close

JEE > LATEST NEWS

ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో ప్రవేశానికి కొత్త విధానం

* రెండుసార్లు ‘నాటా’
* ఏప్రిల్‌ 14, జులై 7న ప్రవేశ పరీక్షలు
* జేఈఈ మెయిన్‌ బాటలోనే ఆర్కిటెక్చర్‌ కౌన్సిల్

ఈనాడు - హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా బ్యాచులర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (బీఆర్క్‌) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఆర్కిటెక్చర్‌ (నాటా)ను ఇక రెండు సార్లు నిర్వహించన్నారు. ఇప్పటివరకు ఒకేసారి ప్రవేశ పరీక్ష ఉండేది. ఇకనుంచి మొదటిసారి పరీక్షను ఏప్రిల్‌ 14న, రెండోసారి జులై 7న నిర్వహిస్తారు. ఈ మేరకు కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నాటా ర్యాంకుల ఆధారంగా ఆయా రాష్ట్రాలు కౌన్సెలింగ్‌ నిర్వహించుకుంటాయి. వాటి ద్వారా ఆయా రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో బీఆర్క్‌, బ్యాచులర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయ ఆర్కిటెక్చర్‌ కళాశాలలో సీట్లను కూడా ఈ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. ఈ విశ్వవిద్యాలయంలో ఏపీ విద్యార్థులకు కొన్ని సీట్లు కేటాయిస్తారు. జేఈఈ మెయిన్‌, ఇతర పలు పరీక్షలను ఆన్‌లైన్‌ విధానంలో జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) నిర్వహిస్తుండగా.. నాటాను మాత్రం ఆర్కిటెక్చర్‌ కౌన్సిల్‌ జరపనుంది. జ‌న‌వ‌రి 21 నుంచి నాటా కరపత్రం, ఇతర వివరాలను వెబ్‌సైట్‌ ద్వారా అందుబాటులో ఉంచుతారు. జేఈఈ మెయిన్‌ మాదిరిగా ఒక విద్యార్థి ఒకటి లేదా రెండు పరీక్షలను రాసుకోవచ్చా? లేదా ఏదైనా ఒక్కటే రాయాలా? అనేదానిపై స్పష్టత రాలేదు.
http://www.nata.in/
దరఖాస్తుల ప్రక్రియ
* పరీక్ష దరఖాస్తుల గడువు
* మొదటి పరీక్షకు జనవరి 24 నుంచి మార్చి 11 వరకు
* రెండో పరీక్షకు జనవరి 24 నుంచి జూన్‌ 12 వరకు
నాటా పరిస్థితి..
* నాటాకు ఏటా హాజరయ్యే విద్యార్థుల సంఖ్య : సుమారు లక్ష
* ఉత్తీర్ణులయ్యే వారి సంఖ్య : 35 వేలు
* తెలుగు రాష్ట్రాల్లో బీఆర్క్‌ సీట్లు : దాదాపు 1,200

 

Published on 20-01-2019