మేధ రానున్న రోజుల్లో మానవ జీవితాల్లో కీలక పాత్ర పోషించనుంది. దీని ద్వారా వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, నిఘా, రక్షణ రంగాల్లో పెనుమార్పులు సాధ్యమవుతాయి. ఇప్పటికే చాలా సంస్థలు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (కృత్రిమ మేధ)ను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలోనే తొలిసారిగా ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ-హైదరాబాద్‌’ బీటెక్‌లో పూర్తిస్థాయి కృత్రిమ మేధ కోర్సును అందుబాటులోకి తెస్తోంది. జేఈఈ-అడ్వాన్స్డ్‌ ద్వారా ఏటా 20 మందికి ఈ కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నారు. 2019-2020 విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. ఐఐటీ, హైదరాబాద్‌ కేంద్రంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో పరిశోధనలకు చక్కటి వాతావరణాన్ని సృష్టించడమే ఈ కోర్సు ప్రధాన లక్ష్యమని ఐఐటీహెచ్‌ సంచాలకులు ఆచార్య యూబీ దేశాయ్‌ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రత్యేకతను చాటనున్న ఐఐటీహెచ్‌
ఐఐటీ హైదరాబాద్‌ ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారికోసం ఎంటెక్‌లో డాటా సైన్స్‌ కోర్సును అందుబాటులో తెచ్చింది. 2015-16 విద్యాసంవత్సరం నుంచి ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఆ కోర్సులో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌ భాగంగా ఉన్నాయి. కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, లిబరల్‌ ఆర్ట్స్‌ విభాగాలు సంయుక్తంగా ‘ఏఐ-హ్యుమానిటీస్‌’ కోర్సును అందుబాటులోకి తెచ్చాయి. బీటెక్‌ విద్యార్థులు మైనర్‌ కోర్సుగా దీన్ని ఎంచుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే బీటెక్‌లో పూర్తిస్థాయిలో కృత్రిమ మేధ కోర్సును తీసుకొస్తున్న ఐఐటీ హైదరాబాద్‌ ఈ విషయంలో దేశంలోనే తొలి ఇన్‌స్టిట్యూట్‌గా నిలవనుంది. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే అమెరికాలోని కార్నెగీ మెలన్‌ విశ్వవిద్యాలయం, మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)లు మాత్రమే ఇలా కోర్సును అందిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఈ కోర్సును అందించనున్న మూడో ఇన్‌స్టిట్యూట్‌గా హైదరాబాద్‌ ఐఐటీ ప్రత్యేకత సాధించనుంది.
నిపుణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
ఈ కోర్సులో ప్రవేశాలు పొందే విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించారు. కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగాలు సమన్వయంతో పనిచేయనున్నాయి. అల్గారిథమ్స్‌, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌, రోబోటిక్స్‌ అంశాలను వారికి నేర్పించనున్నారు. ‘మానవ జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషించనుంది. ఈ కోర్సులో భాగంగా విద్యార్థులకు కంప్యూటర్‌ సైన్స్‌, ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌ అంశాల్లోని ప్రాథమిక సూత్రాలపై శిక్షణ అందించనున్నాం. కృత్రిమ మేధను ఉపయోగించే సమయంలో ఎదురయ్యే నైతిక విలువల అంశాలపై కూడా వారికి అవగాహన కల్పిస్తాం’ అని ఐఐటీహెచ్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ డీన్‌ డాక్టర్‌ సుమోహన చన్నప్పయ్య వివరించారు.

 

Published on 18-01-2019